లేఖనములు
మోర్మన్‌ గ్రంథమును గూర్చి ఒక సంక్షిప్త వివరణ


మోర్మన్‌ గ్రంథమును గూర్చి ఒక సంక్షిప్త వివరణ

మోర్మన్‌ గ్రంథము ప్రాచీన అమెరికాలోని జనుల యొక్క ఒక పవిత్ర వృత్తాంతము, అది లోహపు పలకలపై చెక్కబడియుండెను. ఈ గ్రంథము ఏ మూలముల నుండి సంగ్రహించబడినదో అవి క్రింది వాటిని కలిగియున్నవి:

  1. నీఫై యొక్క పలకలు, అవి రెండు రకములైయుండెను: చిన్నపలకలు మరియు పెద్ద పలకలు. మొదటివి ప్రత్యేకించి ఆధ్యాత్మిక విషయాలు, ప్రవక్తల పరిచర్య మరియు బోధనలకు అంకితము చేయబడినవి. తరువాతవి ఎక్కువగా సంబంధిత జనుల యొక్క లౌకిక చరిత్రను కలిగియున్నవి (1 నీఫై 9:2–4). అయినప్పటికీ, మోషైయ సమయము నుండి పెద్ద పలకలు కూడా ఎక్కువ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల విషయములను కలిగియుండెను.

  2. మోర్మన్‌ యొక్క పలకలు, ఇవి నీఫై యొక్క పెద్ద పలకల నుండి అనేక వ్యాఖ్యానములతో మోర్మన్‌ చేసిన ఒక సంక్షేపమును కలిగియున్నవి. ఈ పలకలు మోర్మన్‌ ద్వారా ఆ చరిత్ర యొక్క కొనసాగింపును, అతని కుమారుడైన మొరోనై ద్వారా అనుబంధములను కలిగియున్నవి.

  3. ఈథర్‌ యొక్క పలకలు, ఇవి జెరెడీయుల చరిత్రను తెలుపును. ఈ వృత్తాంతము మొరోనై ద్వారా సంక్షేపించబడెను. అతడు తన స్వంత వ్యాఖ్యలను జోడించి, “ఈథర్‌ గ్రంథము” అను పేరుతో ఈ వృత్తాంతమునకు సామాన్య చరిత్రను చేర్చెను.

  4. కంచు పలకలు, లీహై జనుల ద్వారా యెరూషలేము నుండి క్రీ.పూ. 600. సం. లో తేబడినవి. ఇవి మోషే యొక్క ఐదు గ్రంథములను, … మరియు ఆరంభము నుండి, … యూదా రాజైన సిద్కియా పరిపాలన ఆరంభమయ్యే వరకు యూదుల వృత్తాంతమును మరియు పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనములను (1 నీఫై 5:11–13) కలిగియున్నవి. ఈ పలకల నుండి అనేక ఉదాహరణలు యెషయా మరియు ఇతర బైబిలు సంబంధమైన, బైబిలేతర ప్రవక్తలను పేర్కొనుచూ మోర్మన్‌ గ్రంథములో అగుపించును.

మోర్మన్‌ గ్రంథము పదిహేను ముఖ్య భాగములు లేదా విభజనలను కలిగియున్నది, ఒక్కటి తప్ప మిగిలినవన్నీ గ్రంథములుగా వ్యవహరించబడి ప్రతిఒక్కటి దాని ప్రధాన రచయిత పేరు మీదుగా పేర్కొనబడియున్నది. మొదటి భాగము (ఓంనైతో ముగియు మొదటి ఆరు గ్రంథములు) నీఫై యొక్క చిన్న పలకల నుండి చేయబడిన అనువాదము. ఓంనై మరియు మోషైయ గ్రంథముల మధ్య మోర్మన్‌ వాక్యములు అని పిలువబడినది ప్రవేశపెట్టబడెను. ఇది చిన్న పలకలపైన చెక్కబడిన వృత్తాంతమును మోర్మన్‌ యొక్క పెద్ద పలకల సంక్షేపముతో సంధించును.

మోషైయ నుండి మోర్మన్‌ 7వ అధ్యాయము వరకుగల సుదీర్ఘ భాగము మోర్మన్‌చే సంక్షేపము చేయబడిన నీఫై యొక్క పెద్ద పలకల అనువాదము. మోర్మన్‌ 8వ అధ్యాయము నుండి సంపుటము అంతము వరకు గల ముగింపు భాగము మోర్మన్‌ కుమారుడైన మొరోనై ద్వారా చెక్కబడెను. అతడు తన తండ్రి జీవిత వృత్తాంతమును పూర్తి చేసిన తరువాత జేరెడీయుల వృత్తాంతమును (ఈథర్‌ గ్రంథముగా) సంక్షేపించెను, ఆ తరువాత మొరోనై గ్రంథము అనబడే భాగములను జతచేసెను.

క్రీ.శ. 421వ సంవత్సరము లేదా ఆ సమీపములో నీఫైయుల ప్రవక్త మరియు చరిత్రకారులలో చివరివాడైన మొరోనై, దేవుని స్వరము చేత ఆయన ప్రాచీన ప్రవక్తల ద్వారా సూచించబడినట్లుగా కడవరి దినములలో బయటకు తేబడుటకు ఆ పవిత్ర వృత్తాంతమును ముద్రవేసి ప్రభువు కొరకు దాచిపెట్టెను. క్రీ.శ. 1823లో ఇదే మొరోనై అప్పటికి పునరుత్థానము చెందిన వ్యక్తిగా ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌ను దర్శించి, ఆ పిమ్మట చెక్కబడిన ఆ పలకలను అతడికి అప్పగించెను.

ఈ సంపుటి గురించి: విషయసూచికకు ముందున్న అసలైన శీర్షిక పేజీ పలకలనుండి తీసుకోబడినది, అది పరిశుద్ధ మూలగ్రంథములో భాగము. 1 నీఫై మరియు మోషైయ 9వ అధ్యాయమునకు ముందు తిన్నని అచ్చుఅక్షరములలో ఉన్న పీఠికలు వంటివి కూడా పరిశుద్ధ మూలగ్రంథములో భాగము. అధ్యాయ శీర్షికల వంటి ఏటవాలు అచ్చుఅక్షరములలో ఉన్న పీఠికలు మూలగ్రంథమునకు అసలైనవి కాదు, అవి చదువుటకు వీలుగా ఉండుటకు ఉంచబడిన అధ్యయన సహాయకాలు.

ఆంగ్లములో ముద్రించబడిన మోర్మన్ గ్రంథము యొక్క పూర్వపు ప్రచురణలలో కొన్ని స్వల్ప తప్పిదాలు కొనసాగాయి. ఈ సంపుటి ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ చేత కూర్పు చేయబడిన ప్రచురణకు ముందు చేతివ్రాతలను మరియు మొదటి సంపుటిలతో అనుగుణ్యం చేయుటకు సరియైనవిగా అనిపించిన సవరణలను కలిగియున్నది.

ముద్రించు