సర్వసభ్య సమావేశము
స్వాగత సందేశం
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


4:27

స్వాగత సందేశం

సర్వసభ్య సమావేశానికి మరియు ప్రభువు స్వరాన్ని వినే విశేషాధికారానికి సుస్వాగతం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన సహోదర సహోదరీలు మరియు స్నేహితులారా, ఈ సర్వసభ్య సమావేశానికి నా వ్యక్తిగత స్వాగతం పలుకుతున్నాను. మన ప్రభువును, రక్షకుడునైన యేసు క్రీస్తును ఆరాధించాలనుకునే గొప్ప ప్రపంచ కుటుంబంగా మనము సమకూడాము. మాతో చేరినందుకు ధన్యవాదాలు.

గత సంవత్సరం విశిష్టమైనది మరియు అసాధారణమైనది. ఇంతకుముందు మనకు తెలియని విషయాలను ప్రతి ఒక్కరం నేర్చుకున్నాము అనడంలో సందేహము లేదు. ఇంతకు ముందు నాకు తెలిసిన కొన్ని పాఠాలు నా హృదయంలో క్రొత్తగా మరియు బోధనాత్మక మార్గాల్లో వ్రాయబడ్డాయి.

ఉదాహరణకు, ప్రభువు తన సంఘ వ్యవహారాలను నిర్దేశిస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. “నా స్వకార్యమును చేయుటకు నేను సమర్థుడనైయున్నానని [మీకు] చూపెదను”1 అని ఆయన చెప్పారు.

మిక్కిలి సవాలుతో కూడుకున్న పరిస్థితులలో మేము చేయగలిగినదంతా చేసి, ఇక ఏమీ చేయలేము అనుకొన్నప్పుడు ఆయన సహాయము చేయుటను తరచుగా, నా సలహాదారులు మరియు నేను కన్నీటితో కూడిన కళ్ళ ద్వారా చూశాము. మేము నిజంగా ఆశ్చర్యపోయాము.

“ఇదిగో, తగిన కాలమందు నా కార్యమును నేను త్వరపెట్టుదును”2 అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఉద్దేశము ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమైయింది. ప్రపంచవ్యాప్త మహమ్మారి సమయంలో కూడా ఆయన తన పనిని వేగవంతం చేయటానికి దర్శకత్వం వహించినందున నేను పదే పదే సంతోషించాను.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, సంఘము యొక్క బలాన్ని దాని సభ్యుల ప్రయత్నాలలో మరియు ఎడతెగక పెరుగుతున్న సాక్ష్యాలలో కనుగొనగలము. సాక్ష్యాలు ఉత్తమంగా గృహములో అభివృద్ధి చెందుతాయి. ఈ గత సంవత్సరంలో, మీలో చాలా మంది మీ గృహాలలో సువార్త అధ్యయనాన్ని నాటకీయంగా పెంచారు. నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు మీ పిల్లలు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు.

సాల్ట్ లేక్ దేవాలయాన్ని పునరుద్ధరించే భారీ ప్రయత్నం కొనసాగుతోంది. దేవాలయ ప్రాంతంలో జరుగుతున్న పనులను చూడడానికి నా కార్యాలయం నుండి నాకు దగ్గరగా చూసే అవకాశం కలిగింది.

దేవాలయ స్థలములో నిర్మాణ పనులు

కార్మికులు పాత చెట్ల మూలాలు త్రవ్వడం, నీటి గొట్టాలు వేయడం, కరెంటు తీగలు వేయడం మరియు కారుతున్న నీటిధారలను త్రవ్వడం నేను చూడగా, రక్షకుడి సహాయంతో మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాలలో పాత శిధిలాలను తొలగించాల్సిన అవసరం గురించి ఆలోచించాను.

యేసు క్రీస్తు సువార్త అనేది పశ్చాత్తాపం యొక్క సువార్త.3 రక్షకుని ప్రాయశ్చిత్తం కారణంగా, మారుతూ, అభివృద్ధి చెందుతూ, మరింత స్వచ్ఛంగా మారడానికి ఆయన సువార్త ఒక ఆహ్వానాన్ని ఇస్తుంది. ఇది నిరీక్షణ, స్వస్థత మరియు పురోగతి యొక్క సువార్త. ఈ విధంగా, సువార్త అనేది ఆనందం యొక్క సందేశం! మనం ముందుకు వేసే ప్రతి చిన్న అడుగుతో మన ఆత్మలు ఆనందిస్తాయి.

ఇశ్రాయేలీయులను సమకూర్చుటలో ఒక భాగం మరియు చాలా ముఖ్యమైన భాగం ఏమిటంటే ప్రజలుగా మనము యోగ్యులుగా ఉండి, ప్రభువు యొక్క రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయడంలో సహాయపడడానికి సమ్మతితో ఉండటం.

పరిశుద్ధాత్మ దర్శకత్వంలో మన నాయకులు జాగ్రత్తగా సిద్ధం చేసిన సందేశాలను మనము వింటున్నప్పుడు, మీ జీవితం నుండి మీరు తొలగించాల్సిన శిధిలాలను గుర్తించుటకు ప్రార్థించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, తద్వారా మీరు మరింత యోగ్యులు కాగలరు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను మరియు మన పరలోకపు తండ్రికి, ఆయన ప్రియ కుమారునికి మీరు వ్యక్తిగతంగా తెలుసని, వారు మిమ్ములను ప్రేమిస్తున్నారని సాక్ష్యమిస్తున్నాను. మీరు ముందుకు వేసే ప్రతి అడుగులో మీకు సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సర్వసభ్య సమావేశానికి మరియు ప్రభువు స్వరాన్ని వినే విశేషాధికారానికి సుస్వాగతం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.