సర్వసభ్య సమావేశము
దేవుని బిడ్డ యొక్క వ్యక్తిగత ప్రయాణం
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:50

దేవుని బిడ్డ యొక్క వ్యక్తిగత ప్రయాణం

దేవుని యొక్క నిబంధన సంతానముగా మనము, పూర్వ మర్త్య లోకం నుండి వస్తున్న ఆ ఆత్మలను ప్రేమించి, గౌరవించి, పోషించి, కాపాడి, స్వాగతిస్తాము.

మనలో ప్రతిఒక్కరు ఈ ప్రపంచవ్యాప్త మహమ్మారి చేత ప్రభావితం చేయబడ్డాము, కుటుంబము మరియు స్నేహితులు అనుకోకుండా మరణిస్తున్నారు. మనం ఎంతగానో ప్రేమించే వారందరిని సూచిస్తూ, మనం ప్రేమతో పోగొట్టుకొనే మూడింటి గురించి నేను చెప్తున్నాను.

సహోదరుడు మరియు సహోదరి బాంజా

వీరు సహోదరుడు ఫిలిప్ మరియుసహోదరి జెర్మైన్ సొండి. సహోదరుడు సొండి మరణించుటకు ముందు బ్రజవిల్లే రిపబ్లిక్ ఆఫ్ కాంగో స్టేకుకు గోత్రజనకునిగా సేవ చేస్తున్నారు. ఈయన ఒక వైద్యుడు, తన నైపుణ్యాలను ఇతరులతో ధారాళంగా పంచుకున్నారు.1

క్లారా రువానో డి విలేరియల్

ఈమె ఈక్వెడార్ లోని టల్కాన్ నుండి సహోదరి క్లారా రువానో డి విల్లారియల్. 34 ఏళ్ళ వయస్సులో ఈమె పునఃస్థాపించబడిన సువార్తను హత్తుకుంది మరియు ప్రియమైన నాయకురాలు. ఈమెకిష్టమైన కీర్తన, “నా విమోచకుడు సజీవుడని నాకు తెలుసు” పాడుతూ ఈమె కుటుంబం వీడ్కోలు చెప్పింది.2

రే తునియు మరియు అతని కుటుంబం

ఈయన యూటా నుండి సహోదరుడు రే టుయినో మరియు అందమైన అతని కుటుంబము. “(వాళ్ళ నాన్న) ఎల్లప్పుడూ దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించారని (మా అబ్బాయిలు) గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను” అని ఈయన భార్య జూలియెట్ అన్నారు.3

“మరణించిన వారిని కోల్పోయినందుకు, మీరు రోదించునంతగా మీరు కలిసియుండి, ప్రేమతో జీవించవలెను,”4 అని ప్రభువు చెప్పారు.

మనం రోదిస్తున్నప్పటికీ, మన రక్షకుని యొక్క మహిమకరమైన పునరుత్థానములో మనం ఆనందిస్తాము. ఆయన మూలంగా, మనకు ప్రియమైనవారు మరియు స్నేహితులు తమ నిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అధ్యక్షులు జోసెఫ్ ఎఫ్. స్మిత్ వివరించినట్లు: “మనం వారిని మరచిపోలేము; మనం వారిని ప్రేమించడం ఆపలేము. … వారు పురోగమించారు; మనము పురోగమిస్తున్నాము; వారు ఎదిగినట్లు మనం ఎదుగుతున్నాము.” 5 “బాధతోనున్న మన కన్నీళ్ళు … నిరీక్షణాశ్రువులుగా మారతాయి,” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు.6

పుట్టుకకు ముందు జీవితం గురించి మనకు తెలుసు

మన నిత్య దృష్టి మర్త్యత్వాన్ని దాటి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వారిని గూర్చి మన గ్రహింపును అధికం చేయడం మాత్రమే కాదు, కానీ తమ ప్రయాణం ఆరంభంలో ఉండి, ఇప్పుడే మర్త్యత్వంలో ప్రవేశిస్తున్న వారిని గూర్చి కూడా మన గ్రహింపును వికసింపజేస్తుంది.

భూమిపైకి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని యొక్క ప్రత్యేక కుమారుడు లేదా కుమార్తె.7 మన వ్యక్తిగత ప్రయాణం పుట్టుకతో మొదలు కాలేదు. మనం పుట్టకముందు, మనం సిద్ధపాటు లోకంలో కలిసి ఉన్నాము, అక్కడ “ఆత్మల లోకంలో (మన) మొదటి పాఠాలు పొందాము.”8 “గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్టించితిని,” 9 అని యెహోవా యిర్మీయాతో చెప్పారు.

పిండం యొక్క నిర్మాణంతో జీవం మొదలైతే, గుండె కొట్టుకోవడం ఎప్పుడు మొదలవుతుంది లేదా బిడ్డ గర్భము వెలుపల ఎప్పుడు నివసించగలదని కొందరు ప్రశ్నించవచ్చు, కానీ మనకు మాత్రం దేవుని యొక్క ఆత్మ కుమార్తెలు మరియు కుమారులు శరీరాన్ని పొంది, మర్త్యత్వాన్ని అనుభూతి చెందడానికి భూమికి వచ్చేందుకు తమ స్వంత వ్యక్తిగత ప్రయాణాల్లో ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

దేవుని యొక్క నిబంధన సంతానముగా మనము, పూర్వ మర్త్య లోకం నుండి వస్తున్న ఆ ఆత్మలను ప్రేమించి, గౌరవించి, పోషించి, కాపాడి, స్వాగతిస్తాము.

స్త్రీల అద్భుతమైన సహకారం

ఒక స్త్రీ కొరకు, బిడ్డను కలిగియుండడం అనేది శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా గొప్ప త్యాగము కాగలదు. ఈ సంఘము యొక్క అద్భుతమైన స్త్రీలను మేము ప్రేమిస్తున్నాము, గౌరవిస్తున్నాము. వివేకం మరియు జ్ఞానంతో మీరు మీ కుటుంబ భారాలను మోస్తారు. మీరు ప్రేమిస్తారు. మీరు సేవచేస్తారు. మీరు త్యాగం చేస్తారు. మీరు విశ్వాసాన్ని బలపరుస్తారు, అవసరంలో ఉన్నవారికి పరిచర్య చేస్తారు మరియు సమాజానికి గొప్ప తోడ్పాటునందిస్తారు.

జీవితాన్ని రక్షించే పవిత్ర బాధ్యత

చాలాకాలం క్రితం, ప్రపంచంలోని గర్భస్రావాల సంఖ్యను బట్టి మిక్కిలి విచారిస్తూ అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ నేడు మనకు సంబంధించిన పదాలతో సంఘం యొక్క స్త్రీలతో ప్రసంగించారు. ఆయన ఇలా అన్నారు:“భార్యలు, తల్లులు అయిన మీరు కుటుంబానికి ప్రాణాధారము వంటివారు. మీరు పిల్లల్ని కంటారు. అది ఎంతో అపరిమితమైన, పవిత్రమైన బాధ్యత. … మానవ జీవితం యొక్క పవిత్రత పట్ల మన అభినందనకు ఏం జరుగుతోంది? గర్భస్రావం అనేది చెడ్డది, క్రూరమైనది, యదార్థమైనది, అసహ్యమైనది, అది భూమిని తుడిచిపెడుతున్నది. దానిని విసర్జించండి, దానినుండి తప్పించుకోండి, దానిని కోరుకోదగినదిగా చూపే రాజీపడు పరిస్థితుల నుండి దూరంగా ఉండండి అని ఈ సంఘ స్త్రీలను నేను వేడుకొంటున్నాను. అది సంభవించగల పరిస్థితులు కొన్ని ఉండవచ్చు, కానీ అవి అత్యంత పరిమితమైనవి.10 … మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెల యొక్క తల్లులు, వారి జీవితాలు పవిత్రమైనవి. వారిని కాపాడడం దైవికంగా ఇవ్వబడిన బాధ్యత, అది సులువుగా మరొకరికి ఇవ్వకూడనిది.”11

84 ఏళ్ళ ఒక వృద్ధురాలి కథను ఎల్డర్ మార్కస్ బి. నాష్ నాతో పంచుకున్నారు, ఆమె తన బాప్తీస్మపు మౌఖికంలో, “(చాలా ఏళ్ళ క్రితం) గర్భస్రావం జరిగినట్లు అంగీకరించారు.” నిజమైన మనస్తాపంతో ఆమె చెప్పింది: “ఒక బిడ్డను గర్భస్రావం చేయించుకున్నాననే అపరాధ భావాన్ని నలభై ఆరేళ్ళ నా జీవితంలో ప్రతీరోజూ నేను భరించాను. … నేనేమి చేసినా ఆ బాధ, అపరాధ భావన తొలగిపోలేదు. యేసు క్రీస్తు యొక్క నిజమైన సువార్త నాకు బోధించబడే వరకు నేను నిరీక్షణ లేకుండా ఉన్నాను. ఎలా పశ్చాత్తాపపడాలో నేను నేర్చుకున్నాను … అకస్మాత్తుగా నేను నిరీక్షణతో నింపబడ్డాను. నా పాపాల నిమిత్తం నేను నిజంగా పశ్చాత్తాపపడితే, నేను క్షమించబడగలనని చివరకు నేను తెలుసుకున్నాను.”12

పశ్చాత్తాపము మరియు క్షమాపణ యొక్క దైవిక బహుమానాలకు మనమెంత కృతజ్ఞులము.

మనము ఏమి చేయగలము?

యేసు క్రీస్తు యొక్క సమాధానకర శిష్యులుగా మన బాధ్యత ఏమిటి? మనం దేవుని ఆజ్ఞలను జీవిద్దాం, వాటిని మన పిల్లలకు బోధిద్దాం, వినడానికి సమ్మతించిన వారితో వాటిని పంచుకుందాం.13 సమాజంలో నిర్ణయాలు చేసేవారితో జీవితం యొక్క పవిత్రత గురించి మన గాఢమైన భావాలను పంచుకుందాం. మనం నమ్మేదానిని వారు పూర్తిగా మెచ్చుకోకపోవచ్చు, కానీ మనకు మట్టుకు ఎందుకు ఈ నిర్ణయాలు ఒక వ్యక్తి తన స్వంత జీవితం నుండి కోరుకొనేదానిని మించినవని వారు మరి ఎక్కువగా గ్రహించాలని మనం ప్రార్థించుదాం.

అనుకోకుండా ఒక బిడ్డ పుట్టబోతుంటే మనం ప్రేమతో, ప్రోత్సాహంతో, అవసరమైతే ఆర్థిక సాయంతో సమీపిద్దాం మరియు తన బిడ్డ పుట్టి, మర్త్యత్వంలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించడంలో ఒక తల్లిని బలపరుద్దాం.14

దత్తత యొక్క అందం

మా కుటుంబంలో రెండు దశాబ్దాల క్రితం, 16 ఏళ్ళ అమ్మాయి తాను తల్లి కాబోతున్నదని తెలుసుకున్నప్పుడు, మేము అపరిమితముగా దీవించబడ్డాము. ఆమె మరియు బిడ్డ తండ్రి పెళ్ళి చేసుకోలేదు మరియు బిడ్డను పెంచడానికి వారు కలిసి ఉండగలరని వారనుకోలేదు. ఆమె కడుపులో ఉన్న జీవం అమూల్యమైనదని ఆ యువతి నమ్మింది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది మరియు ఒక మంచి కుటుంబం ఆమెను దత్తత తీసుకోవడానికి అనుమతించింది. బ్రైస్ మరియు జోలిన్‌ల దృష్టిలో ఆమె వారి ప్రార్థనలకు ఇవ్వబడిన జవాబు. వారు ఆమెకు ఎమిలి అని పేరు పెట్టారు మరియు తన పరలోక తండ్రియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు నమ్మకముంచడాన్ని ఆమెకు బోధించారు.

ఎమిలి మరియు క్రిస్టియన్

ఎమిలి పెద్దయ్యింది. ఎమిలి మరియు మా మనవడు క్రిస్టియన్ ప్రేమించుకొని, ప్రభువు యొక్క మందిరంలో వివాహం చేసుకున్నందుకు మేమెంతో కృతజ్ఞులం. ఎమిలి మరియు క్రిస్టియన్ ఇప్పుడు వారి స్వంత పాపను కలిగియున్నారు.

కుమార్తెతో ఎమిలి

ఇటీవల ఎమిలి వ్రాసింది: “గత తొమ్మిది నెలల గర్భధారణలో, నా పుట్టుక యొక్క సంఘటనలపై ప్రతిబింబించడానికి నాకు సమయం దొరికింది. కేవలం 16 ఏళ్ళ వయస్సుండి, నాకు జన్మనిచ్చిన తల్లి గురించి నేను ఆలోచించాను. గర్భధారణ తెచ్చే మార్పులను, నొప్పులను నేను అనుభవించినప్పుడు, 16 ఏళ్ళ చిన్న వయస్సులో అది ఎంత కష్టమైయుండవచ్చో ఊహించడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. … నాకు జన్మనిచ్చిన తల్లి గురించి ఆలోచిస్తుంటే ఇప్పటికీ కన్నీళ్ళు కారతాయి, ఎవరికి తెలుసు (నా కోసం ఆమె కోరుకున్న జీవితాన్ని) నాకివ్వలేక, నన్ను నిస్వార్థంగా దత్తత ఇచ్చిందేమో. ఆమె శరీరంలో మార్పులు చూసి జనులు ఆమెను విమర్శిస్తుంటే, యౌవన అనుభూతులను కోల్పోతూ, తల్లిప్రేమ యొక్క ఈ శ్రమ చివరన ఆమె తన బిడ్డను మరొకరి చేతికి అప్పగిస్తుందని తెలిసి, ఆ తొమ్మిది నెలల్లో ఆమె ఏమి అనుభవించిందో నేను గ్రహించలేను. ఆమె నిస్వార్థ ఎంపికకు, నా స్వాతంత్య్రాన్ని తీసివేసేలా ఆమె తన స్వాతంత్య్రాన్ని ఉపయోగించడానికి ఎంచుకోనందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.” “పరలోక తండ్రి యొక్క దైవిక ప్రణాళిక కొరకు, నన్ను (ప్రేమించి, శ్రద్ధ చూపిన) అపురూపమైన నా తల్లిదండ్రుల కొరకు, నిత్యత్వము కొరకు మన కుటుంబాలతో మనం ముద్రించబడగల దేవాలయాల కొరకు నేనెంతో కృతజ్ఞురాలిని,”15 అని ఎమిలి ముగించింది.

ఛాయాచిత్ర దృశ్య రూపకల్పన

రక్షకుడు “ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగిలించుకొని–ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనునని వారితో చెప్పెను.”16

ధర్మబద్ధమైన కోరికలు ఇంకా సాకారం కానప్పుడు

పెళ్ళి చేసుకొని, ఎంతో ఆశగా ఎదురుచూసినప్పటికీ పిల్లలు కలుగని నీతిమంతులైన దంపతుల కొరకు మరియు దేవుని చట్టము ప్రకారము పెళ్ళి చేసుకొనే అవకాశం కలుగని స్త్రీ పురుషుల కొరకు నా ప్రేమను, కనికరమును నేను వ్యక్తపరుస్తున్నాను. కేవలం మర్త్యత్వపు దృష్టితో చూసినట్లయితే, జీవితంలో నెరవేరని కలలను అర్థం చేసుకోవడం కష్టము. మీరు యేసు క్రీస్తుపట్ల, మీ నిబంధనల పట్ల విశ్వాసంగా ఉన్నప్పుడు, ఈ జీవితంలో తగిన దీవెనలను పొందుతారని మరియు ప్రభువు యొక్క చిత్తమును బట్టి నిత్యత్వంలో మీ నీతిగల కోరికలు నెరవేరుతాయని ప్రభువు యొక్క సేవకునిగా నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.17 నీతివంతమైన మన ఆశలన్నీ నెరవేరనప్పటికీ, మర్త్యత్వము యొక్క ప్రయాణంలో సంతోషము ఉండగలదు.18

పుట్టుక తర్వాత, పిల్లలకు మన నిరంతర సహాయం అవసరం. కొద్దిమందికి అది చాలా అవసరం. ప్రతి సంవత్సరం ప్రేమగల బిషప్పుల ద్వారా మరియు ధారాళంగా మీరు విరాళమిచ్చే ఉపవాస అర్పణలు, మానవ సంక్షేమ నిధుల ద్వారా లక్షలమంది పిల్లల జీవితాలు దీవించబడుతున్నాయి. రెండు బిలియన్ల టీకాలు వేయాలనే వారి అంతర్జాతీయ ప్రయత్నాలలో యునిసెఫ్‌కు సహాయపడేందుకు ఇటీవల ప్రథమ అధ్యక్షత్వము అదనంగా 20 మిలియన్ డాలర్లను ప్రకటించింది.19 పిల్లలు దేవునిచేత ప్రేమించబడ్డారు.

సంతానం పొందే పవిత్ర నిర్ణయం

ప్రపంచంలోని మిక్కిలి సంపన్న దేశాల్లో కొన్నింటిలో కూడా కొద్దిమంది పిల్లలే జన్మించడం విచారకరం.20 “దేవుడు భూమిని హెచ్చించి మరియు నింపుమని ఆయన బిడ్డలకిచ్చిన ఆజ్ఞ ఇప్పటికీ అమలులోనున్నది.”21 బిడ్డను ఎప్పుడు కనాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి అనేవి భార్యాభర్తలు మరియు ప్రభువు మధ్య చేయబడవలసిన వ్యక్తిగత నిర్ణయాలు. విశ్వాసం మరియు ప్రార్థనతో ఈ పవిత్రమైన నిర్ణయాలు అందమైన, బయల్పాటుతో కూడిన అనుభవాలు కాగలవు.22

దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన లైంగ్ కుటుంబ కథను నేను పంచుకుంటాను. సహోదరి రెబెకా లైంగ్ ఇలా వ్రాస్తున్నారు:

లాయింగ్ కుటుంబం

“2011 వేసవికాలంలో, మా కుటుంబ జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లనిపించింది. మేము పెళ్ళి చేసుకొని, నలుగురు పిల్లలతో సంతోషంగా ఉన్నాము—వారి వయస్సు 9, 7, 5 మరియు 3. …

“నా గర్భధారణలు, కాన్పులు అధిక ప్రమాదంతో కూడుకున్నవి … మా కుటుంబం సంపూర్ణమైందని (అనుకుంటూ), నలుగురు పిల్లలున్నందుకు మేము (చాలా) దీవించబడినట్లు భావించాము. అక్టోబరులో సర్వసభ్య సమావేశాన్ని వింటున్నప్పుడు, మేము మరొక బిడ్డను కనాలనే స్పష్టమైన భావన నాకు కలిగింది. నేను మరియు లీగ్రాండ్ ధ్యానించి, ప్రార్థించినప్పుడు, … మా కోసం మేము కలిగియున్న దానికి భిన్నమైన ప్రణాళికను దేవుడు కలిగియున్నాడని మేము తెలుసుకున్నాము.

“మరొక కష్టమైన గర్భధారణ మరియు కాన్పు తర్వాత, మేము అందమైన పాపతో దీవించబడ్డాము. ఆమెకు బ్రీల్లి అని పేరు పెట్టాము. ఆమె ఒక అద్భుతం. ఆమె పుట్టిన కొంతసేపటికి, (కాన్పు గది)లో ఉండగానే, నేను ఆత్మ యొక్క స్పష్టమైన స్వరాన్ని విన్నాను: ‘మరొకరు ఉన్నారు.’

“మూడు సంవత్సరాల తర్వాత, మరొక అద్భుతం, మియా. బ్రీల్లి మరియు మియా మా కుటుంబానికి అత్యంత ఆనందాన్నిచ్చారు.” “మన స్వబుద్ధిని ఆధారము చేసికొనక … ప్రభువు యొక్క నడిపింపును వినడానికి మరియు మన కొరకు ఆయన ప్రణాళికను అనుసరించడానికి సమ్మతించడం ఎల్లప్పుడూ గొప్ప సంతోషాన్ని తెస్తుంది,” అని ఆమె ముగించింది.23

బ్రియెల్ మరియు మియా లాయింగ్

రక్షకుడు ప్రతి విలువైన బిడ్డను ప్రేమించును

“మరియు ఆయన వారి చిన్న పిల్లలను ఒకరి తరువాత ఒకరిని తీసుకొని, వారిని ఆశీర్వదించెను, …

“మరియు … వారు తమ దృష్టిని పరలోకము వైపు త్రిప్పగా, … అది అగ్నిమధ్యలో నుండియైనట్లు పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చుటను వారు చూచిరి; (దేవదూతలు) … చిన్నపిల్లల చుట్టూ చుట్టుకొనిరి, … మరియు దేవదూతలు వారికి పరిచర్య చేసిరి.”24

దేవుని బిడ్డగా మీ స్వంత వ్యక్తిగత ప్రయాణం మీరు పుట్టిన తర్వాత మొదటిసారి ఊపిరి తీసుకున్నప్పుడు మొదలుకాలేదని మరియు మీ మరణంతో అది అంతం కాదని నేను సాక్ష్యమిస్తున్నాను.

దేవుని యొక్క ప్రతి ఆత్మీయ బిడ్డ తన స్వంత వ్యక్తిగత ప్రయాణం కొరకు భూమిపైకి వస్తున్నారని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం.25 మనం వారిని స్వాగతిద్దాం, వారిని రక్షిద్దాం, వారిని ఎల్లప్పుడూ ప్రేమిద్దాం. మీరు అమూల్యమైన ఈ పిల్లలను రక్షకుని పేరిట స్వీకరించి, వారి నిత్య ప్రయాణంలో వారికి సహాయపడినప్పుడు, ప్రభువు మిమ్మల్ని దీవిస్తారని, ఆయన ప్రేమను, సమ్మతిని మీపై కురిపిస్తారని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. వ్యక్తిగత సంబంధము.

  2. వ్యక్తిగత సంబంధము. సూచించబడిన పాట: “I Know That My Redeemer Lives,” Hymns, no. 136.

  3. వ్యక్తిగత సంబంధము.

  4. సిద్ధాంతము మరియు నిబంధనలు 42:45.

  5. జోసెఫ్ ఎఫ్. స్మిత్, సమావేశ నివేదికలో, ఏప్రి. 1916, 3.

  6. In Trent Toone, “‘A Fulness of Joy’: President Nelson Shares Message of Eternal Life at His Daughter’s Funeral,” Church News, Jan. 19, 2019, thechurchnews.com.

  7. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” ChurchofJesusChrist.org చూడండి.

  8. సిద్ధాంతము మరియు నిబంధనలు 138:56.

  9. యిర్మీయా 1:5. శిశువు యేసు కొరకు నిరీక్షించుచున్న మరియ యొక్క వందనవచనము వినగానే ఎలీసబెతు గర్భములో బాప్తీస్మమిచ్చు యోహాను గంతులు వేసెనని క్రొత్త నిబంధన చెప్తుంది (లూకా 1:41 చూడండి).

  10. యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధికారిక స్థానము:

    “మానవజాతి యొక్క పవిత్రతయందు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము విశ్వసిస్తుంది. కావున, వ్యక్తిగత లేదా సామాజిక సౌకర్యార్థం గర్భస్రావాన్ని ఎంచుకోవడాన్ని సంఘము వ్యతిరేకిస్తుంది మరియు సభ్యులు దానికి లోబడరాదని, దానిని నిర్వహించరాదని, ప్రోత్సహించరాదని, దానికొరకు చెల్లించరాదని లేదా అటువంటి గర్భస్రావాల కొరకు ఏర్పాట్లు చేయరాదని సలహా ఇస్తుంది.

    “క్రింది పరిస్థితులలో సంఘము దాని సభ్యుల కొరకు సాధ్యమైన మినహాయింపులను అనుమతిస్తుంది:

    “మానభంగము లేదా వావివరుసలు తప్పడం మూలంగా గర్భధారణ జరిగినప్పుడు, లేదా

    “దానిని కొనసాగించడం వలన తల్లి ఆరోగ్యానికి లేదా ప్రాణానికి ముప్పు రాగలదని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు, లేదా

    “పుట్టిన తర్వాత బిడ్డ బ్రతకలేనంతగా పిండానికి తీవ్రమైన లోపాలున్నాయని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు.

    “ఈ అరుదైన మినహాయింపులు కూడా వాటంతటవే గర్భస్రావాన్ని సమర్థించవని సంఘము దాని సభ్యులకు బోధిస్తుంది. గర్భస్రావమనేది అత్యంత గంభీరమైన విషయం మరియు సంబంధిత వ్యక్తులు వారి స్థానిక సంఘ నాయకులను సంప్రదించి, వారి నిర్ణయం సరైనదని వ్యక్తిగత ప్రార్థన ద్వారా భావించిన తర్వాత మాత్రమే దానిని పరిగణించాలి.

    “గర్భస్రావం గురించి శాసనసభ ప్రతిపాదనలు లేదా బహిరంగ ప్రదర్శనలను సంఘం ఇష్టపడలేదు లేదా వ్యతిరేకించలేదు” (“Abortion,” Newsroom, newsroom.ChurchofJesusChrist.org; see also General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 38.6.1, ChurchofJesusChrist.org కూడా చూడండి).

  11. గార్డెన్ బి. హింక్లీ, “ “Walking in the Light of the Lord,” Ensign, Nov. 1998, 99; Liahona, Jan. 1999, 117.

    అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా అన్నారు:

    “గర్భస్రావమనేది అసహ్యమైన విషయం, నీచమైన విషయం, తప్పకుండా శోకం, బాధ మరియు పశ్చాత్తాపాన్ని తెచ్చే విషయం.

    “మనం దానిని నిరసించినప్పటికీ, మానభంగము లేదా వావివరుసలు తప్పడం మూలంగా గర్భధారణ జరిగినప్పుడు, దానిని కొనసాగించడం వలన తల్లి ఆరోగ్యానికి లేదా ప్రాణానికి ముప్పు రాగలదని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు, లేదా పుట్టిన తర్వాత బిడ్డ బ్రతకలేనంతగా పిండానికి తీవ్రమైన లోపాలున్నాయని సమర్థుడైన వైద్యుడు నిర్థారించినప్పుడు, అటువంటి పరిస్థితులలో మనము మినహాయింపునిస్తాము.

    “కానీ అటువంటి సందర్భాలు అరుదైనవి మరియు అటువంటివి జరగడానికి చాలా తక్కువ సంభనీయత గలదు. ఈ పరిస్థితులలో సందేహమున్న వారు తమ స్థానిక ధార్మిక నాయకులను సంప్రదించి, మనఃపూర్వకంగా ప్రార్థించి, చర్య తీసుకోవడానికి ముందు ప్రార్థన ద్వారా నిర్థారణను పొందమని అడుగబడ్డారు”(“What Are People Asking about Us?,” Ensign, Nov. 1998, 71; Liahona, Jan. 1999, 83–84).

  12. నీల్ ఎల్. ఆండర్సన్, The Divine Gift of Forgiveness (2019), 25 చూడండి.

    ఫ్రాన్సులో ఒక సందర్భంలో, ఒక బాప్తీస్మపు మౌఖికంలో, చాలా ఏళ్ళ క్రితం జరిగిన తన గర్భస్రావం గురించి ఒక స్త్రీ నాతో మాట్లాడింది. ఆమె మంచితనానికి నేను కృతజ్ఞుడిని. ఆమె బాప్తీస్మం పొందింది. ఒక సంవత్సరం తర్వాత, నేను ఫోను పిలుపు అందుకున్నాను. ఈ అద్భుతమైన స్త్రీ తాను బాప్తీస్మము తీసుకున్న సంవత్సరం నుండి పరిశుద్ధాత్మ చేత బోధించబడింది. ఆమె రోదిస్తూ అన్నది: “చాలాకాలం క్రితం జరిగిన ఒక గర్భస్రావం గురించి నేను మీతో చెప్పాను, మీకు గుర్తుందా? నేను చేసిన దానికొరకు నేను బాధపడుతున్నాను. కానీ, గత సంవత్సరం నన్ను మార్చింది. నా హృదయం రక్షకుని వైపు తిరిగింది. … నా పాపము యొక్క గంభీరత నన్ను ఎంతగా బాధించిందంటే, నేను ఆ జీవిని పునరుద్ధరించలేకపోయాను.”

    ఈ స్త్రీ కొరకు ప్రభువు యొక్క అపారమైన ప్రేమను నేను భావించాను. అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ చెప్పారు, “మీరు పూర్వపు స్థితికి తేలేని దానిని తెచ్చుట, స్వస్థపరచలేని గాయమును స్వస్థపరచుట, మీరు విరుగగొట్టిన దానిని, సరిచేయలేని దానిని సరిచేయుటయే క్రీస్తు ప్రాయశ్చిత్తము యొక్క ముఖ్యమైన ఉద్దేశము. మీ కోరిక స్థిరమైనదై, మీరు ‘కడపటి కాసు’ (మత్తయి 5:25–26 చూడండి) చెల్లించడానికి సమ్మతించినప్పుడు, పూర్వస్థితీకరణ చట్టం రద్దుచేయబడుతుంది. మీరు చెల్లించవలసినది ప్రభువుకు తరలించబడుతుంది. మీరు చెల్లించవలసిన దానిని ఆయన చెల్లిస్తారు” (“The Brilliant Morning of Forgiveness,” Ensign, Nov. 1995, 19–20). నేను ఆమెకు రక్షకుని ప్రేమ యొక్క అభయమిచ్చాను. ప్రభువు ఆమె పాపాన్ని ఆమె నుండి తీసివేయడమే కాకుండా, ఆయన ఆమె ఆత్మను బలపరచి, శుద్ధిచేసారు. (నీల్ ఎల్. ఆండర్సన్, The Divine Gift of Forgiveness, 154–56 చూడండి.)

  13. డాల్లిన్ హెచ్. ఓక్స్, “Protect the Children,” Liahona, Nov. 2012, 43–46 చూడండి.

  14. దేవుని కుమారుడు లేదా కుమార్తె జీవితాన్ని రక్షించడం కూడా తండ్రి యొక్క బాధ్యత. భూమిపై పుట్టబోతున్న బిడ్డను స్వాగతించి, ప్రేమించి, శ్రద్ధ చూపడానికి ప్రతి తండ్రి మానసిక, ఆత్మీయ మరియు ఆర్థికపరమైన బాధ్యత కలిగియున్నాడు.

  15. వ్యక్తిగత సంబంధము.

  16. మార్కు 9:36–37.

  17. నీల్ ఎల్. ఆండర్సన్, “A Compensatory Spiritual Power for the Righteous” (Brigham Young University devotional, Aug. 18, 2015), speeches.byu.edu చూడండి.

  18. డాల్లిన్ హెచ్. ఓక్స్, “The Great Plan of Happiness,” Ensign, Nov. 1993, 75 చూడండి; రస్సెల్ ఎమ్. నెల్సన్, “Choices,” Ensign, Nov. 1990, 75 కూడా చూడండి.

  19. Bishop Caussé Thanks UNICEF and Church Members for COVID-19 Relief,” Newsroom, Mar. 5, 2021, newsroom.ChurchofJesusChrist.org చూడండి.

  20. ఉదాహరణకు, సంయుక్త రాష్ట్రాలు 13 ఏళ్ళ క్రితం 2008లో ఉన్న సంతాన సాఫల్య రేటును నిలుపుకున్నట్లయితే, ఈనాడు మరి 5.8 మిలియన్ల మంది పిల్లలు జీవించియుండేవారు (see Lyman Stone, “5.8 Million Fewer Babies: America’s Lost Decade in Fertility,” Institute for Family Studies, Feb. 3, 2021, ifstudies.org/blog).

  21. కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” ChurchofJesusChrist.org చూడండి. “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” (కీర్తనలు 127:3) అని లేఖనాలు నమోదు చేసాయి. రస్సెల్ ఎమ్. నెల్సన్, “How Firm Our Foundation,” Liahona, July 2002, 83–84 చూడండి; డాల్లిన్ హెచ్. ఓక్స్, “Truth and the Plan,” Liahona, Nov. 2018, 27 కూడా చూడండి.

  22. నీల్ ఎల్. ఆండర్సన్, “Children,” Liahona, Nov. 2011, 28 చూడండి.

  23. వ్యక్తిగత సంబంధము, మార్చి 10, 2021.

  24. 3 నీఫై 17:21, 24.

  25. “వాస్తవానికి, మనమందరము ప్రయాణీకులం—మర్త్యత్వము యొక్క అన్వేషకులం. మునుపటి వ్యక్తిగత అనుభవం యొక్క ప్రయోజనం మనకు లేదు. ఇక్కడ భూమి మీద మన స్వంత ప్రయాణంలో మనం తప్పకుండా మిక్కిలి ఏటవాలుగానుండు కొండలను, అల్లకల్లోలంగా ఉన్న జలాలను దాటాలి” (థామస్ ఎస్. మాన్సన్, “The Bridge Builder,” Liahona, Nov. 2003, 67).