లేఖనములు
హీలమన్ 1


హీలమన్‌ గ్రంథము

నీఫైయుల వృత్తాంతము. వారి యుద్ధములు, వివాదములు మరియు వారి విభేధములు. హీలమన్‌ కుమారుడైన హీలమన్‌ యొక్క గ్రంథములను బట్టి మరియు అతని కుమారుల యొక్క గ్రంథములను బట్టి, క్రీస్తు యొక్క రాకడ వరకు క్రీస్తు రాకడకు ముందున్న అనేకమంది పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనములు. మరియు లేమనీయులలో అనేకులు పరివర్తన పొందిరి. వారి పరివర్తన యొక్క వృత్తాంతము. క్రీస్తు యొక్క రాకడ వరకు హీలమన్‌ మరియు అతని కుమారుల యొక్క వృత్తాంతమును బట్టి, హీలమన్‌ గ్రంథమని పిలువబడిన లేమనీయుల నీతి మరియు నీఫైయుల దుష్టత్వము, హేయక్రియలు మొదలైన వాటి వృత్తాంతము.

1వ అధ్యాయము

రెండవ పహోరన్‌ ప్రధాన న్యాయాధిపతి అగును మరియు కిష్‌క్యుమెన్‌ చేత హత్య చేయబడును—పాక్యుమెని న్యాయపీఠమును అధిష్టించును—కోరియాంటమర్‌ లేమనీయుల సైన్యములను నడిపించును, జరహేమ్లను స్వాధీనపరచుకొని, పాక్యుమెనిని సంహరించును—మొరోనైహా లేమనీయులను ఓడించి, జరహేమ్లను తిరిగి స్వాధీనపరచుకొనును, మరియు కోరియాంటమర్‌ సంహరింపబడును. సుమారు క్రీ. పూ. 52–50 సం.

1 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబదియవ సంవత్సరము యొక్క ప్రారంభములో నీఫైయుల జనుల మధ్య ఒక గంభీరమైన సంకటము మొదలాయెను.

2 ఏలయనగా పహోరన్‌ మరణించెను మరియు సమస్త భూముఖము పైనుండి వెళ్ళిపోయెను; కావున సహోదరులైన పహోరన్‌ కుమారుల మధ్య ఎవరు న్యాయపీఠమును అధిష్టించవలెనను దానిని గూర్చి ఒక గంభీరమైన వివాదము మొదలాయెను.

3 ఇప్పుడు న్యాయపీఠము కొరకు పోరాడి, జనులు కూడా పోరాడునట్లు చేసిన వారి పేర్లు ఇవే: పహోరన్‌, పాంచి, మరియు పాక్యుమెని.

4 పహోరన్‌ యొక్క కుమారులందరు వీరే కాదు (ఏలయనగా అతడు అనేకమందిని కలిగియుండెను), కానీ న్యాయపీఠము కొరకు పోరాడిన వారు వీరే; కావున జనుల మధ్య వారు మూడు విభజనలు చేయబడునట్లు చేసిరి.

5 అయినప్పటికీ నీఫై జనులపై ప్రధాన న్యాయాధిపతిగా, పరిపాలకునిగా జనుల యొక్క స్వరము చేత పహోరన్‌ నియమించబడెను.

6 మరియు తాను న్యాయపీఠమును సంపాదించలేడని చూచి పాక్యుమెని జనుల స్వరముతో ఏకమయ్యెను.

7 కానీ పాంచి మరియు అతడే తమ పరిపాలకుడు కావలెనని కోరిన జనుల యొక్క ఆ భాగము మిక్కిలి కోపముగా నుండిరి; కావున వారి సహోదరులకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుటకు అతడు ఆ జనులను పురిగొల్పజూచెను.

8 మరియు దీనిని చేయబోవుచుండగా అతడు పట్టుకొనబడి, జనుల యొక్క స్వరమును బట్టి విచారణ చేయబడి, మరణశిక్ష పొందెను; ఏలయనగా అతడు తిరుగుబాటు చేసి, జనుల స్వాతంత్ర్యమును నాశనము చేయుటకు కోరెను.

9 ఇప్పుడు అతడే వారి పరిపాలకుడు కావలెనని కోరిన ఆ జనులు అతడు మరణశిక్ష పొందెనని చూచినప్పుడు, కోపముతోనుండి కిష్‌క్యుమెన్‌ అను ఒకడిని పహోరన్‌ యొక్క న్యాయపీఠము వద్దకు పంపిరి; అతడు, పహోరన్‌ న్యాయపీఠముపై కూర్చొనియుండగా అతడిని సంహరించెను.

10 మరియు అతడు పహోరన్‌ యొక్క సేవకుల చేత తరుమబడెను; కానీ కిష్‌క్యుమెన్‌ పలాయనము ఎంత వేగముగా ఉండెననగా ఏ మనుష్యుడూ అతడిని అందుకొనలేకపోయెను.

11 అతడు, అతడిని పంపిన వారి యొద్దకు వెళ్ళెను మరియు కిష్‌క్యుమెన్‌ పహోరన్‌ను హత్య చేసెనని ఏ మనుష్యునికి చెప్పరాదని వారి నిత్య సృష్టికర్తపై ప్రమాణము చేయుచూ వారందరు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి.

12 కావున కిష్‌క్యుమెన్‌ నీఫై జనుల మధ్య తెలియబడలేదు, ఏలయనగా అతడు పహోరన్‌ను హత్య చేసిన సమయమున అతడు మారువేషమందు ఉండెను. కిష్‌క్యుమెన్‌ మరియు అతనితో నిబంధన చేసిన అతని గుంపు వారందరు కనుగొనబడని రీతిలో జనులలో కలిసిపోయిరి; కానీ, కనుగొనబడిన వారందరు మరణశిక్ష పొందిరి.

13 ఇప్పుడు జనులపై ప్రధాన న్యాయాధిపతిగా, పరిపాలకునిగా అతని సహోదరుడైన పహోరన్‌ స్థానములో పరిపాలించుటకు జనుల స్వరమును బట్టి పాక్యుమెని నియమించబడెను; మరియు అది అతని హక్కును బట్టియైయుండెను. ఇది అంతయు న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబదియవ సంవత్సరమందు చేయబడెను మరియు అది ముగిసెను.

14 న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది ఒకటవ సంవత్సరమందు లేమనీయులు అసంఖ్యాక సైన్యమును సమకూర్చుకొని, వారికి ఖడ్గములను, వంపు కత్తులను, విల్లులను, బాణములను, శిరస్త్రాణములను, వక్షస్థల కవచములను మరియు అన్నిరకముల డాలులను ధరింపజేసిరి.

15 వారు నీఫైయులకు వ్యతిరేకముగా మరలా యుద్ధము చేయుటకు వచ్చిరి. వారు కోరియాంటమర్‌ అను పేరు గల మనుష్యుని చేత నడిపించబడిరి; అతడు జరహేమ్ల యొక్క వంశస్థుడు; అతడు నీఫైయుల మధ్య ఒక అసమ్మతీయుడైయుండెను మరియు అతడు బలమైన భారీకాయుడు.

16 కావున అమ్మోరోన్‌ యొక్క కుమారుడైన తుబలోతు అను పేరు గల ఆ లేమనీయుల రాజు, కోరియాంటమర్‌ బలమైన మనుష్యుడైయుండి, అతని శక్తితో మరియు అతని గొప్ప తెలివితో నీఫైయులకు వ్యతిరేకముగా నిలువగలడని తలంచి, అతడిని పంపుట ద్వారా నీఫైయులపై తాను అధికారము పొందగలడని అనుకొనెను.

17 కావున అతడు వారిని కోపమునకు పురిగొల్పుచూ అతని సైన్యములను సమకూర్చెను మరియు అతడు కోరియాంటమర్‌ను వారి నాయకునిగా నియమించి, వారు నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు జరహేమ్ల దేశమునకు వెళ్ళునట్లు చేసెను.

18 ఇప్పుడు, ప్రభుత్వమందు అధికమైన వివాదము మరియు అధికమైన సంకటమున్నందున జరహేమ్ల దేశమందు వారు తగినంతమంది భటులను ఉంచలేదు; ఏలయనగా వారి దేశ ముఖ్యభాగమైన ఆ గొప్ప జరహేమ్ల పట్టణముపై దాడి చేయుటకు లేమనీయులు ధైర్యము చేయరని వారు తలంచిరి.

19 కానీ కోరియాంటమర్‌ అతని బహుసంఖ్యాకమైన సైన్యమునకు ముందు నడిచి, పట్టణము యొక్క నివాసులపై దాడి చేసెను మరియు వారి నడక ఎంత వేగముగా ఉండెననగా, తమ సైన్యములను సమకూర్చుకొనుటకు నీఫైయులకు సమయము లేకుండెను.

20 కావున కోరియాంటమర్‌ పట్టణ ప్రవేశద్వారము వద్దనున్న కావలివారిని సంహరించి, అతని సంపూర్ణ సైన్యముతో పట్టణములోనికి నడిచెను మరియు పట్టణమును వారు పూర్తిగా స్వాధీనము చేసుకొను వరకు వారిని ఎదిరించిన ప్రతి వానిని వారు సంహరించిరి.

21 మరియు ప్రధాన న్యాయాధిపతి అయిన పాక్యుమెని కోరియాంటమర్‌ ఎదుట పట్టణము యొక్క గోడల వరకు పారిపోగా, కోరియాంటమర్‌ అతడు మరణించునంతగా అతడిని గోడకేసి కొట్టెను. ఆ విధముగా పాక్యుమెని యొక్క దినములు అంతమాయెను.

22 ఇప్పుడతడు జరహేమ్ల పట్టణమును స్వాధీనము చేసుకున్నాడని, నీఫైయులు వారి యెదుట పారిపోయిరని, సంహరింపబడిరని, బంధించబడి చెరసాలలో వేయబడిరని, దేశమంతటిలో మిక్కిలి బలమైన పట్టణము యొక్క స్వాధీనమును అతడు సంపాదించియున్నాడని కోరియాంటమర్‌ చూచినప్పుడు, అతని హృదయము ధైర్యము తెచ్చుకొనెను, ఎంతగాననగా అతడు దేశమంతటిపై యుద్ధము చేయుటకు వెళ్ళబోయెను.

23 ఇప్పుడతడు జరహేమ్ల దేశమందు నిలిచియుండకుండా ఒక పెద్ద సైన్యముతో సమృద్ధి పట్టణము వైపు నడిచెను; ఏలయనగా అతడు దేశము యొక్క ఉత్తర భాగములను సంపాదించగలుగునట్లు ముందుకు వెళ్ళుచూ ఖడ్గముతో తన మార్గము గుండా దూసుకొని పోవుటకు అతడు నిశ్చయించుకొనెను.

24 మరియు వారి అత్యధిక బలము దేశము మధ్యలోనున్నదని అతడు తలంచెను, కావున చిన్న గుంపులుగా తప్ప తమను సమకూర్చుకొనుటకు వారికి ఎట్టి సమయమునియ్యక అతడు సైన్యముతో ముందుకు నడిచి ఈ రీతియందు వారిపై దాడిచేసి, వారిని సంహరించెను.

25 కానీ అధిక సంఖ్యలో నీఫైయులు సంహరించబడినప్పటికీ, దేశము మధ్య నుండి కోరియాంటమర్‌ యొక్క ఈ నడక మొరోనైహాకు వారిపై గొప్ప ప్రయోజనమునిచ్చెను.

26 ఏలయనగా లేమనీయులు దేశము మధ్యకు వచ్చుటకు ధైర్యము చేయరు, కానీ వారింతవరకు చేసియున్నట్లుగా సరిహద్దులయందున్న పట్టణములపై దాడి చేయుదురని మొరోనైహా తలంచెను; కావున వారి బలమైన సైన్యములు సరిహద్దులయందున్న ఆ భాగములను కాపాడునట్లు మొరోనైహా చేసెను.

27 అయితే అతడు కోరుకున్నట్లుగా లేమనీయులు భయపడలేదు, కానీ వారు దేశము మధ్యలోనికి వచ్చి ముఖ్య పట్టణమైన జరహేమ్ల పట్టణమును స్వాధీనము చేసుకొనిరి మరియు గొప్ప సంహారముతో జనులను, అనగా స్త్రీ పురుషులిరువురిని, పిల్లలను సంహరించుచూ అనేక పట్టణములు, అనేక బలమైన దుర్గములు స్వాధీనపరచుకొనుచూ దేశము యొక్క అతిముఖ్య భాగముల గుండా వెళ్ళుచుండిరి.

28 కానీ మొరోనైహా దీనిని కనుగొనినప్పుడు, వారు సమృద్ధిదేశమునకు రాకమునుపే వారిని ఎదుర్కొనుటకు అతడు వెంటనే ఒక సైన్యముతో లీహైని చుట్టూ పంపెను.

29 మరియు లీహై ఆ విధముగా చేసెను; వారు సమృద్ధిదేశమునకు వచ్చుటకు ముందు అతడు వారిని ఎదుర్కొని, వారితో యుద్ధము చేసెను, ఎంతగాననగా వారు జరహేమ్ల దేశము వైపు వెనుకకు తిరిగి వెళ్ళనారంభించిరి.

30 మరియు వారి తిరుగు ప్రయాణములో మొరోనైహా వారిని ఎదుర్కొని, వారితో అతి భయంకరముగా యుద్ధము చేసెను; దానిలో అనేకులు సంహరింపబడిరి మరియు సంహరింపబడిన వారి మధ్య కోరియాంటమర్‌ కూడా కనుగొనబడెను.

31 ఇప్పుడు లేమనీయులు ఉత్తరమునకు లేదా దక్షిణమునకు, తూర్పునకు లేదా పశ్చిమమునకు, ఎటువైపునకు తిరిగి పోలేకయుండిరి, ఏలయనగా వారు అన్నివైపులనుండి నీఫైయుల చేత చుట్టుముట్టబడిరి.

32 ఆ విధముగా కోరియాంటమర్‌ లేమనీయులను నీఫైయుల మధ్యలో పడవేసెను, ఎంతగాననగా వారు నీఫైయుల ఆధీనములో ఉండిరి మరియు అతడు సంహరింపబడగా, లేమనీయులు తమనుతాము నీఫైయుల చేతులకు అప్పగించుకొనిరి.

33 ఇప్పుడు మొరోనైహా జరహేమ్ల పట్టణమును తిరిగి స్వాధీనపరచుకొని, బందీలుగా తీసుకొనబడిన లేమనీయులు సమాధానమందు దేశము నుండి బయటకు వెడలిపోవునట్లు చేసెను.

34 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది ఒకటవ సంవత్సరము ముగిసెను.

ముద్రించు