లేఖనములు
మోర్మన్ 5


5వ అధ్యాయము

రక్తపాతము మరియు మారణకాండ గల యుద్ధములందు మోర్మన్‌ మరలా నీఫైయుల సైన్యములకు నాయకత్వము వహించును—యేసే క్రీస్తని ఇశ్రాయేలీయులందరినీ ఒప్పించుటకు మోర్మన్‌ గ్రంథము వెలుగులోనికి వచ్చును—వారి అవిశ్వాసమును బట్టి లేమనీయులు చెదరగొట్టబడెదరు మరియు ఆత్మ వారిని ప్రభావితము చేయుట మానివేయును—కడవరి దినములలో వారు అన్యజనుల నుండి సువార్తను పొందెదరు. సుమారు క్రీ. శ. 375–384 సం.

1 మరియు నేను నీఫైయుల మధ్యకు వెళ్ళి, వారికి ఇకపై సహాయపడనని నేను చేసిన ప్రమాణము నిమిత్తము పశ్చాత్తాపపడితిని; వారు మరలా నాకు వారి సైన్యములపై అధికారమునిచ్చిరి, ఏలయనగా వారి శ్రమల నుండి నేను వారిని విడిపించగలనని వారు తలంచిరి.

2 కానీ, నేను నిరీక్షణ లేకయుంటిని, ఏలయనగా వారిపై వచ్చు ప్రభువు యొక్క తీర్పులను నేనెరుగుదును; వారి దుర్ణీతుల విషయమై వారు పశ్చాత్తాపపడలేదు, కానీ వారిని సృష్టించిన ఆ దేవునికి ప్రార్థన చేయకుండా వారు తమ ప్రాణముల కొరకు పెనుగులాడిరి.

3 మరియు మేము జోర్డాన్‌ పట్టణమునకు పారిపోగా, లేమనీయులు మాపై దాడి చేసిరి; కానీ, వారు వెనుకకు తరుమబడినందున ఆ సమయమున వారు ఆ పట్టణమును స్వాధీనపరచుకొనలేదు.

4 మరలా వారు మాపై దాడి చేసిరి, అయినను మేము పట్టణమును నిలబెట్టుకొంటిమి. మరియు నీఫైయుల ద్వారా నిలబెట్టుకొనబడిన ఇతర పట్టణములు కూడా ఉన్నవి, ఆ బలమైన దుర్గములు వారిని అడ్డగించినందున మా దేశ నివాసులను నాశనము చేయుటకు మా ముందున్న దేశములోనికి వారు ప్రవేశించలేకపోయిరి.

5 కానీ, మేము దాటి వెళ్ళినప్పుడు మాతో చేరని దేశముల నివాసులు లేమనీయుల చేత నాశనము చేయబడిరి; వారి పురములు, గ్రామములు మరియు పట్టణములు అగ్నిచేత కాల్చివేయబడెను; ఆ విధముగా మూడు వందల డెబ్బై తొమ్మిది సంవత్సరములు గతించిపోయెను.

6 మూడు వందల ఎనభైయవ సంవత్సరమందు, లేమనీయులు మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగి వచ్చిరి; మరియు మేము ధైర్యముగా వారికెదురు నిలిచితిమి; కానీ అదంతయు వ్యర్థమాయెను, ఏలయనగా వారి సంఖ్యలు ఎంత గొప్పవనగా, వారు నీఫైయులను వారి పాదముల క్రింద త్రొక్కివేసిరి.

7 మేము మరలా పరుగుతీసితిమి; ఎవరి పరుగు లేమనీయుల కంటే వేగముగా ఉండెనో, వారు తప్పించుకొనిరి; ఎవరి పరుగు లేమనీయులను మించలేదో, వారు చంపబడిరి మరియు నాశనము చేయబడిరి.

8 ఇప్పుడు మోర్మన్‌ అను నేను, నా కన్నుల యెదుట జరిగిన రక్తపాతము మరియు మారణకాండ యొక్క భయంకరమైన దృశ్యమును వర్ణించుట ద్వారా మనుష్యుల ఆత్మలను వేధించుటకు కోరుట లేదు; కానీ, ఈ విషయములు తప్పక తెలియజేయబడవలెనని, దాచబడిన సమస్త విషయములు ఇంటి పైకప్పులపై తెలియజేయబడవలెనని—

9 ఇంకను ఈ విషయముల యొక్క జ్ఞానము ఈ జనుల యొక్క శేషమునకు మరియు ఈ జనులను ఎవరు చెదరగొట్టుదురని ప్రభువు చెప్పెనో ఆ అన్యజనులకు కూడా రావలెనని, ఈ జనులు వారి మధ్య శూన్యముగా యెంచబడవలెనని నేనెరుగుదును—కావున, ఈ జనుల దుష్టత్వమును బట్టి మీరు అంత గొప్ప దుఃఖము కలిగియుండకుండునట్లు, నేను పొందిన ఆజ్ఞను బట్టి నేను చూచిన విషయముల యొక్క పూర్తి వృత్తాంతమును ఇచ్చుటకు ధైర్యము చేయక, ఒక చిన్న సంక్షేపమును నేను వ్రాయుచున్నాను.

10 ఇప్పుడు నేను వారి సంతానమునకు మరియు ఇశ్రాయేలు వంశము గురించి చింత కలిగియుండి, తమ ఆశీర్వాదములు ఎక్కడ నుండి వచ్చినవో గుర్తించి, తెలుసుకొనిన అన్యజనులకు కూడా చెప్పుచున్నాను.

11 ఏలయనగా, అట్టి వారు ఇశ్రాయేలు వంశమునకు వచ్చిన విపత్తుకు దుఃఖపడుదురని నేనెరుగుదును; ముఖ్యముగా, ఈ జనుల యొక్క నాశనము నిమిత్తము వారు దుఃఖపడుదురు; వారు యేసు యొక్క బాహువులందు గట్టిగా పట్టుకొనబడునట్లు ఈ జనులు పశ్చాత్తాపపడలేదని వారు దుఃఖపడుదురు.

12 ఇప్పుడు, ఈ సంగతులు యాకోబు వంశము యొక్క శేషమునకు వ్రాయబడినవి; అవి ఈ మాదిరిగా వ్రాయబడినవి, ఏలయనగా దుష్టత్వము వారి కొరకు వాటిని వెలుగులోనికి తీసుకురాదని దేవుని వలన తెలియును మరియు ఆయన యుక్త కాలమందు వెలుగులోనికి వచ్చునట్లు అవి ప్రభువు సంరక్షణలో దాచివేయబడవలెను.

13 నేను పొందిన ఆజ్ఞ ఇదియే; మరియు అది సరియైనదని తన వివేకమందు ఆయన చూచినప్పుడు, ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారము అవి వెలుగులోనికి వచ్చును.

14 అవి యూదుల యొక్క అవిశ్వాసుల యొద్దకు వెళ్ళును; మరియు యేసే క్రీస్తని, జీవము గల దేవుని కుమారుడని, ఆయన నిబంధన యొక్క నెరవేర్పు కొరకు యూదులను లేదా ఇశ్రాయేలు వంశస్థులందరినీ వారి దేవుడైన ప్రభువు వారికి స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు పునఃస్థాపించుటలో ఆయన గొప్ప మరియు నిత్య సంకల్పమును తండ్రి, తన మిక్కిలి ప్రియ కుమారుని ద్వారా నెరవేర్చునని వారు ఒప్పింపబడు ఉద్దేశ్యము నిమిత్తము అవి వెళ్ళును;

15 మరియు అన్యజనులనుండి వారియొద్దకు వెళ్ళు ఆయన సువార్తను ఈ జనుల యొక్క సంతానము అధిక సంపూర్ణముగా విశ్వసించవలెనని కూడా అవి వెళ్ళును; ఏలయనగా, ఈ జనులు చెదరగొట్టబడుదురు మరియు మా మధ్య ఎన్నడూ ఉండని, అనగా లేమనీయుల మధ్య ఉన్న దానిని మించి నల్లని, మలినమైన, అసహ్యమైన జనులగుదురు; మరియు ఇది, వారి అవిశ్వాసమును విగ్రహారాధనను బట్టియైయుండును.

16 ఏలయనగా, ప్రభువు యొక్క ఆత్మ వారి పితరులను ప్రభావితము చేయుట ఇప్పటికే మానివేసెను; వారు లోకమందు క్రీస్తు మరియు దేవుడు లేకయున్నారు; వారు గాలి యెదుట పొట్టువలే తరుమబడియున్నారు.

17 ఒకప్పుడు వారు ఆహ్లాదకరమైన జనులైయుండిరి మరియు తమ కాపరిగా క్రీస్తును కలిగియుండిరి; వారు తండ్రియైన దేవుని ద్వారా కూడా నడిపించబడిరి.

18 కానీ ఇప్పుడు, గాలియెదుట కొట్టుకొనిపోవు పొట్టు వలె, తెరచాప లేదా లంగరు లేకుండా, లేదా దానిని నడపుటకు ఏదీ లేకుండా అలలపై కొట్టుకొనిపోవు పడవ వలే వారు సాతాను చేత నడిపించబడిరి; మరియు ఆ పడవ ఎట్లుండునో, వారు కూడా అట్లే ఉండిరి.

19 మరియు వారు దేశమందు పొందవలసిన వారి ఆశీర్వాదములను, ఆ దేశమును స్వాధీన పరచుకొనబోవు అన్యజనుల కొరకు ప్రభువు నిలిపివేసెను.

20 కానీ వారు అన్యజనుల చేత తరుమబడి, చెదరగొట్టబడుదురు; వారు అన్యజనుల చేత తరుమబడి చెదరగొట్టబడిన తరువాత, అప్పుడు అబ్రాహాముకు మరియు ఇశ్రాయేలు వంశస్థులందరికి ఆయన చేసిన నిబంధనను ప్రభువు జ్ఞాపకము చేసుకొనును.

21 మరియు వారి కొరకు నీతిమంతులు చేసిన ప్రార్థనలను కూడా ప్రభువు జ్ఞాపకము చేసుకొనును.

22 అప్పుడు, అన్యజనులైన మీరు, పశ్చాత్తాపపడి మీ చెడు మార్గముల నుండి మరలని యెడల, దేవుని శక్తి యెదుట మీరెట్లు నిలువగలరు?

23 మీరు దేవుని హస్తములలో ఉన్నారని మీరెరుగరా? ఆయన సమస్త శక్తిని కలిగియున్నాడని మరియు ఆయన ఘనమైన ఆజ్ఞ మూలముగా భూమి ఒక చుట్ట వలే చుట్టబడునని మీరెరుగరా?

24 కావున పశ్చాత్తాపపడుడి మరియు ఆయన యెదుట మిమ్ములను తగ్గించుకొనుడి, లేని యెడల న్యాయమందు ఆయన మీకు విరుద్ధముగా వచ్చును—లేని యెడల, యాకోబు సంతానము యొక్క శేషము మీ మధ్య ఒక సింహమువలే ముందుకు వెళ్ళి మిమ్ములను ముక్కలుగా చీల్చివేయును; మరియు విడిపించుటకు అక్కడ ఎవడును ఉండడు.

ముద్రించు