తన కుమారుడైన మొరోనైకి మోర్మన్ వ్రాసిన రెండవ లేఖ.
9 వ అధ్యాయము కలిగియున్నది.
9వ అధ్యాయము
నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురు భ్రష్టులై క్షీణదశకు వచ్చిరి—వారు ఒకరినొకరు హింసించి హత్యచేయుదురు—కృప మరియు మంచితనము మొరోనై మీద నిత్యము నిలిచియుండవలెనని మోర్మన్ ప్రార్థించును. సుమారు క్రీ. శ. 401 సం.
1 నా ప్రియ కుమారుడా, నేనింకను జీవించియున్నానని నీవు తెలుసుకొనునట్లు నేను నీకు మరలా వ్రాయుచున్నాను; కానీ, బాధాకరమైన దానిని గూర్చి నేను కొంత వ్రాయుచున్నాను.
2 నేను లేమనీయులతో తీవ్రముగా యుద్ధము చేసితిని, దానిలో మేము జయించలేదు; అర్కియాంటస్ ఖడ్గము చేత కూలియుండెను; లురామ్, ఎమ్రోన్ కూడా; మరియు శ్రేష్ఠమైన మా మనుష్యులలో అనేకమందిని మేము పోగొట్టుకొనియుంటిమి.
3 ఇప్పుడు నా కుమారుడా, లేమనీయులు ఈ జనులను నాశనము చేయుదురేమోయని నేను భయపడుచున్నాను; ఏలయనగా వారు పశ్చాత్తాపపడరు మరియు ఒకరితోనొకరు నిరంతరము కోపముగా ఉండుటకు సాతాను వారిని పురికొల్పుచుండును.
4 నేను వారితో నిరంతరము పనిచేయుచున్నాను; నేను తీక్షణముగా దేవుని వాక్యము చెప్పినప్పుడు వారు వణికి, నాకు వ్యతిరేకముగా కోపముతో నుందురు; నేను ఎట్టి తీక్షణతను వాడనప్పుడు, వారి హృదయములను దానికి వ్యతిరేకముగా వారు కఠినపరచుకొందురు; అందువలన, ప్రభువు యొక్క ఆత్మ వారితో పోరాడుట మానివేసినదేమోయని నేను భయపడుచున్నాను.
5 వారు ఎంత అధికముగా కోపము తెచ్చుకొందురనగా, మరణమును గూర్చి వారు భయపడుట లేదని నాకనిపించును; వారు ఒకరిపట్ల ఒకరు తమ ప్రేమను పోగొట్టుకొనియున్నారు; వారు నిరంతరము పగ మరియు రక్తదాహముతో ఉన్నారు.
6 ఇప్పుడు నా ప్రియ కుమారుడా, వారు కఠినులైనప్పటికీ మనము శ్రద్ధగా పని చేయుదము; ఏలయనగా, మనము పని చేయుట మానిన యెడల, మనము శిక్షావిధి క్రిందికి తేబడుదుము; మనము సమస్త నీతి యొక్క శత్రువును జయించునట్లు, దేవుని రాజ్యమందు మన ఆత్మలకు విశ్రాంతి ఇచ్చునట్లు ఈ మట్టి గుడారమందున్నప్పుడు చేయుటకు మనము ఒక పనిని కలిగియున్నాము.
7 ఇప్పుడు, ఈ జనుల శ్రమలను గూర్చి నేను కొంత వ్రాయుచున్నాను. ఏలయనగా, అమోరోన్ నుండి నేను అందుకొనిన సమాచారమును బట్టి, షెర్రిజా గోపురము నుండి వారు పట్టుకొనిన అనేకమంది బందీలను లేమనీయులు కలిగియున్నారు; వారిలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారు.
8 ఆ స్త్రీల యొక్క భర్తలను మరియు పిల్లల యొక్క తండ్రులను వారు సంహరించియుండిరి; ఆ స్త్రీలకు వారి భర్తల మాంసముతో మరియు పిల్లలకు వారి తండ్రుల మాంసముతో వారు ఆహారము పెట్టిరి; మరియు అతి కొద్ది నీటిని మాత్రమే వారికి ఇచ్చిరి.
9 లేమనీయులు నీచమైన ఈ హేయకార్యమును జరిగించినప్పటికీ, అది మోరియాంటమ్‌లో నున్న మన జనుల దానిని మించలేదు. ఏలయనగా, లేమనీయుల కుమార్తెలలో అనేకమందిని వారు బందీలుగా తీసుకొనిపోయిరి; అన్నిటికంటే మిక్కిలి ప్రియమైన, విలువగలదైన పవిత్రతను మరియు శీలమును వారి నుండి దోచుకొనిన తరువాత—
10 వారు ఈ పని చేసిన తరువాత, మరణించు వరకు కూడా వారి శరీరములను హింసించుచూ మిక్కిలి కౄరమైన పద్ధతిలో వారిని హత్యచేసిరి; మరియు దీనిని చేసిన తరువాత, వారి హృదయ కాఠిన్యము బట్టి వారు అడవి మృగములవలే వారి మాంసమును పీక్కుతినిరి; వారు దీనిని సాహసమునకు చిహ్నముగా చేసిరి.
11 ఓ నా ప్రియ కుమారుడా, జనులు ఈ విధముగా నాగరికత లేని వారివలే ఎట్లు ఉండగలరు—
12 (వారు మర్యాదస్తులైన, ఆహ్లాదకరమైన జనులైయున్నప్పటి నుండి కేవలము కొద్ది సంవత్సరములు మాత్రమే గతించెను)
13 కానీ ఓ నా కుమారుడా, జనులు ఈ విధముగా అంత అధికమైన హేయకార్యమందు ఎట్లు ఆనందించగలరు—
14 మనకు వ్యతిరేకముగా తీర్పునందు దేవుడు తన చేతిని ఆపునని మనమెట్లు ఆశించగలము?
15 ఇదిగో, నా హృదయము మొరపెట్టుచున్నది: ఈ జనులకు ఆపద. ఓ దేవా, తీర్పునందు బయటకు రమ్ము; వారి పాపములు, దుష్టత్వము మరియు హేయకార్యములను నీ యెదుటనుండి దాచివేయుము!
16 ఇంకను నా కుమారుడా, షెర్రిజాలో అనేకమంది విధవరాండ్రు మరియు వారి కుమార్తెలుండిరి; లేమనీయులు తీసుకువెళ్ళని ఆహార సామగ్రి యొక్క ఆ భాగమును జెనీఫీ సైన్యము తీసుకొనిపోయి, ఆహారము కొరకు తిరుగులాడుటకు వారిని వదిలివేసెను; మరియు అనేకమంది వృద్ధ స్త్రీలు మార్గమందు మూర్ఛపోయి, మరణించిరి.
17 నాతో ఉన్న సైన్యము బలహీనమైనది; మరియు లేమనీయుల సైన్యములు షెర్రిజాకు, నాకు మధ్య ఉన్నవి; ఇప్పుడు అహరోను సైన్యము యొద్దకు పారిపోయిన వారందరు వారి భయంకరమైన కౄరత్వమునకు బలిపశువులైరి.
18 అయ్యో, నా జనుల దుష్టత్వము! వారు క్రమములేక, కనికరములేక యుండిరి. నేను కేవలము ఒక మనుష్యుడను మరియు నేను ఒక మనుష్యుని బలమును మాత్రమే కలిగియున్నాను, నేనిక ఏమాత్రము నా ఆజ్ఞలను అమలు చేయలేను.
19 వారి వక్రబుద్ధియందు వారు బలవంతులైరి; అదే విధముగా వారు కౄరముగా ఉండి వృద్ధులను, యౌవనస్థులను ఎవరినీ విడిచిపెట్టలేదు; మంచిదానిలో తప్ప, అన్నింటిలో వారు ఆనందించిరి; మరియు ఈ దేశమంతటా మా స్త్రీలు, మా పిల్లల యొక్క బాధ అన్నింటిని మించెను; నాలుక దానిని చెప్పలేదు లేదా అది వ్రాయబడలేదు.
20 ఇప్పుడు నా కుమారుడా, ఈ భయంకరమైన దృశ్యమును నేను ఇకపై వర్ణించను. ఈ జనుల దుష్టత్వమును నీవెరుగుదువు; వారు ఏ పద్ధతి లేకుండా ఇంద్రియజ్ఞానమును కోల్పోయియున్నారని నీవెరుగుదువు; వారి దుష్టత్వము లేమనీయుల దుష్టత్వమును మించిపోయినది.
21 ఇదిగో నా కుమారుడా, ఆయన నన్ను మెత్తునేమోయన్న భయమును బట్టి, నేను వారిని గూర్చి దేవునికి సిఫారసు చేయలేను.
22 కానీ నా కుమారుడా, నేను నిన్ను గూర్చి దేవునికి సిఫారసు చేయుచున్నాను మరియు నీవు రక్షింపబడుదువని క్రీస్తునందు నేను నమ్ముచున్నాను; ఆయన జనులు ఆయన యొద్దకు తిరిగి వచ్చుటను లేదా వారి పూర్తి నాశనమును చూచుటకు, ఆయన నీ ప్రాణమును విడిచిపెట్టవలెనని నేను దేవుడిని ప్రార్థించుచున్నాను; ఏలయనగా వారు పశ్చాత్తాపపడి, ఆయన యొద్దకు తిరిగిరాని యెడల వారు తప్పక నశించిపోవలెనని నేనెరుగుదును.
23 ఒకవేళ వారు నశించిన యెడల, అది రక్తము మరియు పగ నిమిత్తము వారి హృదయవాంఛను బట్టి నశించిన జెరెడీయుల వలె ఉండును.
24 మరియు వారు నశించిన యెడల, మన సహోదరులలో అనేకులు లేమనీయుల వైపునకు వెళ్ళిరనియు, మరి అధికులు వారిని కూడా విడిచిపెట్టి వెళ్ళుదురనియు మేమెరుగుదుము; అందువలన నీవు విడిచిపెట్టబడి, నేను నశించిపోయి నిన్ను చూడలేని యెడల, మరికొన్ని సంగతులను వ్రాయుము; కానీ, నేను నిన్ను త్వరలో చూడగలనని నేను నమ్ముచున్నాను; ఏలయనగా, నేను పవిత్ర వృత్తాంతములను కలిగియున్నాను, వాటిని నీకు ఇచ్చెదను.
25 నా కుమారుడా, క్రీస్తు నందు విశ్వాసముగా ఉండుము; నేను వ్రాసిన సంగతులు మరణము వరకు కృంగజేయునంతగా నిన్ను బాధింపనీయకుము; క్రీస్తు నిన్ను పైకి లేపును గాక; ఆయన శ్రమలు, మరణము, మన పితరులకు తన శరీరమును చూపుట, ఆయన కనికరము, దీర్ఘశాంతము, ఆయన మహిమ మరియు నిత్యజీవపు నిరీక్షణ నీ మనస్సునందు నిత్యము నిలిచియుండును గాక.
26 సమస్తము ఆయనకు లోబడునంత వరకు, ఎవరి సింహాసనము పరలోకములందు ఉన్నతముగా ఉన్నదో ఆ తండ్రియైన దేవుని యొక్కయు, ఆయన అధికారము యొక్క కుడి పార్శ్వమున కూర్చుండిన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్కయు కృప నీతో ఉండి, నిత్యము నిలుచును గాక. ఆమేన్.