తీవ్రమైన అన్యాయము
యేసు క్రీస్తు అన్యాయాన్ని అర్థం చేసుకుంటారు మరియు న్యాయం చేయడానికి ఆయనకు శక్తి ఉంది.
1994లో, జాతుల మధ్య సత్సంబంధాలు లేని కారణంగా కొంతవరకు తూర్పు ఆఫ్రికా దేశమైన ఆర్వాండాలో జాతి విధ్వంసం చోటు చేసుకుంది. ఐదు లక్షల కంటే ఎక్కువమంది చంపబడినట్లు అంచనా.1 ఆర్వాండా ప్రజలలో అధికశాతం శాంతపరచబడడం విశేషం, కానీ ఈ సంఘటనలు ప్రతిధ్వనించడం కొనసాగింది.2
పది సంవత్సరాల క్రితం, ఆర్వాండాను దర్శించినప్పుడు నా భార్య, నేను కిగాలి విమానాశ్రయంలో మరొక ప్రయాణికుడితో మాటలు కలిపాము. అతడు జాతి విధ్వంసం యొక్క అన్యాయానికి విలపించి, “దేవుడనే వాడు ఉంటే, ఆయన ఏదైనా చేసేవాడు కదా?” అని తీక్షణంగా అడిగాడు. ఈ వ్యక్తి కొరకు—మనలో అనేకమందికి—బాధ మరియు తీవ్ర అన్యాయము అనేవి దయగల, ప్రియమైన పరలోక తండ్రి యొక్క వాస్తవికతతో సంబంధం లేనివిగా అనిపించగలవు. అయినప్పటికీ ఆయన నిజము, ఆయన దయగలవాడు మరియు తన పిల్లలలో ప్రతిఒక్కరిని ఆయన పరిపూర్ణంగా ప్రేమిస్తారు. ఈ ద్వంద్వ భావము మానవజాతి అంత పాతది మరియు చిన్నగా లేదా అతికొద్ది మాటలలో వివరించబడలేదు.
దానిని కొద్దిగా అర్థం చేసుకోవడానికి, వివిధ రకాల అన్యాయాలను మనం పరిశోధించుదాం. ఒక కుటుంబంలో ఇంటి పనులు చేసినందుకుగాను ప్రతిబిడ్డకు వారానికి ఒకసారి ఖర్చుల కొరకు డబ్బు ఇవ్వడాన్ని పరిగణించండి. ఒక కొడుకు జాన్ మిఠాయి కొనుక్కున్నాడు; ఒక కూతురు ఆన్నా తన డబ్బు దాచుకుంది. కొంతకాలానికి ఆన్నా తనకోసం ఒక సైకిలు కొనుక్కుంది. తనకు లేకుండా ఆన్నా సైకిలు కొనుక్కోవడం చాలా అన్యాయమని జాన్ భావించాడు. జాన్ ఎంపికలు అసమానతను సృష్టించాయి, కానీ తల్లిదండ్రుల చర్యలు కాదు. మిఠాయి తినడం వల్ల వచ్చే తక్షణ తృప్తిని వదిలివేయాలనే ఆన్నా నిర్ణయం వల్ల జాన్‌కు ఎటువంటి అన్యాయం జరుగలేదు, ఎందుకంటే అతడు, అతని సహోదరి ఒకేవిధమైన అవకాశాన్ని కలిగియున్నారు.
అదేవిధంగా మన నిర్ణయాలు దీర్ఘ-కాలిక లాభాలను లేదా నష్టాలను కలుగజేయగలవు. ప్రభువు బయల్పరచినట్లుగా, “ఈ లోకములో ఒక వ్యక్తి తన శ్రద్ధవలన, విధేయతవలన మరియొకని కంటే ఎక్కువ జ్ఞానమును, మేధస్సును సంపాదించుకొనిన యెడల, రాబోవు లోకములో అతడు ఎక్కువ ప్రయోజనమును కలిగియుండును.”3 తమ శ్రద్ధగల ఎంపికల వలన ఇతరులు లాభాలు పొందినప్పుడు, మనకు అదే అవకాశము ఉన్నప్పుడు మనకు నిజంగా అన్యాయం జరిగిందని మనం భావించలేము.
అన్యాయానికి మరొక ఉదాహరణ, నా భార్య రూత్ చిన్నతనంలో ఎదుర్కొన్న సందర్భం నుండి వచ్చింది. ఒకరోజు, క్రొత్త బూట్లు కొనడానికి తన చెల్లి మెర్లాను వాళ్ళ అమ్మ తీసుకువెళ్తుందని రూత్ తెలుసుకుంది. రూత్ ఫిర్యాదు చేసింది, “అమ్మా, ఇది చాలా అన్యాయం! మెర్లాకు ఇంతకుముందే క్రొత్త బూట్లు కొన్నారు.”
“రూత్, నీ బూట్లు సరిపోతున్నాయా?” అని రూత్ తల్లి అడిగింది.
“సరిపోతున్నాయి,” అని రూత్ జవాబిచ్చింది.
అప్పుడు రూత్ తల్లి, “మెర్లా బూట్లు సరిపోవడం” లేదు అని చెప్పింది.
కుటుంబంలో ప్రతిబిడ్డకు సరిపోయే బూట్లు ఉండాలని రూత్ ఒప్పుకుంది. రూత్‌కు క్రొత్త బూట్లు ఇష్టమైనప్పటికీ, పరిస్థితులను తన తల్లి దృష్టితో చూసినప్పుడు తనకు అన్యాయం జరిగిందనే ఆమె భావన తొలగిపోయింది.
కొన్ని అన్యాయాలు వివరించబడలేవు; చెప్పడానికి వీలుకాని అన్యాయాలు తీవ్రమైనవి. అన్యాయమనేది అపరిపూర్ణమైన, గాయపడిన లేదా రోగముతోనున్న వారితో జీవించడం నుండి వస్తుంది. మర్త్య జీవితం స్వభావసిద్ధంగా అన్యాయమైనది. కొంతమంది ఐశ్వర్యంలో జన్మిస్తారు, కొందరు జన్మించరు. కొంతమందికి ప్రేమగల తల్లిదండ్రులు ఉంటారు, కొందరికి ఉండరు. కొంతమంది అనేక సంవత్సరాలు జీవిస్తారు, కొందరు కొద్దికాలమే జీవిస్తారు. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. కొందరు వ్యక్తులు మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇతరులను గాయపరిచే తప్పులు చేస్తారు. కొంతమంది తమకు వీలైనప్పుడు కూడా అన్యాయాన్ని తగ్గించడానికి ప్రయత్నించరు. వారెన్నడూ అలా చేయకూడదని తెలిసినా కొందరు వ్యక్తులు దేవుడిచ్చిన స్వతంత్రతను ఇతరులను గాయపరచడానికి ఉపయోగించడం విచారకరం.
వివిధ రకాల అన్యాయాలు కలిసి ఘోరమైన అన్యాయపు సునామీని సృష్టించగలవు. ఉదాహరణకు, ఇప్పటికే అనేకరకాల నష్టాలకు లోనైన వారిని కొవిడ్-19 మహమ్మారి విపరీతంగా ప్రభావితం చేసింది. అటువంటి అన్యాయానికి గురైన వారి కొరకు నా మనస్సు బాధపడుతోంది, కానీ యేసు క్రీస్తు అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని మరియు న్యాయం చేయడానికి ఆయనకు శక్తి ఉందని మనస్ఫూర్తిగా నేను ప్రకటిస్తున్నాను. ఆయన సహించిన అన్యాయంతో పోల్చదగినది ఏదీ లేదు. మానవజాతి యొక్క బాధలు, శ్రమలన్నిటిని ఆయన అనుభవించడం అన్యాయం. నా పాపాలు, తప్పులు మరియు మీ వాటికొరకు ఆయన బాధననుభవించడం అన్యాయం. కానీ, మన కొరకు మరియు పరలోక తండ్రి కొరకు ఆయన ప్రేమ మూలంగా అలా చేయడానికి ఆయన ఎంచుకున్నారు. మనం అనుభవిస్తున్న దానిని ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటారు.4
దేవుడు వారికి అన్యాయం చేస్తున్నాడని ప్రాచీన ఇశ్రాయేలీయులు ఫిర్యాదు చేసారని లేఖనాలు వ్రాసాయి. దానికి జవాబుగా యెహోవా ఇలా అడిగారు, “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా?” ప్రేమగల తల్లి తన చంటిపిల్లను మరువలేనట్లే, ఆయన ప్రేమ మరింత స్థిరమైనదని యెహోవా ప్రకటించారు. ఆయనిలా ధృవీకరించారు: “వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను; నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి.”5 అనంతమైన ప్రాయశ్చిత్త త్యాగమును యేసు క్రీస్తు సహించినందున, ఆయన మన మనోభావాలను పూర్తిగా గ్రహించగలరు. 6 ఆయన మనల్ని, మన పరిస్థితులను ఎల్లప్పుడూ ఎరిగియున్నారు.
మర్త్యత్వములో మనము “ధైర్యముగా” రక్షకుని యొద్దకు వచ్చి, కనికరము, స్వస్థత మరియు సహాయము పొందగలము.7 వివరించలేని విధంగా మనము బాధపడుతున్నప్పటికీ, సరళమైన, సాధారణమైన, ప్రత్యేక విధానాలలో దేవుడు మనల్ని దీవించగలరు. ఈ దీవెనలను గుర్తించడాన్ని మనం నేర్చుకున్నప్పుడు, దేవుని యందు మన నమ్మకం పెరుగుతుంది. నిత్యత్వములో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు అన్యాయాలన్నిటిని పరిష్కరిస్తారు. ఎలా మరియు ఎప్పుడు అని వివేకంతో మనం తెలుసుకోవాలనుకుంటున్నాము. వారు దానిని ఎలా చేయబోతున్నారు? వారు దానిని ఎప్పుడు చేయబోతున్నారు? నాకు తెలిసినంతవరకు, ఎలా లేదా ఎప్పుడు అనేది వారు బయల్పరచలేదు. 8 వారు చేస్తారని మాత్రం నాకు తెలుసు.
అన్యాయకరమైన పరిస్థితులలో మనం చేయవలసిన పనుల్లో ఒకటి, “జీవితంలో అన్యాయమనిపించినవన్నీ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సరిచేయబడగలవు” అని నమ్మడం.9 యేసు క్రీస్తు లోకమును జయించి, అన్యాయమంతటిని “గ్రహించుకొనెను”. ఆయన మూలముగా మనము ఈ లోకములో సమాధానము కలిగియుండగలము మరియు ధైర్యము తెచ్చుకోగలము.10 మనం ఆయనను అనుమతించినట్లయితే, యేసు క్రీస్తు అన్యాయమును మన ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును.11 ఆయన మనల్ని ఓదార్చడమే కాకుండా, కోల్పోయిన దానిని పునఃస్థాపిస్తారు;12 ఆయన అన్యాయమును మన ప్రయోజనము కొరకు ఉపయోగిస్తారు. ఎలా మరియు ఎప్పుడు అనే విషయానికి వస్తే, మనం ఆల్మా వలె గుర్తించి, అంగీకరించాలి, “ఇది ముఖ్యమైనది కాదు; ఏలయనగా ఈ సంగతులన్నిటినీ దేవుడు ఎరుగును; మరియు పరిస్థితి ఇదియని ఎరుగుట నాకు చాలును.”13
ఎలా మరియు ఎప్పుడు అనేదాని గురించి మన ప్రశ్నలను కొంతకాలం నిలిపివేసి, అన్నిటిని సరిచేసే శక్తిని యేసు క్రీస్తు కలిగియున్నారని మరియు ఆవిధంగా చేయాలని ఆశిస్తున్నారని ఆయన యందు విశ్వాసాన్ని వృద్ధిచేయడంపై దృష్టిసారించడానికి మనం ప్రయత్నించగలము.14 ఎలా మరియు ఎప్పుడు అని తెలుసుకోవాలని మనం పట్టుబట్టడం ఉపయోగం లేనిది మరియు దూరదృష్టి లేకపోవడం వంటిది.15
మనం యేసు క్రీస్తు యందు విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటున్నప్పుడు, ఆయనలా మారడానికి కూడా మనం ప్రయత్నించాలి. అప్పుడు మనం ఇతరుల పట్ల కనికరము చూపుతాము మరియు కనిపించినప్పుడల్లా అన్యాయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాము;16 మనం ప్రభావం చూపగల పరిధిలో సరిచేయడానికి మనం ప్రయత్నించగలము. వాస్తవానికి, మనం “ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమై, (మన) ఇష్టపూర్వకముగా అనేక కార్యములు చేసి, అధికమైన నీతిని నెరవేర్చవలెను” అని రక్షకుడు నిర్దేశించారు.17
అన్యాయంతో పోరాడడంలో ఆతృతతో నిమగ్నమైయున్న వారు వకీలు బ్రయన్ స్టీవెన్‌సన్. తప్పుగా నేరం మోపబడిన వారిని రక్షించడానికి, సరైన శిక్షను విధింపజేయడానికి మరియు ప్రాథమిక మానవ హక్కులను కాపాడడానికి సంయుక్త రాష్ట్రాలలో ఆయన న్యాయాభ్యాసము అంకితం చేయబడింది. కొన్నేళ్ళ క్రితం, తప్పుగా హత్యానేరం మోపబడి, మరణశిక్షకు గురైన ఒక వ్యక్తిని స్టీవెన్‌సన్ కాపాడారు. ఆ వ్యక్తి తన సంఘంలో క్రియాశీలకంగా లేనప్పటికీ మరియు అతని వివాహేతర సంబంధం గురించి తెలిసి అనేకమంది చెడుగా మాట్లాడినప్పటికీ, సహకారం కొరకు అతని స్థానిక క్రైస్తవ సంఘాన్ని స్టీవెన్‌సన్ అడిగారు.
నిజంగా ముఖ్యమైన దానిపై జనులు దృష్టిసారించేలా చేయడానికి స్టీవెన్‌సన్ వారితో వ్యభిచార నేరం మోపబడి యేసు వద్దకు తీసుకురాబడిన స్త్రీ గురించి మాట్లాడారు. నేరము మోపినవారు ఆమెను రాళ్ళు రువ్వి చంపవలెనని కోరారు, కానీ “మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని” యేసు చెప్పారు.18 స్త్రీ మీద నేరం మోపినవారు వెళ్ళిపోయారు. యేసు ఆమెను శిక్షించలేదు, కానీ ఇక పాపము చేయకుమని ఆమెను ఆజ్ఞాపించారు.19
ఈ సంగతి చెప్పిన తర్వాత, అహంకారము, భయము మరియు కోపము క్రైస్తవులను కూడా పొరపాటు చేసేవారిపై రాళ్ళు రువ్వునట్లు చేసిందని స్టీవెన్‌సన్ గమనించారు. తరువాత ఆయన, “మనం దానిని చూస్తూ ఊరుకోలేము” అన్నారు, మరియు సభ్యులను “రక్షకులుగా” మారమని ప్రోత్సహించారు.20 సహోదర సహోదరీలారా, రాళ్ళు రువ్వకపోవడం ఇతరుల పట్ల కనికరం చూపడంలో మొదటి మెట్టు. రెండవది, ఇతరులు వేసే రాళ్ళ నుండి కాపాడేందుకు ప్రయత్నించడం.
లాభాలు, నష్టాలతో మనం ఎలా వ్యవహరిస్తామనేది జీవితపు పరీక్షలో భాగము. మనం మాట్లాడేదాని కంటే ఎక్కువగా, గాయపడిన వారిని మరియు నష్టపోయిన వారిని మనమెలా ఆదరిస్తామనే దానిచేత మనం తీర్పుతీర్చబడతాము.21 కడవరి-దిన పరిశుద్ధులుగా మనము మేలు చేయుచు సంచరించుచున్న రక్షకుని మాదిరిని అనుసరించడానికి వెదుకుతాము.22 పరలోక తండ్రి పిల్లలందరి మర్యాదను కాపాడుటకు పనిచేయడం ద్వారా మనము మన పొరుగువారి పట్ల మన ప్రేమను చూపుతాము.
మన స్వంత లాభనష్టాల గురించి లోతుగా ఆలోచించడం మంచిది. ఆన్నా ఎందుకు సైకిలు పొందిందో గ్రహించడానికి జాన్‌కు తన వైఖరి అన్నిటిని తెలిపింది. తన తల్లి దృష్టితో చూడడం వల్ల మెర్లాకు బూట్లు అవసరమని రూత్‌కు విశదపరచబడింది. నిత్య దృష్టితో చూడడానికి ప్రయత్నించడం వలన విషయాలు స్పష్టపరచబడగలవు. మనం రక్షకుని వలె మరింతగా మారినప్పుడు, మనం మరింత సానుభూతిని, గ్రహింపును, దాతృత్వాన్ని వృద్ధిచేస్తాము.
ఆర్వాండా జాతి విధ్వంసం యొక్క అన్యాయం గురించి విలపిస్తూ, “దేవుడనే వాడు ఉంటే, ఆయన ఏదైనా చేసేవాడు కదా?” అని అడిగిన కిగాలిలోని మా తోటి ప్రయాణికుడు వేసిన ప్రశ్నకు నేను తిరిగివెళ్తాను.
జాతి విధ్వంసం వలన ఏర్పడిన బాధను తక్కువ చేసి చూపకుండా, అటువంటి బాధను అర్థం చేసుకోవడంలో మా అసమర్థతను ఒప్పుకున్న తర్వాత, తీవ్రమైన అన్యాయం గురించి యేసు క్రీస్తు ఏమి చేసారో మేము చెప్పాము.23 యేసు క్రీస్తు మరియు ఆయన సంఘము యొక్క పునఃస్థాపన గురించి మేము అనేక సువార్త సూత్రాలను వివరించాము.24
తరువాత, మా పరిచయస్థుడు కన్నీళ్ళతో అడిగాడు, “అంటే చనిపోయిన నా తల్లిదండ్రులు, బాబాయి కోసం నేను చేయవలసినదేదో ఉందని మీరంటున్నారా?”
“అవును!” అన్నాము మేము. తరువాత, జీవితంలోని అన్యాయమంతా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా సరిచేయబడగలదని, ఆయన అధికారము చేత కుటుంబాలు శాశ్వతంగా కలిపియుంచబడగలవని మేము సాక్ష్యమిచ్చాము.
అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు, మనల్ని మనము దేవుని నుండి దూరంగా త్రోసివేయగలము లేదా సహాయ సహకారాల కోసం మనం ఆయన వైపు వెళ్ళగలము. ఉదాహరణకు, నీఫైయులు మరియు లేమనీయుల మధ్య జరిగిన సుదీర్ఘ పోరాటం జనులను భిన్నంగా ప్రభావితం చేసింది. “అనేకులు కఠినపరచబడిరి” మరియు ఇతరులు “వారి బాధలను బట్టి మృదువుగా చేయబడిరి, ఎంతగాననగా వారు దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొనిరి” అని మోర్మన్ గమనించాడు.25
అన్యాయము మిమ్మల్ని కఠినులుగా చేయనివ్వకండి లేదా దేవుని యందు మీ విశ్వాసాన్ని హరించివేయనివ్వకండి. బదులుగా, సహాయం కొరకు దేవుడిని అడగండి. రక్షకునిపట్ల మీ అభినందనను, నమ్మకాన్ని హెచ్చించండి. కఠినులుగా మారడానికి బదులుగా, మంచివారిగా మారేందుకు ఆయనను మీకు సహాయం చేయనివ్వండి.26 మీరు పట్టుదలతో ఉండేలా సహాయపడేందుకు, మీ శ్రమలు “క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడునట్లు” చేయుటకు27 ఆయనను అనుమతించండి. “విరిగిన హృదయాలు గలవారిని బాగుచేయడానికి”28 ఆయన పరిచర్యలో ఆయనతో చేరండి, అన్యాయాన్ని తగ్గించడానికి మరియు రక్షకులుగా మారడానికి ప్రయత్నించండి.29
యేసు క్రీస్తు జీవిస్తున్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయన అన్యాయాన్ని అర్థం చేసుకుంటారు. ఆయన అరచేతుల్లోని గురుతులు మిమ్మల్ని, మీ పరిస్థితులను నిరంతరం ఆయనకు గుర్తుచేస్తాయి. మీ నిరాశయంతటిలో ఆయన మీకు పరిచర్య చేస్తారు. ఆయన యొద్దకు వచ్చేవారికి, రోదన యొక్క బూడిదకు బదులుగా అందమైన కిరీటము; బాధ మరియు దుఃఖానికి బదులుగా సంతోషము; నిరాశ నిస్పృహలకు బదులుగా అభినందన, వేడుక ఇవ్వబడుతుంది.30 పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు మీ విశ్వాసానికి మీరు ఊహించిన దానికంటే అధికంగా ప్రతిఫలమివ్వబడుతుంది. అన్యాయము—ప్రత్యేకించి తీవ్రమైన అన్యాయము అంతా—మీ ప్రయోజనము కొరకు ప్రతిష్టించబడుతుంది. ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.