లేఖనములు
ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌ సాక్ష్యము


ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌ సాక్ష్యము

మోర్మన్‌ గ్రంథము రాకడను గూర్చి ప్రవక్తయైన జోసెఫ్‌ స్మిత్‌ యొక్క స్వంత వచనములు:

“సెప్టెంబరు ఇరువది ఒకటి [1823] … సాయంకాలమున సర్వశక్తిమంతుడైన దేవుని ప్రార్థించుటకు, వేడుకొనుటకు నేను మొదలుపెట్టితిని. …

“నేను ఆ విధముగా దేవుని ప్రార్థించు పనిలో ఉండగా, నా గదిలో ఒక వెలుగు ప్రత్యక్షమగుటను నేను కనుగొంటిని, ఆ గది మిట్టమధ్యాహ్నము కంటే కాంతివంతమగువరకు అది వృద్ధిచెందుచు వచ్చెను, అప్పుడు వెంటనే నా మంచము ప్రక్కన ఒక వ్యక్తి ప్రత్యక్షమై గాలిలో నిలబడియుండెను, ఎందుకనగా అతని పాదములు నేలను తాకలేదు.

“మిక్కిలి శ్రేష్ఠమైన ఒక తెల్లని వదులైన నిలువుటంగీని అతడు ధరించియుండెను. అది నేను ఇప్పటివరకు చూచిన భూసంబంధమైన వాటన్నింటిని మించి మిక్కిలి తెలుపైయుండెను; లేదా భూసంబంధమైనదేదియు అంత తెల్లగా, తేజోమయముగా కనబడునట్లు చేయబడగలదని నేను నమ్ముట లేదు. అతని అరిచేతులు, మణికట్టుకు కొంచెము పైవరకు అతని చేతులకు వస్త్రము లేకుండెను; ఆవిధముగానే అతని అరికాళ్ళు, మడమలకు కొంచెము పైవరకు అతని కాళ్ళకు వస్త్రము లేకుండెను. అతని తల, మెడకు కూడా వస్త్రము లేకుండెను. ఈ అంగీ తప్ప మరే ఇతర వస్త్రమును అతడు ధరించియుండలేదు, ఎందుకనగా అతని రొమ్మును నేను చూడగలుగునట్లు అది తెరువబడియుండెను.

“అతని అంగీయే కాదు, కానీ అతని శరీరమంతా వర్ణనాతీతముగా మహిమకరముగా నుండెను మరియు అతని ముఖము నిజముగా మెరుపువలె ఉండెను. గది మిక్కిలి కాంతివంతముగా ఉండెను, కానీ అతని చుట్టూ ఉన్నంత ప్రకాశవంతముగా కాదు. మొదట అతడిని చూచినప్పుడు నేను భయపడితిని; కానీ వెంటనే భయము తొలగిపోయెను.

“అతడు నన్ను పేరుతో పిలిచి, అతడు దేవుని సన్నిధి నుండి నా కొరకు పంపబడిన ఒక దూత అని, అతని పేరు మొరోనై అని; నేను చేయవలసిన ఒక కార్యమును దేవుడు కలిగియున్నాడని; మరియు సమస్త జనములు, వంశములు, భాషలు, ప్రజల మధ్య మంచికి, చెడుకు నా నామము వాడబడునని లేదా సమస్త ప్రజల మధ్య గౌరవముగా, అగౌరవముగా అది చెప్పుకోబడునని నాతో చెప్పెను.

“ఈ ఖండపు పూర్వ నివాసుల వృత్తాంతమును మరియు వారు ఎక్కడనుండి వచ్చిరో దాని మూలాధారమును తెలుపుచు, బంగారు పలకలపైన వ్రాయబడిన ఒక గ్రంథము పాతిపెట్టబడియుండెనని అతడు చెప్పెను. ప్రాచీన నివాసులకు రక్షకునిచేత ఇవ్వబడిన నిత్య సువార్త సంపూర్ణముగా దానిలో ఉన్నదని కూడా అతడు చెప్పెను.

“రెండు రాళ్ళు వెండి చట్రాలలో ఉన్నాయని—ఆ పలకలతో పాతిపెట్టబడెనని—ఈ రాళ్ళను వక్షస్థల కవచమునకు బంధించిన యెడల అవి ఊరీము తుమ్మీముగా చేయబడునని; ఈ రాళ్ళను కలిగియుండి, ఉపయోగించిన వారు ప్రాచీన కాలములో లేదా పూర్వకాలములో “దీర్ఘదర్శులు” అని పిలువబడిరని; మరియు ఆ గ్రంథమును అనువదించుట కొరకు దేవుడు వాటిని సిద్ధపరిచెనని చెప్పెను. …

“మరలా, అతడు చెప్పిన ఆ పలకలను నేను పొందిన తరువాత—ఎందుకనగా వాటిని పొందవలసిన సమయము అప్పటికింకా రాలేదు—వాటిని, ఊరీము తుమ్మీముతోనున్న వక్షస్థల కవచమును ఏ వ్యక్తికి నేను చూపించరాదని; వాటిని చూపించమని నాకాజ్ఞాపించబడిన వారికి మాత్రమే చూపించవలెనని అతడు నాతో చెప్పెను; నేను చూపించిన యెడల నాశనము చేయబడుదును. పలకలను గూర్చి అతడు నాతో మాట్లాడుచుండగా, పలకలు దాచబడిన ప్రదేశమును నేను చూడగలుగునట్లు, మరలా నేను దానిని దర్శించినప్పుడు స్పష్టముగాను, అసందిగ్ధముగాను ఆ ప్రదేశమును నేను తెలుసుకొనునట్లు నా మనస్సుకు ఒక దర్శనము చూపబడెను.

“ఈ సంభాషణ ముగిసిన తరువాత, వెంటనే గదిలోనున్న వెలుగు నాతో మాట్లాడుచున్న ఆ వ్యక్తి చుట్టూ చేరుట ఆరంభించి, ఆయన చుట్టూ తప్ప గది అంతా చీకటి అగువరకు కొనసాగుట నేను చూచితిని; అప్పుడు తక్షణమే ఆకాశములోనికి ఒక మార్గము తెరచుకొనగా, అతడు పూర్తిగా అదృశ్యమగువరకు ఎక్కిపోవుటను మరియు ఈ పరలోక వెలుగు ప్రత్యక్షము కాకమునుపు గది ఏవిధముగా ఉండెనో ఆవిధముగా చేయబడుటను నేను చూచితిని.

“నేను పడకమీదనే ఉండి ఈ విశిష్టమైన దృశ్యమును గూర్చి ఆలోచించుచు, ఈ అసాధారణ దూత ద్వారా నాకు చెప్పబడిన దానిని గూర్చి బహుగా ఆశ్చర్యపడితిని; అప్పుడు నా ధ్యానము మధ్యలో, నా గది మరలా వెలుగుతో నిండుటను అకస్మాత్తుగా నేను కనుగొంటిని, తక్షణమే ఆ పరలోక దూత మరలా నా మంచము ప్రక్కన నిలుచుండెను.

“అతడు మాట్లాడుట మొదలుపెట్టి, కొంచెము కూడా మార్పులేకుండా మొదటి దర్శనములో చెప్పిన సంగతులనే మరలా చెప్పెను; ఆవిధముగా చెప్పుచు కరువువలన, కత్తివలన, తెగుళ్ళవలన గొప్ప నాశనముతో భూమిమీదకు రాబోవు గొప్ప తీర్పులను గూర్చి అతడు నాకు తెలిపెను; ఈ వేదనకరమైన తీర్పులు ఈ తరములో భూమిమీదకు వచ్చునని చెప్పెను. ఈ సంగతులను తెలిపిన తరువాత, మునుపటివలె అతడు మరలా పైకి ఎక్కిపోయెను.

“ఈ సమయానికల్లా, నా మనస్సులో చాలా లోతుగా ముద్రవేయబడిన దానినిబట్టి నా నిద్ర మత్తు వదిలిపోయెను, నేను చూచిన మరియు వినిన వాటిని బట్టి విస్మయముతో నేను ముంచివేయబడితిని. కానీ, మరలా ఆ దూతను నా మంచము ప్రక్కన చూచి, అతడు మునుపు చెప్పిన సంగతులనే మరలా చెప్పగా లేదా పునరావృతం చేయగా విని నేనెంతో ఆశ్చర్యపోతిని; మరియు (నా తండ్రి కుటుంబము యొక్క బీదరికపు పరిస్థితుల కారణముగా) ఐశ్వర్యవంతులు కావలెనను ఉద్దేశ్యము కొరకు పలకలను పొందుమని సాతాను నన్ను శోధించుటకు ప్రయత్నించునని అతడు నాకొక హెచ్చరిక చేసెను. ఆ పలకలు పొందుట దేవుని ఘనపరచుటకే తప్ప, మరి ఏ ఇతర ఉద్దేశ్యమును నేను కలిగియుండకూడదని మరియు ఆయన రాజ్యమును నిర్మించుట తప్ప, మరే ఇతర ఆలోచనవలన నేను ప్రభావితము చేయబడకూడదని చెప్పుచు అతడు దీనిని వారించెను.

“ఈ మూడవ దర్శనము తరువాత, మునుపటిలాగే అతడు పరలోకమునకు ఎక్కిపోయెను మరియు నేను అప్పుడే పొందిన అనుభవము యొక్క విశిష్టతను గూర్చి ఆలోచించుటకు విడువబడితిని; మూడవసారి పరలోక దూత నా యొద్ద నుండి పైకి ఎక్కిపోయిన వెంటనే కోడి కూసెను మరియు ఉదయము సమీపించుచున్నదని, మా సంభాషణ రాత్రంతా కొనసాగెనని నేను కనుగొంటిని.

“కొద్ది సమయము తరువాత నా పడకమీద నుండి నేను లేచి, ఎప్పటివలె ఆ దినములో చేయవలసిన ఆవశ్యకమైన పనులకు వెళ్ళితిని, కానీ ఇతర సమయాలలో చేసిన విధముగా పనిచేయుటకు ప్రయత్నించగా, చాలావరకు నా బలమును కోల్పోయి నేను పూర్తిగా పనిచేయలేకపోవుచున్నట్లు గ్రహించితిని. నాతో పనిచేయుచున్న నా తండ్రి, నా ఆరోగ్యము సరిగాలేదని గ్రహించి, నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పెను. ఇంటికి వెళ్ళవలెనని నేను బయలుదేరితిని; కానీ మేమున్న పొలము యొక్క కంచె దాటుటకు ప్రయత్నించగా నా బలమును పూర్తిగా కోల్పోయి, నేను నిస్సహాయునిగా నేలపై పడిపోయి, కొంత సమయము వరకు స్పృహలోలేక ఏమియు తెలియకయుంటిని.

“నేను జ్ఞాపకము చేసుకొనిన మొదటి విషయమేమనగా, నన్ను పేరుతో పిలిచి ఒక స్వరము నాతో మాట్లాడుట. నేను పైకిచూచి, మునుపటివలె చుట్టూ కాంతితో నిండుకొని ఆ దూత నా తలకు పైగా నిలువబడియుండుటను చూచితిని. అతడు మరలా గత రాత్రి చెప్పిన సమస్తమును చెప్పి, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పొందిన దర్శనము, ఆజ్ఞలను గూర్చి ఆయనతో చెప్పవలెనని ఆజ్ఞాపించెను.

“దానిని నేను గైకొంటిని; పొలములో ఉన్న నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆ విషయమునంతటిని నేనాయనకు వివరించితిని. ఇది దేవుని వలన కలిగినదని ఆయన సమాధానమిచ్చి, నేను వెళ్ళి ఆ దూత ఆజ్ఞాపించిన ప్రకారము చేయవలెనని చెప్పెను. నేను పొలమును వదిలి, పలకలు పాతిపెట్టబడియున్నవని ఆ దూత చెప్పిన ప్రదేశమునకు వెళ్ళితిని; దానిని గూర్చి నేను పొందిన ఆ దర్శనము స్పష్టముగా ఉండుట వలన, అక్కడకు వెళ్ళిన క్షణమే ఆ ప్రదేశమును నేను యెరిగియుంటిని.

“న్యూయార్క్ రాష్ట్రము, ఓంటారియో జిల్లా, మాంచెస్టర్ పల్లెకు సమీపములో ఒక పెద్ద కొండ కలదు, అది చుట్టుప్రక్కల ఉన్నవాటిలో మిక్కిలి ఎత్తైనది. ఆ కొండ పడమటి వైపున, పైనుండి కొద్దిదూరములో, పెద్ద రాయి క్రింద రాతిపెట్టెలో ఆ పలకలు దాచబడియున్నవి. ఈ రాయి పైభాగము మధ్యలో గుండ్రముగా, దళసరిగా ఉండి అంచులు సన్నగా ఉండెను గనుక మధ్యభాగము నేలపైన కనబడుచుండెను, కానీ అంచు చుట్టూ మట్టితో కప్పబడియుండెను.

“మట్టిని తొలగించిన తరువాత, నేను ఒక మీటను సంపాదించి, దానిని రాతి అంచు క్రింద ఉంచి, స్వల్ప ప్రయత్నముతో దానిని పైకి లేపితిని. నేను లోపల చూడగా, దూత చెప్పినట్లుగా పలకలను, ఊరీము తుమ్మీమును, వక్షస్థల కవచమును నేను యథార్థముగా చూచితిని. అవి ఉంచబడిన పెట్టె ఒక విధమైన సిమెంటుతో రాళ్ళు దగ్గరగా అమర్చి తయారుచేయబడెను. ఆ పెట్టె అడుగు భాగములో అడ్డముగా నిలువుగా రెండు రాళ్ళు అమర్చబడియుండెను, ఈ రాళ్ళమీద పలకలు మరియు ఇతర వస్తువులు అమర్చబడియుండెను.

“వాటిని బయటకు తీయుటకు నేను ప్రయత్నించితిని, కానీ ఆ దూతచేత వారించబడితిని మరియు వాటిని బయటకు తీసుకొని వచ్చుటకు సమయము ఇంకా ఆసన్నము కాలేదని, ఆ సమయము నుండి నాలుగు సంవత్సరముల వరకు ఆసన్నము కాదని నాకు చెప్పబడెను; కానీ నేను ఆ ప్రదేశమునకు సరిగ్గా ఒక సంవత్సరము తరువాత రావలెనని, అక్కడ నన్ను కలుసుకొందునని మరియు ఆ పలకలు పొందుటకు సమయము ఆసన్నమగువరకు ఆ విధముగానే చేయవలెనని అతడు చెప్పెను.

“నాకాజ్ఞాపించబడిన ప్రకారము, ప్రతి సంవత్సరాంతమున నేను వెళ్ళితిని, ప్రతిసారి ఆ దూతను అక్కడ కనుగొంటిని మరియు ప్రభువు ఏమి చేయబోవునో, అంత్యదినములలో ఆయన రాజ్యము ఏలాగు, ఏవిధముగా నడిపించబడవలెనో దానికి సంబంధించిన ఉపదేశమును, జ్ఞానమును మా ప్రతి సంభాషణలో అతడి నుండి నేను పొందితిని.

“బహుకాలము గడిచిన తరువాత పలకలు, ఊరీము తుమ్మీము, వక్షస్థల కవచమును పొందవలసిన సమయము ఆసన్నమాయెను. పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరము సెప్టెంబరు 22వ తేదీన, ఎప్పటివలె మరో సంవత్సరాంతమున అవి పాతిపెట్టబడియున్న ప్రదేశమునకు వెళ్ళితిని, ఆ దూత ఈ ఆజ్ఞను ఇచ్చి వాటిని నాకు అప్పగించెను: అదేమనగా వాటికి నేను బాధ్యుడను, అజాగ్రత్తతో లేదా నా నిర్లక్ష్యమువలన వాటిని నేను కోల్పోయిన యెడల, నేను కొట్టివేయబడుదును; కానీ ఆ దూత వాటిని వెనుకకు తీసుకొనువరకు వాటిని భద్రముగా ఉంచుటకు నా ప్రయత్నములన్నిటిని వినియోగించిన యెడల, అవి కాపాడబడును.

“వాటిని జాగ్రత్తగా ఉంచమని నేనెందుకు అటువంటి కఠినమైన ఆజ్ఞలను పొందితినో మరియు నేను చేయవలసిన కార్యమును చేసిన తరువాత వాటిని వెనుకకు తీసుకొందునని ఆ దూత ఎందుకు చెప్పెనో త్వరలోనే నేను తెలుసుకొంటిని. వాటిని నేను కలిగియున్నానని తెలిసిన వెంటనే, నా నుండి వాటిని పొందుటకు మిక్కిలి తీవ్రమైన ప్రయత్నములు చేయబడెను. మనుష్యాలోచనకు రాగల ప్రతి ఉపాయము వాటిని నా నుండి తీసుకొనుటకు ఉపయోగించబడెను. శ్రమ మునుపటికంటె మిక్కిలి బాధాకరముగాను, తీవ్రముగాను మారెను, సాధ్యమైతే వాటిని నా నుండి తీసుకొనుటకు జనసమూహములు నిత్యము కనిపెట్టుకొనియుండెను. కానీ దేవుని జ్ఞానమువలన నాకు అప్పగించబడిన పనిని నేను చేయువరకు అవి నా చేతులలో సురక్షితముగా ఉండెను. ఒప్పందము ప్రకారము ఆ దూత వాటిని వెనుకకు తీసుకొనుటకు అడిగినప్పుడు అతనికి నేను వాటిని అప్పగించితిని; మరియు ఈ దినము అనగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది, మే రెండవ తేదీ వరకు అతడు తన ఆధీనములో వాటిని కలిగియున్నాడు.”

పూర్తి వృత్తాంతము కొరకు అమూల్యమైన ముత్యములో జోసెఫ్ స్మిత్—చరిత్ర చూడుము.

మట్టి నుండి మాట్లాడుచున్న ప్రజల స్వరమువలె భూమినుండి బయటకు ఈ విధంగా తీసుకొని రాబడి, దైవ చిత్తానుసారము దేవుని శక్తి, వరములచేత ఆధునిక భాషలోనికి అనువదించబడిన ఈ ప్రాచీన గ్రంథము, 1830వ సంవత్సరములో The Book of Mormon (మోర్మన్‌ గ్రంథము) గా లోకానికి మొదట ఆంగ్లములో ప్రచురించబడినది.

ముద్రించు