12వ అధ్యాయము
మనుష్యులు అస్థిరులు, మూర్ఖులు మరియు చెడు చేయుటకు వేగముగానుందురు—ప్రభువు తన జనులను గద్దించును—మనుష్యుల శూన్యత దేవుని శక్తితో పోల్చబడినది—తీర్పు దినమందు మనుష్యులు నిత్యజీవమును లేదా నిత్యశిక్షను పొందెదరు. సుమారు క్రీ. పూ. 6 సం.
1 ఆ విధముగా నరుల సంతానము ఎంత కపటమైనవారో మరియు వారి హృదయములు ఎంత అస్థిరమైనవో కూడా మనము చూడగలము; ఆయన యందు తమ నమ్మికయుంచువారిని ప్రభువు తన అపరిమితమైన గొప్పతనమందు ఆశీర్వదించి, వర్థిల్లజేయునని మనము చూడగలము.
2 మరియు ఆయన తన జనులను వర్థిల్లజేసినప్పుడు, వారి పొలములు, మందలు, గుంపుల యొక్క ఎదుగుదల యందు, వెండి బంగారములయందు మరియు అన్నివిధములైన ప్రశస్థ వస్తువుల యందు వర్థిల్లజేసి, వారి ప్రాణములను కాపాడుచూ వారి శత్రువుల చేతులలో నుండి వారిని విడుదల చేయుచూ వారికి వ్యతిరేకముగా వారు యుద్ధములు ప్రకటించకుండునట్లు వారి శత్రువుల హృదయములను మృదువుగా చేయుచూ, క్లుప్తముగా తన జనుల క్షేమము మరియు సంతోషము నిమిత్తము సమస్త క్రియలను చేయుచూ ఆయన తన జనులను వర్థిల్లజేసిన అదే సమయమందు వారు తమ హృదయములను కఠినపరచుకొని, వారి దేవుడైన ప్రభువును మరచిపోయి, పరిశుద్ధుని వారి పాదముల క్రింద త్రొక్కివేయుదురు—ముఖ్యముగా ఇది వారి సుఖమును బట్టి, వారు అత్యంత సంపన్నులగుటను బట్టియైయున్నది.
3 అందువలన ప్రభువు తన జనులను అనేక శ్రమలతో గద్దించి, వారిని మరణముతో, భయముతో, కరువుతో మరియు అన్ని విధములైన వ్యాధులతో దర్శించని యెడల, వారు ఆయనను జ్ఞాపకము చేసుకొనరు.
4 అయ్యో, నరుల సంతానము ఎంత మూర్ఖులు, వ్యర్థులు, చెడ్డవారు మరియు అపవాది సంబంధులు! దుర్నీతిని చేయుటకు ఎంతో వేగముగాను, మేలు చేయుటకు ఎంతో ఆలస్యముగాను ఉందురు; దుష్టుని మాటలు ఆలకించుటకు మరియు లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై తమ హృదయములను ఉంచుటకు ఎంతో వేగముగా ఉందురు.
5 గర్వమందు హెచ్చింపబడుటకు, డంబములు పలుకుటకు మరియు సమస్త దోషములు చేయుటకు ఎంతో వేగముగానుందురు; మరియు వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు, ఆయన ఉపదేశములకు చెవియొగ్గుటకు, జ్ఞాన మార్గములందు నడుచుటకు ఎంతో ఆలస్యముగానుందురు.
6 వారిని సృష్టించిన వారి దేవుడైన ప్రభువు వారిని పరిపాలించి, ఏలవలెనని వారు కోరరు; వారి యెడల ఆయన మంచితనమును, కనికరమును అధికముగా కలిగియున్నప్పటికీ, వారు ఆయన ఆలోచనలను లెక్క చేయరు మరియు ఆయన వారికి మార్గదర్శి కావలెనని కోరరు.
7 అయ్యో! నరుల సంతానము యొక్క శూన్యత ఎంత గొప్పది; వారు ధూళి కంటే కూడా తక్కువైయున్నారు.
8 ఏలయనగా మన గొప్ప నిత్యదేవుని ఆజ్ఞ చేత ధూళి అటు—ఇటు విభజించబడును.
9 ఆయన స్వరమునకు కొండలు మరియు పర్వతములు వణికి, కంపించును.
10 ఆయన స్వరము యొక్క శక్తి చేత అవి ముక్కలగును మరియు నున్నగా, లోయవలే కూడా అగును.
11 ఆయన స్వరము యొక్క శక్తిచేత భూమియంతయు కంపించును;
12 ఆయన స్వరము యొక్క శక్తిచేత పునాదులు సరిగ్గా మధ్యకు కదులును.
13 మరియు కదులుము అని ఆయన భూమితో చెప్పిన యెడల, అది కదులును.
14 దినమును అనేక గంటల పాటు పొడిగించునట్లు నీవు వెనుకకు వెళ్ళెదవు అని ఆయన భూమికి చెప్పిన యెడల, అది చేయబడును.
15 ఆ విధముగా ఆయన మాట ప్రకారము భూమి వెనుకకు పోవును మరియు సూర్యుడు స్థిరముగా నిలిచియున్నట్లు మనుష్యునికి అనిపించును; అది అంతే, ఏలయనగా నిశ్చయముగా కదులునది భూమియే కానీ సూర్యుడు కాదు.
16 మరియు నీవు ఎండిపొమ్ము అని ఆయన అగాధ జలములకు చెప్పిన యెడల, అది జరుగును.
17 ఇదిగో నీవు పైకి లేచి, ఆ పట్టణము పాతిపెట్టబడునట్లు వచ్చి దానిపై పడుము అని ఆయన ఈ పర్వతమునకు చెప్పిన యెడల, అది జరుగును.
18 ఒక మనుష్యుడు భూమి యందు నిధిని దాచిన యెడల మరియు దానిని దాచిన వాని దుర్నీతిని బట్టి అది శాపగ్రస్థమగుగాక అని ప్రభువు చెప్పిన యెడల, అది శాపగ్రస్థమగును.
19 ఈ సమయము నుండి ఇక ముందుకు మరెన్నటికీ ఏ మనుష్యుడు నిన్ను కనుగొనకుండునట్లు నీవు శాపగ్రస్థమగుము అని ప్రభువు చెప్పిన యెడల, ఏ మనుష్యుడు ఇకముందు మరియు ఎన్నటికీ దానిని పొందలేడు.
20 ఇదిగో, నీ దోషములను బట్టి నీవు నిరంతరము శాపగ్రస్థుడవగుదువు అని ప్రభువు ఒక మనుష్యునికి చెప్పిన యెడల, అది జరుగును.
21 నీ దోషములను బట్టి నీవు నా సన్నిధి నుండి కొట్టి వేయబడుదువు అని ప్రభువు చెప్పిన యెడల, అది ఆలాగు జరుగునట్లు ఆయన చేయును.
22 ఆయన దీనిని చెప్పు వానికి ఆపద, ఏలయనగా అది దోషము చేయువాని కొరకైయుండును మరియు అతడు రక్షించబడలేడు; కావున ఈ హేతువు నిమిత్తము మనుష్యులు రక్షించబడునట్లు పశ్చాత్తాపము ప్రకటించబడెను.
23 కావున పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువు యొక్క స్వరమును ఆలకించువారు ధన్యులు; ఏలయనగా రక్షింపబడు వారు వీరే.
24 వారి క్రియల ప్రకారము, వారు కృపను బట్టి కృపకు పునఃస్థాపించబడునట్లు మనుష్యులు పశ్చాత్తాపమునకు, సత్క్రియలకు తేబడునట్లు దేవుడు తన గొప్ప సంపూర్ణతయందు అనుగ్రహించును గాక.
25 మరియు మనుష్యులందరు రక్షింపబడవలెనని నేను కోరుచున్నాను. కానీ ఆ గొప్ప అంత్యదినమందు బయటకు గెంటివేయబడువారు, ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడువారు కొందరు ఉన్నారని మనము చదువుచున్నాము.
26 మేలు చేసిన వారు నిత్యజీవమును పొందుదురు మరియు కీడు చేసిన వారు నిత్యశిక్షను పొందుదురు అని చెప్పిన వాక్యములను నెరవేర్చుచూ వారు అంతము లేని దౌర్భాగ్యపు స్థితికి అప్పగించబడుదురు; అది ఆలాగునైయున్నది, ఆమేన్.