లేఖనములు
హీలమన్ 15


15వ అధ్యాయము

ప్రభువు నీఫైయులను ప్రేమించెను, గనుక ఆయన వారిని గద్దించెను—పరివర్తన పొందిన లేమనీయులు విశ్వాసమందు దృఢముగాను, నిలకడగాను ఉండిరి—కడవరి దినములందు ప్రభువు లేమనీయుల యెడల కనికరము కలిగియుండును. సుమారు క్రీ. పూ. 6 సం.

1 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీరు పశ్చాత్తాపపడని యెడల మీ ఇండ్లు మీ కొరకు నిర్జనముగా విడువబడియుండునని నేను మీకు ప్రకటించుచున్నాను.

2 మీరు పశ్చాత్తాపపడని యెడల, పాలిచ్చు దినమందు మీ స్త్రీలు దుఃఖించుటకు గొప్ప హేతువు కలిగియుందురు; ఏలయనగా మీరు పారిపోవుటకు ప్రయత్నించెదరు, కానీ ఆశ్రయము కొరకు ఎట్టి స్థలముండదు మరియు బిడ్డతోనున్న వారికి ఆపద, ఏలయనగా వారు భారముగా ఉన్నందున పారిపోలేరు; కావున వారు త్రొక్కివేయబడి, నశించిపోవుటకు విడువబడుదురు.

3 వారికి చూపబడిన ఈ సూచకక్రియలు మరియు ఆశ్చర్యకార్యములన్నిటిని చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడని యెడల, నీఫై జనులని పిలువబడిన ఈ జనులకు ఆపద; ఏలయనగా వారు ప్రభువు చేత ఎన్నుకోబడిన జనులైయుండిరి; ఆయన నీఫై జనులను ప్రేమించెను మరియు వారిని గద్దించెను; ఆయన వారిని ప్రేమించినందున, వారి దుర్నీతి దినములందు ఆయన వారిని గద్దించెను.

4 కానీ నా సహోదరులారా, లేమనీయుల క్రియలు నిరంతరము చెడ్డవైయున్నందున ఆయన వారిని ద్వేషించెను మరియు ఇది వారి పితరుల ఆచారము యెక్క దుర్నీతిని బట్టియైయుండెను. కానీ నీఫైయుల బోధన ద్వారా వారికి రక్షణ వచ్చియుండెను; మరియు ఈ ఉద్దేశ్యము నిమిత్తము ప్రభువు వారి దినములు పొడిగించెను.

5 వారిలో అధికభాగము వారి కర్తవ్యపు బాటలో ఉన్నారు, దేవుని యెదుట జాగ్రత్తగా నడుచుచున్నారు మరియు మోషే ధర్మశాస్త్రమును బట్టి, ఆయన ఆజ్ఞలు, కట్టడలు, తీర్పులను పాటించుచున్నారని మీరు చూడవలెనని నేను కోరుచున్నాను.

6 వారిలో అధికభాగము దీనిని చేయుచున్నారు మరియు వారి సహోదరులలో మిగిలిన వారిని సత్యము యొక్క జ్ఞానమునకు తేగలుగునట్లు అలసిపోకుండా శ్రద్ధతో వారు పాటుపడుచున్నారు; కావున ప్రతిదినము వారితో చేరుచున్న వారు అనేకులున్నారని నేను మీతో చెప్పుచున్నాను.

7 మరియు మీకు మీరే దీనిని ఎరిగియున్నారు, ఏలయనగా మీరు దానిని చూచియున్నారు, వారిలో సత్యము యొక్క జ్ఞానమునకు మరియు వారి పితరుల యొక్క దుర్మార్గమైన, హేయకరమైన ఆచారములను గూర్చి తెలుసుకొనుటకు తేబడియున్న వారందరు, మరియు ప్రభువునందు విశ్వాసమునకు, పశ్చాత్తాపమునకు అనగా వారి హృదయమందు మార్పు తెచ్చునట్టి విశ్వాసము మరియు పశ్చాత్తాపమునకు నడిపించునట్లు వ్రాయబడియున్న పరిశుద్ధ లేఖనములు, అనగా పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనముల యందు విశ్వసించుటకు నడిపించబడియున్న వారందరు—

8 కావున ఎంతమంది ఈ జ్ఞానమునకు వచ్చిరో వారందరు విశ్వాసమందు మరియు వారు స్వతంత్రులుగా చేయబడిన ఆ విషయమందు దృఢముగాను, నిలకడగాను ఉన్నారని మీకు మీరే ఎరుగుదురు.

9 మరియు వారు తమ యుద్ధ ఆయుధములను పాతిపెట్టియున్నారని, ఎందుచేతనైనా వారు పాపము చేయుదురేమోయను భయముతో వాటిని తీసుకొనుటకు కూడా వారు భయపడుచున్నారని మీరెరుగుదురు; వారు పాపము చేయుటకు భయపడుచున్నారని మీరు చూడగలరు, ఏలయనగా వారు త్రొక్కివేయబడుటకు మరియు వారి శత్రువుల చేత సంహరింపబడుటకు తమనుతాము అనుమతించుకొందురు, కానీ వారికి వ్యతిరేకముగా తమ ఖడ్గములను ఎత్తరు; ఇదంతయు క్రీస్తునందున్న వారి విశ్వాసమును బట్టియైయున్నది.

10 ఇప్పుడు దేనియందు వారు విశ్వసించుచున్నారో ఆ సంగతి యందు వారు విశ్వసించినప్పుడు వారి నిలకడను బట్టి, ఒకసారి వారికి జ్ఞానము కలుగజేయబడినప్పుడు వారి దృఢత్వమును బట్టి ప్రభువు వారిని ఆశీర్వదించును మరియు వారి దోషమున్నప్పటికీ వారి దినములు పొడిగించును—

11 అనగా, సత్యము యొక్క జ్ఞానమునకు తిరిగి మన సహోదరులైన లేమనీయుల యొక్క పునఃస్థాపన గూర్చి మన పితరుల ద్వారా, ప్రవక్త జీనోస్ మరియు అనేక ఇతర ప్రవక్తల ద్వారా కూడా చెప్పబడిన సమయము వచ్చువరకు, వారు విశ్వాసమందు క్షీణించియున్నను ప్రభువు వారి దినములను పొడిగించును—

12 అనగా, కడవరి సమయముల యందు ప్రభువు యొక్క వాగ్దానములు మన సహోదరులైన లేమనీయులకు లభ్యమగునని నేను మీతో చెప్పుచున్నాను; వారు అనేక బాధలు పొందినప్పటికీ మరియు వారు భూ ముఖముపై ఇటు-అటు తరుమబడి, వేటాడబడి, కొట్టబడి, ఆశ్రయము కొరకు ఎట్టి స్థలము లేకుండా దూరముగా చెదరగొట్టబడినప్పటికీ, ప్రభువు వారి యెడల కనికరము కలిగియుండును.

13 ఈ ప్రవచనమును బట్టియే వారు మరలా సత్యమైన జ్ఞానమునకు, వారి విమోచకుడు మరియు వారి గొప్ప నిజమైన కాపరి యొక్క జ్ఞానమునకు తేబడి, ఆయన గొఱ్ఱెల మధ్య లెక్కించబడుదురు.

14 కావున, మీరు పశ్చాత్తాపపడని యెడల అది మీ కంటే వారికి మేలుగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను.

15 ఏలయనగా మీకు చూపబడిన అద్భుతములు వారికి, అనగా వారి పితరుల యొక్క ఆచారమును బట్టి విశ్వాసమందు క్షీణించిన వారికి చూపబడియుండిన యెడల, వారు తిరిగి ఎన్నడూ విశ్వాసమందు క్షీణించియుండేవారు కాదని మీకు మీరే చూడగలరు.

16 కావున, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను వారిని పూర్తిగా నాశనము చేయను, కానీ నా దృష్టిలో యుక్తమైన దినమునందు వారు నా యొద్దకు తిరిగి వచ్చునట్లు నేను చేయుదునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

17 ఇప్పుడు నీఫైయులను గూర్చి ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను వారి మధ్య అనేక అద్భుతములు చేసినప్పటికీ వారు పశ్చాత్తాపపడి నా చిత్తమును జరిగించని యెడల, వారి అవిశ్వాసమును బట్టి నేను వారిని పూర్తిగా నాశనము చేయుదునని మరియు ప్రభువు జీవముతోడు ఈ సంగతులు నిశ్చయముగా జరుగునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ముద్రించు