మన దైవిక ప్రేరేపిత రాజ్యాంగాన్ని రక్షించడం
దైవిక ప్రేరణపై మన నమ్మకం సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని మరియు రాజ్యాంగ సూత్రాలను సమర్థించడానికి మరియు రక్షించడానికి కడవరి-దిన పరిశుద్ధులకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను ఇస్తుంది.
ఈ సమస్యాత్మక సమయంలో, సంయుక్త రాష్ట్రాల యొక్క ప్రేరేపిత రాజ్యాంగం గురించి మాట్లాడాలని నేను భావించాను. ఈ రాజ్యాంగం సంయుక్త రాష్ట్రాలలో ఉన్న మన సభ్యులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది, అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలకు ఉమ్మడి వారసత్వముగా ఉన్నది.
I.
రాజ్యాంగం ప్రభుత్వానికి పునాది. ఇది ప్రభుత్వ అధికారాల వినియోగానికి నిర్మాణాన్ని మరియు పరిమితులను అందిస్తుంది. సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం నేటికీ అమలులో ఉన్న పురాతన వ్రాతపూర్వక రాజ్యాంగం. మొదట దీనిని తక్కువ సంఖ్యలో కాలనీలు మాత్రమే స్వీకరించినప్పటికీ, త్వరలో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక నమూనాగా మారింది. నేడు, మూడు దేశాలు మినహా ప్రతి దేశం వ్రాతపూర్వక రాజ్యాంగాలను స్వీకరించింది.1
ఈ వ్యాఖ్యలలో నేను ఏ రాజకీయ పార్టీ లేదా ఇతర సమూహం కోసం మాట్లాడను. నేను 60 ఏళ్ళకు పైగా అధ్యయనం చేసిన సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం కోసం మాట్లాడుతున్నాను. సంయుక్త రాష్ట్రాల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయ గుమస్తాగా ఉన్న అనుభవం నుండి నేను మాట్లాడుతున్నాను. న్యాయ ఆచార్యునిగా నా 15 సంవత్సరాలు మరియు యూటా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నా 3½ సంవత్సరాల అనుభవము నుండి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా, దైవిక ప్రేరేపిత సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం పునఃస్థాపించబడిన ఆయన సంఘము యొక్క పనికి వర్తిస్తుంది గనుక దాని యొక్క అర్థాన్ని అధ్యయనం చేయవలసిన బాధ్యత ఉన్న వ్యక్తిగా, 37 సంవత్సరాల నుండి యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడిగా ఉన్న నేను మాట్లాడుతున్నాను.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రత్యేకమైనది, ఎందుకంటే “సర్వశరీరుల హక్కులు, ఆత్మరక్షణ కొరకు” ఆయన దానిని “స్థాపించెనని” దేవుడు బయలుపరచెను. (సిద్ధాంతము మరియు నిబంధనలు 101: 77; 80వ వచనము కూడా చూడండి) అందుకే ఈ రాజ్యాంగం పట్ల ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నది. ప్రపంచంలోని ఇతర దేశాలలో దాని సూత్రాలను ఉపయోగించాలా లేదా ఎలా ఉపయోగించాలి అనేది ఆయా దేశాల వారు నిర్ణయించాల్సిన విషయం.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని స్థాపించడంలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి? నైతిక స్వేచ్ఛ యొక్క సిద్ధాంతంలో మనం దానిని చూడవచ్చు. పునఃస్థాపించబడిన సంఘము యొక్క మొదటి దశాబ్దంలో, పశ్చిమ సరిహద్దులోని కడవరి-దిన పరిశుద్ధులు ఏకాంత మరియు బహిరంగ హింసకు గురయ్యారు. కొంతవరకు దీనికి కారణం, సంయుక్త రాష్ట్రాలలో అప్పుడు నెలకొని ఉన్న మానవ బానిసత్వం పట్ల వారి వ్యతిరేకత. ఈ పరిస్థితులలో, దేవుడు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా తన సిద్ధాంతం గురించి నిత్య సత్యాలను వెల్లడించెను.
దేవుడు తన పిల్లలకు నైతిక స్వతంత్రతను—నిర్ణయించుకొనే మరియు చర్యతీసుకొనే శక్తిని ఇచ్చాడు. ఆ స్వతంత్రత యొక్క అభ్యాసానికి మిక్కిలి కోరదగిన పరిస్థితి ఏమనగా స్త్రీ పురుషులు వారి ఎంపికల ప్రకారం నిర్ణయించడానికి మరియు పనిచేయడానికి గరిష్ట స్వేచ్ఛ కలిగియుండటం. అప్పుడు, “తీర్పుదినమందు ప్రతి మనుష్యుడు తన పాపములకు లెక్క అప్పగించవలసియుండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 101: 78) అని బయల్పాటు వివరిస్తుంది. “కాబట్టి, ఏ మనుష్యుడు మరొకనికి బానిసగానుండుట సరికాదు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 101: 79) అని ప్రభువు బయలుపరచారు. మానవ బానిసత్వం తప్పు అని దీని అర్థం. అదే సూత్రం ప్రకారం, పౌరులకు తమ పాలకుల ఎంపికలో లేదా వారి చట్టాలను రూపొందించడంలో ఎటువంటి పాత్ర లేకపోవడం తప్పని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
II.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం దైవికంగా ప్రేరేపించబడిందనే మన నమ్మకం యొక్క అర్థం ప్రతి రాష్ట్రం నుండి ప్రతినిధుల సంఖ్యను లేదా ప్రతి కనీస వయస్సును కేటాయించే నిబంధనలు వంటి ప్రతి పదం మరియు పదబంధాన్ని దైవిక బయల్పాటు నిర్దేశిస్తుందని కాదు.2 రాజ్యాంగం “పూర్తిగా అభివృద్ధి చెందిన పత్రం కాదు” అని అధ్యక్షులు జె. రూబెన్ క్లార్క్ అన్నారు. “దీనికి విరుద్ధంగా, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం యొక్క మారుతున్న అవసరాలను తీర్చడానికి ఇది పెరగాలని మరియు అభివృద్ధి చెందాలని మేము నమ్ముతున్నాము”3 అని ఆయన వివరించారు. ఉదాహరణకు, ప్రేరేపిత సవరణలు బానిసత్వాన్ని రద్దు చేశాయి మరియు మహిళలకు ఓటు హక్కును ఇచ్చాయి. ఏదేమైనా, రాజ్యాంగాన్ని వివరించే ప్రతి సుప్రీంకోర్టు తీర్పులో మనకు ప్రేరణ కనిపించదు.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంలో కనీసం ఐదు దైవిక ప్రేరేపిత సూత్రాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను.4
మొదటి సూత్రమేమనగా ప్రభుత్వ అధికారం యొక్క మూలం ప్రజలే. సార్వభౌమాధికారం సార్వత్రికంగా రాజుల దైవిక హక్కు నుండి లేదా సైనిక శక్తి నుండి వచ్చిందని భావించిన కాలంలో, ప్రజలకు సార్వభౌమ శక్తిని ఆపాదించడం విప్లవాత్మకమైనది. తత్వవేత్తలు దీనిని సమర్థించారు, కానీ సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం దీనిని మొదట వర్తింపజేసింది. ప్రజలలో సార్వభౌమాధికారం అంటే ప్రభుత్వ చర్యలను బెదిరించడానికి లేదా బలవంతం చేయడానికి అల్లరి మూకలు లేదా ఇతర సమూహాలు జోక్యం చేసుకోగలవని అర్థం కాదు. అమెరికా రాజ్యాంగం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించింది, ఇక్కడ ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా తమ అధికారాన్ని వినియోగించుకుంటారు.
రెండవ ప్రేరేపిత సూత్రమేమనగా దేశం మరియు దాని అనుబంధ రాష్ట్రాల మధ్య అధికార విభజన. మన సమాఖ్య వ్యవస్థలో, ఈ అపూర్వమైన సూత్రం కొన్నిసార్లు బానిసత్వాన్ని రద్దు చేయడం మరియు మహిళలకు ఓటు హక్కును విస్తరించడం వంటి ప్రేరేపిత సవరణల ద్వారా మార్చబడింది. విశేషమేమిటంటే, సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం జాతీయ ప్రభుత్వాన్ని స్పష్టంగా లేదా సూత్రప్రాయంగా మంజూరు చేసిన అధికారాలకు పరిమితం చేస్తుంది మరియు ఇది అన్ని ఇతర ప్రభుత్వ అధికారాలను “ఆయా రాష్ట్రాలకు లేదా ప్రజలకు”5 కేటాయిస్తుంది.
మరొక ప్రేరేపిత సూత్రమేమనగా, అధికారాల విభజన. 1787 రాజ్యాంగ సదస్సుకు ఒక శతాబ్దం ముందు, ఇంగ్లీష్ పార్లమెంటు వారు రాజు నుండి కొన్ని అధికారాలను స్వాధీనం చేసుకున్నప్పుడు శాసన మరియు కార్యనిర్వాహక అధికారాన్ని వేరు చేయడానికి ముందుకు వచ్చారు. అమెరికా సదస్సులో కలిగిన ప్రేరణ స్వతంత్ర కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయ అధికారాలను అప్పగించడం కాబట్టి ఈ మూడు శాఖలు ఒకదానిపై ఒకటి తనిఖీ చేయగలవు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మూడు సంవత్సరాల తరువాత స్వీకరించబడిన హక్కుల బిల్లులో వ్యక్తిగత హక్కులు మరియు ప్రభుత్వ అధికారంపై నిర్దిష్ట పరిమితుల యొక్క ముఖ్యమైన హామీల సమూహంలో నాల్గవ ప్రేరేపిత సూత్రం ఉంది. హక్కుల బిల్లు కొత్తది కాదు. ఇక్కడ, మాగ్నా కార్టాతో ప్రారంభించి, ఇంగ్లాండ్‌లో మార్గదర్శక సూత్రాల ఆచరణాత్మక అమలులో ఈ ప్రేరేపణ కలిగింది. రాజ్యాంగ రచయితలు వీటితో సుపరిచితులు, ఎందుకంటే కొన్ని వలసరాజ్యాల అధికారపత్రములో అలాంటి హామీలు ఉన్నాయి.
హక్కుల బిల్లు లేకుండా, కేవలం మూడు దశాబ్దాల తరువాత ప్రారంభమైన సువార్త పునఃస్థాపనకు అమెరికా ఆతిథ్య దేశంగా పనిచేసి ఉండేది కాదు. ప్రభుత్వ కార్యాలయానికి6 మతపరమైన పరీక్షలు ఉండకూడదనే అసలు నిబంధనలో దైవిక ప్రేరణ ఉంది, కానీ మొదటి సవరణలో మత స్వేచ్ఛ మరియు ప్రభుత్వానికి ఏ మతము ఉండకూడదనే హామీలు చాలా ముఖ్యమైనవి. మొదటి సవరణ వాక్ మరియు పత్రికా స్వాతంత్య్రంలో మరియు నేరస్తుల విచారణ వంటి ఇతర సవరణలలో పొందుపరచబడిన వ్యక్తిగత రక్షణలలో కూడా మనము దైవిక ప్రేరణను చూస్తాము.
ఐదవది మరియు చివరిది, మొత్తం రాజ్యాంగం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యంలో నేను దైవిక ప్రేరణను చూస్తున్నాను. మనము చట్టం చేత పరిపాలించబడాలి, కానీ వ్యక్తులచేత కాదు మరియు మన విధేయతను రాజ్యాంగం, దాని సూత్రాలు మరియు ప్రక్రియల పట్ల చూపాలి, కానీ ఏ స్థానాన్ని కలిగియున్న వారి పట్ల కాదు. ఈ విధంగా, చట్టం ముందు వ్యక్తులందరు సమానంగా ఉండాలి. ఈ సూత్రాలు కొన్ని దేశాలలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన నిరంకుశ ఆశయాలను వ్యతిరేకిస్తాయి. ప్రభుత్వంలోని మూడు శాఖలలో ఏదీ మరొక దానిపై ఆధిపత్యం వహించకూడదని లేదా ఒక దానిపై మరొకటి తనిఖీ చేసుకోవడానికి వాటి సరైన రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా మిగిలిన శాఖలు నిరోధించకూడదని కూడా దాని అర్థం.
III.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగంలో దైవిక ప్రేరేపిత సూత్రాలు ఉన్నప్పటికీ, అసంపూర్ణ మానవులచే ఉపయోగించబడినప్పుడు వాటి కొరకు ఉద్దేశించిన ప్రభావాలు ఎల్లప్పుడూ సాధించబడలేదు. చట్టాన్ని రూపొందించే ముఖ్యమైన విషయాలు, అనగా కుటుంబ సంబంధాలను నియంత్రించే కొన్ని చట్టాల వంటివాటిని సమాఖ్య ప్రభుత్వం రాష్ట్రాల నుండి తీసుకుంది. వాక్ స్వాతంత్య్రం యొక్క మొదటి సవరణ హామీ కొన్నిసార్లు జనాదరణ లేని ప్రసంగాన్ని అణచివేయడం ద్వారా బలహీనపరచబడుతుంది. మరొక శాఖకు అప్పగించబడిన అధికారాలను ప్రయోగించి లేదా ఆటంకపరచే ప్రభుత్వంలోని ఒక శాఖ యొక్క ప్రభావాల వలన అధికారాల విభజన యొక్క సూత్రం ఎల్లప్పుడూ ఒత్తిడికి లోనవుతుంది.
సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం యొక్క ప్రేరేపిత సూత్రాలను బలహీనపరిచే ఇతర బెదిరింపులు ఉన్నాయి. స్వేచ్ఛ మరియు స్వపరిపాలనకు బదులుగా ప్రస్తుత సామాజిక పోకడలను దాని స్థాపనకు ప్రత్యామ్నాయంగా మార్చడానికి చేసిన ప్రయత్నాల వల్ల రాజ్యాంగం యొక్క స్థితి క్షీణిస్తుంది. రాజ్యాంగం యొక్క సూత్రాలను విస్మరించే అభ్యర్థులు లేదా అధికారులు దాని అధికారాన్ని అల్పమైనదిగా చేస్తారు. అధికారమివ్వడానికి మరియు ప్రభుత్వ అధికారం కోసం పరిమితులు నియమించడానికి మూలాధారాముగా రాజ్యాంగం యొక్క ఉన్నత స్థితిని తెలియజేయుటకు బదులు రాజ్యాంగం యొక్క గౌరవం మరియు శక్తిని విశ్వసనీయ పరీక్ష లేదా రాజకీయ నినాదం వలె సూచించేవారు దానిని కించపరుస్తారు.
IV.
దైవిక ప్రేరణపై మన నమ్మకం సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగాన్ని మరియు మనం ఎక్కడ నివసిస్తున్నా రాజ్యాంగ సూత్రాలను సమర్థించడానికి మరియు రక్షించడానికి కడవరి-దిన పరిశుద్ధులకు ఒక ప్రత్యేకమైన బాధ్యతను ఇస్తుంది మనము ప్రభువుపై నమ్మకం ఉంచాలి మరియు ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలి.
నమ్మకమైన కడవరి-దిన పరిశుద్ధులు ఇంకా ఏమి చేయాలి? అన్ని దేశాలకు మరియు వారి నాయకులకు మార్గనిర్దేశం చేసి ఆశీర్వదించమని ప్రభువును ప్రార్థించాలి. ఇది మన విశ్వాస ప్రమాణాలలో భాగం. అధ్యక్షులు లేదా పాలకులకు లోబడి ఉండడం7 మన వ్యక్తిగత చట్టాలు లేదా విధానాలను వ్యతిరేకించడానికి ఎటువంటి అడ్డంకి కాదు. మన రాజ్యాంగాలు మరియు వర్తించే చట్టాల చట్రంలో, మన ప్రభావాన్ని పౌరపరంగా మరియు శాంతియుతంగా ఉపయోగించాలని దీని అర్థం. వివాదాస్పద సమస్యలపై, మనము మితంగా మరియు ఏకీకృతం చేయడానికి ప్రయత్నించాలి.
ప్రేరేపిత రాజ్యాంగాన్ని సమర్థించడంలో భాగంగా ఇతర విధులు ఉన్నాయి. మనము రాజ్యాంగంలోని ప్రేరేపిత సూత్రాలను నేర్చుకోవాలి మరియు సమర్థించాలి. వారి బహిరంగ చర్యలలో ఆ సూత్రాలకు మద్దతు ఇచ్చే తెలివైన మరియు మంచి వ్యక్తులను మనము వెతకాలి మరియు మద్దతు ఇవ్వాలి.8 పౌర వ్యవహారాలలో మన ప్రభావాన్ని కలిగించడంలో చురుకుగా ఉండే పరిజ్ఞానం గల పౌరులుగా మనం ఉండాలి.
సంయుక్త రాష్ట్రాలు మరియు ఇతర ప్రజాస్వామ్య దేశాలలో ప్రస్తుత పరిస్థితులలో ఓటింగ్ ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా, రాజకీయ పార్టీలలో సభ్యత్వం మరియు సేవ ద్వారా, అధికారులు, పార్టీలు మరియు అభ్యర్థులతో సంభాషణల ద్వారా కార్యాలయానికి పోటీ చేయడం (దానిని మేము ప్రోత్సహిస్తున్నాము) చేత రాజకీయ ప్రభావం అభ్యసించబడుతున్నది. బాగా పనిచేయడానికి ప్రజాస్వామ్యానికి ఇవన్నీ అవసరం, కానీ మనస్సాక్షి ఉన్న ఏ ఒక్క పౌరుడు ఇవన్నీ సమకూర్చవలసిన అవసరం లేదు.
అనేక రాజకీయ సమస్యలు ఉన్నాయి మరియు ఏ పార్టీ, ఏ వేదిక, ఏ వ్యక్తిగత అభ్యర్థి కూడా వ్యక్తిగత ప్రాధాన్యతలన్నింటిని సంతృప్తిపరచలేరు. అందువల్ల ప్రతి పౌరుడు ఏ సమయంలోనైనా అతనికి లేదా ఆమెకు ఏ సమస్యలు చాలా ముఖ్యమైనవో నిర్ణయించుకోవాలి. అప్పుడు, సభ్యులు తమ వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వారి ప్రభావాన్ని ఎలా అభ్యసించాలి అనే దానిపై ప్రేరణ పొందాలి. ఈ ప్రక్రియ సులభంగా ఉండదు. ప్రతి ఎన్నికలకు పార్టీ మద్దతు లేదా అభ్యర్థి ఎంపికలు మారడం దీనికి అవసరం కావచ్చు.
ఈ వ్యక్తిగత చర్యల మూలంగా కొన్నిసార్లు ఓటర్లు వారు ఆమోదించలేని అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు లేదా వేదికలకు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది.9 రాజకీయ విషయాలలో ఒకరినొకరు తీర్పుతీర్చవద్దని మన సభ్యులను మేము ప్రోత్సహించడానికి ఇది ఒక కారణం. నమ్మకమైన కడవరి-దిన పరిశుద్ధుడు ఒక నిర్దిష్ట పార్టీకి చెందినవాడు కాదని లేదా ఒక నిర్దిష్ట అభ్యర్థికి ఓటు వేయలేడని మనము ఎప్పుడూ నొక్కి చెప్పకూడదు. మనము సరైన సూత్రాలను బోధిస్తాము మరియు ఎప్పటికప్పుడు కలిగే సమస్యలపై ఆ సూత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో మరియు వర్తింపజేయాలో ఎంచుకోవడానికి మన సభ్యులకు అవకాశమిస్తాము. రాజకీయ ఎంపికలు మరియు అనుబంధాలు మన సంఘ కూడికలలో బోధనలకు లేదా న్యాయవాదానికి సంబంధించినవి కావు అని మనము నొక్కిచెప్తున్నాము మరియు మన స్థానిక నాయకులను నొక్కిచెప్పమని కోరుచున్నాము.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము, మతం యొక్క స్వేచ్ఛకు లేదా సంఘ సంస్థల యొక్క ముఖ్యమైన ప్రయోజనాలకు విరుద్ధంగా మనము భావించే నిర్దిష్ట శాసన ప్రతిపాదనలను ఆమోదించే లేదా వ్యతిరేకించే హక్కును ఉపయోగించుకుంటుంది.
సంయుక్త రాష్ట్రాల యొక్క దైవిక ప్రేరేపిత రాజ్యాంగము గురించి నేను సాక్ష్యమిస్తున్నాను మరియు దానిని ప్రేరేపించిన దివ్యమైన వ్యక్తిని గుర్తించిన మనము దాని గొప్ప సూత్రాలను ఎల్లప్పుడూ సమర్థించాలని, కాపాడాలని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.