లేఖనములు
మోర్మన్ 3


3వ అధ్యాయము

నీఫైయులకు మోర్మన్‌ పశ్చాత్తాపమును ప్రకటించును—వారు గొప్ప విజయము పొందెదరు మరియు తమ స్వంత బలమందు అతిశయించెదరు—వారికి నాయకత్వము వహించుటకు మోర్మన్‌ తిరస్కరించును మరియు వారి కొరకు అతని ప్రార్థనలు విశ్వాసరహితముగా ఉండును—సువార్తను నమ్ముటకు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములను మోర్మన్‌ గ్రంథము ఆహ్వానించును. సుమారు క్రీ. శ. 360–362 సం.

1 ఇంకను పది సంవత్సరములు గతించిపోవు వరకు లేమనీయులు తిరిగి యుద్ధము చేయుటకు రాలేదు. నేను, నా జనులైన నీఫైయులకు యుద్ధ సమయమునకు ముందుగా తమ దేశములను, తమ ఆయుధములను సిద్ధపరిచే పనిని అప్పగించితిని.

2 మరియు ప్రభువు నాతో ఈలాగు సెలవిచ్చెను: మీరు పశ్చాత్తాపపడి, నా యొద్దకు వచ్చి, బాప్తిస్మము పొంది, నా సంఘమును తిరిగి నిర్మించిన యెడల మీరు విడచిపెట్టబడుదురు అని ఈ జనులకు ప్రకటించుము.

3 మరియు నేను ఈ జనులకు ప్రకటించితిని, కానీ అది వ్యర్థమాయెను; వారిని విడిపించి, పశ్చాత్తాపపడుటకు వారికి ఒక అవకాశమును దయచేసినది ప్రభువేనని వారు గుర్తించలేదు. వారు తమ దేవుడైన ప్రభువుకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనిరి.

4 క్రీస్తు యొక్క రాకడనుండి మొత్తము మూడు వందల అరువది సంవత్సరములను పూర్తిచేయుచూ ఈ పదవ సంవత్సరము గడిచిపోయిన తరువాత, లేమనీయుల రాజు నాకు ఒక లేఖను పంపెను; మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగి వచ్చుటకు వారు సిద్ధపడుచున్నారని అది నాకు తెలియజేసెను.

5 నా జనులు నిర్జన దేశములో దక్షిణము వైపునున్న దేశములోనికి నడిపించు సన్నని మార్గము ప్రక్కన సరిహద్దులలోనున్న ఒక పట్టణమందు సమకూడునట్లు నేను చేసితిని.

6 మా దేశములలో వేటిని వారు స్వాధీనము చేసుకొనకుండా మేము లేమనీయుల సైన్యములను ఆపగలుగునట్లు మా సైన్యములను అక్కడ ఉంచితిమి; కావున, మేము వారికి వ్యతిరేకముగా మా సమస్త బలగముతో కోటలు నిర్మించుకొంటిమి.

7 మూడు వందల అరవై ఒకటవ సంవత్సరమందు, మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు లేమనీయులు నిర్జన పట్టణమునకు వచ్చిరి; ఆ సంవత్సరమందు వారు తిరిగి తమ స్వంత దేశములకు పారిపోవునంతగా మేము వారిని ఓడించితిమి.

8 మూడు వందల అరవై రెండవ సంవత్సరమందు, వారు మరలా యుద్ధము చేయుటకు వచ్చిరి. మేము మరలా వారిని ఓడించితిమి మరియు గొప్ప సంఖ్యలో వారిని సంహరించితిమి, వారి మృతులు సముద్రములోనికి పడవేయబడిరి.

9 ఇప్పుడు, నా జనులైన నీఫైయులు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి వారు తమ స్వంత బలమందు అతిశయించుట మొదలుపెట్టిరి మరియు వారి శత్రువులచేత సంహరింపబడిన తమ సహోదరుల యొక్క రక్తము నిమిత్తము, వారు తమ పగ తీర్చుకొందురని పరలోకముల యెదుట ఒట్టు పెట్టుకొనసాగిరి.

10 తమ శత్రువులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వారు వెళ్ళుదురని, వారిని దేశములోనుండి నిర్మూలించెదరని పరలోకముల మీద మరియు దేవుని యొక్క సింహాసనము మీద కూడా ఒట్టు పెట్టుకొనిరి.

11 వారి దుష్టత్వము మరియు హేయకార్యములను బట్టి, ఈ సమయము నుండి ఈ జనులపై అధికారిగా లేదా నాయకునిగా ఉండుటకు మోర్మన్‌ అను నేను పూర్తిగా తిరస్కరించితిని.

12 దుర్మార్గులైనప్పటికీ నేను వారిని నడిపించితిని, నేను అనేకమార్లు యుద్ధమందు వారికి నాయకత్వము వహించితిని మరియు నాలో ఉన్న దేవుని యొక్క ప్రేమను బట్టి, నా పూర్ణ హృదయముతో వారిని ప్రేమించితిని; వారి కొరకు దినమంతయు ప్రార్థనలో నా దేవునికి నా ఆత్మ క్రుమ్మరించబడెను; అయినప్పటికీ, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆ ప్రార్థన విశ్వాస రహితమైయుండెను.

13 మూడుసార్లు నేను వారిని వారి శత్రువుల చేతులలో నుండి విడిపించితిని మరియు వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు.

14 తమ శత్రువులతో యుద్ధము చేయుటకు వారు వెళ్ళుదురని, తమ సహోదరుల యొక్క రక్తమును బట్టి తమ పగ తీర్చుకొందురని మన ప్రభువు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా వారికి నిషేధింపబడిన సమస్తముచేత వారు ఒట్టు పెట్టుకొనినప్పుడు, ప్రభువు యొక్క స్వరము ఇట్లు చెప్పుచు నాకు వినబడెను:

15 పగ నాది మరియు నేను బదులు చెల్లించెదను; నేను వారిని విడిపించిన తరువాత ఈ జనులు పశ్చాత్తాపపడనందున వారు భూముఖముపై నుండి నిర్మూలించబడెదరు.

16 మరియు మా శత్రువులకు వ్యతిరేకముగా వెళ్ళుటకు నేను పూర్తిగా తిరస్కరించితిని; ప్రభువు నన్ను ఆజ్ఞాపించినట్లుగా నేను చేసితిని; రాబోవు విషయములను గూర్చి సాక్ష్యమిచ్చిన ఆత్మ యొక్క ప్రత్యక్షతలను బట్టి, నేను కనిన, వినిన విషయములను లోకమునకు విశదపరచుటకు ఏకైక ప్రత్యక్షసాక్షిగా నేను నిలిచితిని.

17 కావున అన్యజనులారా, మీకు మరియు ఇశ్రాయేలు వంశము వారికి కూడా నేను వ్రాయుచున్నదేమనగా, ప్రభువు కార్యము ప్రారంభమైనప్పుడు మీ స్వాస్థ్యము యొక్క దేశమునకు తిరిగి వచ్చుటకు మీరు సిద్ధపడుచుందురు;

18 ఇదిగో, నేను భూదిగంతములన్నిటికీ వ్రాయుచున్నాను; ముఖ్యముగా, యెరూషలేము దేశమందు ఆయన శిష్యులుగా ఉండుటకు యేసు ఎన్నుకొనిన పండ్రెండుగురి చేత, వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడు ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రములకు వ్రాయుచున్నాను.

19 ఈ దేశమందు యేసు ఎన్నుకొనిన పండ్రెండుగురి చేత తీర్పు తీర్చబడు ఈ జనుల యొక్క శేషమునకు కూడా నేను వ్రాయుచున్నాను; మరియు వారు యెరూషలేము దేశమందు యేసు ఎన్నుకొనిన మరో పండ్రెండుగురి చేత తీర్పు తీర్చబడుదురు.

20 ఈ విషయములను ఆత్మ నాకు విశదపరిచెను; కావున, నేను మీకందరికీ వ్రాయుచున్నాను. మీరందరూ, అనగా ఆదాము యొక్క సంపూర్ణ మానవ కుటుంబమునకు చెందిన ప్రతి ఆత్మ క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట తప్పక నిలబడవలెనని మరియు అవి మంచివేగాని చెడ్డవేగాని, మీ క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు మీరు నిలబడవలెనని మీరు తెలుసుకొను ఉద్దేశ్యము నిమిత్తము నేను మీకు వ్రాయుచున్నాను.

21 మీ మధ్య ఉండబోవు యేసు క్రీస్తు యొక్క సువార్తను మీరు విశ్వసించవలెనని మరియు ప్రభువు యొక్క నిబంధన జనులైన యూదులు వారు సంహరించిన యేసే నిజముగా క్రీస్తని, నిజముగా దేవుడని, వారు కనిన వినిన యేసుతో పాటు ఇతర సాక్ష్యములను కూడా కలిగియుండునట్లు నేను వ్రాయుచున్నాను.

22 మరియు పశ్చాత్తాపపడి, క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట నిలుచుటకై సిద్ధపడుటకు భూదిగంతములైన మీ అందరినీ నేను ఒప్పించగలుగవలెనని నేను కోరుచున్నాను.

ముద్రించు