సర్వసభ్య సమావేశము
మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


12:45

మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?

మన పరలోక తండ్రి ప్రణాళికలో పేర్కొన్న గమ్యం వైపు మర్త్యత్వము ద్వారా మన ప్రయాణానికి అవసరమైన ప్రతిదాన్ని యేసు క్రీస్తు చేసారు.

చాలా సంవత్సరాల క్రితం ఒక స్టేకు సమావేశంలో శనివారం సాయంత్రం జరిగిన కూడికలో, నేను ఒక మహిళను కలుసుకున్నాను, సంఘములో చాలా సంవత్సరాల నిష్క్రియాత్మకత తరువాత ఆమె స్నేహితులు ఆమెను తిరిగి సంఘానికి రమ్మని కోరారని, కానీ ఆమె ఎందుకు అలా చేయాలో ఆమెకు అర్థం కాలేదని ఆమె చెప్పింది. ఆమెను ప్రోత్సహించడానికి నేను ఇలా చెప్పాను, “రక్షకుడు మీ కోసం చేసిన పనులన్నింటినీ మీరు పరిగణించినప్పుడు, ఆయనను ఆరాధించడానికి మరియు సేవ చేయడానికి తిరిగి రావడానికి మీకు చాలా కారణాలు ఉంటాయి.” “ఆయన నా కోసం ఏమి చేసారు?” అని ఆమె అన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

రెండవ రాకడ

మనలో ప్రతీ ఒక్కరి కోసం యేసు క్రీస్తు ఏమి చేసారు? మన పరలోక తండ్రి ప్రణాళికలో పేర్కొన్న గమ్యం వైపు మర్త్యత్వము ద్వారా మన ప్రయాణానికి అవసరమైన ప్రతిదాన్ని ఆయన చేసారు. నేను ఆ ప్రణాళిక యొక్క నాలుగు ప్రధాన లక్షణాల గురించి మాట్లాడతాను. వీటిలో ప్రతి ఒక్క దానిలో, ఆయన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ముఖ్యమైన వ్యక్తి. దీనంతటిని ప్రోత్సహించేది “దేవుని ప్రేమయై యున్నది, అది తననుతాను నరుల సంతానము యొక్క హృదయముల యందు చిందించుకొనుచున్నది; అందువలన, అది అన్ని వస్తువులను మించి మిక్కిలి కోరదగినది” (1 నీఫై 11:22).

I.

ఈస్టర్ ఆదివారానికి ముందు, మొదట యేసు క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడటం సమంజసం. మృతుల నుండి పునరుత్థానం చెందడం మన విశ్వాసం యొక్క అభయమిచ్చు వ్యక్తిగత స్తంభం వంటిది. ఇది మన సిద్ధాంతానికి అర్థాన్ని, మన ప్రవర్తనకు ప్రేరణను, మన భవిష్యత్తు కోసం నిరీక్షణను జోడిస్తుంది.

యేసు క్రీస్తు యొక్క యథాతథమైన పునరుత్థానం గురించి బైబిల్ మరియు మోర్మన్ గ్రంథ వర్ణనలను మనము విశ్వసిస్తున్నందున, ఈ భూమిపై ఇప్పటివరకు నివసించిన మానవులందరికీ ఇలాంటి పునరుత్థానం వస్తుందని చెప్పే అనేక లేఖన బోధనలను కూడా మనము అంగీకరిస్తాము.1 యేసు బోధించినట్లు, “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు” (యోహాను 14:19). “మృతులు అక్షయులుగా లేపబడుదురు” మరియు “ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును” (1 కొరింథీయులు 15:52, 54) అని ఆయన అపొస్తలుడు బోధించాడు.

పునరుత్థానము

కానీ పునరుత్థానం అమర్త్యత్వం యొక్క ఈ హామీ కంటే ఎక్కువ ఇస్తుంది. ఇది మనం మర్త్య జీవితాన్ని చూసే విధానాన్ని మారుస్తుంది.

మనలో ప్రతి ఒక్కరూ మరియు మనం ప్రేమిస్తున్నవారు ఎదుర్కొంటున్న మర్త్యత్వపు సవాళ్ళను భరించే దృక్పథాన్ని మరియు శక్తిని పునరుత్థానం ఇస్తుంది. పుట్టినప్పుడు మనకున్న లేదా మర్త్య జీవితంలో పొందిన శారీరక, మానసిక లేదా భావోద్వేగ లోపాలను వీక్షించడానికి ఇది క్రొత్త మార్గాన్ని ఇస్తుంది. దుఃఖాలు, వైఫల్యాలు మరియు నిరాశలను భరించే శక్తిని ఇది ఇస్తుంది. మనలో ప్రతి ఒక్కరికి పునరుత్థాన అభయము ఉన్నందున, ఈ మర్త్య లోపాలు మరియు వ్యతిరేకతలు తాత్కాలికమేనని మనకు తెలుసు.

పునరుత్థానం మన మర్త్య జీవితాలలో దేవుని ఆజ్ఞలను పాటించటానికి శక్తివంతమైన ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. మనము మృతులలో నుండి లేచి, ప్రవచించబడిన మన తుది తీర్పుకు వెళ్ళినప్పుడు, పునరుత్థానం చెందిన జీవులకు వాగ్దానం చేయబడిన ఉత్తమమైన ఆశీర్వాదాలకు అర్హత పొందాలని మనము కోరుకుంటున్నాము.2

కుటుంబాలుగా మనం నిరంతరము జీవించగలము

అదనంగా, పునరుత్థానంలో మన కుటుంబ సభ్యులతో అనగా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు మరియు సంతానముతో ఉండటానికి అవకాశం ఉంటుంది అనే వాగ్దానం మర్త్యత్వములో మన కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ఒక శక్తివంతమైన ప్రోత్సాహముగా ఉన్నది. ఇది ఈ జీవితంలో ప్రేమతో కలిసి జీవించడానికి కూడా మనకు సహాయపడుతుంది మరియు ఇది మన ప్రియమైనవారి మరణంలో మనకు ఓదార్పునిస్తుంది. ఈ మర్త్య విభజనలు తాత్కాలికమేనని మనకు తెలుసు మరియు భవిష్యత్తులో సంతోషకరమైన పునఃకలయికలు, సహవాసాల కొరకు మనము ఎదురుచూస్తున్నాము. పునరుత్థానం మనకు నిరీక్షణను మరియు వేచియున్నప్పుడు సహనముగా ఉండటానికి శక్తిని అందిస్తుంది. అకాల మరణము అని పిలువబడే మరణముతో పాటు ఇది మన మరణాన్ని ఎదుర్కోవటానికి ధైర్యం మరియు గౌరవంతో కూడా మనలను సిద్ధం చేసింది.

పునరుత్థానం యొక్క ఈ ప్రభావాలన్నీ “యేసు క్రీస్తు నా కోసం ఏమి చేసారు?” అనే ప్రశ్నకు మొదటి సమాధానంలో భాగం.

II.

మనలో చాలా మందికి యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క ప్రధాన అర్ధం మన పాపాలు క్షమించబడే అవకాశం. ఆరాధనలో, మనము భక్తితో ఇలా పాడతాము:

తన విలువైన రక్తమును ఆయన ఉచితముగా చిందించెను;

తన ప్రాణాన్ని ఉచితముగా ఇచ్చెను,

దోషము కొరకు పాపరహిత త్యాగము,

మరణిస్తున్న లోకమును రక్షించుటకు చేసెను.3

పశ్చాత్తాపపడే మానవులందరి పాపాలకు బలిగా మారడానికి మన రక్షకుడు మరియు విమోచకుడు అపారమయిన బాధను భరించాడు. ఈ ప్రాయశ్చిత్త త్యాగము చివరకు ఉత్తమమైన దానిని ఇచ్చింది, మచ్చలేని స్వచ్ఛమైన గొర్రెపిల్ల మిక్కిలి ఎక్కువైన ఈ లోక పాపములన్నింటి కొరకు బలి ఇవ్వబడింది. మన వ్యక్తిగత పాపాలనుండి పరిశుద్ధపరచబడుటకు మనలో ప్రతి ఒక్కరికి ఇది అవకాశాన్ని ఇచ్చింది, తద్వారా మన నిత్య తండ్రి అయిన దేవుని సన్నిధికి మనం తిరిగి చేర్చబడవచ్చు. ఈ అవకాశము దేవుని పిల్లలందరికీ అందుబాటులో ఉంది. ఆరాధనలో మనము ఇలా పాడతాము:

ఆయన తన దివ్యమైన సింహాసనం నుండి దిగి వచ్చాడని నేను ఆశ్చర్యపోతున్నాను

నా వంటి అవిధేయమైన మరియు గర్వంగా ఉన్న ఆత్మను రక్షించడానికి,

ఆయన తన గొప్ప ప్రేమను నా వంటి వారికి విస్తరించాలని.4

యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతమైన మరియు అపారమయిన ప్రభావం మనలో ప్రతి ఒక్కరిపై దేవుడు కలిగియున్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. “ఆత్మల విలువ”—ప్రతి ఒక్కటి—”దేవుని దృష్టిలో గొప్పది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10) అని ఆయన చేసిన ప్రకటనను ఇది ధృవీకరిస్తుంది. బైబిల్‌లో, మన పరలోక తండ్రి ప్రేమ రూపంలో యేసు క్రీస్తు దీనిని వివరించారు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” ( యోహాను 3:16). ఆధునిక బయల్పాటులో మన విమోచకుడైన యేసు క్రీస్తు ఇలా ప్రకటించారు, ఆయన “లోకమును ఎంతగా ప్రేమించెననగా, నమ్మువారందరు దేవుని కుమారులగుటకు తన ప్రాణమును అర్పించెను” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 34:3).

“పరిపూర్ణుడు” అగుటకు మరియు “క్రీస్తులో పవిత్రపరచబడుటకు” మనము “[మన] పూర్ణ బలము, మనస్సు మరియు శక్తితో దేవుడిని ప్రేమించవలెను” అనే బోధతో “క్రీస్తు యొక్క మరొక నిబంధన” అయిన మోర్మన్ గ్రంథము ముగుస్తుండటం ఆశ్చర్యము కలిగించునా?” (మొరోనై 10:32-33). ప్రేమతో ప్రేరేపించబడిన ఆయన ప్రణాళిక ప్రేమతో స్వీకరించబడాలి.

III.

మన రక్షకుడైన యేసు క్రీస్తు మన కోసం ఇంకా ఏమి చేసారు? తన ప్రవక్తల బోధనల ద్వారా మరియు తన వ్యక్తిగత పరిచర్య ద్వారా యేసు మనకు రక్షణ ప్రణాళికను బోధించారు. ఈ ప్రణాళికలో సృష్టి, జీవిత ఉద్దేశ్యం, వ్యతిరేకత యొక్క అవసరం మరియు ఎన్నుకొనే స్వేచ్ఛావరము ఉన్నాయి. మన పరలోక తల్లిదండ్రుల వద్దకు మనల్ని తిరిగి తీసుకొనివెళ్ళడానికి మనం పాటించవలసిన ఆజ్ఞలు, నిబంధనలు మరియు మనం తప్పక పొందవలసిన విధులు కూడా ఆయన మనకు బోధించారు.

కొండమీది ప్రసంగము

బైబిల్‌లో మనం ఆయన బోధనను చదువుతాము, “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండును” (యోహాను 8:12). మరియు ఆధునిక బయల్పాటులో, “ఇదిగో, నేను యేసు క్రీస్తును… చీకటి యందు మరుగుపరచబడలేని ఒక వెలుగును” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 14:9) అని మనం చదువుతాము. మనము ఆయన బోధనలను అనుసరిస్తే, ఆయన ఈ జీవితంలో మన మార్గాన్ని వెలుగుతో నింపి, వచ్చే జీవితంలో మన గమ్యానికి అభయమిస్తారు.

ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున, ఈ మర్త్య ప్రపంచంలోని విషయాలపై కాకుండా ఆయనపై దృష్టి పెట్టమని ఆయన మనల్ని సవాలు చేస్తారు. జీవాహారముపై ఆయన చేసిన గొప్ప ఉపన్యాసంలో, ప్రపంచంలోని విషయాల పట్ల—అనగా భూమిపై జీవితాన్ని నిలబెట్టే విషయాలే కానీ నిత్యజీవానికి పోషణ ఇవ్వని వాటివైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే వారిలో మనం ఉండకూడదని యేసు బోధించారు.5 “నన్ను అనుసరించండి”6 అని యేసు మనల్ని పదే పదే ఆహ్వానించారు.

IV.

చివరగా, తన ప్రాయశ్చిత్తంలో భాగంగా యేసు క్రీస్తు “ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు సాగెను; తన జనుల బాధలను, రోగములను ఆయన తనపై తీసుకొనునని చెప్పిన వాక్యము నెరవేరుటకు ఇది జరుగును”( ఆల్మా 7:11) అని మోర్మన్ గ్రంథము బోధించుచున్నది.

మన రక్షకుడు “ప్రతి విధమైన” ఈ మర్త్య సవాళ్ళను ఎందుకు ఎదుర్కొన్నారు? ఆల్మా ఇలా వివరించెను, “మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండునట్లు, వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో (అనగా అర్థము ఉపశమనము లేదా సహాయమియ్యవలెనో) శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి బలహీనతలను తనపై తీసుకొనును” (ఆల్మా 7:12).

గెత్సేమనేలో క్రీస్తు

మన రక్షకునికి మన శోధనలు, మన శ్రమలు, మన హృదయ వేదనలు మరియు మన బాధలు తెలుసు, ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తంలో భాగంగా ఆయన వాటన్నింటినీ ఇష్టపూర్వకంగా అనుభవించారు. ఇతర లేఖనాలు దీనిని ధృవీకరించును. క్రొత్త నిబంధన ఇలా ప్రకటిస్తుంది, “తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు.” (హెబ్రీయులకు 2:18). యెషయా ఇలా బోధించెను, “నీకు తోడైయున్నాను భయపడకుము: … నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే” (యెషయా 41:10). ఎటువంటి మర్త్య బలహీనతలతో బాధపడుతున్నవారైనా మన రక్షకుడు ఆ రకమైన బాధను కూడా అనుభవించారని మరియు ఆయన ప్రాయశ్చిత్తం ద్వారా మనలో ప్రతి ఒక్కరికి దానిని భరించే శక్తిని ఇస్తారని గుర్తుంచుకోవాలి.

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ వీటన్నింటిని మన మూడవ విశ్వాస ప్రమాణంలో సంగ్రహించెను: “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సువార్త నియమములకు, విధులకు విధేయత చూపుట వలన మనుష్యజాతి యావత్తు రక్షింపబడునని మేము నమ్ముచున్నాము”.

“యేసు క్రీస్తు నా కోసం ఏమి చేసారు?” అని ఆ సహోదరి అడిగింది. మన పరలోకపు తండ్రి ప్రణాళిక ప్రకారం, ఆయన “పరలోకములను భూమిని సృష్టించెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు14:9) తద్వారా మనలో ప్రతి ఒక్కరికి మన దైవిక గమ్యాన్ని వెదకడానికి అవసరమైన మర్త్య అనుభవం లభిస్తుంది. తండ్రి ప్రణాళికలో భాగంగా, మనలో ప్రతి ఒక్కరికి అమర్త్యత్వాన్ని అభయమివ్వడానికి యేసు క్రీస్తు పునరుత్థానం మరణాన్ని జయించింది. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త త్యాగము మనలో ప్రతి ఒక్కరికి మన పాపాలకు పశ్చాత్తాపపడడానికి మరియు మన పరలోక గృహానికి పరిశుభ్రంగా తిరిగి రావడానికి అవకాశం ఇస్తుంది. ఆయన ఆజ్ఞలు మరియు నిబంధనలు మనకు మార్గాన్ని చూపుతాయి, మరియు ఆయన యాజకత్వం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన విధులు నిర్వహించే అధికారాన్ని ఇస్తుంది. మన బాధలన్నిటిలో ఏవిధంగా మనల్ని బలోపేతం చేయాలో తెలుసుకొనునట్లు మన రక్షకుడు అన్ని మర్త్య బాధలు మరియు బలహీనతలను ఇష్టపూర్వకంగా అనుభవించారు.

యేసు క్రీస్తు

యేసు క్రీస్తు ఇవన్నీ చేసారు, ఎందుకంటే ఆయన దేవుని పిల్లలందరినీ ప్రేమిస్తున్నారు. ప్రేమ అన్నింటికీ ప్రేరణ, మరియు అది మొదటి నుంచీ ఆవిధంగా ఉంది. ఆధునిక బయల్పాటులో దేవుడు మనకు ఇలా చెప్పారు, “ఆయన నరులను పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించెను … ఆయన స్వరూపమందు వారిని సృష్టించెను… ఆయనను ప్రేమించి, సేవించాలని వారికి ఆజ్ఞలనిచ్చెను” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 20:18–19).

వీటన్నిటికీ నేను సాక్ష్యమిస్తున్నాను మరియు మన రక్షకుడు మనలో ప్రతి ఒక్కరి కోసం ఏమి చేశారో మనమందరం గుర్తుంచుకుంటామని, మనమందరం ఆయనను ప్రేమించి, సేవ చేస్తామని ప్రార్థిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.