అవి ప్రబలము కాలేవు; మనము పడిపోము
మనము యేసు క్రీస్తుపై మన పునాదిని నిర్మిస్తే, మనము విఫలము కాము!
గత సర్వసభ్య సమావేశములో, ప్రియమైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “అపొస్తలుడైన పౌలు ప్రవచించినట్లుగా, ఈ అపాయకరమైన కాలములందు, సాతాను ఇకపై దేవుని ప్రణాళికపై తన దాడులను దాచటానికి ప్రయత్నించడు . అనేక చెడ్డ ఆలోచనలు లోకంలో ప్రఖ్యాతిగాంచాయి. కాబట్టి, మన జీవితాల్లో దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడానికి, ఆయన స్వరమును వినడం నేర్చుకోవడానికి, ఇశ్రాయేలును సమకూర్చడంలో సహాయపడేందుకు మన శక్తిని ఉపయోగించడానికి తీర్మానించుకొని యుండుట ఆత్మీయంగా జీవించడానికి గల ఏకైక మార్గము.”1
దేవుని స్వరమును వినడానికి నేర్చుకోవడానికి ప్రవక్త యొక్క ఆహ్వానాన్ని మనము పరిగణించినప్పుడు, మన హృదయాలు తీర్మానించబడినవా లేక కఠినపరచబడినవా? జేకబ్ 6:6 లో ఇవ్వబడిన సలహాను మనము జ్ఞాపకముంచుకుందాం: “అవును, ఈ దినమున మీరు ఆయన స్వరమును విని మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. ఏలయనగా మీరెందుకు చనిపోయెదరు?” మన జీవితాలలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి మనము తీర్మానించుకొనియుండాలి.
మన జీవితాలలో దేవునికి ప్రాధాన్యతను ఇచ్చి, అపవాదికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలా ఉండగలము? సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34 మనము ఇలా చదువుతాము, “కాబట్టి, భయపడకుడి, చిన్న మందా; మేలు చేయండి; భూమి, నరకము మీకు వ్యతిరేకంగా ఏకము కానియ్యుడి, మీరు నా బండపై కట్టబడిన యెడల, అవి ప్రబలము కాలేవు.” అది ప్రాముఖ్యమైన వాగ్దానము. భూమి, నరకము మనకు వ్యతిరేకంగా ఏకమైనప్పటికీ, ఆయన బండపై మన జీవితాలను స్థాపించుట ద్వారా మనము దేవునికి ప్రాధాన్యతనిచ్చిన యెడల అవి ప్రబలము కాలేవు.
ఆయన శిష్యులతో మాట్లాడుతూ, క్రొత్త నిబంధన మత్తయి 7 అధ్యాయములో వ్రాయబడిన బుద్ధిమంతుడు మరియు బుద్దిహీనుని గూర్చి యేసు క్రీస్తు బోధించెను. “బుద్ధిమంతుడు మరియు బుద్దిహీనుడు”2 ప్రాథమిక పాటను మీలో అనేకమంది వినియుంటారు. పాటలో నాలుగు వచనాలను పోల్చడానికి మీరు సమయాన్ని తీసుకొన్న యెడల, 1, 2 వచనాలు 3, 4 వచనాలను పోలి ఉంటాయి. బుద్ధిమంతుడు మరియు బుద్దిహీనుడు ఇరువురు ఒక ఇల్లు కడుతున్నారు. వారు తమ కుటుంబానికి భద్రమైన, సౌకర్యముగల ఇంటిని అందించాలని కోరుతున్నారు. మీ వలె, నా వలె వారు కూడా ఒక కుటుంబంగా కలిసి సంతోషంగా జీవించాలని కోరుతున్నారు. చుట్టు ప్రక్కల పరిస్థితి ఒకేవిధంగా ఉన్నది—“ వానలు కురిసాయి, వరదలు పైకి వచ్చాయి.” ఆ పాటను మనము పాడినప్పుడు దానిని ఆరుసార్లు పాడతాము. ఒకేఒక తేడా ఏమిటంటే, బుద్ధిమంతుడు తన ఇంటిని బండపై కట్టాడు మరియు ఇల్లు తుఫాను చేత కదిలించబడలేదు, అయితే బుద్ధిహీనుడు, తన ఇంటిని ఇసుకపై కట్టాడు మరియు అతడి ఇల్లు తుఫాను చేత నాశనము చేయబడింది. కాబట్టి, మన ఆత్మీయ పునాది యొక్క స్థానము చాలా ముఖ్యమైనది, మరియు మన పునాది చివరికి, నిత్యమైన ఫలితంపై నిర్ణయాత్మక ప్రభావాన్ని కలిగియున్నది.
మన భవిష్యత్తు జీవితాన్ని మనము స్థాపించినప్పుడు, మనమందరం నిశ్చయమైన పునాదిపై కనుగొనబడి, నిలిచియుండాలని నేనాశిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. హీలమన్ 5:12 లో మనము జ్ఞాపకం చేయబడ్డాము: “ఇప్పుడు నా కుమారులారా! జ్ఞాపకముంచుకొనుడి, మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి; అపవాది తన బలమైన గాలులను, సుడిగాలి యందు అతని బాణములను పంపునప్పుడు, అతని సమస్త వడగళ్ళు మరియు బలమైన గాలివాన మిమ్ములను కొట్టునప్పుడు, దౌర్భాగ్యపు అఘాథము మరియు అంతము లేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొనిపోవుటకు అది మీపై ఏ శక్తి కలిగియుండదు, ఏలయనగా మీరు కట్టబడిన ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది మరియు మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.”
అది దేవుని నుండి వచ్చిన వాగ్దానము! మనము యేసు క్రీస్తుపై మన పునాదిని నిర్మిస్తే, మనము విఫలము కాము! మనము విశ్వాసముతో అంతము వరకు సహించినప్పుడు, ఆయన బండపై మన జీవితాలను స్థాపించడానికి దేవుడు మనకు సహాయపడతాడు, మరియు నరకపు ద్వారములు మనకు వ్యతిరేకంగా తెరవబడవు (సిద్ధాంతము మరియు నిబంధనలు 10:69). భవిష్యత్తులో జరగబోయే దానిని మనము మార్చలేకపోవచ్చు, కానీ రాబోయే దాని కొరకు మనము ఎలా సిద్ధపడగలమో ఎంపిక చేసుకోవచ్చు.
“సువార్త మేలైనది, కనుక కనీసము వారానికి ఒకసారైన మన జీవితాలలో భాగముగా చేర్చాల్సిన అవసరమున్నది” అని మనలో కొందరు ఆలోచించవచ్చు. వారానికి ఒకసారి సంఘానికి వెళ్ళడం బండపై కట్టబడటానికి సరిపోదు. మన జీవితాల మొత్తం యేసు క్రీస్తు యొక్క సువార్తతో నింపబడాలి. సువార్త మన జీవితంలో చిన్న అంశము కాదు, కానీ మన జీవితం వాస్తవంగా దేవుని గొప్ప ప్రణాళిక మరియు సువార్తలో చిన్న అంశము. దాని గురించి ఆలోచించండి. అది నిజము కాదా? మన మర్త్య జీవితము రక్షణ ప్రణాళిక మరియు ఉన్నతస్థితిలో భాగము మాత్రమే.
దేవుడు మన పరలోక తండ్రి. ఆయన మనందరిని ప్రేమిస్తున్నాడు. మన గురించి మనకు తెలిసిన దానికంటే మేలుగా మన సాధ్యతను ఆయన ఎక్కువగా ఎరుగును. ఆయన మన జీవితాలలోని వివరాలను మాత్రమే ఎరుగడు. దేవుడు మన జీవితాలలో ప్రతీ చిన్న వివరమును ఎరిగియున్నాడు.
మన జీవిస్తున్న ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ యొక్క తెలివైన సలహాను దయచేసి అనుసరించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 21:5–6 లో వ్రాయబడినట్లుగా:
“ఏలయనగా మీరు అతని మాటను పూర్తి సహనముతోను, విశ్వాసముతోను నా నోటినుండి పలికినట్లుగానే స్వీకరించవలెను.
“ఈ సంగతులను చేయుట ద్వారా నరకపు ద్వారములు మీ యెదుట నిలువజాలవు; అవును, ప్రభువైన దేవుడు అంధకార శక్తులను మీ యెదుట నుండి తరిమివేయును, మీ మేలు కొరకు, ఆయన నామ ఘనత కొరకు పరలోకములు కంపించునట్లు చేయును.
ఆ కారణము వలన, అవి ప్రబలవు, మరియు మనము విఫలము కాము!
ఆయన మొదటిసారి వచ్చినట్లుగా రెండవసారి క్రీస్తు తిరిగి వస్తాడని, ఈసారి గొప్ప మహిమ, శక్తితో వస్తాడని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. ఈ తెరకు ఈవైపు లేక మరొకవైపున అయినప్పటికినీ, ఆయనను స్వీకరించడానికి నేను సిద్ధముగా ఉండాలని నిరీక్షిస్తున్నాను మరియు ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైన ఈస్టరు కాలమును మనము జరుపుకున్నప్పుడు, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము మరియు ఆయన పునరుత్థానము (మొరోనై 7:41 చూడండి), యొక్క శక్తి ద్వారా, నేను వెళ్ళి నా సృష్టికర్తను కలుసుకొని “మీకు కృతజ్ఞతలు” అని చెప్పగలనని నేను ఆశిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.