లేఖనములు
హీలమన్ 11


11వ అధ్యాయము

వారి యుద్ధమునకు బదులుగా కరువును ఇవ్వమని నీఫై ప్రభువును ఒప్పించును—అనేకమంది జనులు నశించెదరు—వారు పశ్చాత్తాపపడుదురు మరియు నీఫై వర్షము కొరకు ప్రభువును బ్రతిమాలుకొనును—నీఫై మరియు లీహై అనేక బయల్పాటులను పొందుదురు—గాడియాంటన్‌ దొంగలు దేశమందు తమను బలముగా స్థాపించుకొందురు. సుమారు క్రీ. పూ. 20–6 సం.

1 ఇప్పుడు న్యాయాధిపతుల పరిపాలన యొక్క డెబ్బది రెండవ సంవత్సరమందు వివాదములు ఎక్కువై దేశమంతటా నీఫై జనులందరి మధ్య యుద్ధములుండెను.

2 ఆ దొంగల యొక్క రహస్య ముఠాయే నాశనము మరియు దుష్టత్వము యొక్క ఈ క్రియను కొనసాగించినది. ఈ యుద్ధము ఆ సంవత్సరమంతయు కొనసాగెను; డెబ్బది మూడవ సంవత్సరమందు కూడా అది కొనసాగెను.

3 ఈ సంవత్సరమందు నీఫై ప్రభువుకు ఇట్లు చెప్పుచూ మొరపెట్టెను:

4 ఓ ప్రభువా, ఈ జనులు ఖడ్గము చేత నాశనము చేయబడునట్లు అనుమతించకుము; కానీ ఓ ప్రభువా, దానికి మించి వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వారిని పురిగొల్పునట్లు దేశమందు ఒక కరువును ఉండనిమ్ము, బహుశా వారు పశ్చాత్తాపపడి నీ వైపు తిరుగుదురేమో.

5 కావున నీఫై మాటల ప్రకారము అట్లు చేయబడెను. దేశములో నీఫై జనులందరి మధ్య గొప్ప కరువుండెను. ఆ విధముగా డెబ్బది నాలుగవ సంవత్సరమందు కరువు కొనసాగెను మరియు నాశనక్రియ ఖడ్గము చేత ఆగెను, కానీ కరువు చేత తీవ్రమాయెను.

6 ఈ నాశనక్రియ డెబ్బది అయిదవ సంవత్సరమందు కూడా కొనసాగెను. ఏలయనగా భూమి మొత్తబడి ఎండిపోయెను; ధాన్యము యొక్క ఋతువు నందు ధాన్యమును పండించలేదు; మరియు నీఫైయుల మధ్యనున్నట్లే లేమనీయుల మధ్య కూడా భూమియంతయు మొత్తబడెను, అందుచేత వారు మొత్తబడి, దేశము యొక్క అధిక దుర్మార్గమైన భాగములందు వేలసంఖ్యలో నశించిరి.

7 వారు కరువు చేత నశించబోవుచున్నారని చూచి జనులు వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట మొదలుపెట్టిరి; మరియు వారు నీఫై మాటలను జ్ఞాపకము చేసుకొనుట మొదలుపెట్టిరి.

8 నీఫైతో—ఇదిగో, నీవు దేవుని మనుష్యుడవని మేమెరుగుదుము, కావున మా నాశనమును గూర్చి నీవు చెప్పిన మాటలన్నీ నెరవేరకుండునట్లు ఆయన ఈ కరువును మా నుండి తీసివేయునట్లు మన దేవుడైన ప్రభువుకు మొరపెట్టుము అని చెప్పవలెనని జనులు వారి ప్రధాన న్యాయాధిపతులను, నాయకులను బ్రతిమాలుకొనసాగిరి.

9 అప్పుడు, కోరబడిన మాటల ప్రకారము న్యాయాధిపతులు నీఫైకి చెప్పిరి. జనులు పశ్చాత్తాపపడి, గోనెపట్ట కట్టుకొని తమనుతాము తగ్గించుకొనిరని నీఫై చూచినప్పుడు, అతడు ప్రభువుకు ఇట్లు చెప్పుచూ తిరిగి మొరపెట్టెను:

10 ఓ ప్రభువా, ఈ జనులు పశ్చాత్తాపపడిరి; వారి మధ్య నుండి గాడియాంటన్‌ ముఠా అంతరించిపోవునంతగా వారిని దూరముగా తరిమివేసిరి మరియు వారి రహస్య ప్రణాళికలను భూమిలో పాతిపెట్టిరి.

11 ఇప్పుడు ఓ ప్రభువా, వారి ఈ తగ్గింపును బట్టి నీవు నీ కోపమును త్రిప్పివేయవా; నీవు ఇప్పటికే నాశనము చేసిన ఆ దుష్టుల యొక్క నాశనమందు నీ కోపము శాంతించునట్లు చేయవా.

12 ఓ ప్రభువా, నీవు నీ కోపమును, నీ ఉగ్రతను త్రిప్పివేయవా, ఈ దేశమందు ఈ కరువు ఆగునట్లు చేయవా.

13 ఓ ప్రభువా, నీవు నన్ను ఆలకించవా, నా మాటల ప్రకారము చేయబడునట్లు చేయవా, భూమి తన ఫలమును, ధాన్యము యొక్క ఋతువు నందు ధాన్యమును పండించునట్లు భూ ముఖముపై వర్షము కురిపించవా.

14 ఓ ప్రభువా, ఖడ్గము చేత నాశనము ఆగునట్లు కరువు ఉండనిమ్మని నేను చెప్పినప్పుడు నీవు నా మాటలను ఆలకించితివి; ఈ సమయమున కూడా నీవు నా మాటలను ఆలకించెదవని నేనెరుగుదును, ఏలయనగా ఈ జనులు పశ్చాత్తాపపడిన యెడల నేను వారిని విడిచిపెట్టుదునని నీవు చెప్పితివి.

15 ఓ ప్రభువా, వారికి వచ్చిన కరువు, వ్యాధి మరియు నాశనమును బట్టి వారు పశ్చాత్తాపపడిరని నీవు చూచుచున్నావు.

16 ఇప్పుడు ఓ ప్రభువా, నీవు నీ కోపమును త్రిప్పివేసి, వారు నిన్ను సేవించుదురేమోనని తిరిగి ప్రయత్నించవా? అట్లయిన, ఓ ప్రభువా, నీవు చెప్పిన మాటలను బట్టి నీవు వారిని ఆశీర్వదించవచ్చును.

17 అంతట డెబ్బది ఆరవ సంవత్సరమందు ప్రభువు తన కోపమును జనులపై నుండి త్రిప్పివేసి, భూమిపై వర్షము కురియునట్లు చేసెను, ఎంతగాననగా దాని ఫలము యొక్క ఋతువు నందు అది ఫలమును ఫలించెను మరియు దాని ధాన్యము యొక్క ఋతువు నందు అది ధాన్యమును పండించెను.

18 జనులు ఆనందించి, దేవుడిని మహిమపరచిరి మరియు దేశమంతయు ఆనందముతో నిండెను; వారిక ఏ మాత్రము నీఫైని నాశనము చేయగోరలేదు, కానీ దేవుని నుండి గొప్ప శక్తి మరియు అధికారము ఇవ్వబడియున్న గొప్ప ప్రవక్తగా, దైవజనునిగా వారతనిని యెంచిరి.

19 మరియు అతని సహోదరుడు లీహై కూడా నీతికి సంబంధించిన విషయములలో అతనికి ఏ మాత్రము తీసిపోలేదు.

20 ఆ విధముగా నీఫై జనులు దేశమందు తిరిగి వర్థిల్లసాగిరి మరియు పాడైన స్థలములను తిరిగి నిర్మించుట మొదలుపెట్టి ఉత్తరము వైపున, దక్షిణము వైపున పడమటి సముద్రము నుండి తూర్పు సముద్రము వరకు దేశమంతటిని నింపు వరకు వారు వర్థిల్లి, విస్తరించసాగిరి.

21 మరియు డెబ్బది ఆరవ సంవత్సరము సమాధానమందు ముగిసెను. డెబ్బది ఏడవ సంవత్సరము సమాధానమందు ప్రారంభమాయెను; దేశమందంతటా సంఘము వ్యాపించెను; నీఫైయులు మరియు లేమనీయులలో అధిక భాగము సంఘమునకు చెందియుండిరి; దేశమందు వారు అత్యధిక సమాధానము కలిగియుండిరి; ఆ విధముగా డెబ్బది ఏడవ సంవత్సరము ముగిసెను.

22 ప్రవక్తలచేత ఇవ్వబడిన బోధనాంశములను గూర్చిన కొద్ది వివాదములు తప్ప, డెబ్బది ఎనిమిదవ సంవత్సరమందు కూడా వారు సమాధానము కలిగియుండిరి.

23 డెబ్బది తొమ్మిదవ సంవత్సరమందు అక్కడ ఎక్కువ కలహము మొదలాయెను. కానీ నీఫై, లీహై మరియు వారి సహోదరులలో అనేకులు ప్రతిరోజు అనేక బయల్పాటులను పొందియుండి, సిద్ధాంతము యొక్క సత్యమైన అంశములను గూర్చి ఎరిగియుండి జనులకు బోధించిరి, ఎంతగాననగా వారి కలహమునకు అదే సంవత్సరమందు వారు ముగింపు పలికిరి.

24 మరియు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనభైయవ సంవత్సరమందు, కొంతకాలమునకు ముందు లేమనీయుల యొద్దకు వెళ్ళిపోయి తమపై లేమనీయుల పేరును తీసుకొన్న నీఫై జనులలోని అసమ్మతీయులు కొందరు మరియు వాస్తవముగా లేమనీయ సంతతి వారు కొందరు వారి చేత లేదా ఆ అసమ్మతీయుల చేత కోపమునకు రేపబడి, తమ సహోదరులతో యుద్ధము ప్రారంభించిరి.

25 వారు నరహత్యను, దోపిడీని జరిగించిరి; తరువాత వారు కనుగొనబడకుండునట్లు తమను దాచుకొనుచు వారు పర్వతములలోనికి, అరణ్యములలోనికి, రహస్య స్థలములలోనికి వెళ్ళిపోవుచుండిరి మరియు ప్రతిదినము వారి యొద్దకు వెళ్ళిన అసమ్మతీయులను వారిలో కలుపుకొనుచుండిరి.

26 ఆ విధముగా కొన్ని సంవత్సరముల కాలములోనే వారు అతి పెద్ద దొంగలముఠా అయిరి; వారు గాడియాంటన్‌ యొక్క రహస్య ప్రణాళికలన్నిటిని అన్వేషించిరి మరియు ఆ విధముగా వారు గాడియాంటన్‌ దొంగలైరి.

27 ఇప్పుడు ఈ దొంగలు నీఫై జనుల మధ్య మరియు లేమనీయ జనుల మధ్య కూడా గొప్ప వినాశనము జరిగించిరి.

28 మరియు ఈ నాశనక్రియకు ముగింపు పలుకుట అవసరమాయెను; కావున ఈ దొంగలముఠాను వెతికి, నాశనము చేయుటకు వారు బలమైన మనుష్యుల సైన్యమునొకదానిని అరణ్యములోనికి మరియు పర్వతములపైకి పంపిరి.

29 కానీ అదే సంవత్సరమందు వారు వారి స్వదేశములలోనికి వెనుకకు తరుమబడిరి. ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనభైయవ సంవత్సరము ముగిసెను.

30 ఎనుబది ఒకటవ సంవత్సరము యొక్క ప్రారంభమందు వారు తిరిగి ఈ దొంగలముఠాపై దాడిచేసి, అనేకమందిని నాశనము చేసిరి; మరియు వారు కూడా అధికముగా నాశనము చేయబడిరి.

31 పర్వతములను, అరణ్యమును ఆక్రమించుకొనిన ఆ దొంగల సంఖ్య అత్యధికమైనందున, వారు అరణ్యములోనుండి మరియు పర్వతములలో నుండి వారి స్వదేశములకు తిరిగి వెళ్ళుటకు బలవంతము చేయబడిరి.

32 ఆ విధముగా ఈ సంవత్సరము ముగిసెను. మరియు దొంగలు ఇంకను ఎక్కువై, బలవంతులైరి; ఎంతగాననగా వారు నీఫైయులు, లేమనీయుల యొక్క సంపూర్ణ సైన్యములను ఎదిరించిరి; మరియు దేశమందంతటా జనులందరిపై గొప్ప భయము వచ్చునట్లు వారు చేసిరి.

33 ఏలయనగా వారు దేశము యొక్క అనేక భాగములను దర్శించి, గొప్ప వినాశనము జరిగించిరి; అనేకులను చంపిరి మరియు ఇతరులను, ప్రత్యేకించి వారి స్త్రీలను, పిల్లలను అరణ్యములోనికి బందీలుగా కొనిపోయిరి.

34 ఇప్పుడు వారి దుర్నీతిని బట్టి జనులపై వచ్చిన ఈ గొప్ప కీడు, తిరిగి వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వారిని పురిగొల్పెను.

35 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఎనుబది ఒకటవ సంవత్సరము ముగిసెను.

36 మరియు ఎనుబది రెండవ సంవత్సరమందు వారు తిరిగి వారి దేవుడైన ప్రభువును మరచిపోవుట మొదలుపెట్టిరి. ఎనుబది మూడవ సంవత్సరమందు వారు దుర్మార్గమందు బలపడసాగిరి. ఎనుబది నాలుగవ సంవత్సరమందు వారు తమ జీవనసరళి మార్చుకొనలేదు.

37 ఎనుబది అయిదవ సంవత్సరమందు వారు తమ గర్వమందు మరియు దుర్మార్గమందు మరింత బలపడసాగిరి; ఆ విధముగా వారు తిరిగి నాశనమునకు పరిపక్వమగుచుండిరి.

38 మరియు ఆ విధముగా ఎనుబది అయిదవ సంవత్సరము ముగిసెను.

ముద్రించు