లేఖనములు
1 నీఫై 14


అధ్యాయము 14

అన్యజనులపై వచ్చు ఆశీర్వాదములు, శాపములను గూర్చి ఒక దేవదూత నీఫైకి చెప్పును—రెండు సంఘములు మాత్రమే కలవు: దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సంఘము, అపవాది యొక్క సంఘము—సమస్త జనములలోను దేవుని పరిశుద్ధులు ఆ గొప్ప హేయకరమైన సంఘము ద్వారా హింసింపబడుదురు—అపోస్తలుడైన యోహాను లోకము యొక్క అంతమును గూర్చి వ్రాయును. సుమారు క్రీ. పూ. 600–592 సం.

1 ఒక వేళ అన్యజనులు దేవుని గొఱ్ఱెపిల్లను ఆలకించిన యెడల, ఆ దినమున ఆయన వారికి వాక్యమందు, శక్తి యందు, నిజముగా క్రియ యందు వారి అడ్డంకులను తీసివేయునట్లుగా తననుతాను వారికి విశదపరచుకొనును—

2 మరియు దేవుని గొఱ్ఱెపిల్లకు వ్యతిరేకముగా వారి హృదయములను కఠిన పరచుకొనని యెడల, వారు నీ తండ్రి యొక్క సంతానమందు లెక్కించబడుదురు; ముఖ్యముగా, వారు ఇశ్రాయేలు వంశస్థులలో లెక్కించబడుదురు; వారు వాగ్దానదేశముపై శాశ్వతముగా ఒక ఆశీర్వదింపబడిన జనముగానుందురు; వారు మరెన్నడూ దాస్యములోనికి తేబడరు; మరియు ఇశ్రాయేలు వంశము మరెన్నడూ తన ఉనికిని కోల్పోదు.

3 నరుల ఆత్మలను నరకములోనికి నడిపించునట్లు అపవాది మరియు అతని సంతానముచేత ఏర్పాటు చేయబడిన ఆ గొప్ప హేయకరమైన సంఘము చేత వారి కొరకు త్రవ్వబడిన ఆ మహాగొయ్యి—ముఖ్యముగా, నరుల నాశనము కొరకు త్రవ్వబడిన ఆ మహాగొయ్యి దానిని త్రవ్విన వారి సర్వనాశనమునకు వారి చేతనే నింపబడునని దేవుని గొఱ్ఱెపిల్ల సెలవిచ్చుచున్నాడు, అంతము లేని ఆ నరకము లోనికి దానిని పడవేసుకొనుట తప్ప ఆత్మ నాశనము కాదు.

4 ఏలయనగా, ఇది అపవాది యొక్క దాస్యమును బట్టి, దేవుని న్యాయమును బట్టి, ఆయన యెదుట దుష్టత్వము మరియు హేయమైన క్రియలు చేయు వారందరిపై యున్నది.

5 ఆ దేవదూత నీఫైయను నాతో ఇట్లనెను: అన్యజనులు పశ్చాత్తాపము పొందిన యెడల, వారికి మేలు జరుగునని నీవు చూచియున్నావు; ఇశ్రాయేలు వంశస్థులతో ప్రభువు నిబంధనలను గూర్చి కూడా నీవెరుగుదువు; మరియు ఎవరైతే పశ్చాత్తాపము పొందరో, వారు నశింపవలెనని కూడా నీవు విని యున్నావు.

6 కాబట్టి అన్యజనులు దేవుని గొఱ్ఱెపిల్లకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠిన పరచుకొనిన యెడల, వారికి ఆపద కలుగును గాక.

7 ఏలయనగా, నేను నరుల సంతానము మధ్యన ఒక గొప్ప అద్భుతకార్యమును చేయబోవు సమయము వచ్చునని దేవుని గొఱ్ఱెపిల్ల సెలవిచ్చుచున్నాడు; ఆ కార్యము శాశ్వతమైనది, ఒక విధముగా లేదా మరొక విధముగా—వారిని సమాధానము మరియు నిత్యజీవమునకు ఒప్పించుటకు లేదా వారి హృదయ కాఠిన్యమునకును, వారి మనస్సుల అంధత్వమునకును, నేను చెప్పిన ఆ అపవాది యొక్క దాస్యమును బట్టి వారు దాస్యములోనికి తేబడునట్లుగా భౌతికముగా ఆధ్యాత్మికముగా వారు నాశనములోనికి తేబడుటకు వారిని అప్పగించుటకైయున్నది.

8 ఆ దేవదూత ఈ మాటలు చెప్పిన తరువాత, అతడు నాతో—ఇశ్రాయేలు వంశస్థులతో తండ్రి చేసిన నిబంధనలు నీకు జ్ఞాపకమున్నవా? అనెను. నేనతనితో అవునని చెప్పితిని.

9 అతడు నాతో—చూడుము, అపవాదియే స్థాపకుడైయున్న హేయకార్యములకు తల్లియైన ఆ గొప్ప హేయకరమైన సంఘమును చూడుమనెను.

10 అతడు నాతో రెండు సంఘములు మాత్రమే ఉన్నవని చెప్పెను: ఒకటి దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సంఘము, మరొకటి అపవాది యొక్క సంఘము. అందువలన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సంఘమునకు చెందనివాడు హేయకార్యములకు తల్లియైన ఆ గొప్ప సంఘమునకు చెందును; ఆమె సమస్త భూమికి వ్యభిచారిణియైయున్నది.

11 నేను చూచి, సమస్త భూమి యొక్క వ్యభిచారిణిని వీక్షించితిని, ఆమె అనేక జలములపైన కూర్చొనియుండెను; ఆమె సమస్త జనములు, జాతులు, భాషలు, ప్రజల మధ్య భూమియంతటి మీద అధికారమును కలిగియుండెను.

12 నేను దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క సంఘమును చూచితిని, అనేక జలములపై కూర్చొనియున్న వ్యభిచారిణి యొక్క దుర్మార్గత మరియు హేయక్రియలను బట్టి దాని సభ్యుల సంఖ్య స్వల్పముగా నుండెను; అయినప్పటికినీ దేవుని పరిశుద్ధులున్న గొఱ్ఱెపిల్ల సంఘము కూడా భూముఖమంతటా ఉండుట నేను చూచితిని; మరియు నేను చూచియున్న ఆ మహా వ్యభిచారిణి యొక్క దుర్మార్గతను బట్టి భూముఖముపైన వారి ఆధిపత్యములు స్వల్పముగా ఉండెను.

13 ఆ గొప్ప హేయకార్యములకు తల్లి దేవుని గొఱ్ఱెపిల్లకు వ్యతిరేకముగా పోరాడుటకు భూముఖమంతటి మీద అన్యజనుల యొక్క సమస్త జనముల మధ్య సమూహములను సమకూర్చుటను నేను చూచితిని.

14 భూముఖమంతటిపై చెదిరియున్న గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.

15 దేవుని ఉగ్రత ఆ గొప్ప హేయకరమైన సంఘముపై క్రుమ్మరింపబడుట నేను చూచితిని, ఎంతగాననగా భూమి పైనున్న సమస్త జనములు, వంశముల మధ్య యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులు ఉండెను.

16 హేయకార్యముల తల్లికి చెందిన జనములన్నిటి మధ్య యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులు మొదలు కాగానే, ఆ దేవదూత నాతో ఇట్లనెను: ఇదిగో, దేవుని ఉగ్రత వేశ్యల తల్లిపైన ఉన్నది; మరియు నీవు ఈ దృశ్యములన్నింటిని చూచుచున్నావు—

17 అపవాది స్థాపకుడుగానున్న భూమియంతటి యొక్క గొప్ప హేయకరమైన సంఘమయిన వేశ్యల తల్లిపైన దేవుని ఉగ్రత క్రుమ్మరింపబడు ఆ దినము వచ్చినప్పుడు, ఇశ్రాయేలు వంశస్థులైన తన జనులకు ఆయన చేసిన నిబంధనలను నెరవేర్చుటకు మార్గము సిద్ధపరచుటలో తండ్రి యొక్క పని ప్రారంభమగును.

18 ఆ దేవదూత నాతో—చూడుమనెను.

19 నేను చూచి, ఒక మనుష్యుడు తెల్లని నిలువుటంగీని ధరించియుండుట వీక్షించితిని.

20 ఆ దేవదూత నాతో ఇట్లనెను: గొఱ్ఱెపిల్ల యొక్క పండ్రెండుగురు అపొస్తలులలో ఒకరిని చూడుము.

21 అతడు ఈ దృశ్యములలో మిగిలిన వాటిని మరియు జరిగిపోయిన వాటిలో అనేక కార్యములను చూచి, వ్రాయును.

22 అతడు లోకము యొక్క అంతమును గూర్చి కూడా వ్రాయును.

23 అందువలన, అతడు వ్రాయు వాక్యములు న్యాయమైనవి, సత్యమైనవి; మరియు అవి ఆ యూదుని నోటి నుండి వెలువడుచుండగా నీవు చూచిన ఆ గ్రంథము నందు వ్రాయబడినవి; యూదుని నోటినుండి అవి వెలువడిన సమయమున లేదా ఆ గ్రంథము యూదుని నోటినుండి వెలువడిన సమయమున వ్రాయబడిన వాక్యములు సరళముగా, శుద్ధముగా, మిక్కిలి ప్రశస్థముగా ఉండి, మనుష్యులందరి గ్రహింపునకు సులువైయుండెను.

24 గొఱ్ఱెపిల్ల యొక్క ఈ అపొస్తలుడు వ్రాయు వాక్యములు నీవు చూసియుండిన అనేక దృశ్యములే; మిగిలిన వాటిని నీవు చూచెదవు.

25 కానీ ఇక మీదట నీవు చూచు దృశ్యములను నీవు వ్రాయరాదు; ఏలయనగా దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క అపోస్తలుడు వాటిని వ్రాయవలెనని ప్రభువైన దేవుడు నియమించెను.

26 ముందుండిన ఇతరులకు కూడా ఆయన అన్నిదర్శనములను చూపగా వారు వాటిని వ్రాసిరి; మరియు గొఱ్ఱెపిల్లయందున్న సత్యమును బట్టి, ప్రభువు యొక్క యుక్త కాలమందు ఇశ్రాయేలు వంశము వారికి వాటి శుద్ధత్వమునందు వచ్చునట్లు అవి ముద్ర వేయబడియున్నవి.

27 ఆ దేవదూత మాటను బట్టి గొఱ్ఱెపిల్ల యొక్క అపోస్తలుని పేరు యోహాను అని నీఫైయను నేను విని, సాక్ష్యమిచ్చుచున్నాను.

28 నీఫైయను నేను చూచిన, వినిన మిగిలిన దర్శనములను వ్రాయుటకు నిషేధింపబడితిని; అందువలన నేను వ్రాసిన వాక్యములు నాకు చాలును; నేను చూచిన దృశ్యముల యొక్క ఒక చిన్నభాగమును మాత్రమే నేను వ్రాసితిని.

29 నా తండ్రి చూచిన దర్శనములను నేను చూచితినని, ప్రభువు యొక్క దేవదూత వాటిని నాకు తెలియజేసెనని నేను సాక్ష్యమిచ్చుచున్నాను.

30 ఇప్పుడు, నేను ఆత్మలో కొనిపోబడినప్పుడు చూచిన దృశ్యములను గూర్చి మాట్లాడుట నేను ముగించెదను; నేను చూచిన దృశ్యములన్నిటిని నేను వ్రాయనప్పటికీ నేను వ్రాసిన వాక్యములు సత్యమైనవి. అది ఆలాగునైయున్నది. ఆమేన్‌.