సర్వసభ్య సమావేశము
సత్రములో స్థలము
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:45

సత్రములో స్థలము

తన సత్రమును (ఆయన సంఘము) అందరికీ ఆశ్రయదుర్గముగా చేయడానికి యేసు క్రీస్తు వలె మంచి సమరయునిగా మారాలని ఆయన మనలను ఈ ఈస్టర్ సమయములో ఆహ్వానిస్తున్నారు.

ప్రియమైన సహోదర సహోదరీలారా, 20 సంవత్సరాల క్రితం మా నాన్న మరణించినప్పటికీ, ఆయనను చూడాలని అనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేను ఆయనను మళ్ళీ చూస్తానని ఈస్టర్ వాగ్దానం చేస్తుంది.

నేను ఇంగ్లాండ్‌లోని స్నాతకోత్తర కళాశాలలో ఉన్నప్పుడు, నాన్న నన్ను చూడడానికి వచ్చారు. నేను ఇంటిపై బెంగ పెట్టుకున్నానని ఆయన తండ్రి హృదయానికి తెలుసు.

నాన్నకు ఆహార విషయంలో తప్ప మిగిలిన అన్నింటిలో సాహసం చేయడం అంటే ఇష్టం. వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాన్స్‌లో కూడా, “చైనీస్ ఆహారాన్ని తీసుకుందాం” అని అంటారాయన. సంఘములో సుదీర్ఘకాలం పనిచేసిన గోత్రజనకుడైన మా నాన్న ఆధ్యాత్మికమైనవారు, దయగలవారు. ఒక రాత్రి, పారిస్ గుండా పెద్ద సైరన్లతో కూడిన అత్యవసర వాహనాలు వెళ్తున్నప్పుడు, “గెరిట్, ఆ ఏడుపులు ఒక నగరం యొక్క గాయాలు” అని చెప్పారు.

ఆ పర్యటనలో, నేను ఇతర ఏడుపులు మరియు గాయాలను అనుభవించాను. ఒక యువతి చిన్న తోపుడుబండిలో ఐస్‌క్రీం అమ్ముతున్నది. ఆమె ఐస్‌క్రీమ్ కప్పులు ఒక గరిటెడు మాత్రమే పట్టేంత పరిమాణంలో ఉన్నాయి. ఏదో కారణం వలన ఒక భారీకాయుడు ఆ యువతితో గొడవపడ్డాడు. అరుస్తూ, ఆమెను నెట్టుతూ అతడు ఆమె బండిపై పడి, ఆమె ఐస్‌క్రీం కప్పులను చెల్లాచెదురు చేసాడు. అతడు తన బూట్లతో ఆ కప్పులను చూర్ణం చేస్తుండగా నేనేమీ చేయలేకపోయాను. విరిగిన కప్పుల ముక్కలను కాపాడడానికి ప్రయత్నిస్తూ వీధిలో మోకాళ్ళపై ఉన్న యువతిని, ఆమె ముఖం మీద వేదనతో కన్నీళ్ళు ప్రవహించడాన్ని నేను ఇప్పటికీ చూడగలను. ఆమె రూపం నన్ను వెంటాడుతోంది, నిర్దయగా, పట్టించుకోకుండా ఉండటం, మనం తరచుగా ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడాన్ని అది గుర్తుచేస్తుంది.

మరొక మధ్యాహ్నం, పారిస్ సమీపంలో మా నాన్న, నేను చార్ట్రెస్ వద్ద ఉన్న గొప్ప క్రైస్తవ ప్రార్థనాలయాన్ని సందర్శించాము. క్రైస్తవ ప్రార్థనాలయాలలో ప్రపంచ నిపుణుడైన మాల్కం మిల్లెర్1 మూడు జతల చార్ట్రెస్ అద్దకపు గాజు కిటికీలను ఎత్తి చూపాడు. అవి ఒక కథ చెబుతాయని అతడు అన్నాడు.

మొదటి కిటికీల జత ఆదాము మరియు హవ్వ ఏదేను తోటను విడిచి వెళ్ళినట్లు చూపిస్తాయి.

రెండవ కిటికీల జత మంచి సమరయుని ఉపమానమును వివరిస్తాయి.

మూడవ కిటికీల జత ప్రభువు యొక్క రెండవ రాకడను వర్ణిస్తాయి.

వీటన్నిటిని కలిపి చూస్తే, ఈ అద్దకపు గాజు కిటికీలు మన నిత్య ప్రయాణాన్ని వివరించగలవు. ఆయన సత్రములో స్థలమున్నదని అందరినీ స్వాగతించమని అవి మనల్ని ఆహ్వానిస్తాయి.2

చార్ట్రెస్ క్రైస్తవ ప్రార్థనాలయం వద్ద కిటికీ

iStock.com/digitalimagination

ఆదాము హవ్వల మాదిరిగానే, మనము ముండ్ల తుప్పలు, గచ్చపొదలు3 గల ప్రపంచంలోకి వచ్చాము.

చార్ట్రెస్ క్రైస్తవ ప్రార్థనాలయం వద్ద కిటికీ

iStock.com/digitalimagination

యెరికోకు పోవు దుమ్ము ధూళిగల మన రహదారిలో మనము దాడిచేయబడ్డాము, గాయపడ్డాము మరియు బాధతో విడువబడ్డాము.4

మనము ఒకరికొకరం సహాయం చేసుకోవలసి ఉన్నప్పటికీ, చాలా తరచుగా మనం ఏదో ఒక కారణం చేత రహదారికి అవతలి వైపుకు వెళ్తాము.

అయితే, కరుణతో మంచి సమరయుడు నూనెయు ద్రాక్షారసమును పోసి మన గాయములను కట్టును. సంస్కారము మరియు ఇతర విధుల చిహ్నాలు, ద్రాక్షారసం మరియు నూనె యేసు క్రీస్తులో ఆత్మీయ స్వస్థతను మనకు సూచిస్తాయి.5 మంచి సమరయుడు మనలను తన సొంత గాడిదపై ఉంచును లేదా కొన్ని అద్దకపు గాజు వృత్తాంతాలలో చెప్పబడినట్లుగా, మనలను అతని భుజాలపై మోయును. ఆయన మనలను సత్రానికి తీసుకొని వచ్చును, అది ఆయన సంఘమును, మన సంఘమును సూచించును. “ఇతని పరామర్శించుము. … నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదను”6 అని సత్రము వద్ద మంచి సమరయుడు చెప్పును. మన రక్షకుని యొక్క చిహ్నమైన మంచి సమరయుడు ఈసారి ఘనత మరియు మహిమతో తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు.

చార్ట్రెస్ క్రైస్తవ ప్రార్థనాలయం వద్ద కిటికీ

iStock.com/digitalimagination

ఈ ఈస్టర్ సమయంలో, తనలాగే మంచి సమరయునిగా మారాలని, తన సత్రము (ఆయన సంఘము)ను జీవితపు గాయాలు మరియు తుఫానుల నుండి అందరికీ ఆశ్రయంగా చేయమని యేసు క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నారు.7 ఆయనకు చేసినట్లుగానే ప్రతిరోజూ “మిక్కిలి అల్పులైన”8 వీరికి చేసినప్పుడు ఆయన వాగ్దానం చేసిన రెండవ రాకడ కోసం మనము సిద్ధపడతాము. “మిక్కిలి అల్పులు” ఎవరనగా మనలో ప్రతి ఒక్కరూ.

మనము మంచి సమరయునితో సత్రానికి వస్తున్నప్పుడు, యేసు క్రీస్తు గురించి మరియు మన గురించి ఐదు విషయాలు నేర్చుకుంటాము.

మొదటిది, మనలో ఉన్న లోపాలు మరియు బలహీనలతో మనం ఉన్నట్లుగానే సత్రానికి వస్తాము. అయినప్పటికీ, సహకారం అందించడానికి మనందరికీ ఏదో ఒకటి అవసరం. ఇతర వ్యక్తులతో ఏర్పరచుకొను సంబంధాల ద్వారా మనం తరచూ దేవుని యొద్దకు తిరిగి వెళ్తాము. మహమ్మారులు, తుఫానులు, కార్చిచ్చు, కరువులను ఎదుర్కోవడానికి లేదా రోజువారీ అవసరాలను నిశ్శబ్దంగా తీర్చడానికి మనం ఐక్య సమాజానికి చెందియున్నాము. మనము కలిసి ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సహోదరీతో సహా ప్రతి స్వరాన్ని మరియు ఆత్మను వింటున్నప్పుడు మనము ప్రేరణ పొందుతాము.

మన హృదయాలు మారినప్పుడు మరియు మన ముఖంలో ఆయన స్వరూపాన్ని పొందినప్పుడు,9 మనం ఆయనను, మనల్ని ఆయన సంఘములో చూస్తాము. ఆయనలో, మనం స్పష్టతను కనుగొంటాము, కానీ వైరుధ్యాన్ని కాదు. ఆయనలో, మనం మంచి చేయడానికి కారణాన్ని, మంచిగా ఉండడానికి కారణాన్ని మరియు ఉత్తమముగా మారే సామర్థ్యం పెరగడాన్ని కనుగొంటాము. ఆయనలో, స్థిర విశ్వాసాన్ని, విముక్తిని కలిగించు నిస్వార్థతను, శ్రద్ధగల మార్పును మరియు దేవునిపై నమ్మకాన్ని కనుగొంటాము. ఆయన సత్రములో, మన తండ్రి అయిన దేవునితో మరియు యేసు క్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధాన్ని కనుగొని, దానిని బలపరుస్తాము.

సత్రాన్ని ఆయనకు అవసరమైన స్థలంగా మారుస్తామని ఆయన మనల్ని నమ్ముతాడు. మనము మన ప్రతిభలను మరియు ఉత్తమ ప్రయత్నాలను అందిస్తున్నప్పుడు, ఆయన ఆత్మ వరాలు 10 కూడా బలపరచి, ఆశీర్వదిస్తాయి.

ఒక స్పానిష్ భాషా వ్యాఖ్యాత నాతో ఇలా అన్నాడు, “ఎల్డర్ గాంగ్, “భాషలు మాట్లాడు వరము చేత” మీరు ఏమి చెప్పబోతున్నారో నాకు తెలుసు కాబట్టి నేను అనువదించగలను” అని ఈ నమ్మకమైన సహోదరుడు అన్నాడు.

విశ్వాసం మరియు అభయము యొక్క బహుమానాలు వచ్చి, వివిధ పరిస్థితులలో భిన్నంగా కనిపిస్తాయి. తన భర్త కోవిడ్-19 నుండి మరణించగా, ఒక ప్రియమైన సహోదరి ఆత్మీయంగా ఓదార్పును పొందింది. ఆమె ఇలా చెప్పింది, “ప్రియమైన నా భర్త, నేను మళ్ళీ కలిసి ఉంటామని నాకు తెలుసు.” మరొక కోవిడ్ పరిస్థితిలో, మరొక ప్రియమైన సహోదరి ఇలా చెప్పింది, “నా భర్తకు మరికొంత సమయం ఇవ్వమని నేను ప్రభువు మరియు వైద్యులను వేడుకోవాలని భావించాను.”

రెండవది, తన సత్రాన్ని దయ మరియు స్థలం ఉన్న ప్రదేశంగా మార్చమని ఆయన మనలను వేడుకుంటున్నాడు, అక్కడ ప్రతి ఒక్కరూ సమకూడవచ్చు, అక్కడ అందరికీ స్థలం ఉంటుంది. రెండవ తరగతి సమూహాలు లేకుండా యేసు క్రీస్తు శిష్యులుగా అందరూ సమానమే.

సంస్కార సమావేశాలు, ఇతర ఆదివార సమావేశాలు మరియు సామాజిక కార్యక్రమాలకు హాజరు కావడానికి అందరూ ఆహ్వానితులే.11 మనము మన రక్షకుడిని భక్తితో ఆరాధిస్తాము, ఒకరి మేలు కొరకు మరొకరు ఆలోచనాత్మకంగా ఉంటాము. మనము ప్రతి వ్యక్తిని చూసి, పలకరిస్తాము. మనము చిరునవ్వు నవ్వుతూ, ఒంటరిగా కూర్చున్న వారితో కూర్చుంటాము, క్రొత్తగా పరివర్తన చెందినవారు, తిరిగి వచ్చే సహోదర సహోదరీలు, యువతులు మరియు యువకులు, ప్రతి ప్రియమైన ప్రాథమిక బిడ్డ పేర్లు తెలుసుకుంటాము.

వారి స్థానంలో మనల్ని మనం ఊహించుకుంటూ స్నేహితులను, సందర్శకులను, ఆ ప్రాంతానికి క్రొత్తగా వచ్చిన వారిని, పలు బాధ్యతలు నిర్వహిస్తూ తీరికలేని వారిని మనం స్వాగతిస్తాము. మనము దుఃఖిస్తాము, సంతోషిస్తాము మరియు ఒకరికొకరు తోడుగా ఉంటాము. మనము మన ఆదర్శాలకు తగినట్లుగా లేనప్పుడు మరియు హడావిడిగా, తెలియకుండా, తీర్పుతీర్చేవారిగా లేదా పక్షపాతంతో ఉన్నప్పుడు, మనము ఒకరికొకరు క్షమాపణ అడిగి, మెరుగ్గా నడుచుకుంటాము.

ఆఫ్రికా నుండి వచ్చి, ఇప్పుడు అమెరిగా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్న ఒక కుటుంబం ఇలా చెప్పింది, “మొదటి రోజు నుండి కూడా సంఘ సభ్యులు స్నేహపూర్వకంగా మరియు స్వాగతించేవారిగా ఉన్నారు. ప్రతి ఒక్కరు మేము మా సొంత ఊర్లో ఉన్నట్లు భావించేలా చేసారు. మమ్మల్ని ఎవరూ తక్కువగా చూడలేదు.” ఆ తండ్రి ఇలా అన్నాడు, “సువార్త ఫలాలు సువార్త మూలాల నుండి వస్తాయని పవిత్ర బైబిల్ బోధిస్తుంది.” “మరియు సువార్తికులు, మా కొడుకు మరియు కూతురు ఆ సువార్తికుల మాదిరిగా ఎదగాలని మేము కోరుకుంటున్నాము“ అని ఆ తల్లి, తండ్రి చెప్పారు. సహోదర సహోదరీలారా, మనమందరం ఆయన సత్రానికి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం.

మూడవది, పరిపూర్ణత యేసు క్రీస్తులో ఉందని, ప్రపంచ పరిపూర్ణతలో లేదని ఆయన సత్రములో మనం నేర్చుకుంటాము. అవాస్తవ మరియు అవాస్తవికమైన ప్రపంచంలోని “ఇన్‌స్టాగ్రాం పరిపూర్ణత” అనే కల్పిత పరిపూర్ణతకు మనం అర్హులము కాదని, స్వైప్‌లు, ఇష్టాలు లేదా డబుల్ ట్యాప్‌ల ద్వారా నియంత్రించబడుతన్నామని మనకు అనిపించవచ్చు. దీనికి విరుద్ధంగా, మన గురించి మరెవరూ తెలుసుకోకూడదని మనం అనుకునే ప్రతిదీ మన రక్షకుడైన యేసు క్రీస్తుకు తెలుసు, అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారా సాధ్యము చేయబడి, రెండవ మరియు మూడవ అవకాశములిచ్చు సువార్త ఆయనది.12 ఆయన ఆజ్ఞలను పాటించడానికి మనం పూర్తిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మనం తక్కువ తీర్పుతీర్చువారిగా, మనల్ని మనం మరియు ఒకరినొకరం ఎక్కువ క్షమించువారిగా, మంచి సమరయునిగా ఉండాలని ఆయన మనలో ప్రతిఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు.

మనము ఒకరికొకరం సహాయపడేటప్పుడు మనకు మనం సహాయం చేసుకుంటాము. నాకు తెలిసిన ఒక కుటుంబం రద్దీగా ఉండే రహదారి సమీపంలో నివసించేది. ప్రయాణికులు సహాయం కొరకు తరచుగా అక్కడ ఆగేవారు. ఒక రోజు ఉదయాన్నే ఎవరో వారి ఇంటి తలుపులు గట్టిగా కొట్టడాన్ని ఆ కుటుంబం విన్నది. అలసిపోయి, తెల్లవారుజామున 2:00 గంటలకు ఎవరైయుంటారని ఆందోళన చెంది, ఈ ఒక్కసారికి ఎవరైనా సహాయం చేయకపోతారా అని వారు ఆశ్చర్యపోయారు. పట్టువిడవకుండా ఆ తలుపు కొట్టడం కొనసాగుతున్నప్పుడు, “మంటలు—మీ ఇంటి వెనుక మంటలు!” అని వారు ఒక స్వరాన్ని విన్నారు. మంచి సమరయులు ఒకరికొకరు సహాయపడతారు.

నాల్గవది, ఆయన సత్రములో, మనము యేసు క్రీస్తులో కేంద్రీకృతమై ఉన్న సువార్త సమాజంలో భాగమౌతాము, అది పునఃస్థాపించబడిన సత్యంలో, సజీవ ప్రవక్తలు మరియు అపొస్తలులలో, యేసుక్రీస్తు యొక్క మరొక నిబంధనయైన మోర్మన్ గ్రంథములో దృఢంగా స్థాపించబడినది. ఆయన మనలను తన సత్రానికి మరియు ఆయన ఇంటికి అనగా పవిత్ర దేవాలయానికి తీసుకువస్తాడు. యెరికోకు వెళ్ళే మార్గంలో గాయపడిన వ్యక్తి మాదిరిగానే, మంచి సమరయుడు మనలను శుభ్రపరచి, దుస్తులు ధరింపజేసి, దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మనల్ని సిద్ధం చేసి, దేవుని కుటుంబంతో శాశ్వతంగా మనలను ఏకం చేయగల ప్రదేశమే ప్రభువు మందిరము. ఆయన సువార్తను విశ్వాసంతో, విధేయతతో జీవించే వారందరి కొరకు ఆయన దేవాలయాలు తెరిచి ఉన్నాయి.

దేవాలయ ఆరాధనలో మనం అనుభవించు ఆనందం విభిన్న వారసత్వాలు, సంస్కృతులు, భాషలు మరియు తరాల మధ్య సువార్త ఐక్యతను కలిగి ఉంటుంది. టేలర్స్‌విల్ యూటా దేవాలయ శంకుస్థాపన సమయంలో, 17 ఏళ్ల మాక్స్ హార్కర్ తన ముత్తాతయైన జోసెఫ్ హార్కర్ మరియు అతని భార్య సుసన్నా స్నేత్ చేత ఆరు తరాల ముందు ప్రారంభమైన కుటుంబ విశ్వాసం యొక్క వారసత్వం గురించి పంచుకున్నారు. యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో, మనలో ప్రతి ఒక్కరం మన కుటుంబ తరాలను కలిపే బలమైన కొక్కెంగా మారవచ్చు.

చివరగా ఐదవది, దేవుడు తన సత్రములో అందరికీ స్థలమును కలిగియుండి, మన విభిన్న నేపథ్యాలలో మరియు పరిస్థితులలో అదే విధంగా ప్రతి జనములు, వంశములు, భాషలలో ఉన్న తన పిల్లలను ప్రేమిస్తున్నాడని మనము సంతోషిస్తాము.

గత 40 సంవత్సరాలకు పైగా, సంఘ సభ్యులు మరింత అంతర్జాతీయంగా మారారు. 1998 నుండి, సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడా లోపల కంటే ఎక్కువ మంది సంఘ సభ్యులు బయట దేశాలలో నివసించారు. 2025 నాటికి, సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో కంటే లాటిన్ అమెరికాలో ఎక్కువ మంది సంఘ సభ్యులు నివసించవచ్చని మేము ఊహిస్తున్నాము. తండ్రియైన లీహై యొక్క నమ్మకమైన వారసులను సమకూర్చుట అనేది నెరవేరుతున్న ప్రవచనము. అగ్రగాములు స్థిరపడిన ప్రాంతంతో పాటు నమ్మకమైన పరిశుద్ధులు ప్రపంచవ్యాప్త సంఘంలో భక్తికి, సేవకు మూలాధారముగా నిలిచారు.

అలాగే, వయోజన సంఘ సభ్యులలో ఎక్కువమంది ఇప్పుడు అవివాహితులు, వితంతువులు లేదా విడాకులు తీసుకున్నారు. ఇది విశేషమైన మార్పు. ఇందులో మన ఉపశమన సమాజ సహోదరీలలో సగానికి పైగా మరియు మన వయోజన యాజకత్వ సహోదరులలో సగానికి పైగా ఉన్నారు. ఈ జనాభా నమూనా 1992 నుండి ప్రపంచవ్యాప్త సంఘములోను మరియు 2019 నుండి సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలోని సంఘములోను ఉంది.

ప్రభువు ఎదుట మరియు ఆయన సంఘములో మన విజయము వైవాహిక స్థితికి సంబంధించినది కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క విశ్వసనీయమైన, శూరులైన శిష్యులు కావడానికి సంబంధించింది.13 పెద్దలు పెద్దలుగా కనబడాలని, బాధ్యతగా ఉండాలని మరియు పెద్దల వలె సహకరించాలని కోరుకుంటారు. ఆశీర్వదించడానికి మరియు సేవ చేయడానికి యేసు క్రీస్తు శిష్యులు ప్రతిచోటా, ప్రతి ఆకారం, పరిమాణం, రంగు, వయస్సుతో, ప్రతి ఒక్కరు విశ్వాసం, ధర్మబద్ధమైన కోరికలు, ప్రతిభలు మరియు అపారమైన సామర్థ్యాలతో వస్తారు. పశ్చాత్తాపం14 మరియు శాశ్వతమైన ఆనందానికి విశ్వాసంతో యేసు క్రీస్తును అనుసరించాలని మనము ప్రతిరోజూ ప్రయత్నిస్తాము.

ఈ జీవితంలో, మనము కొన్నిసార్లు ప్రభువు కొరకు వేచి ఉంటాము. భవిష్యత్తులో మనం ఆశించే మరియు కోరుకునే చోట మనం ఇంకా ఉండకపోవచ్చు. భక్తిగల ఒక సహోదరి ఇలా అన్నారు, “ప్రభువు ఆశీర్వాదం కోసం ఆయన కొరకు నమ్మకంగా వేచి ఉండడమంటే ఒక పవిత్ర స్థానంలో ఉండడమే. ఇది జాలి, అహంకారము లేదా తీర్పుతీర్చు వైఖరితో కాకుండా పవిత్ర గౌరవంతో చేయబడాలి.”15 ఈలోగా, మన జీవితాన్ని జీవిస్తామే కానీ మనం కోరుకునే జీవితం ప్రారంభమయ్యే వరకు వేచి ఉండము.

“యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు; వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు; అలయక పరుగెత్తుదురు; సొమ్మసిల్లక నడిచిపోవుదురు”16 అని యెషయా వాగ్దానము చేసాడు.

మంచి సమరయుడు తిరిగి వస్తానని హామీ ఇస్తున్నాడు. ఆయన నామమందు మనం ఒకరినొకరం సంరక్షించుకొన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనము విరిగిన హృదయాలతో మరియు నలిగిన ఆత్మలతో17 వచ్చినప్పుడు, మనం యేసు క్రీస్తులో స్వరాన్ని కనుగొనవచ్చు మరియు ఆయన అవగాహన అనే సురక్షితమైన చేతులలో చుట్టబడవచ్చు.18 పవిత్ర విధులు అంతర్గత ఉద్దేశ్యాన్ని మరియు బాహ్య చర్యను పవిత్రం చేయడానికి నిబంధనకు చెందేలా చేస్తాయి మరియు “దైవత్వం యొక్క శక్తిని”19 అందిస్తాయి. ఆయన ప్రేమ-దయ మరియు దీర్ఘశాంతముతో, ఆయన సంఘము మన సత్రం అవుతుంది.

మనము ఆయన సత్రములో స్థలమును సృష్టించి, అందరినీ ఆహ్వానించినప్పుడు, మన మంచి సమరయుడు దుమ్ముధూళితో నిండిన మన మర్త్య రహదారులపై మనల్ని స్వస్థపరచగలడు. పరిపూర్ణ ప్రేమతో, మన తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు “ఈ లోకములో శాంతిని, రాబోవు లోకములో నిత్యజీవమును”20 తద్వారా “నేనెక్కడ యుందునో మీరును అక్కడ ఉందురు“21 అని వాగ్దానం చేస్తున్నారు. ఈ విధంగా నేను కృతజ్ఞతతో సాక్ష్యమిస్తున్నాను మరియు యేసు క్రీస్తు పవిత్రమైన మరియు పరిశుద్ధమైన నామంలో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.