లేఖనములు
1 నీఫై 20


20వ అధ్యాయము

ప్రభువు తన ఉద్దేశ్యములను ఇశ్రాయేలీయులకు ప్రకటించును—ఇశ్రాయేలీయులు శ్రమల కొలిమిలో ఎన్నుకోబడిరి మరియు బబులోనులో నుండి బయటకు వెళ్ళవలయును—యెషయా 48 తో పోల్చుము. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అను పేరు కలిగినవారలారా, యూదా జలములలో నుండి లేదా బాప్తిస్మపు జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై ప్రభువు నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించినప్పటికీ నీతి సత్యములందు ప్రమాణము చేయనివారలారా, ఈ మాట విని ఆలకించుడి.

2 వారు—మేము పరిశుద్ధ పట్టణస్థులమను పేరు పెట్టుకొని సైన్యములకధిపతియైన ఇశ్రాయేలు దేవుడిని ఆశ్రయించరు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

3 గతించిన కార్యములను నేను ఆరంభమునుండి ప్రకటించియున్నాను; ఆ సమాచారము నా నోటనుండి బయలుదేరెను, నేను వాటిని ప్రకటించితిని. నేను అకస్మాత్తుగా వాటిని ప్రకటించితిని.

4 నేను దీనిని చేసితిని, ఎందుకనగా నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేనెరిగియుంటిని;

5 నా విగ్రహము ఈ కార్యములను జరిగించెనని, నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము వాటిని ఆజ్ఞాపించెనని నీవు చెప్పకుండునట్లు అవి జరుగకమునుపే వాటిని నీకు చూపించితిని, అంతేకాకుండా ఆరంభమునుండి వాటిని నీకు ప్రకటించితిని.

6 నీవు వీటన్నిటిని విని, చూచియున్నావు; నీవు వాటిని ప్రకటించవా? తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేనికమీదట నీకు తెలియజేయుచున్నాను.

7 అవి ఆరంభమునుండి సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవియే. అవి నాకు తెలిసేయున్నవని నీవు చెప్పకుండునట్లు, వాటిని నీవు విను దినమునకు ముందే అవి నీకు ప్రకటించబడినవి.

8 అవి నీవు వినియుండలేదు; నీవు ఎరిగియుండలేదు; అప్పటినుండి నీ చెవి తెరువబడనేలేదు; నీవు నమ్మకద్రోహివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అపరాధివి అనిపించుకొంటివని నాకు తెలియును.

9 అయినప్పటికీ, నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నీ విషయములో నన్ను నేను నిరోధించుకొనుచున్నాను.

10 ఏలయనగా, నేను నిన్ను పుటము వేసితిని, నిన్ను శ్రమల కొలిమిలో నేనేర్పరచుకొంటిని.

11 నా నిమిత్తము, నా నిమిత్తమే ఆలాగు చేసెదను, నా నామము అపవిత్రపరచబడనియ్యను, నా మహిమను నేను మరియొకనికియ్యను.

12 యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను; నేను మొదటి వాడను, కడపటివాడను.

13 నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడిచేయి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను. నేను వాటిని పిలువగా అవన్నియు ఒక్కటిగా నిలుచును.

14 మీరందరు కూడివచ్చి ఆలకించుడి; వారిలో ఎవడు వారికి ఈ విషయములు ప్రకటించెనో వానిని ప్రభువు ప్రేమించెను; వారి ద్వారా ఆయన ప్రకటించియున్న ఆయన వాక్యమును ఆయన నెరవేర్చును; ఆయన బబులోనుపై తన చిత్తమును జరిగించును మరియు ఆయన బాహుబలము కల్దీయులమీదికి వచ్చును.

15 ఇంకను, నేనే ప్రభువును, సెలవిచ్చినవాడను నేనే; ప్రకటించుటకు నేనే అతడిని పిలిచితిని, నేనే అతడిని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

16 మీరు నా యొద్దకు రండి; నేను రహస్యముగా మాటలాడినవాడను కాను; ఆదినుండి, అది ప్రకటింప బడిన సమయము నుండి నేను మాట్లాడియుంటిని; ప్రభువైన దేవుడు, ఆయన ఆత్మయు నన్ను పంపెను.

17 నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధుడునైన ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నేనతనిని పంపియున్నాను; నీకు ప్రయోజనము కలుగునట్లు ఉపదేశించువాడు, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించువాడు, నీ దేవుడైన ప్రభువు దానిని చేసియున్నాడు.

18 నీవు నా ఆజ్ఞలను ఆలకించిన యెడల—నీ సమాధానము నదివలెను, నీ నీతి సముద్ర తరంగములవలెను ఉండును.

19 నీ సంతానము ఇసుకవలే విస్తారమగును; నీ గర్భఫలము దాని రేణువులవలే విస్తరించును; వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు.

20 బబులోను నుండి బయలువెళ్ళుడి. కల్దీయుల దేశములో నుండి పారిపోవుడి. ప్రభువు తన సేవకుడైన యాకోబును విమోచించెనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి, భూదిగంతముల వరకు అది వినబడునట్లు దానిని ప్రకటించుడి.

21 ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికగొనలేదు; రాతికొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్ళు ఉబుకజేసెను; ఆయన కొండను చీల్చగా నీళ్ళు ప్రవాహముగా బయలుదేరెను.

22 ఆయన దీనినంతటిని, దీనికంటే ఎక్కువగా చేసినప్పటికీ కూడా దుష్టులకు నెమ్మదియుండదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ముద్రించు