సర్వసభ్య సమావేశము
నిబంధన మార్గము ఎందుకు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


15:4

నిబంధన మార్గము ఎందుకు

నిబంధన మార్గం యొక్క వ్యత్యాసం ప్రత్యేకమైనది మరియు శాశ్వతముగా ప్రాముఖ్యమైనది.

తన పరిచర్య అంతటిలో, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ దేవుడు తన పిల్లలతో చేయు నిబంధనలను అధ్యయనం చేసి, బోధించారు. నిబంధన మార్గంలో నడిచేవారికి ఆయనే ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. సంఘ అధ్యక్షుడిగా తన మొదటి సందేశంలో, అధ్యక్షులు నెల్సన్ ఇలా పేర్కొన్నారు:

“రక్షకునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలు పాటించడం ద్వారా ఆయనను అనుసరించాలనే మీ నిబద్ధత ప్రతిచోటా ఉన్న పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు లభించే ప్రతి ఆత్మీయ దీవెన మరియు విశేషాధికారానికి ద్వారాన్ని తెరుస్తుంది.

“… దేవాలయ విధులు మరియు అక్కడ మీరు చేసే నిబంధనలు మీ జీవితాన్ని, మీ వివాహాన్ని, కుటుంబాన్ని మరియు విరోధి యొక్క దాడులను నిరోధించే మీ సామర్థ్యాన్ని బలపరచడంలో ముఖ్యమైనవి. దేవాలయములో మీ ఆరాధన, మీ పూర్వీకుల కొరకు అక్కడ మీ సేవ మిమ్మల్ని హెచ్చించబడిన వ్యక్తిగత బయల్పాటుతో దీవించును, నిబంధన బాటపై నిలిచియుండుటకు మీ నిబద్ధతను పటిష్టపరచును.”1

నిబంధన మార్గం అంటే ఏమిటి? ఇది దేవుని యొక్క సిలెస్టియల్ రాజ్యానికి నడిపించే మార్గం. మనము ఆ మార్గములో బాప్తీస్మము యొక్క ద్వారం వద్ద బయలుదేరాము, ఆపై “క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, అంతము వరకు [రెండు గొప్ప ఆజ్ఞలైన] దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుంటాము.”2 నిబంధన మార్గంలో (ఇది మర్త్యత్వము తరువాత కూడా కొనసాగుతుంది), రక్షణ మరియు ఉన్నతస్థితికి సంబంధించిన అన్ని విధులు మరియు నిబంధనలను మనము పొందుతాము.

దేవుని చిత్తాన్ని చేయుట మరియు “అన్ని విషయములలో ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడుటయే”3 మన నిబంధన యొక్క అతి పెద్ద నిబద్ధతయై యున్నది. అనుదినము యేసు క్రీస్తు సువార్త యొక్క సూత్రాలు మరియు ఆజ్ఞలను అనుసరించడం జీవితంలో సంతోషకరమైన మరియు అత్యంత సంతృప్తికరమైన మార్గమైయున్నది. దానికి ఒక కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి చాలా సమస్యలను మరియు విచారాన్ని తప్పించుకుంటాడు. నేను క్రీడల సారూప్యతను ఉపయోగిస్తాను. టెన్నిస్‌లో, బలవంతపు లోపాలు అని ఉంటాయి. క్రీడాకారుని వద్దకు వచ్చిన బంతిని నెట్‌లోకి కొట్టడం లేదా మొదట బంతిని కొడుతున్నప్పుడు రెండు సార్లు తప్పులు చేయడం వంటివి. బలవంతపు లోపాలు ప్రత్యర్థి నైపుణ్యం వల్ల జరిగినవి కాకుండా ఆటగాడి పొరపాటు యొక్క ఫలితాలుగా పరిగణించబడతాయి.

చాలా తరచుగా మన సమస్యలు లేదా సవాళ్ళు స్వయంగా కల్పించుకొనేవి, తప్పుడు ఎంపికల ఫలితం లేదా “బలవంతపు లోపాల” ఫలితమని మనము చెప్పగలం. మనము నిబంధన మార్గాన్ని శ్రద్ధగా అనుసరిస్తున్నప్పుడు, సహజంగానే మనం చాలా “బలవంతపు లోపాలను” నివారిస్తాము. మనము వ్యసనం యొక్క వివిధ రూపాలను ప్రక్కన పెడతాము. మనము అవినీతికరమైన ప్రవర్తన యొక్క గోతిలో పడము. మనము అనైతికత మరియు నమ్మకద్రోహం యొక్క అగాథాన్ని దాటుతాము. జనాదరణ పొందినప్పటికీ, మన శారీరక మరియు ఆత్మీయ శ్రేయస్సును దెబ్బతీసే వ్యక్తులను మరియు విషయాలను మనము దాటవేస్తాము. ఇతరులకు హాని కలిగించే లేదా నష్టం కలిగించే ఎంపికలను మనము నివారిస్తాము, బదులుగా స్వీయ క్రమశిక్షణ మరియు సేవ యొక్క అలవాట్లను పెంపొందించుకుంటాము.4

ఎల్డర్ జె. గోల్డెన్ కింబల్ ఇలా అన్నారు, “నేను [ఎప్పుడూ] తిన్నని ఇరుకైన మార్గములో నడిచి ఉండకపోవచ్చు, కానీ నేను వీలైనంత తరచుగా దాన్ని దాటడానికి (ప్రయత్నిస్తాను).”5 మరింత తీవ్రమైన క్షణంలో, ఒక వైపు తప్పించుకోగలిగిన దుఃఖాన్ని నివారించడానికి, మరోవైపు అనివార్యమైన జీవిత బాధలతో విజయవంతంగా వ్యవహరించడానికి నిబంధన మార్గం దాటడం కాకుండా దానిలో నిలిచి ఉండడం మన గొప్ప నిరీక్షణ అని సహోదరుడు కింబల్ అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

కొందరు ఇలా అనవచ్చు, “నేను బాప్తీస్మము తీసుకొని లేదా తీసుకొనకుండా మంచి ఎంపికలు చేయగలను; గౌరవప్రదమైన మరియు విజయవంతమైన వ్యక్తిగా ఉండడానికి నాకు నిబంధనలు అవసరం లేదు.” నిజమే, నిబంధన మార్గంలో ఉండకుండానే ఆ మార్గంలో ఉన్నవారి ఎంపికలు మరియు సహకారాలకు అద్దం పట్టే విధంగా వ్యవహరించే వారు చాలామంది ఉన్నారు. వారు “నిబంధన-స్థిరమైన” మార్గంలో నడవడం వలన వచ్చే ఆశీర్వాదాలను పొందుతారని మీరు అనవచ్చు. అయితే, నిబంధన మార్గానికి వ్యత్యాసం ఏమిటి?

నిజానికి, వ్యత్యాసం ప్రత్యేకంగా మరియు శాశ్వతంగా ముఖ్యమైనది. ఇది మన విధేయత యొక్క స్వభావం, మన పట్ల దేవుని నిబద్ధత యొక్క లక్షణం, మనం పొందే దైవిక సహాయం, నిబంధన జనులుగా సమకూడుటతో ముడిపడి ఉన్న దీవెనలు మరియు ముఖ్యంగా మన నిత్య వారసత్వాన్ని కలిగియున్నది.

నిబద్దతో కూడిన విధేయత

మొదటిది దేవునిపట్ల మన విధేయత యొక్క స్వభావం. మంచి ఉద్దేశాలను కలిగి ఉండటమే కాకుండా, దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించుటకు మనము గంభీరంగా కట్టుబడి ఉన్నాము. దీనిలో మనం యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరిస్తాము, ఆయన బాప్తీస్మం తీసుకోవడం ద్వారా, “శరీరానుసారముగా తననుతాను తండ్రి యెదుట తగ్గించుకొనుచున్నాడని నరుల సంతానమునకు చూపుచు, తండ్రి ఆజ్ఞలను పాటించుటలో తాను ఆయనకు లోబడియుండెదనని తండ్రికి సాక్ష్యమిచ్చుచున్నాడు.”6

నిబంధనలతో, మనం తప్పులను నివారించడం లేదా వివేకం కలిగి ఉండటంపై మాత్రమే దృష్టిసారించము. మన ఎంపికలకు, మన జీవితాలకు దేవునికి జవాబుదారులమని భావిస్తాము. మనము క్రీస్తు నామాన్ని మనపై తీసుకుంటాము. మనము క్రీస్తుపై, అనగా యేసును గూర్చిన సాక్ష్యమందు శూరులుగా ఉండటంపై మరియు క్రీస్తు గుణాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తాము.

నిబంధనలతో, సువార్త సూత్రాలకు విధేయత చూపడం మన ఆత్మ యొక్క ముఖ్యమైన భాగం అవుతుంది. నాకు ఒక జంటతో పరిచయం ఉంది, వారి వివాహ సమయంలో, భార్య సంఘములో చురుకుగా లేదు మరియు భర్త సంఘ సభ్యుడు కాదు. నేను వారిని వారి అసలు పేర్లతో కాకుండా మేరీ మరియు జాన్ అని పిలుస్తాను. వారికి పిల్లలు కలిగిన తరువాత, లేఖనాలలో చెప్పినట్లుగా “ప్రభువు యొక్క శిక్షణలో, ఉపదేశములో”7 వారిని పెంచాల్సిన అవసరాన్ని మేరీ ఎంతగానో భావించింది. జాన్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. సువార్తను స్థిరమైన ప్రాతిపదికన బోధించడానికి మేరీ ఇంట్లో ఉండటానికి కొన్ని ముఖ్యమైన త్యాగాలు చేసింది. సంఘ ఆరాధన మరియు కార్యకలాపాలను కుటుంబం పూర్తిగా ఉపయోగించుకునేలా ఆమె చూసుకుంది. మేరీ మరియు జాన్ ఆదర్శప్రాయమైన తల్లిదండ్రులు అయ్యారు మరియు వారి పిల్లలు (శక్తిమంతమైన అబ్బాయిలందరూ) సువార్త సూత్రాలు మరియు ప్రమాణాల పట్ల విశ్వాసం మరియు భక్తితో పెరిగారు.

జాన్ తల్లిదండ్రులు, అబ్బాయిల తాతలు, వారి మనవళ్ళ ఆరోగ్యకరమైన జీవితాలు మరియు విజయాలతో సంతోషించారు, కానీ సంఘము పట్ల కొంత వైరుధ్యం ఉన్నందున, వారు ఈ విజయాన్ని ప్రత్యేకంగా జాన్ మరియు మేరీల పెంపక నైపుణ్యాలకు ఆపాదించాలని కోరుకున్నారు. జాన్, సంఘ సభ్యుడు కానప్పటికీ, అబ్బాయిల ఆరోగ్యకరమైన జీవితాలు మరియు విజయాల గురించి తన తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సవాలు చేశాడు. సువార్త బోధనల ఫలాలను వారు చూస్తున్నారని— తన కుమారులు సంఘములో అనుభవిస్తున్న దానికి, అలాగే ఇంట్లో జరుగుతున్న దానికి కారణం అదేనని జాన్ బలంగా చెప్పాడు.

జాన్ కూడా ఆత్మ చేత, అతని భార్య ప్రేమ, మాదిరుల చేత మరియు అతని కుమారుల ప్రేరేపణ చేత ప్రభావితమయ్యాడు. కొంతకాలము తరువాత అతడు బాప్తీస్మము తీసుకున్నాడు మరియు సంఘ సభ్యులు, స్నేహితులు మిక్కిలి ఆనందించారు.

వారి మరియు వారి కుమారుల జీవితం సవాళ్ళు లేకుండా ఉండనప్పటికీ, వారి దీవెనలకు మూలం సువార్త నిబంధన అని మేరీ మరియు జాన్ హృదయపూర్వకంగా ధృవీకరిస్తున్నారు. యిర్మీయాకు ప్రభువు చెప్పిన మాటలు వారి పిల్లల జీవితాలలో మరియు వారి స్వంత జీవితాల్లో నెరవేరినట్లు వారు చూశారు: “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులగుదురు.”8

దేవునితో దృఢమైన బంధాన్ని కలిగియుండండి

నిబంధన మార్గం యొక్క రెండవ ప్రత్యేక అంశం దేవునితో మన సంబంధం. దేవుడు తన పిల్లలకు ఇచ్చే నిబంధనలు మనకు మార్గనిర్దేశం చేయడం కంటే ఎక్కువ చేస్తాయి. అవి మనలను ఆయనతో బంధిస్తాయి మరియు ఆయనతో బంధించబడి ఉండటం వలన మనం అన్నింటినీ అధిగమించగలము.9

సరైన సమాచారం లేని ఒక వార్తాపత్రిక విలేఖరి రాసిన ఒక కథనాన్ని నేను ఒకసారి చదివాను, చనిపోయినవారికి మనం బాప్తీస్మము ఇచ్చే విధానం మైక్రోఫిల్మ్ చుట్టలు నీటిలో ముంచడం వంటిది అని అతడు వివరించాడు. అప్పుడు మైక్రోఫిల్మ్‌లో ఎవరి పేర్లు కనిపిస్తాయో వారు బాప్తీస్మం తీసుకున్నట్లు పరిగణించబడతారు. ఆ విధానం సమర్థవంతంగా ఉంటుంది, కానీ అది ప్రతి ఆత్మ యొక్క అనంతమైన విలువను మరియు దేవునితో వ్యక్తిగత నిబంధన యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యతను విస్మరిస్తుంది.

“ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొనువారు కొందరే … అని [యేసు] చెప్పెను.”10 చిహ్నపూర్వకంగా చెప్పాలంటే, ఈ ద్వారము చాలా ఇరుకైనది, ఇది ఒక సమయంలో ఒకరు మాత్రమే ప్రవేశించడానికి అనుమతిస్తుంది. ప్రతి ఒక్కరూ దేవునికి వ్యక్తిగత నిబద్ధతనిస్తారు మరియు బదులుగా అతడు లేదా ఆమె ఈ లోకంలో మరియు నిత్యత్వంలో పరిపూర్ణముగా ఆధారపడగలరని ఆయన నుండి ప్రతి ఒక్కరు పేరు పేరున వ్యక్తిగత నిబంధన పొందుతారు. నిబంధనలు మరియు విధులతో మన జీవితాలలో “దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును.”11

దైవిక సహాయం

ఇది నిబంధన మార్గం యొక్క మూడవ ప్రత్యేక దీవెనను పరిగణించుటకు దారి తీస్తుంది. నిబంధనను చేసేవారు నిబంధనను పాటించేవారుగా ఉండేందుకు సహాయపడుటకు దేవుడు దాదాపు అపారమైన వరమును ఇస్తాడు: అదే పరిశుద్ధాత్మ వరము. ఈ బహుమానము పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము, రక్షణ మరియు మార్గదర్శకత్వానికి మనం కలిగియున్న హక్కు.12 ఆదరణకర్త అని కూడా పిలువబడే పరిశుద్ధాత్మ “నిరీక్షణతోను, పరిపూర్ణమైన ప్రేమతోను నింపును.”13 ఆయన “సమస్త సంగతులను యెరుగును మరియు తండ్రిని గూర్చియు, కుమారుని గూర్చియు సాక్ష్యమిచ్చును,”14 వారికి సాక్షులుగా ఉంటామని మనం నిబద్దత కలిగియుంటాము.15

నిబంధన మార్గంలో క్షమాపణ మరియు పాపం నుండి శుద్ధి చేయబడుట యొక్క ఆవశ్యకమైన దీవెనలను కూడా మనం కనుగొంటాము. ఇది పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడే దైవిక కృప ద్వారా మాత్రమే రాగల సహాయం. “ఇప్పుడు ఆజ్ఞ ఇదియే: అంత్యదినమున మీరు నా యెదుట మచ్చలేక యుండునట్లు, పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధపరచబడునట్లు, భూదిగంతములలో నున్న మీరందరు పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి మరియు నా నామమున బాప్తీస్మము పొందుడి”16 అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

నిబంధన జనులతో సమకూడండి

నాల్గవది, ఎవరైతే నిబంధన మార్గాన్ని అనుసరిస్తున్నారో, వారు దైవికంగా నియమించబడిన వివిధ కూడికలలో చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదాలను కూడా పొందుతారు. దీర్ఘకాలంగా చెదరగొట్టబడిన ఇశ్రాయేలు యొక్క గోత్రములను వారి వారసత్వ దేశములకు అక్షరాలా సమకూర్చే ప్రవచనాలు లేఖనాలంతటా కనిపిస్తాయి.17 ఆ ప్రవచనాలు మరియు వాగ్దానాల నెరవేర్పు ఇప్పుడు నిబంధన జనులను భూమిపై దేవుని రాజ్యమైన సంఘములో చేర్చడంతో జరుగుతోంది. అధ్యక్షులు నెల్సన్ ఇలా వివరించారు, “మనము సమకూర్పు గురించి మాట్లాడేటప్పుడు, మనము ఈ ప్రాథమిక సత్యాన్ని మాత్రమే చెబుతున్నాము: మన పరలోక తండ్రి పిల్లల్లో ప్రతి ఒక్కరూ … పునఃస్థాపించబడిన యేసుక్రీస్తు సువార్త సందేశాన్ని వినడానికి అర్హులు.” 18

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులను ప్రభువు ఇలా ఆజ్ఞాపించెను “మీ వెలుగు జనములకు ఒక ప్రమాణముగా నుండునట్లు లేచి, ప్రకాశించుడి; సీయోను ప్రదేశములో, ఆమె స్టేకులలో సమకూడుట రక్షణ కొరకు, తుఫాను నుండి రక్షణ కొరకు ఏమియు కలపబడకుండా భూమియంతటిపై క్రుమ్మరించబడబోవు దేవుని ఉగ్రతనుండి తప్పించుకొనుట కొరకు జరుగును.”19

మనం “ఇహలోక మాలిన్యము అంటకుండా [మనల్ని మనం] బహుమిక్కిలిగా కాపాడుకొనుటకు” ప్రభువు దినమున ప్రార్థన గృహాములో నిబంధన జనులకు ప్రతి వారం ఒక సమావేశం కూడా కలదు.20 ఇది యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క జ్ఞాపకార్థం సంస్కారపు రొట్టె మరియు నీటిలో పాలుపంచుకోవడం మరియు “ఉపవాసముండుటకు, ప్రార్థన చేయుటకు, [మన] ఆత్మల సంక్షేమమును గూర్చి ఒకరితోనొకరు మాట్లాడే”21 ఒక కూడిక. యుక్తవయసులో, నా ఉన్నత పాఠశాల తరగతిలో నేను మాత్రమే సంఘ సభ్యుడిని. పాఠశాలలో చాలామంది మంచి స్నేహితుల అనుబంధాన్ని నేను ఆస్వాదించాను, అయినప్పటికీ నన్ను ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఉత్తేజపరచడానికి మరియు నూతనపరచడానికి ప్రతి వారం ఈ విశ్రాంతిదిన కూడికపైనే నేను ఎక్కువగా ఆధారపడ్డాను. ప్రస్తుత మహమ్మారి సమయంలో ఈ క్రమ నిబంధన కూడిక యొక్క నష్టాన్ని మనం ఎంతో స్పష్టంగా అనుభవించాము మరియు మునుపటిలా మనం మళ్ళీ కలిసి రాగల సమయం కొరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.

నిబంధన జనులు అక్కడ ప్రత్యేకంగా లభించే విధులు, దీవెనలు మరియు బయల్పాటు పొందడానికి దేవాలయములో, ప్రభువు గృహాములో సమావేశమవుతారు. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ఇలా బోధించెను: “ప్రపంచంలోని ఏ యుగంలోనైనా… దేవుని ప్రజలను సమకూర్చడానికి గల ఉద్దేశము ఏమిటి? … ప్రధాన లక్ష్యం ఏమిటంటే, యెహోవాకు తన మందిరపు విధులను మరియు ఆయన రాజ్య మహిమలను తన ప్రజలకు బయలుపరచగల ఒక ఆలయాన్ని నిర్మించడం మరియు ప్రజలకు రక్షణ మార్గాన్ని నేర్పించడం; ఎందుకనగా కొన్ని నిర్దిష్టమైన విధులు మరియు సూత్రాలు కలవు, అవి బోధించబడి, ఆచరించబడినప్పుడు, వాటి ఉద్దేశము కొరకు నిర్మించిన ప్రదేశంలో లేదా గృహములో వాటిని చేయాలి.”22

నిబంధన వాగ్దానాలను వారసత్వంగా పొందండి

చివరగా, నిబంధన మార్గాన్ని అనుసరించడం వలన మాత్రమే మనం అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల దీవెనలను వారసత్వంగా పొందుతాము, అవి దేవుడు మాత్రమే ఇవ్వగల రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క అంతిమ దీవెనలు.23

నిబంధన జనులకు సంబంధించిన లేఖన అనుబంధములు తరచుగా “ఇశ్రాయేలు వంశమును” లేదా అబ్రాహాము యొక్క వారసులను సూచిస్తాయి. కానీ నిబంధన జనులలో యేసు క్రీస్తు సువార్తను స్వీకరించే వారందరూ కూడా ఉన్నారు.24 పౌలు ఇలా వివరించెను:

“క్రీస్తు లోనికి బాప్తీస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. …

“మీరు క్రీస్తు సంబంధులైతే, ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.”25

తమ నిబంధనలకు విధేయులుగా ఉన్నవారు “నీతిమంతుల పునరుత్థానములో ముందుకు వచ్చెదరు.”26 వారు “క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు ద్వారా పరిపూర్ణులుగా చేయబడిరి. … సిలెస్టియల్ మహిమ శరీరములు కలవారు వీరే, వారి మహిమ సూర్యుని పోలియుండును, అది దేవుని మహిమ, అన్నిటికంటె ఉన్నతమైనది.”27 “కావున, అన్ని సంగతులు—జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్న సంగతులు లేదా రాబోవు సంగతులు వారివే, అన్నీ వారివే, వారు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు.”28

నిబంధన మార్గంలో ఉండాలని ప్రవక్త ఇచ్చిన పిలుపును మనం ఆలకించెదము. నీఫై మనల్ని మరియు మన కాలాన్ని చూసి ఇలా వ్రాసాడు, “భూముఖమంతటిపై చెదిరియున్న గొఱ్ఱెపిల్ల సంఘము యొక్క పరిశుద్ధులపైన, ప్రభువు నిబంధన జనులపైన దేవుని గొఱ్ఱెపిల్ల యొక్క శక్తి దిగివచ్చుట నీఫైయను నేను చూచితిని; వారు గొప్ప మహిమయందు పరిశుద్ధతను, దేవుని శక్తిని ఆయుధములుగా ధరించుకొనియుండిరి.”29

నీఫైతో పాటు “ప్రభువు నిబంధనల యందు నా ఆత్మ ఆనందించుచున్నది.”30 ఈ ఈస్టర్ ఆదివారం నాడు, యేసు క్రీస్తును గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన పునరుత్థానమే మన నిరీక్షణ మరియు నిబంధన మార్గంలో వాగ్దానం చేయబడిన అన్నిటికీ అభయము. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.