లేఖనములు
1 నీఫై 18


అధ్యాయము 18

ఓడ పూర్తియగును—యాకోబు, యోసేపుల పుట్టుక ప్రస్తావించబడును—ఆ సమూహము వాగ్దానదేశమునకు బయలుదేరును—ఇష్మాయెల్ కుమారులు, వారి భార్యలు విలాసాలలో మునిగితేలుతూ తిరుగుబాటు చేయుదురు—నీఫై కట్టి వేయబడును, ఓడ ఒక భయంకరమైన తుఫాను చేత వెనుకకు నడిపించబడును—నీఫై విడిపించబడును మరియు అతని ప్రార్థన ద్వారా తుఫాను ఆగును—ఆ జనులు వాగ్దానదేశము చేరుదురు. సుమారు క్రీ. పూ. 591–589 సం.

1 వారు ప్రభువును ఆరాధించి నాతోపాటు ముందుకు నడిచిరి. మేము కలప పనిని వింతైన పనితనముతో చేసితిమి; ప్రభువు నాకు ఎప్పటికప్పుడు కలపతో నేను ఏవిధముగా ఓడను చేయవలెనో చూపెను.

2 ఇప్పుడు, నీఫైయను నేను మనుష్యులు నేర్చుకొనిన విధానము ప్రకారము ఆ కలపతో పని చేయలేదు లేదా మనుష్యుల విధానము ప్రకారము నేను ఆ ఓడను నిర్మించలేదు; కానీ, ప్రభువు నాకు చూపిన విధముగా నేను దానిని నిర్మించితిని; అందువలన, అది మనుష్యుల విధానములో చేయబడలేదు.

3 నీఫైయను నేను, తరచుగా పర్వతముపైకి వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేసితిని. అందువలన, ప్రభువు నాకు గొప్ప విషయములను చూపెను.

4 ప్రభువు వాక్యము ప్రకారము నేను ఓడను తయారుచేసిన తరువాత అది మంచిగా ఉండెనని, దాని పనితనము మిక్కిలి మేలిరకమైనదిగా ఉండెనని నా సహోదరులు చూచిరి; కావున, వారు ప్రభువు యెదుట మరలా తమనుతాము తగ్గించుకొనిరి.

5 మేము లేచి, ఓడలోనికి వెళ్ళవలెనని ప్రభువు నా తండ్రితో చెప్పెను.

6 మరుసటి దినమున మేము అన్నివస్తువులను, అరణ్యము నుండి అధిక ఫలములను, మాంసమును, విస్తారముగా తేనెను మరియు ప్రభువు మాకు ఆజ్ఞాపించిన దాని ప్రకారము సామగ్రిని సిద్ధపరచుకొన్న తరువాత, మా సమస్త సామాగ్రితో మా విత్తనములతో ప్రతివాడు వాని వయస్సు ప్రకారము మాతో మేము తెచ్చుకొన్న ప్రతి వస్తువుతోపాటు ఓడలోనికి వెళ్ళితిమి; ఆ విధముగా మేమందరము మా భార్యలతో, మా పిల్లలతో ఓడలోనికి వెళ్ళితిమి.

7 ఇప్పుడు, నా తండ్రి అరణ్యములో ఇద్దరు కుమారులను కనెను. పెద్దవాని పేరు యాకోబు, చిన్నవాడు యోసేపు.

8 మేమందరము మాకు ఆజ్ఞాపించబడిన మా సామగ్రిని, వస్తువులను మాతో తీసుకొని ఓడలోనికి వెళ్ళిన తరువాత, మేము సముద్రములో వాగ్దానదేశము వైపునకు ప్రయాణము ప్రారంభించి గాలిచేత ముందు నడిపించబడితిమి.

9 అనేక దినములపాటు మేము గాలిచేత ముందుకు నడిపించబడిన తరువాత, నా సహోదరులు, ఇష్మాయెల్ కుమారులు, వారి భార్యలు నాట్యమాడుచూ, పాటలు పాడుచూ మిక్కిలి అసభ్యకరముగా మాటలాడుట ప్రారంభించునంతగా తమనుతాము ఉల్లాసపరచుకొనుట మొదలుపెట్టి, వారు ఇక్కడకు ఏ శక్తి ద్వారా తీసుకొని రాబడిరో కూడా మరచిపోయి వారి యొక్క అసభ్యకర ప్రవర్తనలో అతిశయించిరి.

10 ప్రభువు మా యెడల ఆగ్రహించి, మేము సముద్రపు లోతులలో మ్రింగివేయబడునట్లు మా దుష్టత్వమును బట్టి మమ్ములను మొత్తునేమోనని నీఫైయను నేను అత్యధికముగా భయపడుట మొదలుపెట్టితిని; కావున, నీఫైయను నేను వారితో గంభీరముగా మాటలాడుట ప్రారంభించితిని; కానీ, వారు నాపై కోపము తెచ్చుకొని మా తమ్ముడు మాపై అధికారిగా ఉండుట మేము సహించమనిరి.

11 లేమన్‌, లెముయెల్‌లు నన్ను తీసుకుపోయి త్రాళ్ళతో కట్టివేసి, నాతో చాలా కఠినముగా ప్రవర్తించిరి; అయినప్పటికీ, దుష్టులను గూర్చి ఆయన పలికిన మాట నెరవేరునట్లు, వారికి తన శక్తిని చూపునట్లు ప్రభువు దీనిని జరుగనిచ్చెను.

12 నేను కదలలేనంతగా వారు నన్ను కట్టివేసిన తరువాత, ప్రభువు ద్వారా సిద్ధపరచబడిన దిక్సూచి పని చేయుట మానివేసెను.

13 అందువలన వారు ఆ ఓడను ఎటు నడిపించవలెనో ఎరుగకయుండిరి, అప్పుడక్కడ ఒక పెద్ద తుఫాను అనగా గొప్ప భయంకరమైన తుఫాను రేగినందువలన మేము ఆ జలములపై మూడు రోజులపాటు వెనుకకు నెట్టివేయబడితిమి; వారు సముద్రములో మునిగిపోవుదురేమోనని అత్యధికముగా భయపడుట మొదలుపెట్టిరి; అయినప్పటికీ, వారు నన్ను విడిచిపెట్టలేదు.

14 మేము వెనుకకు నెట్టివేయబడిన నాలుగవ దినమున ఆ తుఫాను మరింత తీవ్రము కాసాగెను.

15 మేము సముద్రపు లోతులలో మునిగిపోబోతిమి. నాలుగు దినముల పాటు మేము జలములపై వెనుకకు నెట్టబడిన తరువాత, నా సహోదరులు దేవుని తీర్పులు తమపై ఉన్నవని, తమ దుష్ట కార్యములను బట్టి పశ్చాత్తాపము పొందని యెడల వారు నశించిపోవుదురని చూచుట మొదలుపెట్టిరి; అందువలన, వారు నా యొద్దకు వచ్చి నా చేతి మణికట్టులపైయున్న త్రాళ్ళను విప్పిరి. నా చేతి మణికట్టులు అత్యధికముగా వాచియుండెను; నా కాలి చీలమండలు కూడా అధికముగా వాచియుండి, ఆ బాధ చాలా తీవ్రముగా ఉండెను.

16 అయినప్పటికీ, నేను నా దేవుని వైపు చూచి దినమంతయు ఆయనను స్తుతించితిని; నా శ్రమలను బట్టి నేను ప్రభువుకు వ్యతిరేకముగా సణగలేదు.

17 ఇప్పుడు నా తండ్రి లీహై, వారితోను ఇష్మాయెల్ కుమారులతోను అనేక విషయములు చెప్పెను; కానీ ఎవరైనా నా పక్షమున మాట్లాడిన యెడల, వారు అనేకరకాలుగా వారిని బెదిరించిరి; నా తల్లిదండ్రులు వృధ్ధాప్యమందుండి, వారి సంతానమును బట్టి అధిక దుఃఖమును అనుభవించినందున వారు దిగులుతో అనారోగ్యముపాలైరి.

18 వారి దుఃఖము, తీవ్ర వేదన మరియు నా సహోదరుల దుష్టకార్యములను బట్టి, ఈ స్థితి నుండి కొనిపోబడి వారు తమ దేవుని కలుసుకొనుటకు సమీపముగా తేబడిరి; నెరసిన వారి వెంట్రుకలు ధూళిలో కలిసిపోవుటకు సిద్ధముగానుండెను, అనగా దుఃఖముతో వారు నీటి సమాధిలోనికి పడవేయబడుటకు సిద్ధముగా ఉండిరి.

19 యాకోబు, యోసేపులు చిన్నవారైయుండి, అధిక పోషణ కావలసిన వారై తమ తల్లి యొక్క శ్రమలను బట్టి దుఃఖపడిరి; నా భార్య, పిల్లలు కూడా తమ కన్నీళ్ళతో, ప్రార్థనలతో నా సహోదరులు నన్ను విడిచిపెట్టునట్లు వారి హృదయములను మృదువుగా చేయలేకపోయిరి.

20 నాశనముతో వారిని భయపెట్టు దేవుని శక్తి తప్ప మరేదియు వారి హృదయములను మృదువుగా చేయలేకపోయెను; అందువలన, వారు సముద్రపు లోతులలో మునిగిపోబోవుచున్నారని గ్రహించినప్పుడు తాము చేసిన కార్యమును బట్టి వారు పశ్చాత్తాపపడి, నన్ను విడిచిపెట్టిరి.

21 వారు నన్ను విడిచిపెట్టిన తరువాత, నేను ఆ దిక్సూచిని తీసుకోగా అది నేను ఆశించినట్లు పని చేసెను; అప్పుడు నేను ప్రభువుకు ప్రార్థన చేసితిని. నేను ప్రార్థన చేసిన తరువాత గాలులు, తుఫాను ఆగెను మరియు అక్కడ గొప్ప ప్రశాంతత నెలకొనెను.

22 అప్పుడు నీఫైయను నేను ఓడను నడిపించగా, మేము వాగ్దానదేశము వైపునకు తిరిగి సముద్రయానము చేసితిమి.

23 అనేకదినముల పాటు మేము సముద్రయానము చేసిన తరువాత మేము వాగ్దానదేశమునకు చేరితిమి. మేము నేలపై ముందుకు వెళ్ళి, మా గుడారములను వేసుకొని దానిని వాగ్దానదేశమని పిలిచితిమి.

24 మేము నేలను దున్ని, విత్తనములు నాటుట ప్రారంభించితిమి; మేము యెరూషలేము దేశము నుండి తెచ్చిన విత్తనములన్నియు విత్తితిమి; అవి అత్యధికముగా పెరిగినందున, మేము విస్తారముగా ఆశీర్వదింపబడితిమి.

25 మేము వాగ్దానదేశమందు అరణ్యములో ప్రయాణము చేయుచుండగా, అక్కడి అడవులలో మనుష్యులకు ఉపయోగకరమైన అన్ని జంతువులు ఆవు-ఎద్దు, గాడిద-గుఱ్ఱము, మేక-అడవి మేక మరియు అన్ని రకములైన క్రూరమృగములు ఉండుటను కనుగొంటిమి. మేము బంగారము, వెండి, రాగి, అన్ని రకములైన లోహములను కూడా కనుగొంటిమి.