23వ అధ్యాయము
బబులోను నాశనము రెండవ రాకడ సమయమున జరుగు నాశనమునకు ఒక సూచన అయ్యున్నది—అది ఉగ్రత మరియు ప్రతీకారము యొక్క దినమైయుండును—బబులోను (లోకము) శాశ్వతముగా పతనమైపోవును—యెషయా 13 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 559–545 సం.
1 ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి—
2 సైన్యము ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు ఎత్తైన పర్వతముమీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి.
3 నేను పరిశుద్ధపరచిన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను, ఏలయనగా నా కోపము నా ఉన్నతస్థితి యందు ఆనందించు వారిపైన లేదు.
4 పర్వతములలోని జన సమూహము వలన కలుగు శబ్దము బహుజనుల ఘోష వలే వినబడుచున్నది, సమకూడి వచ్చు రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినబడుచున్నది, సెన్యములకధిపతియగు ప్రభువు యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు.
5 సర్వలోకమును పాడుచేయుటకై దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి ప్రభువును, ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నవి.
6 ప్రభువు యొక్క దినము సమీపించియున్నది, ఘోషించుడి; అది ప్రళయమువలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును.
7 అందుచేత బాహువులన్నియు దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును;
8 జనులు విభ్రాంతినొందుదురు; వేదనలు, దుఃఖములు వారికి కలుగును, ఒకరినొకరు తేరి చూతురు; వారి ముఖములు జ్వాలల వలె ఉండును.
9 ప్రభువు దినము వచ్చుచున్నది, దేశమును పాడుచేయుటకు, దాని పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకు క్రూరమైన ఉగ్రతతోను, ప్రచండమైన కోపముతోను అది వచ్చును.
10 ఆకాశ నక్షత్రములు, నక్షత్ర రాశులు తమ వెలుగు ప్రకాశింపనియ్యవు; ఉదయకాలమున సూర్యుడిని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు.
11 కీడును బట్టి లోకమును, వారి దోషములను బట్టి దుర్మార్గులను నేను శిక్షించెదను; అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణచివేసెదను.
12 బంగారము కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను.
13 సైన్యములకధిపతియగు ప్రభువు ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణకునట్లు, భూమి తన స్థానము తప్పునట్లు నేను చేసెదను.
14 అప్పుడు తరుమబడుచున్న జింక వలె, పోగు చేయని గొఱ్ఱెల వలె జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు.
15 గర్విష్ఠుడైన ప్రతివాడు కత్తివాత కూలును; దుష్టులతో చేరిన ప్రతివాడు ఖడ్గము చేత కూలును.
16 వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు; వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదరు.
17 వారికి వ్యతిరేకముగా నేను మాదీయులను పురిగొల్పెదను, వారు వెండి బంగారములను లక్ష్యము చేయరు, వారు దానియందు ఆనందించరు.
18 వారి విండ్లు యౌవనస్థులను నలుగగొట్టును; గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు.
19 అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాల వలె అగును.
20 అది మరెన్నడును నివాసస్థలముగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు; అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు, గొఱ్ఱెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనియ్యరు.
21 ఎడారిలోని కౄర మృగములు అక్కడ పండుకొనును, పనికిరాని జీవులు వారి ఇండ్లలో ఉండును; గుడ్లగూబలు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును.
22 ద్వీపములలోని కౄర మృగములు నిర్జనమైన వారి ఇండ్లలోను, ఘటసర్పములు వారి సుఖవిలాస మందిరములలోను మొరలిడును; ఆ దేశమునకు కాలము సమీపించియున్నది, దాని దినములు సంకుచితములు. దానిని నేను త్వరగా నాశనము చేయుదును; ఏలయనగా నా జనుల యెడల నేను కనికరముగానుందును, కానీ దుర్మార్గులు నశించెదరు.