లేఖనములు
జేకబ్ 1


జేకబ్ గ్రంథము
నీఫై యొక్క సహోదరుడు

అతని సహోదరులకు అతని బోధనావాక్యములు. క్రీస్తు సిద్ధాంతమును పడద్రోయుటకు ప్రయత్నించుచున్న ఒకని గర్వమును అతడు అణచును. నీఫై జనుల యొక్క చరిత్రను గూర్చి కొన్ని మాటలు.

1వ అధ్యాయము

జేకబ్, జోసఫ్‌లు క్రీస్తు నందు విశ్వసించుడని, ఆయన ఆజ్ఞలు పాటించుడని మనుష్యులను ఒప్పించుటకు ప్రయత్నించెదరు—నీఫై మరణించును—నీఫైయుల మధ్య దుష్టత్వము ప్రబలును. సుమారు క్రీ. పూ. 544–421 సం.

1 లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి ఏబది అయిదు సంవత్సరములు గడిచిపోయెను; కావున జేకబ్ అను నాకు, ఈ విషయములు చెక్కబడియున్న ఆ చిన్న పలకలను గూర్చి నీఫై ఒక ఆజ్ఞ ఇచ్చెను.

2 నేను అతి విలువైనవిగా భావించిన విషయములలో కొన్నింటిని ఈ పలకలపై వ్రాయవలెనని; నీఫై జనులని పిలువబడిన ఈ జనుల చరిత్రను గూర్చి ఎక్కువగా వ్రాయరాదని జేకబ్ అను నాకు అతడు ఒక ఆజ్ఞ ఇచ్చెను.

3 ఏలయనగా తన జనుల చరిత్ర అతని యొక్క ఇతర పలకలపై చెక్కబడవలెనని, నేను ఈ పలకలను భద్రపరచి నా సంతానమునకు తరతరములకు వాటిని అందజేయవలెనని అతడు చెప్పెను.

4 ఒకవేళ పవిత్రమైన బోధన లేదా గొప్ప ప్రకటన లేదా ప్రవచనము ఏదైనా ఉన్న యెడల, వాటిలో ప్రధానమైన వాటిని నేను ఈ పలకలపై చెక్కవలెను మరియు క్రీస్తు నిమిత్తము, మా జనుల నిమిత్తము సాధ్యమైనంత వరకు వాటిని గూర్చి వ్రాయవలెను.

5 ఏలయనగా విశ్వాసము మరియు గొప్ప ఆతురత కారణముగా మా జనులను గూర్చి, వారికి జరుగబోవు సంగతులను గూర్చి నిజముగా మాకు విశదము చేయబడెను.

6 మేము అనేక బయల్పాటులను మరియు అధికముగా ప్రవచనాత్మను పొందితిమి; అందువలన మేము రాబోవు క్రీస్తును, ఆయన రాజ్యమును ఎరిగియుంటిమి.

7 కావున, వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశించునట్లు క్రీస్తు యొద్దకు వచ్చి దేవుని మంచితనము నందు పాలుపంచుకోమని, లేని యెడల ఇశ్రాయేలు సంతానము అరణ్యములో ఉన్నప్పుడు శోధనా దినములలో కోపము పుట్టించినప్పటివలె వారు లోనికి ప్రవేశించరాదని ఆయన తన ఉగ్రతలో ప్రమాణము చేయునేమోనని వారిని ఒప్పించుటకు మా జనుల మధ్య మేము శ్రద్ధతో కృషి చేసితిమి.

8 దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయకూడదని, ఆయనను కోపమునకు పురిగొల్పరాదని, మనుష్యులందరు క్రీస్తు నందు విశ్వసించవలెనని, ఆయన మరణమును యోచించవలెనని, ఆయన సిలువను భరించవలెనని, లోకము యొక్క అవమానమును సహించవలెనని మేము మనుష్యులందరిని ఒప్పించుటకు దేవుని సహాయము ఆశించుచున్నాము; అందువలన జేకబ్ అను నేను నా సహోదరుడైన నీఫై ఆజ్ఞను నెరవేర్చుటకు పూనుకుంటిని.

9 నీఫై వృద్ధుడు కాసాగి, తాను త్వరలో మరణించెదనని గ్రహించెను; అందువలన, రాజుల పరిపాలనను అనుసరించి తన జనులపై ఒక రాజుగా, అధిపతిగా ఉండుటకు అతడు ఒక మనుష్యుని అభిషేకించెను.

10 నీఫై వారి కొరకు గొప్ప రక్షకునిగా ఉండి, వారిని కాపాడుటకు లేబన్‌ ఖడ్గమును ఉపయోగించి, వారి క్షేమము కొరకు తన దినములన్నిటిలో కృషిచేసినందున జనులు అతడిని అత్యధికముగా ప్రేమించిరి—

11 కావున అతని పేరును జ్ఞాపకార్థముగా ఉంచుకోవలెనని జనులు కోరుకొనిరి. రాజుల పరిపాలనను అనుసరించి అతని స్థానములో ఎవరు పరిపాలించినను జనులచేత వారు వరుసగా రెండవ నీఫై, మూడవ నీఫై అని పిలువబడిరి; వారు ఏ పేరును కలిగియున్నను జనులచేత వారు ఆ విధముగా పిలువబడిరి.

12 మరియు నీఫై మరణించెను.

13 ఇప్పుడు లేమనీయులు కాని జనులు నీఫైయులైయున్నారు; అయినప్పటికీ వారు నీఫైయులు, జేకబీయులు, జోసెఫీయులు, జోరమీయులు, లేమనీయులు, లెముయేలీయులు మరియు ఇష్మాయేలీయులని పిలువబడిరి.

14 కానీ జేకబ్ అను నేను ఇకపై వారిని ఈ పేర్లతో వేరుపరచను, అయితే నీఫై జనులను నాశనము చేయుటకు ప్రయత్నించు వారిని లేమనీయులనియు నీఫైతో స్నేహముగా ఉన్న వారిని నీఫైయులనియు లేదా రాజుల పరిపాలనను అనుసరించి నీఫై జనులనియు పిలిచెదను.

15 ఇప్పుడు, నీఫై జనులు రెండవ రాజు పరిపాలనలో తమ హృదయములందు కఠినమగుట ప్రారంభించిరి మరియు అనేకమంది భార్యలను, ఉపపత్నులను కోరిన ప్రాచీన కాలపు దావీదువలే, అతని కుమారుడు సొలోమోనువలే దుష్టాచారముల యందు కొంతవరకు మునిగియుండిరి.

16 వారు అధికముగా బంగారమును వెండిని వెదకనారంభించిరి, కొంతవరకు గర్వమందు హెచ్చించుకొనుట మొదలుపెట్టిరి.

17 అందువలన జేకబ్ అను నేను, ప్రభువు నుండి నా పిలుపును పొందిన పిమ్మట దేవాలయమందు వారికి బోధించుచున్నప్పుడు వారితో ఈ మాటలు పలికితిని.

18 ఏలయనగా జేకబ్ అను నేను మరియు నా సహోదరుడైన జోసెఫ్‌, నీఫై ద్వారా ఈ జనులపై యాజకులుగా, ఉపదేశకులుగా ప్రతిష్ఠించబడితిమి.

19 మేము పూర్ణ శ్రద్ధతో దేవుని వాక్యమును వారికి బోధించని యెడల, జనుల పాపములను మా స్వంత శిరస్సులపై వహించుకొనుటకు బాధ్యత తీసుకొనుచూ మేము మా స్థానమును ప్రభువుకు ఘనపరిచితిమి; అందువలన వారి రక్తము మా వస్త్రములపై రాకుండునట్లు మా శక్తిమేరకు కృషి చేసితిమి; లేని యెడల వారి రక్తము మా వస్త్రములమీద చింది, అంత్యదినమున మేము మచ్చలేనివారిగా కనుగొనబడలేము.

ముద్రించు