లేఖనములు
2 నీఫై 18


18వ అధ్యాయము

క్రీస్తు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును—ప్రభువును వెదకుడి, కిచకిచలాడు మంత్రజ్ఞులను కాదు—నడిపింపు కొరకు ధర్మశాస్త్రము వైపు సాక్ష్యము వైపు తిరుగుడి—యెషయా 8 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 మరియు ప్రభువు వాక్కు నాతో—నీవు గొప్ప పత్రమును తీసుకొని మహేరు-షాలాల్-హాష్‌-బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము.

2 నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని చెప్పగా,

3 నేను ప్రవక్త్రి యొద్దకు వెళ్ళితిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా ప్రభువు—అతనికి మహేరు-షాలాల్-హాష్‌-బజ్ అని పేరు పెట్టుము.

4 ఈ బాలుడు—నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును సమరయ యొక్క దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

5 మరియు ప్రభువు ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను—

6 ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్ళు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు.

7 కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును.

8 అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును.

9 జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా మీరందరు ఆలకించుడి, మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

10 ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును; మాట పలికినను అది నిలువదు; దేవుడు మాతో నున్నాడు.

11 ఈ జనుల మార్గమున నడవకూడదని ప్రభువు బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను—

12 ఈ జనులు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అని అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దిగులుపడకుడి.

13 సైన్యములకధిపతియగు ప్రభువే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసమే దిగులుపడవలెను.

14 అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును; అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును.

15 అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి, కాళ్లు చేతులు విరిగి, చిక్కుబడి పట్టబడుదురు.

16 ఈ సాక్ష్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగించుము.

17 యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసుకొను ప్రభువు కొరకు నేను ఎదురుచూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను.

18 ఇదిగో, నేనును, ప్రభువు నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియైన ప్రభువు వలని సూచకక్రియలుగాను, ఆశ్చర్యకార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్యనున్నాము.

19 వారు మిమ్మును చూచి—కర్ణపిశాచి గలవారి యొద్దకును, కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారించవద్దా? సజీవుల పక్షముగా చచ్చినవారి నుండి వినుటకు వెళ్ళదగునా?

20 ధర్మశాస్త్రమును సాక్ష్యమును విచారించుడి; ఈ వాక్య ప్రకారము వారు బోధించకపోవుటకు కారణము వారిలో వెలుగు లేకపోవుటయే.

21 అట్టివారు ఇబ్బందిపడుచూ ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు పైకి చూతురు;

22 భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి త్రోలివేయబడెదరు.