5వ అధ్యాయము
నీఫైయులు, లేమనీయుల నుండి తమను వేరుపరచుకొని, మోషే ధర్మశాస్త్రమును పాటించెదరు మరియు ఒక ఆలయమును నిర్మించెదరు—వారి అవిశ్వాసమును బట్టి లేమనీయులు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడి, శపించబడి నీఫైయులకు ఒక కొరడా వలె అగుదురు. సుమారు క్రీ. పూ. 588–559 సం.
1 నీఫైయను నేను, నా సహోదరుల కోపమును బట్టి ప్రభువైన నా దేవునికి ఎంతో మొరపెట్టితిని.
2 అయితే వారు నా ప్రాణము తీయుటకు ప్రయత్నించునంతగా నా మీద వారి కోపము తీవ్రమాయెను.
3 వారు నాకు వ్యతిరేకముగా ఇట్లనుచూ సణిగిరి: మన తమ్ముడు మనపై పరిపాలన చేయవలెనని తలంచుచున్నాడు; మనము అతడిని బట్టి చాలా శ్రమ పొందియున్నాము; అందువలన, ఇప్పుడు మనము అతని మాటల వలన అధిక బాధను పొందకుండునట్లు అతడిని సంహరించెదము. ఏలయనగా, ఈ జనులపై పరిపాలన చేయుట అన్నలమైన మనకు చెందును గనుక మన అధిపతిగా అతడిని మనము ఉండనియ్యము.
4 ఇప్పుడు, నాకు వ్యతిరేకముగా వారు సణిగిన మాటలన్నియు నేను ఈ పలకలపై వ్రాయుట లేదు; కానీ వారు నా ప్రాణము తీయుటకు ప్రయత్నించిరని వ్రాయుట చాలును.
5 నీఫైయను నేను వారి నుండి విడిపోయి, నాతో వెళ్ళదలచిన వారందరితో కలిసి అరణ్యములోనికి పారిపోవలెనని ప్రభువు నన్ను హెచ్చరించెను.
6 అందువలన నీఫైయను నేను, నా కుటుంబమును, జోరమ్‌ను అతని కుటుంబమును, నా అన్న శామ్‌ను అతని కుటుంబమును, నా తమ్ములైన జేకబ్, జోసెఫ్‌లను, నా సహోదరీలను మరియు నాతో వెళ్ళు వారందరిని తీసుకొనివెళ్ళితిని. నాతో వెళ్ళు వారందరు దేవుని హెచ్చరికలు మరియు బయల్పాటులయందు విశ్వసించిన వారు; కావున, వారు నా మాటలను ఆలకించిరి.
7 మేము మా గుడారములను తీసుకొని, మాకు సాధ్యమైన వాటన్నిటిని తీసుకొని అరణ్యములో అనేకదినముల పాటు ప్రయాణము చేసితిమి. అనేకదినముల పాటు ప్రయాణము చేసిన తరువాత మేము మా గుడారములను వేసుకొంటిమి.
8 ఆ స్థలమును నీఫై అని పిలువవలెనని నా జనులు కోరిరి; అందువలన, మేము దానిని నీఫైయని పిలిచితిమి.
9 నాతో ఉన్నవారందరు తమనుతాము నీఫై జనులని పిలుచుకొనవలెనని నిశ్చయించుకొనిరి.
10 మేము మోషే ధర్మశాస్త్రముననుసరించి ప్రభువు యొక్క తీర్పులను, కట్టడలను మరియు ఆజ్ఞలను పాటించుటను ఆచరించితిమి.
11 ప్రభువు మాతో ఉండెను గనుక మేము అత్యధికముగా వర్థిల్లితిమి; మేము విత్తనములు విత్తి, మరలా సమృద్ధిగా పంట కోసితిమి; మేము మందలను, గుంపులను, అన్ని రకముల జంతువులను పెంచుట ప్రారంభించితిమి.
12 నీఫైయను నేను కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను మరియు వ్రాయబడిన దానిని బట్టి, నా తండ్రి కొరకు ప్రభువు హస్తము ద్వారా సిద్ధపరచబడిన గోళము లేదా దిక్సూచిని కూడా వెంటతెచ్చితిని.
13 మేము అత్యధికముగా వర్థిల్లి, ఆ దేశములో విస్తరించుట మొదలుపెట్టితిమి.
14 ఇప్పుడు లేమనీయులని పిలువబడిన జనులు ఒకవేళ మాపైకి వచ్చి, మమ్ములను నాశనము చేయుదురేమోనని నీఫైయను నేను, లేబన్ ఖడ్గమును తీసుకొని దాని ప్రకారము అనేక ఖడ్గములను చేసితిని; ఏలయనగా నా యెడల, నా సంతానము మరియు నా జనులని పిలువబడిన వారి యెడల వారి ద్వేషమును నేనెరుగుదును.
15 నేను నా జనులకు భవనములను నిర్మించుట, సకల విధముల చెక్క పనిచేయుట, అత్యంత సమృద్ధిగానున్న ఇనుము, రాగి, కంచు, ఉక్కు, బంగారము, వెండి మరియు ప్రశస్థమైన లోహములతో పనిచేయుటను నేర్పితిని.
16 నీఫైయను నేను, సొలొమోను యొక్క ఆలయము మాదిరిగా ఒక ఆలయమును నిర్మించితిని; కానీ, అది ఎక్కువ ప్రశస్థమైన వస్తువులతో నిర్మించబడలేదు; ఏలయనగా, అవి దేశములో దొరకనందున అది సొలొమోను యొక్క ఆలయము వలే నిర్మించబడలేకపోయెను. అయితే దాని నిర్మాణ విధానము సొలొమోను యొక్క ఆలయము వలే ఉండెను. దాని పనితనము అత్యంత మేలిరకమైయుండెను.
17 నీఫైయను నేను, నా జనులు పరిశ్రమించునట్లు, తమ చేతులతో పనిచేయునట్లు చేసితిని.
18 నేను వారికి రాజుగా ఉండవలెనని వారు కోరిరి. కానీ, వారు ఒక రాజును కలిగియుండకూడదని నీఫైయను నేను కోరితిని. అయినను, వారి కొరకు నా శక్తి యందున్నదంతయూ నేను చేసితిని.
19 నేను వారి అధిపతిగా, వారి ఉపదేశకునిగా ఉండవలెనని నా సహోదరుల గూర్చి ప్రభువు పలికిన వాక్యములు వారిపట్ల నెరవేరెను. కావున, వారు నా ప్రాణము తీయుటకు ప్రయత్నించువరకు ప్రభువు యొక్క ఆజ్ఞలననుసరించి నేను వారి అధిపతిగా, వారి ఉపదేశకునిగా ఉంటిని.
20 కావున, నీ మాటలు ఆలకించకుండా ఉన్నంతవరకు వారు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడుదురని ప్రభువు నాతో పలికిన వాక్యము నెరవేరెను. మరియు వారు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడిరి.
21 వారిపై శాపము వచ్చునట్లు, అనగా వారి దుష్టత్వమును బట్టి బాధాకరమైన శాపము వచ్చునట్లు ఆయన చేసెను. ఏలయనగా, వారు తమ హృదయములను ఆయనకు వ్యతిరేకముగా కఠినపరచుకొని ఒక చెకుముకి రాయి వలే అయిరి; ఇప్పుడు వారు తెల్లగా, అత్యంత సుందరముగా, మనోహరముగా ఉండి నా జనులను ఆకర్షించకుండునట్లు, ప్రభువైన దేవుడు వారి చర్మమును నల్లగా చేసెను.
22 మరియు ప్రభువైన దేవుడు ఈ విధముగా సెలవిచ్చుచున్నాడు: వారు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడితే తప్ప, వారు నీ జనులకు అసహ్యకరముగా ఉండునట్లు నేను చేసెదను.
23 వారి సంతానముతో కలియు వాని సంతానము శపించబడును; వారు కూడా అదే శాపముతో శపించబడుదురు. మరియు ప్రభువు దానిని పలుకగా అది జరిగెను.
24 వారిపైనున్న శాపమును బట్టి వారు కీడు మరియు కుయుక్తితో నిండిన సోమరులైరి, వారు అరణ్యములో ఇతర జంతువులను చంపి తినే మృగముల కొరకు వెదికిరి.
25 మరియు ప్రభువైన దేవుడు నాతో ఇట్లనెను: వారు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు నీ సంతానమును పురిగొల్పు కొరడావలేనుందురు; మరియు వారు నన్ను జ్ఞాపకము చేసుకొనకుండా, నా మాటలు ఆలకించకుండా ఉన్న యెడల, వారు నాశనమగునట్లు వారిని బాధించెదరు.
26 నీఫైయను నేను, జేకబ్ మరియు జోసెఫ్‌లను దేశములో నా జనులపై యాజకులుగా, బోధకులుగా నియమించితిని.
27 మేము ఆనందముగా జీవించితిమి.
28 మరియు మేము యెరూషలేమును విడిచిపెట్టిన సమయము నుండి ముప్పది సంవత్సరములు గడిచెను.
29 నేను చేసిన నా పలకలపై ఇంతవరకు నా జనుల వృత్తాంతములను నీఫైయను నేను వ్రాసితిని.
30 మరియు ప్రభువైన దేవుడు నాతో—ఇతర పలకలను చేయుము; నీ జనుల ప్రయోజనము కొరకు నా దృష్టిలో శ్రేష్ఠమైన అనేక విషయములను వాటిపై నీవు చెక్కెదవు అనెను.
31 అందువలన నీఫైయను నేను, ప్రభువు ఆజ్ఞలకు విధేయుడనైయుండుటకు ఈ పలకలను తయారుచేసి, వాటిపై ఈ విషయములను చెక్కితిని.
32 దేవునికి ప్రీతికరమైన దానినే నేను చెక్కితిని. నా జనులు దేవుని విషయములపట్ల సంతోషపడిన యెడల, వారు ఈ పలకలపైనున్న నా చెక్కడములపట్ల సంతోషించెదరు.
33 నా జనుల చరిత్ర యొక్క ప్రత్యేక భాగమును నా జనులు ఆశించిన యెడల, వారు నా ఇతర పలకలను పరిశీలించవలెను.
34 ఇప్పుడు నలుబది సంవత్సరములు గతించెనని చెప్పుట నాకు చాలును, మేము ఇప్పటికే మా సహోదరులతో యుద్ధములు, వివాదములు కలిగియుంటిమి.