సర్వసభ్య సమావేశము
ఆవశ్యకమైన సంభాషణలు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:24

ఆవశ్యకమైన సంభాషణలు

మన పిల్లల్లో పరివర్తన దానంతటదే వచ్చేవరకు మనం వేచియుండలేము. ఆకస్మిక పరివర్తన అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క నియమము కాదు.

ప్రాథమికను “ప్రాథమిక” అని మనం ఎందుకు పిలుస్తామని మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? పిల్లలు వారి చిన్నతనంలో పొందే ఆత్మీయ జ్ఞానాన్ని ఈ పేరు సూచించినప్పటికీ, నాకు మాత్రం ఇది ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. మన పరలోక తండ్రికి పిల్లలు ఎన్నడూ రెండవ ప్రాధాన్యత కాదు—వారు ఎల్లప్పుడూ “మొదటి ప్రాధాన్యతగా” ఉన్నారు.1

వారిని దేవుని యొక్క పిల్లలుగా మనం విలువనిచ్చి, గౌరవించి, కాపాడతామని ఆయన నమ్ముతున్నారు. చికాకులు, ఒత్తిడులు అధికంగా ఉన్నప్పుడు కూడా మనం ఎన్నడూ శారీరకంగా, మాటలతో లేదా మానసికంగా ఏవిధంగాను వారికి హాని చేయమని దానర్థము. బదులుగా మనం పిల్లలకు విలువిస్తాము మరియు దూషణ యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవడానికి మనం చేయగలిగినదంతా చేస్తాము. ఆయన వలె—మనకు వారి సంరక్షణే ప్రధానమైనది.2

ఒక యౌవన తల్లి మరియు తండ్రి తమ వంటగది బల్ల దగ్గర కూర్చొని ఆ రోజు గురించి ఆలోచిస్తున్నారు. హాలు నుండి దబ్బుమని శబ్దం వినిపించింది. “ఏం జరిగింది?” అని తల్లి అడిగింది.

అప్పుడు వారు తమ నాలుగేళ్ళ కొడుకు పడకగది నుండి చిన్నగా ఏడుపు రావడం విన్నారు. వారు హాలుకు పరుగెత్తారు. అక్కడ అతడు మంచం ప్రక్కన నేలపై పడి ఉన్నాడు. తల్లి ఆ పిల్లవాడిని పైకి లేపి, ఏం జరిగిందని అడిగింది.

“నేను మంచం పైనుండి పడిపోయాను,” అన్నాడతడు.

“నువ్వు మంచం పైనుండి ఎందుకు పడ్డావు?” అని అన్నదామె.

అతడు భుజాలు ఎగరేస్తూ, “తెలియదు. నేను తగినంత దూరం చేరలేదేమో” అన్నాడు.

ఈ “తగినంత దూరం చేరడం” గురించే నేను ఈ ఉదయం మాట్లాడాలి అనుకుంటున్నాను. యేసు క్రీస్తు యొక్క సువార్తలో “తగినంత దూరం చేరడానికి” పిల్లలకు సహాయపడడం మన విశేషాధికారము మరియు బాధ్యత. దానిని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు.

పిల్లల జీవితాల్లో సాతాను ప్రభావం నుండి వారు రక్షింపబడేందుకు ప్రత్యేక సమయముంది. అది వారు అమాయకంగా, పాప-రహితంగా ఉన్న సమయం.3 అది తల్లిదండ్రులు, పిల్లల కొరకు పరిశుద్ధ సమయం. “దేవుని యెదుట లెక్క అప్పగించు వయస్సుకు సమీపించడానికి” ముందు మరియు తరువాత, మాట మరియు మాదిరి ద్వారా పిల్లలు బోధించబడాలి.4

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ బోధించారు: “చిన్నపిల్లలతో మనం గొప్ప అవకాశాన్ని కలిగియున్నాము. పిల్లలు వారి మర్త్య శత్రువు శోధనలను ఇంకా ఎదుర్కోగలిగే వయస్సులో మరియు వారి వ్యక్తిగత శ్రమల హోరులో సత్య వాక్యాలు వినడం వారికి కష్టము కాకముందే చిన్నప్పుడే వారికి బోధించడం మంచిది.”5 అటువంటి బోధన వారి దైవిక ఉనికిని, వారి ఉద్దేశ్యాన్ని మరియు నిబంధన బాట వెంబడి వారు పరిశుద్ధ నిబంధనలను చేసి, విధులను పొందినప్పుడు వారికోసం వేచియున్న ఘనమైన దీవెనలను గుర్తించడానికి వారికి సహాయపడుతుంది.

మన పిల్లల్లో పరివర్తన దానంతటదే వచ్చేవరకు మనం వేచియుండలేము. ఆకస్మిక పరివర్తన అనేది యేసు క్రీస్తు సువార్త యొక్క నియమము కాదు. రక్షకుని వలె కావడమనేది యాదృచ్ఛికంగా జరుగదు. ఉద్దేశపూర్వకంగా ప్రేమించడం, బోధించడం మరియు సాక్ష్యమివ్వడం, పిల్లలు చిన్నవయస్సులోనే పరిశుద్ధాత్మ ప్రభావాన్ని అనుభవించడానికి సహాయపడగలదు. మన పిల్లలు యేసు క్రీస్తు గురించి సాక్ష్యాన్ని పొందడానికి, పరివర్తన చెందడానికి పరిశుద్ధాత్మ ఆవశ్యకము; వారు “ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకము చేసుకోవాలని, తద్వారా వారు ఆయన ఆత్మను వారితో కలిగియుండాలని” మనం కోరుకుంటాము.6

కుటుంబ సంభాషణ

యేసు క్రీస్తు సువార్త గురించి కుటుంబ సంభాషణలు, ఆత్మను ఆహ్వానించగల ఆవశ్యకమైన సంభాషణల విలువను పరిగణించండి. మన పిల్లలతో మనం అటువంటి సంభాషణలు కలిగియున్నప్పుడు, “ఒక నిశ్చయమైన పునాది, ఆ పునాదిపై (వారు) కట్టబడిన యెడల ఎన్నటికీ వారు పడిపోని” ఒక పునాదిని నిర్మించడానికి మనం వారికి సహాయపడతాము.7 మనం ఒక బిడ్డను బలపరచినప్పుడు, మనం ఒక కుటుంబాన్ని బలపరుస్తాము.

ఈ ముఖ్యమైన చర్చలు పిల్లలను:

  • పశ్చాత్తాప సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి,

  • సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు యందు విశ్వాసం కలిగియుండడానికి,

  • ఎనిమిదేళ్ళ వయస్సులో బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మ వరమును ఎంచుకోవడానికి,8

  • ప్రార్థించడానికి, ప్రభువు యెదుట యధార్థముగా నడుచుకోవడానికి నడిపించగలవు.9

“కాబట్టి ఈ సంగతులను నిస్సంకోచముగా నీ పిల్లలకు బోధించమని నేను నీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను”10 అని రక్షకుడు చెప్పారు. అంత నిస్సంకోచంగా మనం ఏమి బోధించాలని ఆయన కోరారు?

  1. ఆదాము యొక్క పతనము

  2. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము

  3. మరలా జన్మించడం యొక్క ప్రాముఖ్యత11

“క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండమని, ఆత్మీయముగా మరలా జన్మించమని తమ పిల్లలకు బోధించి, శిక్షణనివ్వడాన్ని తల్లిదండ్రులు అశ్రద్ధ చేసినప్పుడు నిశ్చయంగా అపవాది సంతోషిస్తాడు,” అని ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్ చెప్పారు.12

దానికి బదులుగా, “మంచిని చేయుటకు నడిపించు ఆత్మయందు (వారి) నమ్మకముంచునట్లు పిల్లలకు మనం సహాయపడేలా రక్షకుడు చేస్తారు.13 అలా చేయడానికి, వారు ఎప్పుడు ఆత్మను అనుభవిస్తున్నారో గుర్తించడంలో మరియు ఎటువంటి చర్యలు ఆత్మ వీడిపోయేలా చేస్తాయో తెలుసుకోవడంలో మనం పిల్లలకు సహాయపడగలము. ఆవిధంగా వారు పశ్చాత్తాపపడడాన్ని నేర్చుకుంటారు మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా వెలుగుకు తిరిగివస్తారు. ఆత్మీయంగా స్వస్థపడడాన్ని ప్రోత్సహించడంలో ఇది సహాయపడుతుంది.

ఏ వయస్సులోనైనా ఆత్మీయంగా స్వస్థపడడానికి మన పిల్లలకు సహాయపడడంలో మనం సంతోషించగలము. అది సంక్లిష్టంగా లేదా అధిక సమయం తీసుకొనేలా ఉండనవసరం లేదు. సరళమైన, శ్రద్ధగల సంభాషణలు వారు ఏమి నమ్ముతున్నారో తెలుసుకోవడమే కాకుండా, ముఖ్యంగా వారు దానిని ఎందుకు నమ్ముతున్నారో పిల్లలు తెలుసుకొనేలా చేయగలవు. సహజంగా, నిలకడగా జరిగే శ్రద్ధగల సంభాషణలు బాగా అర్థం చేసుకోవడానికి మరియు జవాబులకు దారితీయగలవు. మన పిల్లలకు బోధించడం, వారిని వినడం మరియు వారి కళ్ళలోకి చూడడం నుండి మనల్ని నిరోధించేలా ఎలక్ట్రానిక్ పరికరాల సౌఖ్యాన్ని అనుమతించవద్దు.

తల్లి-కుమార్తెల సంభాషణ

ఆవశ్యకమైన సంభాషణల కొరకు అదనపు అవకాశాలు అభినయము ద్వారా సంభవించగలవు. ఒక చెడు ఎంపిక చేయడానికి శోధించబడడాన్ని లేదా ఒత్తిడికి లోనవడాన్ని కుటుంబ సభ్యులు అభినయించి చూపవచ్చు. సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో సిద్ధంగా ఉండేందుకు అటువంటి అభ్యాసము పిల్లలను బలపరచగలదు. ఉదాహరణకు, మనం దానిని అభినయించి, వారేమి చేస్తారని పిల్లల్ని అడుగుతూ దాని గురించి మాట్లాడవచ్చు:

  • జ్ఞానవాక్యాన్ని పాటించకుండా ఉండేందుకు వారు శోధించబడినట్లయితే.

  • అశ్లీల చిత్రాలు వారికి చూపబడినట్లయితే.

  • అబద్ధమాడేందుకు, దొంగిలించేందుకు లేదా మోసగించేందుకు వారు శోధించబడినట్లయితే.

  • వారి నమ్మకాలు లేదా విలువలతో విభేదించు దేనినైనా బడిలో స్నేహితుడు లేదా ఉపాధ్యాయుని నుండి వారు వినినట్లయితే.

వారు దానిని అభినయించి, దాని గురించి మాట్లాడినట్లయితే, ప్రతికూల స్నేహితులున్న సందర్భాలలో సిద్ధపడకుండా ఉండడానికి బదులు, పిల్లలు “విశ్వాసమను డాలును ధరించి, దానితో (వారు) దుష్టుని అగ్నిబాణములు అన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు కాగలరు.”14

ఒక సన్నిహిత స్నేహితుడు 18 ఏళ్ళ వయస్సులోనే ఈ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. అతడు, సంయుక్త రాష్ట్రాలు మరియు వియత్నాం మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సంయుక్త రాష్ట్రాల సైన్యంలో చేరాడు. పదాతిదళ సైనికుడయ్యేందుకు పదాతిదళంలో ప్రాథమిక శిక్షణకు అతడు నియమించబడ్డాడు. శిక్షణ చాలా కఠినంగా ఉందని అతడు వివరించాడు. అతని శిక్షకుడు కఠినమైనవాడు మరియు అతి క్రూరమైనవాడని అతడు వివరించాడు.

ఒకరోజు అతని పటాలము యుద్ధ సామానులన్నిటిని ధరించి, చాలా ఎండలో కొండలెక్కుతున్నారు. అకస్మాత్తుగా శిక్షకుడు అరుస్తూ నేలపై పడుకొని, కదలవద్దని ఆదేశించాడు. అతి చిన్న కదలికను కూడా శిక్షకుడు గమనిస్తున్నాడు. ఎటువంటి కదలిక అయినా తరువాత తీవ్రమైన పర్యవసానాలను ఇస్తుంది. వారి నాయకుని పట్ల పెరుతున్న కోపం మరియు విద్వేషంతో రెండు గంటలకంటే ఎక్కువసేపు పటాలము ఎండలో బాధపడ్డారు.

చాలా నెలల తర్వాత, మా స్నేహితుడు తన పటాలాన్ని వియత్నాం అడవుల గుండా తీసుకువెళ్తున్నాడు. ఇది శిక్షణ కాదు, వాస్తవము. చుట్టుప్రక్కలనున్న చెట్ల పైనుండి కాల్పలు వినిపించడం మొదలైంది. పటాలం మొత్తం వెంటనే నేలపై పడుకుంది.

శత్రువు దేనికోసం చూస్తున్నాడు? కదలిక. ఏ కొంచెం కదలిక అయినా వారిపై కాల్పులు జరుగుతాయి. అడవిలో నేలమీద కదలకుండా, చెమటోడుస్తూ పడుకొని చాలాసేపు చీకటిపడేందుకు ఎదురుచూస్తున్నప్పుడు, అతని ఆలోచనలు ప్రాథమిక శిక్షణపై ప్రతిబింబించాయని మా స్నేహితుడు చెప్పాడు. అతని శిక్షకుడి పట్ల తీవ్రమైన అయిష్టతను అతడు గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు—అతడు తనకు నేర్పినదాని కొరకు మరియు ఈ క్లిష్టపరిస్థితి కొరకు అతడు తనను సిద్ధపరచినందుకు అత్యంత కృతజ్ఞతను భావించాడు. యుద్ధము తీవ్రమైనప్పుడు ఏమి చేయాలో తెలుసుకొనే సామర్థ్యంతో మా స్నేహితుడిని, అతని పటాలాన్ని శిక్షకుడు తెలివిగా సిద్ధం చేసాడు. ప్రభావవంతంగా అతడు మా స్నేహితుడి ప్రాణాలు కాపాడాడు.

మన పిల్లల కొరకు ఆత్మీయంగా ఇదేవిధంగా మనమెలా చేయగలము? జీవితమనే యుద్ధభూమిలో వారు ప్రవేశించడానికి చాలాకాలం ముందే వారికి బోధించి, బలపరచి, వారిని సిద్ధం చేయడానికి మనం మరింత ఎక్కువగా ఎలా ప్రయత్నించగలము?15 “తగినంత దూరం చేరడానికి” వారిని మనమెలా ఆహ్వానించగలము? జీవితపు యుద్ధభూమిలో రక్తం చిందించడానికి బదులుగా ఇంటిలో సురక్షితమైన అభ్యాస వాతావరణంలో వారు “చెమటోడ్చేలా” మనం చేయలేమా?

నా జీవితంలో వెనుదిరిగి చూసినప్పుడు, యేసు క్రీస్తు సువార్తను జీవించేలా మా పిల్లలకు సహాయపడాలనే మా ఆతృతలో నా భర్త మరియు నేను ఆ శిక్షకుడిలా భావించిన సందర్భాలున్నాయి. ఇలా చెప్పినప్పుడు జేకబ్ ప్రవక్త ఇవే భావాలను చెప్పినట్లు అనిపిస్తోంది: “నేను మీ ఆత్మల క్షేమమును ఆశించియున్నాను. మీ కొరకు నా ఆతురత గొప్పది; అది ఎల్లప్పుడూ ఉండెనని మీకై మీరు ఎరుగుదురు.”16

పిల్లలు నేర్చుకొని, వృద్ధిచెందుతున్నప్పుడు, వారి నమ్మకాలు సవాలు చేయబడతాయి. కానీ వారు సరిగ్గా సిద్ధం చేయబడినప్పుడు, బలమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ వారు విశ్వాసంలో, ధైర్యంలో, నమ్మకంలో ఎదగగలరు.

“పిల్లల మనస్సులను సిద్ధపరచమని” ఆల్మా మనకు బోధించాడు.17 “శాశ్వతమరణము యొక్క మార్గమును లేదా నిత్యజీవము యొక్క మార్గమును ఎంచుకొనుటకు—(వారిని వారు) నిర్వహించుకొనుటకు (వారు) స్వతంత్రులైయున్నారని” అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో విశ్వాస సంరక్షకులుగా ఉండడానికి మనము ఉదయిస్తున్న తరాన్ని సిద్ధం చేస్తున్నాము.18 ఈ గొప్ప సత్యాన్ని గ్రహించడానికి పిల్లలు యోగ్యులు: తప్పుగా అనుకుంటే నిత్యత్వము తప్పుగా ఉంటుంది.

మన పిల్లలతో సరళమైనప్పటికీ ఆవశ్యకమైన మన సంభాషణలు “రాబోవు లోకములో నిత్యజీవమును అనగా అమర్త్యపు మహిమను ఆనందించగలుగునట్లు ఇప్పుడు నిత్యజీవపు మాటలను ఆనందించగలుగుటకు” వారికి సహాయపడును గాక.19

మనం మన పిల్లలను పోషించి, సిద్ధం చేస్తున్నప్పుడు, మనం వారి స్వతంత్రతను అనుమతిస్తాము, మనఃపూర్వకంగా వారిని ప్రేమిస్తాము, దేవుని ఆజ్ఞలను, ఆయన పశ్చాత్తాప బహుమానాన్ని వారికి బోధిస్తాము మరియు ఎన్నటికీ వారిపై ఆశ కోల్పోము. ఏదేమైనా, మనతో ప్రభువు వ్యవహరించే తీరు ఇది కాదా?

ప్రియమైన మన రక్షకుని ద్వారా మనం “పరిపూర్ణమైన, ప్రకాశవంతమైన నిరీక్షణ”20 కలిగియుండగలమని తెలుసుకొని, క్రీస్తుయందు నిలకడగా మనం ముందుకుసాగెదము.

ఎల్లప్పుడూ ఆయనే సమాధానమని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.

వివరణలు

  1. 3 నీఫై 17:23–24 చూడండి.

  2. మిఛెలిన్ గ్రాస్లి, “Behold Your Little Ones,” Ensign, నవ. 1992, 93 చూడండి: “నాకు, చూడుము అనే పదం ముఖ్యమైనది. అది కేవలం ‘వీక్షించడం మరియు చూడడం’ కంటే ఎక్కువ సూచిస్తుంది. వారి పిల్లలను చూడుము అని ప్రభువు నీఫైయులకు సూచించినప్పుడు, వారి పిల్లల పట్ల శ్రద్ధ వహించమని, వారి గురించి ఆలోచించమని, వర్తమానాన్ని మించి వారి నిత్య సాధ్యతలను చూడమని ఆయన వారికి చెప్పారని నేను నమ్ముతున్నాను.

    రస్సెల్ ఎమ్. నెల్సన్, “Listen to Learn,” Ensign, May 1991, 22 చూడండి: “బలవంతంగా పిల్లల్ని పాలించడం సాతాను పద్ధతి, రక్షకునిది కాదు. మన పిల్లలు మనకు సొంతం కాదు. తల్లిదండ్రులుగా మన విశేషాధికారము వారిని ప్రేమించడం, వారిని నడిపించడం మరియు వారికి స్వేచ్ఛనివ్వడం.”

  3. సిద్ధాంతము మరియు నిబంధనలు 29:46–47 చూడండి.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:71.

  5. హెన్రీ బి. ఐరింగ్, “The Power of Teaching Doctrine,” Ensign, మే 1999, 87.

  6. సిద్ధాంతము మరియు నిబంధనలు 20:79.

  7. హీలమన్ 5:12.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25 చూడండి; విశ్వాస ప్రమాణాలు 1:4 కూడా చూడండి.

  9. సిద్ధాంతము మరియు నిబంధనలు 68:28.

  10. మోషే 06:58; వివరణ చేర్చబడినది.

  11. లూకా 06:59 సిద్ధాంతము మరియు నిబంధనలు 19:-31 కూడా చూడండి.

  12. D. Todd Christofferson, “Why Marriage, Why Family?,” Liahona, May 2015, 52.

  13. సిద్ధాంతము మరియు నిబంధనలు 11:12–13; సిద్ధాంతము మరియు నిబంధనలు 93 కూడా చూడండి.

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 27:17; వివరణ చేర్చబడినది; see also Marion G. Romney, “Home Teaching and Family Home Evening,” Improvement Era, June 1969, 97: “మన శత్రువైన సాతాను నీతిపై అన్ని వైపులనుండి ముట్టడిస్తున్నాడు. బాగా సమకూర్చబడిన అతని బలగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రధానంగా మన పిల్లలు మరియు యువతపై దాడిచేయడమే అతని లక్ష్యం. చెడ్డ మరియు దుష్ట ప్రచారాలకు ప్రతిచోటా వారు లోనవుతున్నారు. వారు వెళ్ళిన ప్రతిచోటా, పరిశుద్ధమైన ప్రతిదానిని మరియు ప్రతి నీతి సూత్రాన్ని నాశనం చేయడానికి, మోసగించడానికి కుట్రపన్నుతున్న చెడు చేత వారు మొత్తబడుతున్నారు. … సాతాను యొక్క ఈ దాడులను ఎదుర్కొని నిలబడేందుకు తగినట్లుగా మన పిల్లలు బలపరచబడాలంటే, ప్రభువు నిర్దేశించినట్లుగా వారు ఇంటిలో తప్పక బోధించబడి, శిక్షణ ఇవ్వబడాలి.

  15. Russell M. Nelson, “Children of the Covenant,” Ensign, May 1995, 32 చూడండి:

    “సంవత్సరాల క్రితం ఒక యువ వైద్య విద్యార్థిగా నేను ఇప్పుడు నివారించగలిగే వ్యాధులతో బాధపడుతున్న చాలా మంది రోగులను చూశాను. ఒకప్పుడు అసాధ్యమైనవిగా—ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి వ్యక్తులను బలపరచడం నేడు సాధ్యము. కావలసిన వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడానికి గల ఒక వైద్య పద్ధతి టీకాలు వేయడం. టీకా అనే పదం మనోహరమైనది. ఈ పదం రెండు లాటిన్ మూలాల నుండి వచ్చింది: టీ, అనగా ‘లోపల’; మరియు కా, అనగా ‘కన్ను.’ టీకాలు వేయడం అంటే అసలైన అర్థం, హాని జరుగకుండా పర్యవేక్షించడానికి—‘లోపలివరకు చూడడం’.

    పోలియో వంటి వ్యాధి శరీరాన్ని అవిటిగా చేస్తుంది లేదా నాశనం చేస్తుంది. పాపము అనే వ్యాధి ఆత్మను అవిటిగా చేయగలదు లేదా నాశనం చేయగలదు. పోలియో విధ్వంసాలు ఇప్పుడు టీకాల వలన నివారించబడగలవు, కానీ పాపము యొక్క విధ్వంసాలకు మరో రకమైన నివారణ అవసరం. దుష్టత్వానికి వ్యతిరేకంగా వైద్యులు టీకాలు వేయలేరు. ఆత్మీయ రక్షణ కేవలం ప్రభువు నుండి—ఆయన స్వంత విధానంలోనే వస్తుంది. యేసు టీకాలు వేయడానికి కాదు, కానీ బోధించడానికి ఎన్నుకుంటారు. ఆయన విధానంలో టీకాలు లేవు; ఆయన పిల్లల నిత్య ఆత్మలను రక్షించడానికి—‘లోపలివరకు’ ప్రబలమైయున్న—దైవిక సిద్ధాంతాన్ని బోధించడాన్ని అది ఉపయోగిస్తుంది.”

  16. 2 నీఫై 6:3.

  17. ఆల్మా 39:16.

  18. 2 నీఫై 10:23.

  19. మోషే 6:59; వివరణ చేర్చబడినది.

  20. 2 నీఫై 31:20.