మోర్మన్ గ్రంథము
1వ అధ్యాయము
అమ్మరోన్ పవిత్ర వృత్తాంతములను గూర్చి మోర్మన్‌కు ఉపదేశించును—నీఫైయులు మరియు లేమనీయుల మధ్య యుద్ధము ప్రారంభమగును—ముగ్గురు నీఫైయులు కొనిపోబడుదురు—దుష్టత్వము, అవిశ్వాసము, గారడీలు మరియు మంత్రవిద్యలు ప్రబలును. సుమారు క్రీ. శ. 321–326 సం.
1 ఇప్పుడు మోర్మన్ అను నేను, నేను కనిన, వినిన విషయముల యొక్క వృత్తాంతమును వ్రాయుచున్నాను మరియు దానిని మోర్మన్ గ్రంథము అని పిలిచెదను.
2 అమ్మరోన్ ఆ వృత్తాంతములను ప్రభువు సంరక్షణలో దాచివేయు సమయమున నా యొద్దకు వచ్చెను (నేను సుమారు పది సంవత్సరముల వయస్సు కలిగియుండి, నా జనుల జ్ఞానములో కొంతవరకు నేర్చుకొనుట మొదలుపెట్టితిని.) మరియు అమ్మరోన్ నాతో ఇట్లనెను: నీవు స్థిరబుద్ధిగల పిల్లవాడివని, పరిశీలించుటలో వేగముగా ఉన్నావని నేను చూచుచున్నాను;
3 కావున, నీవు సుమారు ఇరువది నాలుగు సంవత్సరముల వాడవైనప్పుడు, నీవు ఈ జనులను గూర్చి పరిశీలించిన విషయములను జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను; నీవు ఆ వయస్సు వాడవైనప్పుడు, ఆంటుమ్ దేశమునకు షిమ్ అని పిలువబడు కొండకు వెళ్ళుము; అక్కడ నేను ఈ జనులను గూర్చిన పరిశుద్ధ చెక్కడములన్నిటినీ ప్రభువు కొరకు భద్రపరచితిని.
4 ఇదిగో, నీవు నీఫై పలకలను మాత్రము తీసుకొని, మిగిలిన వాటిని అవి ఉన్న స్థలమందే వదిలివేయవలెను; ఈ జనులను గూర్చి నీవు పరిశీలించిన విషయములన్నిటినీ నీఫై పలకలపై చెక్కవలెను.
5 మరియు మోర్మన్ అను నేను, నీఫై యొక్క వంశస్థుడనైయుండి (నా తండ్రి పేరు మోర్మన్), అమ్మరోన్ నాకు ఆజ్ఞాపించిన విషయములను జ్ఞాపకముంచుకొంటిని.
6 నేను పదకొండు సంవత్సరములవానిగా ఉన్నప్పుడు, నా తండ్రి చేత దక్షిణము వైపు దేశములోనికి, జరహేమ్ల దేశమునకు తీసుకొనిపోబడితిని.
7 ఆ దేశమంతయు భవనములతో కప్పబడియుండెను; మరియు జనులు ఇంచుమించు సముద్రపు ఇసుకవలే అధిక సంఖ్యాకులైరి.
8 ఈ సంవత్సరమందు నీఫైయులు, జేకబీయులు, జోసెఫీయులు మరియు జోరమీయులను కలిగియున్న నీఫైయుల మధ్య ఒక యుద్ధము ప్రారంభమాయెను; ఈ యుద్ధము నీఫైయులు మరియు లేమనీయులు, లెమూయేలీయులు, ఇష్మాయేలీయుల మధ్యనుండెను.
9 ఇప్పుడు లేమనీయులు, లెమూయేలీయులు, ఇష్మాయేలీయులు కలిసి లేమనీయులని పిలువబడిరి; నీఫైయులు మరియు లేమనీయులు రెండు పక్షములైయుంటిరి.
10 జరహేమ్ల యొక్క సరిహద్దులలో సీదోను జలముల యొద్ద వారి మధ్య యుద్ధముండుట మొదలాయెను.
11 నీఫైయులు ముప్పది వేలమందిని మించిన గొప్ప సైన్యమును సమకూర్చిరి. మరియు ఈ సంవత్సరమందు వారు అనేక యుద్ధములను కలిగియుంటిరి, వాటిలో నీఫైయులు లేమనీయులను కొట్టివేసి, వారిలో అనేకులను సంహరించిరి.
12 అంతట లేమనీయులు వారి ప్రణాళికను వదిలివేసిరి మరియు దేశమందు సమాధానము స్థిరపడెను; సుమారు నాలుగు సంవత్సరముల పాటు సమాధానము నిలిచియుండి, ఎట్టి రక్తపాతము లేకుండెను.
13 కానీ దుష్టత్వము దేశమంతటా వ్యాపించియుండెను, ఎంతగాననగా జనుల యొక్క దుర్నీతిని బట్టి ప్రభువు తన ప్రియ శిష్యులను కొనిపోయెను, అద్భుతములు మరియు స్వస్థత కార్యములు ఆగిపోయెను.
14 ప్రభువు నుండి ఎట్టి బహుమానములు లేకుండెను; వారి దుష్టత్వము మరియు అవిశ్వాసమును బట్టి, పరిశుద్ధాత్మ ఎవరిపైన రాకుండెను.
15 నేను పదిహేను సంవత్సరముల వాడనైయుండి, కొంత స్థిరమైన మనస్సును కలిగియుంటిని; కావున, నేను ప్రభువు చేత దర్శింపబడితిని మరియు యేసు యొక్క మంచితనమును ఎరిగి, రుచి చూచితిని.
16 నేను ఈ జనులకు బోధించుటకు ప్రయత్నించితిని, కానీ నా నోరు మూయబడియుండెను మరియు నేను వారికి బోధించరాదని నిషేధింపబడితిని; ఏలయనగా వారు ఇష్టపూర్వకముగా తమ దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి మరియు వారి దుర్నీతిని బట్టి ప్రియమైన శిష్యులు దేశమునుండి బయటకు కొనిపోబడిరి.
17 కానీ నేను వారి మధ్య నిలిచియుంటిని, అయితే వారి హృదయ కాఠిన్యమును బట్టి నేను వారికి బోధించరాదని నిషేధింపబడితిని మరియు వారి హృదయ కాఠిన్యమును బట్టి, వారి నిమిత్తము దేశము శపించబడెను.
18 మరియు లేమనీయుల మధ్యనున్న ఈ గాడియాంటన్ దొంగలు దేశమును పట్టి పీడించుచుండిరి, ఎంతగాననగా దాని నివాసులు తమ ధనరాశులను భూమిలో దాచివేయుట మొదలుపెట్టిరి; ప్రభువు దేశమును శపించెను గనుక, వారు వాటిని పట్టుకొనలేకుండునట్లు లేదా వాటిని తిరిగి సంపాదించకుండునట్లు అవి చేజారిపోవుచుండెను.
19 మరియు అక్కడ గారడీలు, మంత్ర విద్యలు, కనికట్టులు ఉండెను; అబినడై మరియు లేమనీయుడైన సమూయేలు యొక్క మాటలన్నీ నెరవేరునట్లు, దేశమంతటా దుష్టుని శక్తి పని చేసెను.