సర్వసభ్య సమావేశము
వెలుగు వెలుగును హత్తుకొనును
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


11:11

వెలుగు వెలుగును హత్తుకొనును

క్రీస్తునందు మన విశ్వాసమును మనము తీవ్రతరము చేసినప్పుడు, మనల్ని చుట్టుముట్టగల సమస్త చీకటిని అది పారద్రోలేంత వరకు హెచ్చైన పరిమాణములో వెలుగును మనము పొందుతాము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఆశీర్వదించబడిన ఈస్టరు ఆదివారము ఉదయమున మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానముతో భూమిపై ఉదయించిన మహిమగల వెలుగును ధ్యానించుటలో మీతో ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను.

ఆయన మర్త్య పరిచర్యయందు, యేసు ఇలా ప్రకటించెను “నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగియుండును”1 క్రీస్తు యొక్క ఆత్మ “అన్ని విషయాలందు ఉన్నది, అన్ని విషయాలకు జీవమిచ్చును.”2 అది మరొకవిధంగా మనల్ని చుట్టుముట్టగల చీకటిని జయించును.

సంవత్సరాల క్రితం, సాహసాన్ని అన్వేషిస్తూ, నా ఇద్దరు కుమారులు, నేను మోనింగ్ కావర్న్ (మధ్య కాలిఫోర్నియాలోని గుహ) వద్దకు యువకుల గుంపుతో పాటు వెళ్ళాము, ఒక సమయంలో దాని ముఖద్వారము వద్ద ప్రతిధ్వనించిన శబ్దానికి దాని పేరు పెట్టారు. ఈ గుహ ఇరుకైన నిలువు గుహ మార్గం, ఇది 180 అడుగుల (55 మీ) లోతైన నిలువు గదిలోకి తెరుచుకుంటుంది, ఇది కాలిఫోర్నియాలోని అతిపెద్ద ఒకే గుహ గది.

మోనింగ్ కావర్న్

రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి: సురక్షితమైన వృత్తాకార మెట్లు లేదా గుహ యొక్క అంతస్తు వరకు ఒక తాడును జారడం ద్వారా ఇతర నిలువు ఉపరితలం క్రిందకు దిగడం; నా కుమారులు మరియు నేను తాడుతో జారడం ద్వారా క్రిందకు దిగడాన్ని ఎంచుకున్నాను. మా పెద్ద కొడుకు మొదట క్రిందకు వెళ్ళాక, నా చిన్న కొడుకు, నేను కలిసి దిగునట్లు మేము ఉద్దేశ్యపూర్వకంగా చివరిగా వెళ్ళాము.

మా మార్గదర్శులు సూచించి, ఒక బలమైన తాడుకు జీను మరియు మూలాధారమైన దానికి భద్రపరచడానికి ఉపయోగించే పరికరంతో మాకు భద్రత కల్పించిన తరువాత, మేము చిన్న అంచుపై నిలబడి, మా విశ్వాసాన్ని కూర్చుకొనే వరకు నెమ్మదిగా వెనుకకు కదలసాగాము, ఎందుకంటే ఇది తిరగడానికి చివరి ప్రదేశము, మరియు గుహ ముఖద్వారం నుండి సూర్యకాంతిని మేమూ చూడగల చివరి ప్రదేశం.

మా తదుపరి అడుగు వెనుకకు మమ్మల్ని చాలా విశాలమైన పెద్ద గుడి వంటి గుహలో పడవేసింది, అది ఎంత ఎత్తుగా, విశాలంగా ఉందంటే, లిబర్టీ విగ్రహము లోపల పట్టేస్తుంది. సాపేక్షమైన చీకటికి మా కళ్ళు సర్దుబాటు అయినప్పుడు, అక్కడ మేము నెమ్మదిగా తిరుగుతున్నాము. మేము క్రిందకు వెళ్ళడం కొనసాగిస్తున్నప్పుడు, విద్యుత్ దీపాల ప్రకాశం మెరిసే రాతి నిర్మాణము, ఖనిజ నిర్మాణము యొక్క అద్భుతమైన గోడను ప్రకాశింపజేసాయి.

హెచ్చరించకుండా, హఠాత్తుగా లైట్లు పూర్తిగా ఆరిపోయాయి. అగాధం పైన వ్రేలాడబడుతూ, మా ముందున్న తాళ్లను పట్టుకున్న మా చేతులను కూడా మేము చూడలేకపోయేంతగా చాలా దట్టమైన చీకటిలో చుట్టబడ్డాము. వెంటనే ఒక స్వరము, “నాన్నా, నాన్నా, మీరు అక్కడ ఉన్నారా?” అని అడిగింది.

“నేను ఇక్కడున్నాను కుమారుడా, నేను ఇక్కడే ఉన్నాను,” నేను జవాబిచ్చాను.

ఊహించకుండా వెలుగును కొల్పోవుట, విద్యుత్తు లేకుండా, గుహలోని చీకటి ప్రవేశించడానికి వీలుకానిదని చూపటానికి ఏర్పాటు చేయబడింది. అది సాధించబడింది; మేము చీకటిని “అనుభవించాము.” లైట్లు తిరిగి వచ్చినప్పుడు, మిణుకుమనే వెలుగుకు కూడా, చీకటి ఎల్లప్పుడు లోబడినట్లుగా, వెంటనే చీకటి వెళ్ళిపోయి, వెలుగుతో ఉంచబడింది. నా కుమారులు మరియు నేను ఎన్నడూ ఎరగని చీకటి జ్ఞాపకముతో మేము ఎన్నడూ మరచిపోని వెలుగు కొరకు గొప్ప ప్రశంసను, మరియు చీకటిలో మేమందరము ఒంటరిగా ఎన్నడూ లేమనే అభయముతో విడువబడ్డాము.

ఆ గుహలోనికి మేము దిగటం కొన్ని విధాలుగా మర్త్యత్వము గుండా మన ప్రయాణమునకు పోలికగా ఉన్నది. మనము పరలోకపు మహిమకరమైన వెలుగు నుండి బయలుదేరి, మన మర్త్యత్వముకు ముందు జీవితమును మరచిపోయి పాపము, దుష్టత్వము నిండిన లోకములోనికి దిగివచ్చాము. మన పరలోక తండ్రి మనల్ని చీకటికి విడిచిపెట్టలేదు కానీ ఆయన ప్రియమైన కుమారుడైన, యేసు క్రీస్తు ద్వారా మన ప్రయాణము కొరకు మనకు వెలుగును వాగ్దానము చేసాడు.

భూమి మీద సమస్త జీవులకు సూర్యుని కాంతి ముఖ్యమైనదని మనము ఎరుగుదుము. మన ఆత్మీయ జీవితానికి సమానంగా ముఖ్యమైనది మన రక్షకుడి నుండి ప్రకాశించే వెలుగు. ఆయన పరిపూర్ణమైన ప్రేమయందు, దేవుడు “లోకములోనికి వచ్చిన”3 ప్రతీ వ్యక్తికి క్రీస్తు యొక్క వెలుగును అనుగ్రహించాడు, ఆవిధంగా వారు “చెడు నుండి మంచి ఎరుగునట్లు”4 మరియు “ఎల్లప్పుడు మంచి చేయుటకు,”5 ప్రేరేపించబడెదరు. ఆ వెలుగు, తరచుగా మనము పిలిచే మనస్సాక్షి ద్వారా దానికదే బయల్పరచబడి, ఎప్పటికీ అమలు చేయడానికి, మంచిగా ఉండటానికి మరియు మనకు సాధ్యమైనంత శ్రేష్టమైన వ్యక్తిగా ఉండటానికి మనల్ని ప్రేరేపించును.

క్రీస్తునందు మన విశ్వాసమును మనము తీవ్రతరము చేసినప్పుడు, మనల్ని చుట్టుముట్టగల సమస్త చీకటిని అది పారద్రోలేంత వరకు హెచ్చైన పరిమాణములో వెలును మనము పొందుతాము. “దేవుని నుండి వచ్చినది వెలుగు; మరియు వెలుగును స్వీకరించి, దేవునిలో కొనసాగువాడు, మరింత వెలుగును పొందుతాడు మరియు పరిపూర్ణమైన రోజు వరకు ఆ వెలుగు ప్రకాశవంతంగా మరియు ప్రకాశవంతంగా పెరుగుతుంది.”6

క్రీస్తు యొక్క వెలుగు మనము పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య చేసే ప్రభావమును పొందడానికి సిద్ధపరచును, అది “సువార్త యొక్క సత్యమును గూర్చి… దేవుని యొక్క ఒప్పింప జేయు శక్తి.”7 త్రియేక దేవుని యొక్క మూడవ సభ్యుడు, పరిశుద్ధాత్మ “ఆత్మ యొక్క వ్యక్తిత్వము.”8 మర్తత్వములో పరలోక తండ్రి మీకు దయచేసే వెలుగులో మిక్కలి గొప్ప ఆధారము పరిశుద్ధాత్మ నుండి వచ్చును, ఆయన ప్రభావము “మీ మనస్సుకు జ్ఞానవృద్ధి కలిగించి [మరియు] మీ ఆత్మను ఆనందముతో నింపుతుంది.”9

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో, పునఃస్థాపించబడిన యాజకత్వ అధికారము ద్వారా, మీరు పాపముల పరిహారము కొరకు ముంచడం ద్వారా బాప్తీస్మము పొందారు. తరువాత, మీ తలపై చేతులు వేయబడి, పరిశుద్ధాత్మ యొక్క ఈ అద్భుతమైన, “చెప్పశక్యముగాని వరము”10 మీపై దయచేయబడ్డారు.

అప్పటి నుండి, మీ కోరికలు, క్రియలు నిబంధన మార్గముపై కేంద్రీకరించబడినప్పుడు, మీలోపలున్న వెలుగు వలె, పరిశుద్ధాత్మ సత్యమును బయల్పరచి, సాక్ష్యమిచ్చును,11 అపాయమును గూర్చి హెచ్చరించును,12 శుద్ధి చేయును,13 మరియు మీ ఆత్మకు శాంతిని దయచేయును.14

“వెలుగు, వెలుగును హత్తుకుంటుంది”15 కనుక, పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన సహవాసము, వెలుగులో మిమ్మల్ని ఉంచగల ఎంపికలను చేయడానికి మిమ్మల్ని నడిపించును, దీనికి విరుద్ధంగా, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము లేకుండా చేయబడిన ఎంపికలు మిమ్మల్ని నీడలు, చీకటిలోనికి నడిపిస్తాయి. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ ఇలా బోధించారు, “వెలుగు ఉన్నప్పుడు, చీకటి అదృశ్యమవుతుంది మరియు తప్పక వెళ్ళిపోవాలి. … పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయ వెలుగు ఉన్నప్పుడు, సాతాను యొక్క చీకటి వెళ్ళిపోవును.”16

బహుశా, ఇది మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకొనే సమయమని నేను మీకు సూచించనా: నా జీవితంలో ఆ వెలుగును నేను కలిగియున్నానా? లేని యెడల, చివరిసారిగా, నేను ఎప్పుడు కలిగియున్నాను?

జీవితాన్ని క్రొత్తదిగా చేసి మరియు బలపరచడానికి ప్రతిరోజూ సూర్యరశ్మి భూమిని స్నానం చేయించినట్లే, మీరు ఆయనను అనగా యేసు క్రీస్తును అనుసరించడానికి ఎంచుకున్నప్పుడు ప్రతిరోజూ మీలోని కాంతిని ప్రకాశవంతం చేయవచ్చు.

ప్రార్థనయందు దేవునిని మీరు వెదకిన ప్రతీసారి, అదనపు వెలుగు చేర్చబడుతుంది, “ఆయనను వినడానికి”;17 మీరు లేఖనాలను అధ్యయనం చేసినప్పుడు లేక మన జీవిస్తున్న ప్రవక్తల సందేశాలకు స్పందించినప్పుడు, మరియు “ప్రభువు యొక్క విధులన్నిటియందు నడిచినప్పుడు”18 అది జ్ఞానవృద్ధి కలిగిస్తుంది.

ఆత్మీయ సూర్యకాంతిని మీ ఆత్మలోనికి మరియు మీరు పశ్చాత్తాపపడిన ప్రతీసారి మీ జీవితంలోనికి శాంతిని ఆహ్వానిస్తారు. రక్షకుని నామమును మీపై తీసుకొనుటకు, ఎల్లప్పుడు ఆయనను జ్ఞాపకముంచుకోవడానికి, మరియు ఆయన ఆజ్ఞలను పాటించడానికి మీరు ప్రతీ వారము సంస్కారము తీసుకొన్నప్పుడు, ఆయన వెలుగు మీలోపల ప్రకాశిస్తుంది.

సువార్తను పంచుకొని మీ సాక్ష్యమును మీరు పంచుకొన్న ప్రతీసారి మీ ఆత్మలో సూర్యుని కాంతి ఉన్నది. రక్షకుడు చేసినట్లుగా మీరు ఒకరినొకరికి సేవ చేసిన ప్రతిసారీ, మీ హృదయములో ఆయన అప్యాయతను అనుభూతి చెందుతారు. పరలోక తండ్రి యొక్క వెలుగు ఆయన పరిశుద్ధ ఆలయములో మరియు ప్రభువు యొక్క మందిరంలో తమను తాము హాజరుపరచుకున్న వారందరిపై ఎల్లప్పుడు నివసిస్తుంది. మీలోని ఆయన వెలుగు మీ దయ, ఓపిక, క్షమాపణ మరియు దాతృత్వము యొక్క క్రియలతో హెచ్చించబడుతుంది మరియు మీ సంతోషముగల ముఖముపై దానికదే చూపిస్తుంది. దానికి విరుద్ధంగా, మనము చాలా త్వరగా కోపముతెచ్చుకొని లేక క్షమించడానికి చాలా ఆలస్యము చేసినప్పుడు మనము శోధనకు లోబడతాము. “మీ ముఖమును సూర్యుని కాంతివైపు ఉంచినప్పుడు, నీడలు ఏమీ చేయలేవు కానీ మీ వెనకబడతాయి.”19

పరిశుద్ధాత్మ యొక్క సహవాసముకు యోగ్యులుగా మీరు జీవించినప్పుడు, మీరు నిజంగా “బయల్పాటును పొందటానికి మీ ఆత్మీయ సామర్ధ్యమును వృద్ధి చేస్తారు.”20

జీవితము సవాళ్లు మరియు కష్టాలను ఇస్తుంది, మరియు మనమందరం తప్పక కొన్ని సవాళ్లను మరియు కష్టాలను ఎదుర్కొవాలి. వీటన్నిటి ద్వారా, మనము “మన జీవితాలలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన,”21 యెడల, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు మన శ్రమలందు ఉద్దేశము, అర్థమున్నదని తెలుపుతుంది, మన చీకటి దినములు అంతటా దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి, అవి చివరకు క్రీస్తునందు స్థిరమైన విశ్వాసము మరియు ప్రకాశవంతమైన నిరీక్షణతో మనల్ని ఉత్తమంగా, ఎక్కువ సంపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తాయి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ సలహా ఇచ్చినట్లుగా, “కష్టముతో పాటు పెరుగుతున్న చీకటి, యేసు క్రీస్తు యొక్క వెలుగును ఎప్పటికీ ఉజ్వలంగా ప్రకాశింపచేస్తుంది.”22

మన జీవితాలలో కొన్ని సమయాలు ఊహించని రీతిలో మరియు కోరదగని రెండు స్థలములకు మనల్ని తీసుకొనిపోగలవు. పాపము మిమ్మల్ని అక్కడికి నడిపించిన యెడల, చీకటిని తరిమివేయడానికి సువార్త వెలుగును మన జీవితాలలోకి అనుమతించుటకు అవసరమైన దానిని చేయుట మరియు విరిగి నలిగిన ఆత్మతో పశ్చాత్తాపపడుతూ మీ పరలోక తండ్రిని వినయంగా చేరుకోవడాన్ని ఇప్పుడే ప్రారంభించండి. ఆయన మీ మనఃపూర్వకమైన ప్రార్థన వింటాడు. నేడు ధైర్యముతో “[ఆయన]యొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”23 మీరు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క స్వస్థపరిచే శక్తికి మించినవారు కారు.

నేను మంచివారైన తల్లిదండ్రుల నుండి, యేసు క్రీస్తు వెలుగు మరియు ఆయన సువార్తకు స్పందించిన విశ్వాసులైన పూర్వీకుల నుండి వచ్చాను మరియు అది వారి జీవితాలను, ఆత్మీయ స్థితిస్థాపకతతో అనుసరించిన తరములను దీవించింది. మా నాన్న తన తండ్రి మైలో టి. డైచెస్ గురించి తరచుగా మాట్లాడేవారు, మరియు దేవునియందు అతడి విశ్వాసము ఎల్లప్పుడు అతడిని ఎలా నడిపించిందో పంచుకున్నాడు. తాత అడవిని సంరక్షించే అధికారి మరియు దేవుని యొక్క నడిపింపు, శ్రద్ధను పూర్తిగా నమ్ముతూ, తరచుగా ఒంటరిగా వెళ్లేవాడు.

ఒక వసంతకాలమున ఆలస్యంగా, తాత ఎత్తైన కొండలపై ఒంటరిగా ఉన్నాడు. అప్పటికే శీతాకాలం ప్రారంభమైంది, ఆయన ప్రియమైన గుర్రములలో ఒకటైన వృద్ధ ప్రిన్స్ గుర్రము ఒక దానిపై ఆయన కూర్చోన్నాడు మరియు కర్రదుంగలను కలపముక్కలుగా రంపంతో పలకలుగా కోయకముందు వాటిని కొలవడానికి సామిల్లు వద్దకు వెళ్ళాడు.

సంధ్యా సమయంలో, అతను తన పనిని ముగించి, తిరిగి జీనులోకి ఎక్కాడు. అప్పటికే, ఉష్టోగ్రత వేగంగా తగ్గిపోయింది మరియు తీవ్రమైన శీతాకాలపు మంచు తుఫాను పర్వతాన్ని చుట్టుముట్టింది. అతనిని నడిపించడానికి వెలుగు లేదా దారి లేకపోవడంతో, రేంజర్ స్టేషనుకు తిరిగి నడిపిస్తాడని భావించిన దిశలో అతను ప్రిన్స్ గుర్రమును త్రిప్పాడు.

తుఫానులో ప్రయాణిస్తున్న మైలో డైచెస్

చీకటిలో కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత, ప్రిన్స్ మందగించింది, తరువాత ఆగిపోయింది. తాత గుర్రాన్ని ముందుకు వెళ్ళమని పలుమార్లు పురికొల్పాడు, కానీ గుర్రము తిరస్కరించింది. వారి చుట్టూ కురుస్తున్న మంచు చూడటాన్ని కష్టతరము చేయడంతో, తనకు దేవుని సహాయము అవసరమని తాత గ్రహించాడు. తన జీవితకాలమంతటా అతడు చేసినట్లుగా, అతడు వినయంగా “సందేహించకుండా, విశ్వాసముతో [అడిగాడు].”24 ఒక మెల్లని నిమ్మళమైన స్వరము జవాబిచ్చింది, “మైలో, గుర్రపు పగ్గాలను వదలు చెయ్యుము.” తాత లోబడ్డాడు, అతడు పగ్గాలను వదులు చేసినప్పుడు, ప్రిన్స్ చుట్టూ తిరిగి, బరువైన అడుగులతో వేరే దిశలో కదిలింది. గంటల తరువాత, ప్రిన్స్ మరలా ఆగిపోయింది, మరియు తన తలను క్రిందకు దించింది. వేగంగా పడుతున్న మంచు, గాలిచేత చెదరగొట్టబడి, వారు రేంజర్ స్టేషను ద్వారము వద్దకు క్షేమంగా చేరుకున్నట్టు తాత చూసాడు.

ఉదయకాలపు సూర్యునితో, తాత మంచులో ప్రిన్స్ యొక్క అస్పష్టమైన జాడలను తిరిగి కనుగొన్నాడు. అతను ప్రిన్స్ తన పగ్గాలను వదలు చేసిన చోటును కనుగొన్నప్పుడు అతడు లోతుగా శ్వాస తీసుకున్నాడు: అది ఒక ఎత్తైన పర్వత శిఖరం యొక్క అంచు, అక్కడ ఒక అడుగు ముందుకు వేస్తే గుర్రం మరియు నడిపే వారు ఇద్దరూ కొండ క్రింద ఉన్న కఠినమైన రాళ్ళపై పడిపోయి చనిపోయి యుండవచ్చు.

ఆ అనుభవము, మరియు అనేక ఇతర అనుభవాలపై ఆధారపడి, తాత సలహా ఇచ్చాడు, “మీరు ఎప్పటికి కలిగియుండే శ్రేష్టమైన, గొప్ప భాగస్వామి మీ పరలోకమందున్న తండ్రి.” నాన్న తాత కథను వివరించినప్పుడు, అతను లేఖనాల నుండి ఉదహరించడం నాకు గుర్తుంది:

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.

“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”25

దీపమును పట్టుకున్న రక్షకుడు

యేసు క్రీస్తు “చీకటిలో ప్రకాశించుచున్న”26 శాశ్వతమైన వెలుగు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఏ చీకటి ఆ వెలుగును అణచలేదు, ఆర్పలేదు, గెలవలేదు, లేక ఓడించలేదు. మన పరలోక తండ్రి ఆ వెలుగును మీకు ఉచితంగా ఇస్తున్నారు. మీరు ఎన్నడూ ఒంటరివారు కాదు. ఆయన ప్రతీ ప్రార్థనను ఆలకిస్తాడు, మరియు జవాబిస్తాడు. ఆయన “చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచెను.”27 “తండ్రీ, తండ్రీ, మీరు అక్కడ ఉన్నారా?” అని అడిగినప్పుడు, ఆయన ఎల్లప్పుడూ “నేను ఇక్కడ ఉన్నాను, నా బిడ్డ; నేను ఇక్కడే ఉన్నాను” అని ప్రత్యుత్తరం ఇచ్చును.

మన రక్షకుడు మరియు మన విమోచకునిగా పరలోక తండ్రి యొక్క ప్రణాళికను యేసు క్రీస్తు నెరవేర్చాడని, 28 ఆయన మన వెలుగు, మన జీవము, మరియు మన మార్గమని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన వెలుగు ఎన్నడూ మసకబారదు,29 ఆయన మహిమ ఎన్నడూ అంతముకాదు, మీ కొరకు ఆయన ప్రేమ—నిన్న, నేడు, మరియు శాశ్వతంగా నిత్యమైనది. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.