16వ అధ్యాయము
సమూయేలును విశ్వసించిన నీఫైయులు, నీఫై చేత బాప్తిస్మము పొందుదురు—పశ్చాత్తాపపడని నీఫైయుల బాణములు మరియు రాళ్ళు సమూయేలును సంహరింపజాలవు—కొందరు తమ హృదయములను కఠినపరచుకొందురు, ఇతరులు దూతలను చూచెదరు—అవిశ్వాసులు క్రీస్తునందు మరియు యెరూషలేమునకు ఆయన రాకయందు విశ్వసించుట యుక్తము కాదని చెప్పుదురు. సుమారు క్రీ. పూ. 6–1 సం.
1 ఇప్పుడు పట్టణపు ప్రాకారము పైనుండి లేమనీయుడైన సమూయేలు పలికిన మాటలను వినిన వారనేకులు అక్కడుండిరి. అతని మాటపై విశ్వాసముంచిన వారందరు వెళ్ళి నీఫై కొరకు వెదికిరి; వారు ముందుకు వచ్చి అతడిని కనుగొనినప్పుడు, వారు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందవలెనని కోరుచూ వారి పాపములను కాదనకుండా అతని యొద్ద ఒప్పుకొనిరి.
2 కానీ సమూయేలు మాటల యందు విశ్వసించని వారందరు అతనితో కోపముగానుండిరి; వారు ప్రాకారముపైనున్న అతని మీదకు రాళ్ళు విసిరిరి మరియు అతడు ప్రాకారముపై నిలువగా అనేకులు అతని పైకి బాణములు కూడా వేసిరి; కానీ ప్రభువు యొక్క ఆత్మ అతనితోనుండెను, ఎంతగాననగా వారి రాళ్ళతోను లేదా వారి బాణములతోను వారతడిని కొట్టలేకపోయిరి.
3 ఇప్పుడు వారతడిని కొట్టలేకపోయిరని చూచినప్పుడు, అతని మాటల యందు విశ్వసించిన వారు అక్కడ మరింతమంది ఉండిరి, ఎంతగాననగా వారు బాప్తిస్మము పొందుటకు నీఫై యొద్దకు వెళ్ళిపోయిరి.
4 ఏలయనగా క్రీస్తు త్వరలో రావలసియున్నదని వారు తెలుసుకొనునట్లు సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను చూపుచూ జనుల మధ్య అద్భుతములను చేయుచూ జనులకు నీఫై బాప్తిస్మమిచ్చుచూ, ప్రవచించుచూ, బోధించుచూ పశ్చాత్తాపమును గూర్చి ప్రకటించుచుండెను.
5 వారు విశ్వసించగలుగునట్లు వారికి అవి ముందుగానే తెలియజేయబడియున్నవని అవి వచ్చు సమయమున వారు తెలుసుకొని, జ్ఞాపకము చేసుకొనగలుగునట్లు త్వరలో రాబోవు సంగతులను గూర్చి వారికి చెప్పుచుండెను; కావున సమూయేలు మాటలపై విశ్వసించిన వారందరు బాప్తిస్మము పొందుటకు అతని యొద్దకు వెళ్ళిరి, ఏలయనగా వారు పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకొనుచూ వచ్చిరి.
6 కానీ వారిలో అధికభాగము సమూయేలు మాటల యందు విశ్వసించలేదు; కావున వారతడిని తమ రాళ్ళతోను, తమ బాణములతోను కొట్టలేకపోయిరని చూచినప్పుడు, వారు తమ సైనికాధికారులతో ఇట్లు చెప్పుచూ కేకవేసిరి: ఈ మమష్యుని పట్టుకొని బంధించుడి, ఏలయనగా అతడు దయ్యము పట్టియున్నాడు మరియు అతని యందున్న దయ్యము యొక్క శక్తిని బట్టి మేము అతడిని మా రాళ్ళతోను, బాణములతోను కొట్టలేకపోతిమి; కావున అతడిని పట్టుకొని బంధించి, దూరముగా ఉంచుడి.
7 మరియు వారు అతనిపై తమ చేతులు వేయుటకు ముందుకువెళ్ళగా, అతడు ప్రాకారము పైనుండి క్రిందికి దూకి వారి దేశములో నుండి బయటకు, అతని స్వదేశమునకు పారిపోయి, తన స్వంత జనుల మధ్య భోధించుట మరియు ప్రవచించుట మొదలుపెట్టెను.
8 అతని గూర్చి నీఫైయుల మధ్య మరి ఎన్నడూ వినబడలేదు; ఆ విధముగా జనుల యొక్క వ్యవహారములుండెను.
9 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనుబది ఆరవ సంవత్సరము ముగిసెను.
10 ఆ విధముగా జనులలో అధికభాగము వారి గర్వము మరియు దుర్మార్గమందు నిలిచియుండి, తక్కువ భాగము దేవుని యెదుట అతి జాగ్రత్తతో నడుచుచుండగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనుబది ఏడవ సంవత్సరము కూడా ముగిసెను.
11 మరియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనుబది ఎనిమిదవ సంవత్సరమందు కూడా పరిస్థితులు ఇదే విధముగానుండెను.
12 జనులు దుర్నీతి యందు ఎక్కువ కఠినులగుట మరియు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన దానిని అత్యధికముగా చేయుటను మొదలుపెట్టుట తప్ప, న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనుబది తొమ్మిదవ సంవత్సరమందు జనుల వ్యవహారములయందు పెద్ద మార్పేమియు లేకుండెను.
13 కానీ న్యాయాధిపతుల పరిపాలన యొక్క తొంభైయవ సంవత్సరమందు జనులకు గొప్ప సూచకక్రియలు, ఆశ్చర్యకార్యములు ఇవ్వబడెను మరియు ప్రవక్తల మాటలు నెరవేరుట మొదలాయెను.
14 దేవదూతలు మనుష్యులకు, జ్ఞానులకు కనబడి, మహా సంతోషకరమైన సువర్తమానములను వారికి ప్రకటించిరి; ఆ విధముగా ఈ సంవత్సరమందు లేఖనములు నెరవేరుట మొదలాయెను.
15 అయినను నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురిలో అధికముగా విశ్వసించిన భాగము తప్ప, జనులందరు తమ హృదయములను కఠినపరచుకొనసాగిరి మరియు వారి స్వశక్తిపై, వారి స్వంత జ్ఞానముపై ఆధారపడుట మొదలుపెట్టుచూ ఇట్లనిరి:
16 అనేకమైనవాటి మధ్య వారు కొన్ని సంగతులను సరిగ్గా ఊహించియుండవచ్చు; కానీ చెప్పబడిన వాటిని గూర్చి ఆ గొప్ప మరియు అద్భుతకార్యములన్నియు జరుగలేవని మేమెరుగుదుము.
17 మరియు ఇట్లు చెప్పుచూ వారి మధ్య వారు తర్కించుచూ వాదులాడుచుండిరి:
18 క్రీస్తు వంటి ఒక ప్రాణి రాబోవుట అనునది తర్కించదగినదే కాదని, అటులైన యెడల చెప్పబడియున్నట్లు దేవుని కుమారుడు, భూమ్యాకాశముల తండ్రియైన ఆయన యెరుషలేము వద్దనున్న వారికివలెనే మనకు కూడా తనను ఎందుకు చూపించుకొనడు?
19 యెరూషలేము దేశమందువలెనే ఈ దేశమందు కూడా ఆయన తనను ఎందుకు చూపించుకొనడు?
20 కానీ, మన మధ్య కాకుండా మనము ఎరుగని ఒక దేశమందు, చాలా దూరములోనున్న ఒక దేశమందు జరుగబోవు ఏదో గొప్ప మరియు ఆశ్చర్యకరమైన సంగతియందు మనము విశ్వాసముంచునట్లు చేయుటకు ఇది మన పితరుల ద్వారా మనకు అందించబడిన ఒక దుష్టాచారమని మనమెరుగుదుము; అందువలన వారు మనలను అజ్ఞానములో ఉంచవచ్చును, ఏలయనగా అవి సత్యమని మన కన్నులతో మనము చూడలేము.
21 మరియు వారు దుష్టుని యొక్క మోసకరమైన, మర్మమైన నేర్పుల ద్వారా మనము గ్రహింపలేని ఏదో గొప్ప మర్మమును చేయుదురు, అది మనలను వారి మాటలకు, వారికి కూడా దాసులుగా ఉంచును, ఏలయనగా మనకు వాక్యమును బోధించుటకు మనము వారిపై ఆధారపడియున్నాము; ఆ విధముగా మనము వారికి మనలను లోబరచుకొనిన యెడల, వారు మనలను మన జీవితకాలమంతా అజ్ఞానమందు ఉంచెదరు.
22 ఇంకను మూర్ఖమైన, వ్యర్థమైన అనేకానేక సంగతులను జనులు తమ హృదయములందు ఊహించుకొనిరి; వారు అధికముగా కలతచెందిరి, ఏలయనగా నిరంతరము దుర్నీతి చేయుటకు సాతాను వారిని పురిగొల్పెను; మేలైన దానికి వ్యతిరేకముగా మరియు రాబోవు దానికి వ్యతిరేకముగా జనుల హృదయములను అతడు కఠినపరచునట్లు దేశమంతటా అతడు వదంతులను, వివాదములను వ్యాపింపజేయుచూ వెళ్ళెను.
23 ప్రభువు యొక్క జనుల మధ్య సూచకక్రియలు, ఆశ్చర్యకార్యములు చేయబడినప్పటికీ మరియు వారు చేసిన అద్భుతములు అనేకమున్నప్పటికీ, సాతాను దేశమంతటానున్న జనుల హృదయములపై గొప్ప పట్టు సంపాదించెను.
24 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క తొంభైయవ సంవత్సరము ముగిసెను.
25 ఆ విధముగా హీలమన్ మరియు అతని కుమారుల యొక్క గ్రంథమును బట్టి హీలమన్ గ్రంథము ముగిసెను.