యేసు క్రీస్తు: మన ఆత్మల యొక్క పోషకుడు
మన పాపాలకు మనం నిజాయితీగా పశ్చాత్తాప పడుతున్నప్పుడు, క్రీస్తు ప్రాయశ్చిత్త బలి మన జీవితంలో పూర్తిగా ప్రభావవంతం కావడానికి అనుమతిస్తాము.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ప్రకాశవంతమైన ఈస్టర్ ఉదయాన, మానవ చరిత్రలో సంభవించిన అత్యంత అద్భుతమైన, అత్యంత గంభీరమైన మరియు అతి గొప్పదైన చర్యను అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త బలిని గుర్తుచేసుకున్నందుకు నా హృదయం ఆనందిస్తోంది. దేవుని పిల్లలందరి తరఫున రక్షకుని జీవితం యొక్క గొప్పతనాన్ని మరియు పరోపకారాన్ని ప్రవక్తయైన యెషయా యొక్క ప్రసిద్ధ మాటలు ఘనంగా చాటిచెప్తాయి:
“నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు.
“మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్దమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.”1
మానవాళి యొక్క పాపాలను స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా, అన్యాయంగా సిలువకు మేకులు కొట్టబడటం ద్వారా మరియు మూడవ రోజు 2 మరణాన్ని విజయవంతంగా జయించడం ద్వారా, ప్రాచీన కాలంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన పస్కా విధికి యేసు మరింత పవిత్రమైన అర్థాన్ని ఇచ్చెను. 3 ప్రవచనం నెరవేర్చుటకు, ప్రభువు పస్కా5 వేడుకలో ఉపయోగించిన సాంప్రదాయ చిహ్నాలను ధృవీకరిస్తూ ఆయన తన శరీరాన్ని మరియు విలువైన రక్తాన్ని గొప్ప మరియు చివరి త్యాగంగా అర్పించెను.4 ఆ విధముగా చేయుట ద్వారా క్రీస్తు మానవ మనసుకు అర్థం కాని శారీరక మరియు ఆత్మీయ బాధలను అనుభవించెను. రక్షకుడు స్వయంగా ఇలా చెప్పెను:
“దేవుడనైన నేను అందరి కొరకు ఈ బాధలను భరించితిని, …
“ఆ శ్రమ అందరికంటే గొప్పవాడను అనగా దేవుడనైన నన్ను బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము, ఆత్మ శ్రమపడునట్లు చేసెను—ఆ చేదు పాత్రను త్రాగకుండా వెనుదిరగాలని నేను అనుకొంటిని—
“అయినప్పటికీ, తండ్రికి మహిమ కలుగును గాక మరియు నేను త్రాగి, నరుల సంతానము కొరకైన సిద్ధపాటులను ముగించితిని.”6
క్రీస్తు తన అనంతమైన మరియు దయగల త్యాగం ద్వారా తండ్రి7 చిత్తాన్ని దయతో నెరవేర్చెను. పతనం9 ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడిన భౌతిక మరియు ఆత్మీయ మరణం యొక్క ముల్లును ఆయన అధిగమించి8, శాశ్వతమైన రక్షణకు అవకాశాన్ని మనకు కల్పించెను.10
మనందరి కొరకు ఈ శాశ్వతమైన మరియు పరిపూర్ణమైన త్యాగాన్ని నెరవేర్చగల సామర్థ్యం గల వ్యక్తి యేసు మాత్రమే.11 లోకము రూపించబడక ముందే పరలోకములో ఆ ఘనమైన ఆలోచన సభలో ఆయన ఎన్నుకోబడి, ముందుగా నియమించబడెను.12 ఇంకా, ఒక మర్త్య స్త్రీ నుండి జన్మించిన ఆయన భౌతిక మరణాన్ని వారసత్వంగా పొందెను, కానీ దేవుని నుండి, తండ్రి యొక్క ఏకైక కుమారుడిగా, ఆయన తన జీవితాన్ని అర్పించి తరువాత దానిని తిరిగి తీసుకొనే శక్తిని వారసత్వంగా పొందెను.13 అదనంగా, క్రీస్తు మచ్చలేని పరిపూర్ణ జీవితాన్ని జీవించెను, కావున దైవిక న్యాయం యొక్క అక్కరల నుండి మినహాయింపబడెను.14 కొన్ని సందర్భాల్లో ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా బోధించారు:
“యేసు క్రీస్తు మధ్యవర్తిత్వం లేకుండా రక్షణ ప్రపంచానికి రాదు.
“దేవుడు… తన సొంత కుమారుని బహుమానము ద్వారా ఒక త్యాగాన్ని సిద్ధం చేసెను, … మనిషి ప్రభువు సన్నిధిలోకి ప్రవేశించే ద్వారాన్ని తెరుచుటకు సరైన సమయంలో ఆయన పంపించబడాలి.”15
రక్షకుడు తన త్యాగం ద్వారా భౌతిక మరణం యొక్క ప్రభావాలను బేషరతుగా తొలగించినప్పటికీ,16 మనం చేసిన పాపములకు పశ్చాత్తాపపడడానికి మన వ్యక్తిగత బాధ్యతను ఆయన తొలగించలేదు.17 బదులుగా, మన నిత్య తండ్రితో రాజీపడటానికి ఆయన మనకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందించారు. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా మనము, మనస్సు మరియు హృదయం యొక్క గొప్ప మార్పును అనుభవించవచ్చు, అది దేవుని పట్ల మరియు సాధారణంగా జీవితం పట్ల సరికొత్త వైఖరిని తీసుకువస్తుంది.18 మన పాపముల కొరకు మనం హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి, మన హృదయాన్ని, చిత్తాన్ని దేవునికి మరియు ఆయన ఆజ్ఞలకు మళ్ళించినప్పుడు, మనం ఆయన క్షమాపణను పొందవచ్చు మరియు మన జీవితంలో ఎక్కువ సమృద్ధిగా ఆయన పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభవించవచ్చు. కనికరముతో, రక్షకుడు భరించినంత లోతైన బాధను అనుభవించకుండా తప్పించుకుంటాము.19
పశ్చాత్తాపమనే బహుమానము తన పిల్లలపై దేవుని దయ యొక్క వ్యక్తీకరణ మరియు ఇది మనము చేసే అతిక్రమములను అధిగమించడంలో సహాయపడటానికి ఆయన సాటిలేని శక్తిని ప్రదర్శిస్తుంది. ఇది మన మర్త్య బలహీనతలు, అపరాధముల పట్ల మన నిత్య తండ్రి కలిగియున్న సహనానికి, దీర్ఘశాంతానికి నిదర్శనం. మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ బహుమానము “ఆనందానికి మరియు మనశ్శాంతికి కీలకం”20 అని పేర్కొన్నారు.
నా ప్రియమైన మిత్రులారా, మన పాపాలకు మనం నిజాయితీగా పశ్చాత్తాపపడుతున్నప్పుడు, 21 క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త బలి మన జీవితంలో పూర్తిగా ప్రభావవంతం కావడానికి మనము అనుమతిస్తాము.22 మనము పాపపు బానిసత్వం నుండి విముక్తి పొందుతాము, మన భూలోక ప్రయాణంలో ఆనందాన్ని పొందుతాము మరియు నిత్య రక్షణను పొందటానికి అర్హత పొందుతాము, ఇది యేసు క్రీస్తును విశ్వసించి ఆయన వద్దకు వచ్చే వారందరికీ లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధం చేయబడింది.23
రక్షణ యొక్క ఈ గంభీరమైన బహుమతితో పాటు, ప్రస్తుత మహమ్మారిలో మనం ఇటీవల అనుభవించిన పరిస్థితులతో సహా, మన బాధలు, శోధనలు మరియు మర్త్య జీవితంలోని బలహీనతలను మనం ఎదుర్కొంటున్నప్పుడు రక్షకుడు మనకు ఉపశమనాన్ని మరియు ఓదార్పును అందిస్తారు. మర్తత్వములో మనం అనుభవించే కష్టాల గురించి క్రీస్తుకు ఎల్లప్పుడూ తెలుసునని నేను మీకు అభయమివ్వగలను. దుఃఖము, వేదన మరియు శారీరక బాధలతో పాటు మనం ఎదుర్కొంటున్న మానసిక మరియు ఆత్మీయ సవాళ్ళన్నిటిని ఆయన అర్థం చేసుకుంటారు. రక్షకుని ప్రేగులు దయతో నిండి ఉన్నాయి మరియు ఆయన ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సాధ్యమే, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అనుభవించారు, మన బలహీనతలు మరియు లోపముల బాధను శరీరములో ఉన్నప్పుడు ఆయన తనపై తీసుకున్నారు.24
సాత్వీకముతో, హృదయ వినమ్రతతో ఆయన అన్నిటికంటే తగ్గించుకొని, మన అతిక్రమములు మరియు పాపాల కోసం గాయపడినందుకు మనుష్యుల చేత తృణీకరించబడుటకు, తిరస్కరించబడుటకు మరియు అవమానించబడుటకు ఆయన అంగీకరించారు. లోక పాపములన్నింటిని25 తనపై తీసుకొనుట ద్వారా మనందరి కొరకు వీటన్నిటిని ఆయన అనుభవించి, మన అంతిమ ఆత్మీయ సంరక్షకుడు అయ్యారు.
ఆత్మీయంగా ఆయన సంరక్షణకు మనల్ని మనం లోబరచుకొని ఆయనను సమీపించినప్పుడు, మనం ఆయన కాడిని మనపై తీసుకోగలుగుతాము, అది సులువైనది మరియు ఆయన భారాన్ని తీసుకోగలుగుతాము, అది తేలికైనది, తద్వారా వాగ్దానం చేసిన ఓదార్పు మరియు విశ్రాంతి మనకు లభిస్తుంది. ఇంకా, మనం జీవితపు కష్టాలను, బలహీనతలను మరియు దుఃఖాలను అధిగమించడానికి మనందరికి అవసరమైన బలాన్ని అందుకుంటాము, ఆయన సహాయం మరియు స్వస్థపరచు శక్తి లేకుండా వాటిని సహించడం చాలా కష్టం.26 “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును”27 అని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. “అప్పుడు (ఆయన) కుమారుని యందలి సంతోషము ద్వారా [మన] భారములు తేలికగునట్లు దేవుడు [మనకు] అనుగ్రహించునుగాక.”28
గత సంవత్సరం చివరలో, ప్రభువు పట్ల ఎంతో విశ్వాసపాత్రులైన ప్రియమైన జంట, మారియో మరియు రెజీనా ఎమెరిక్ కోవిడ్-19 నుండి వచ్చిన సమస్యల కారణంగా నాలుగు రోజుల వ్యవధిలో కన్నుమూసినట్లు నేను తెలుసుకున్నాను.
ప్రస్తుతం బ్రెజిల్‌లో బిషప్పుగా పనిచేస్తున్న వారి కుమారులలో ఒకరు ఈ క్రింది విషయాలు నాకు చెప్పారు: “నా తల్లిదండ్రులు ఈ స్థితిలో మమ్మల్ని విడిచివెళ్ళడాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది, కానీ ఆ విషాదం మధ్య నా జీవితంలో నేను ప్రభువు హస్తాన్ని స్పష్టంగా అనుభవించగలిగాను, ఎందుకంటే నా అవగాహనను మించిన బలం మరియు శాంతి నాకు లభించాయి. యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై నాకున్న విశ్వాసం ద్వారా, నా కుటుంబ సభ్యులను మరియు ఈ కష్టమైన అనుభవంలో మాకు సహాయం చేసిన వారందరినీ బలోపేతం చేయడానికి మరియు ఓదార్చడానికి నాకు దైవిక సహాయం లభించింది. ప్రతి ఒక్కరూ ఆశించిన అద్భుతం జరుగకపోయినప్పటికీ, వ్యక్తిగతంగా నా స్వంత జీవితంలో మరియు నా కుటుంబ సభ్యుల జీవితాల్లో సంభవించిన అనేక ఇతర అద్భుతములకు నేను సాక్షిగా ఉన్నాను. నాపై రక్షకునికి గల ప్రేమలో మరియు తన పిల్లల కొరకు దేవుని సంతోష ప్రణాళికలో నాకు నిరీక్షణను, విశ్వాసాన్ని కలిగిస్తూ నా హృదయపు లోతుల్లోకి చొచ్చుకుపోయిన ఒక అనిర్వచనీయమైన శాంతిని నేను అనుభవించాను. చాలా దుఃఖంతో నిండిన రోజులలో, మన పూర్ణ హృదయము, బలము, మనస్సు మరియు శక్తితో ఆయనను వెతుకుతున్నప్పుడు రక్షకుని ప్రేమగల బాహువులు ఎల్లప్పుడూ చాపబడియుంటాయని నేను తెలుసుకున్నాను.”
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఈస్టర్ ఆదివారం నాడు, యేసు మృతులలోనుండి లేచాడని మరియు ఆయన జీవిస్తున్నాడని గంభీరంగా నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన ద్వారా మరియు ఆయన అనంత ప్రాయశ్చిత్తం ద్వారా, రక్షకుడు భౌతిక మరియు ఆత్మీయ మరణాన్ని అధిగమించడానికి మనకు మార్గం ఏర్పరిచెనని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఈ గొప్ప ఆశీర్వాదాలతో పాటు, కష్ట సమయాల్లో ఆయన మనకు ఓదార్పు మరియు అభయాన్ని కూడా ఇచ్చును. అంతం వరకు విశ్వాసంతో సహిస్తూ, యేసు క్రీస్తుపై మరియు దివ్యమైన ఆయన ప్రాయశ్చిత్త త్యాగముపై మనం నమ్మకముంచినప్పుడు, ఒక రోజు మనము ఆయన సన్నిధికి తిరిగి వెళ్ళడానికి తన శక్తిమేరకు అన్నిటిని చేసే మన ప్రియమైన పరలోక తండ్రి వాగ్దానాలను మనము ఆనందిస్తానని నేను మీకు అభయమిస్తున్నాను. ఇది ఆయన కార్యము మరియు ఆయన మహిమయైయున్నది! 29. యేసే క్రీస్తని, లోక విమోచకుడు, వాగ్దానం చేయబడిన మెస్సీయ, పునరుత్థానం మరియు జీవము అని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను.30 నేను ఈ సత్యాలను తండ్రి యొక్క అద్వితీయుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు పవిత్ర నామంలో పంచుకుంటున్నాను, ఆమేన్.