లేఖనములు
మొరోనై 1


మొరోనై గ్రంథము

1వ అధ్యాయము

లేమనీయుల ప్రయోజనము కొరకు మొరోనై వ్రాయును—క్రీస్తును తిరస్కరించని నీఫైయులు చంపబడుదురు. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 ఇప్పుడు మొరోనై అను నేను, జెరెడ్‌ యొక్క జనుల వృత్తాంతమును సంక్షేపము చేయుటను ముగించిన తరువాత, మరింత వ్రాయుదునని నేను తలంచలేదు, కానీ నేనింకను నశించియుండలేదు; వారు నన్ను నాశనము చేయుదురేమోయని భయపడి, నేను లేమనీయుల యెదుటకు రాలేదు.

2 ఏలయనగా, వారి మధ్య యుద్ధములు మిక్కిలి భయంకరముగా ఉండెను; మరియు వారి ద్వేషమును బట్టి, క్రీస్తును తిరస్కరించని ప్రతి నీఫైయుని వారు చంపిరి.

3 మొరోనై అను నేను, క్రీస్తును తిరస్కరించను; కావున, నా స్వంత క్షేమము నిమిత్తము నేను వెళ్ళగలిగిన చోటుకు నేను తిరుగుచుందును.

4 అందువలన నేను తలంచిన దానికి విరుద్ధముగా, నేను మరికొన్ని విషయములను వ్రాయుదును; ఏలయనగా, నేను ఇకమీదట వ్రాయనని నేను తలంచితిని; కానీ ప్రభువు యొక్క చిత్తమును బట్టి, భవిష్యత్తులో ఏదో ఒక దినమందు నా సహోదరులైన లేమనీయులకు బహుశా అవి విలువ కలిగియుండునేమోయని, నేను మరికొన్ని సంగతులను వ్రాయుచున్నాను.