ఇదిగో! నేను అద్భుతములు చేయు దేవుడను
అద్భుతాలు, సూచకక్రియలు మరియు అద్భుతకార్యములు నేడు యేసు క్రీస్తు యొక్క అనుచరులమైన మీ జీవితాల్లో, నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి.
నా ప్రియ సహోదర సహోదరీలారా, నేడు మీ ముందు నిలబడడం ఎంతో సంతోషకరం. ఈ సమావేశంలో ఇదివరకే ప్రసంగించిన వారితోపాటు నేను కూడా యేసు క్రీస్తు జీవించియున్నారని మీకు సాక్ష్యమిస్తున్నాను. తన సంఘాన్ని ఆయన నడిపిస్తారు; ఆయన తన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌తో మాట్లాడతారు, ఆయన పరలోక తండ్రి పిల్లలందరిని ప్రేమిస్తారు.
ఈ ఈస్టరు ఆదివారమునాడు మన రక్షకుడు, విమోచకుడు,1 బలవంతుడైన దేవుడు,2 సమాధానకర్తయగు అధిపతి2 అయిన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అరువు తెచ్చుకున్న సమాధిలో మూడు రోజుల తర్వాత ఆయన పునరుత్థానముతో పూర్తవుతున్న ఆయన ప్రాయశ్చిత్తము మానవ చరిత్రలో అతిగొప్ప అద్భుతంగా నిలుస్తుంది. “ఇదిగో, నేను దేవుడను, అద్భుతములు చేయు దేవుడను,”3 అని ఆయన ప్రకటించారు.
“క్రీస్తు పరలోకములోనికి ఆరోహణుడై దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చున్నందున అద్భుతములు ఆగిపోయినవా?”4 అని మోర్మన్ గ్రంథములో ప్రవక్త మొరోనై అడుగుతారు. “ఆగలేదు; నరుల సంతానమునకు దేవదూతలు పరిచర్య చేయుట కూడా మానివేయలేదు”5 అని ఆయన జవాబిస్తారు.
శిలువ వేయబడిన తర్వాత, యేసు దేహాన్ని అభిషేకించడానికి కొద్దిమంది స్త్రీలతో కలిసి సమాధి వద్దకు వెళ్ళిన మరియకు ప్రభువు యొక్క దేవదూత కనిపించారు. దేవదూత ఇలా అన్నారు:
సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?6
“ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు.”7
మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన అబినడై ఆ అద్భుతాన్ని ప్రకటించాడు:
“క్రీస్తు మృతుల నుండి లేచియుండని యెడల, … పునరుత్థానము ఉండేది కాదు.
“కానీ పునరుత్థానమున్నది మరియు మరణము యొక్క ముల్లు క్రీస్తు నందు మ్రింగి వేయబడినది; కావున సమాధికి విజయము లేదు.”8
యేసు క్రీస్తు యొక్క అద్భుతకార్యములు: “ఈయన గాలికిని నీళ్ళకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన యెవరో,”9 అని ఆనాటి శిష్యులు ఆశ్చర్యపడేలా చేసాయి.
ఆనాటి అపొస్తలులు యేసు క్రీస్తును వెంబడించి, ఆయన సువార్తను బోధిస్తుండగా వినినప్పుడు, వారు అనేక అద్భుతాలను చూసారు. “గ్రుడ్డివారు చూపు పొందుటను, కుంటివారు నడుచుటను, కుష్టురోగులు శుద్ధులగుటను, చెవిటివారు వినుటను, చనిపోయినవారు లేపబడుటను, బీదలకు సువార్త ప్రకటింపబడుటను” వారు చూసారు.10
అద్భుతాలు, సూచకక్రియలు మరియు అద్భుతకార్యములు నేడు యేసు క్రీస్తు యొక్క అనుచరులమైన మీ జీవితాల్లో, నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అద్భుతాలనేవి దైవిక క్రియలు, ప్రత్యక్షతలు, దేవుని అనంత శక్తి యొక్క వ్యక్తీకరణలు మరియు ఆయన “నిన్న, నేడు మరియు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు”11 అను ధృవీకరణ. సముద్రాలను సృష్టించిన యేసు క్రీస్తు వాటిని నిమ్మళపరచగలరు; గ్రుడ్డివానికి చూపునిచ్చిన ఆయన మన దృష్టిని పరలోకము వైపు ఎత్తగలరు; కుష్టురోగులను శుద్ధిచేసిన ఆయన మన రోగాలను బాగుచేయగలరు; నపుంసకుని స్వస్థపరచిన ఆయన లేచి, “నన్ను వెంబడించుము”12 అని మనల్ని పిలువగలరు.
మీలో అనేకులు మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ అద్భుతాలను చూసారు. యేసు చనిపోయిన వానిని లేపుటతో పోల్చితే అవి చిన్నవిగా కనిపించవచ్చు. కానీ అది దేవుని నుండి రావడం వలన అద్భుతమైందే తప్ప, దాని పరిమాణం వలన కాదు. అద్భుతాలు కేవలం యాదృచ్ఛికమని లేదా అదృష్టమని కొందరు అంటారు. కానీ ఎవరైతే “దేవుని శక్తిని, అద్భుతములను తిరస్కరించి, పేదలను బాధించి, వారు లాభము పొందునట్లు వారి స్వంత జ్ఞానమును, స్వంత పాండిత్యమును తమకు తామే బోధించుకొందురో,”13 అట్టివారిని ప్రవక్త నీఫై ఖండించారు.
“రక్షించుటకు బలాఢ్యుడైన వాని”14 యొక్క దైవిక శక్తి చేత అద్భుతాలు చేయబడతాయి. అద్భుతాలనేవి దేవుని నిత్య ప్రణాళిక యొక్క విస్తరణలు; అద్భుతాలు పరలోకం నుండి భూమికి జీవనరేఖలు.
గత శరదృతువులో సహోదరి రాస్బాండ్ మరియు నేను, 16 వేర్వేరు భాషలలో 6,00,000లకు పైగా జనులకు ప్రసారం చేయబడిన ప్రపంచవ్యాప్త ముఖాముఖి కోసం యూటాలోని గోషెన్‌కు వెళ్ళే దారిలో ఉన్నాము.15 ప్రపంచవ్యాప్తంగా యుక్తవయస్కుల చేత సమర్పించబడిన ప్రశ్నలతో యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన సంఘటనలపై కార్యక్రమము కేంద్రీకరించబడవలసియుంది. సహోదరి రాస్బాండ్ మరియు నేను వ్యక్తిగతంగా ప్రశ్నలను పునర్వీక్షించాము; జోసెఫ్ స్మిత్ దేవుని ప్రవక్తయని, మా జీవితాల్లో బయల్పాటు యొక్క శక్తి, యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన ముందుకుసాగుట మరియు మేము ప్రశస్తముగా యెంచిన సత్యాలు, ఆజ్ఞల గురించి సాక్ష్యమివ్వడానికి అవి మాకు అవకాశాన్నిచ్చాయి. నేటి శ్రోతలలో అనేకులు ఆ అద్భుత సంఘటనలో భాగస్థులు.
మొదట ఈ ప్రసారం న్యూయార్క్ ఉత్తరభాగంలోని పరిశుద్ధ వనంలో ఆరంభించబడవలసియుంది, అక్కడ జోసెఫ్ స్మిత్ ఇలా సాక్ష్యమిచ్చారు: “గాలిలో నా పైన నిలువబడిన ఇద్దరు వ్యక్తులను నేను చూచితిని, వారి తేజస్సు, మహిమ వర్ణనాతీతముగా నుండెను. వారిలో ఒకరు నన్ను పేరుతో పిలిచి మరొకరిని చూపిస్తూ—ఈయన నా ప్రియకుమారుడు. ఆయనను ఆలకించుము!” అని చెప్పెను. ప్రియమైన సహోదర సహోదరీలారా, అది ఒక అద్భుతము.
ప్రపంచవ్యాప్త మహమ్మారి కారణంగా మేము ప్రసారాన్ని యూటాలోని గోషెన్‌కు తరలించవలసి వచ్చింది, అక్కడ పాత యెరూషలేములో ఒక భాగాన్ని చిత్రీకరించడానికి యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము పునర్నిర్మించబడింది. మా గమ్యస్థానం వైపు నుండి దట్టమైన పొగ రావడం చూసినప్పుడు ఆ ఆదివారం సాయంత్రం నేను, సహోదరి రాస్బాండ్ గోషెన్ నుండి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నాము. ఆ ప్రాంతంలో కార్చిచ్చు మండుతోంది. ప్రసారం కష్టాల్లో పడుతుందేమోనని మేము విచారించాము. దానికి తగినట్లుగానే, మా ప్రసార సమయమైన ఆరు గంటలకు ఇరవై నిముషాల ముందు ఆ భవన సముదాయమంతటా విద్యుత్తు పోయింది. విద్యుత్తు లేదు! ప్రసారాలు లేవు. ఒక జనరేటర్ ఉంది, దానితో పని జరుగుతుందని కొందరు అనుకున్నారు, కానీ మా దగ్గరున్న అధునాతన పరికరాలకు తగినంతగా అది సరఫరా చేస్తుందన్న హామీ లేదు.
కథకులు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులు, నా విస్తార కుటుంబంలోని 20 మంది యుక్తవయస్కులతో పాటు కార్యక్రమములోని వారందరం జరుగబోయే దానికోసం పూర్తిగా పాటుపడ్డాము. వారి కన్నీళ్ళు, కలవరం నుండి కొంచెం దూరం జరిగి, నేను ఒక అద్భుతం కోసం ప్రభువును బ్రతిమాలాను. “పరలోక తండ్రీ, నేను ఎప్పుడోగాని ఒక అద్భుతం కోసం అడుగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను,” అని నేను ప్రార్థించాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా యుక్తవయస్కుల కోసం ఈ సమావేశం తప్పక జరగాలి. మీ చిత్తమైతే ఇది జరగడానికి మాకు విద్యుత్తు కావాలి.”
ఆరు గంటల తర్వాత ఏడు నిముషాలకు, విద్యుత్తు పోయినంత త్వరగా తిరిగి వచ్చింది. సంగీతం నుండి వీడియోలకు కావలసిన మైక్రోఫోనులతో సహా ప్రసార పరికరాలన్నీ పనిచేయడం ప్రారంభించాయి. మేము వెంటనే ప్రసారాన్ని ప్రారంభించగలిగాము. మేము ఒక అద్భుతాన్ని చూసాము.
ఆరోజు సాయంత్రం నేను, సహోదరి రాస్బాండ్ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, అధ్యక్షులు మరియు సహోదరి నెల్సన్ మాకు ఈ సందేశాన్ని పంపారు: “రాన్, విద్యుత్తు పోయిందని విన్న వెంటనే మేము ఒక అద్భుతం కోసం ప్రార్థించామని నువ్వు తెలుసుకోవాలని మేము కోరుతున్నాము.”
కడవరి-దిన లేఖనాలలో ఇలా వ్రాయబడింది: “ఏలయనగా ప్రభువైన నేను, పరలోక శక్తులను వినియోగించుటకు నా చేతిని చాచితిని; దానిని మీరిప్పుడు చూడలేరు గాని కొద్దికాలము తరువాత దానిని మీరు చూచెదరు, నేను ఉన్నవాడనని, మరియు నేను వచ్చి నా జనులను పరిపాలించెదనని తెలుసుకొందురు.”17
సరిగ్గా అదే జరిగింది. ప్రభువు తన చేతిని చాపారు మరియు విద్యుత్తు వచ్చింది.
అధ్యక్షులు నెల్సన్ గత సభలో మనకు శక్తివంతంగా నేర్పించినందున, విశ్వాసము యొక్క శక్తి ద్వారా అద్భుతాలు జరిగాయి. ప్రవక్త మొరోనై జనులకు ఇలా ఉద్భోధించారు, “మనుష్య సంతానమునకు విశ్వాసము లేని యెడల, దేవుడు వారి మధ్య ఏ అద్భుతమును చేయలేడు; కావున, వారు విశ్వాసమును సాధన చేయు వరకు ఆయన తనను కనబరచుకొనలేదు.”19
ఆయన కొనసాగించారు:
“ఇదిగో, చెరసాల నేలకూలునట్లు చేసినది ఆల్మా మరియు అమ్యులెక్ యొక్క విశ్వాసమే.
“లేమనీయులు అగ్నితోను, పరిశుద్ధాత్మతోను బాప్తీస్మము పొందునట్లు వారిలో మార్పు తెచ్చినది నీఫై మరియు లీహై యొక్క విశ్వాసమే.
“లేమనీయుల మధ్య అంత గొప్పదైన అద్భుతము జరిగించినది అమ్మోన్ మరియు అతని సహోదరుల యొక్క విశ్వాసమే.”20
“ఏ సమయమందైనను, ఎవరైనను వారి విశ్వాసమును సాధన చేయు వరకు అద్భుతములను చేయలేదు; అందువలన, వారు మొదట దేవుని కుమారునియందు విశ్వాసముంచిరి.”18
లేఖనాల వరుసకు నేను కొంత జతచేయగలను, “చిత్తశుద్ధిగల యౌవన నిర్వాహకులు, ప్రసార నిపుణులు, సంఘ నాయకులు, సభ్యులు, ఒక అపొస్తలుడు, దేవుని యొక్క ఒక ప్రవక్త, వీరందరి విశ్వాసమే ఈ గొప్ప అద్భుతాన్ని జరిగించి, యూటాలోని గోషెన్‌లో మారుమూల ఉన్న చిత్రీకరణ ప్రాంతంలో విద్యుత్తును పునరుద్ధరించింది.”
అద్భుతాలు ప్రార్థనకు జవాబులుగా రాగలవు. అవి ఎల్లప్పుడూ మనం అడిగేవి లేదా మనం ఆశించేవి కాకపోవచ్చు, కానీ మనం ప్రభువు నందు నమ్మకముంచినప్పుడు, ఆయన అక్కడ ఉంటారు మరియు ఆయన సరైనది చేస్తారు. మనకు అవసరమైన క్షణానికి తగినట్లుగా ఆయన అద్భుతాన్ని చేస్తారు.
ఆయన శక్తి, మన కొరకు ఆయన ప్రేమ, మన మర్త్య అనుభవంలో ప్రభువు యొక్క ప్రభావం మరియు అత్యంత విలువైన దానిని మనకు బోధించడంలో ఆయన కోరికను మనకు గుర్తుచేయడానికి ప్రభువు అద్భుతాలు చేస్తారు. “స్వస్థత పొందుటకు నా యందు విశ్వాసము కలిగి, మరణదండన విధింపబడనివాడు స్వస్థపరచబడును,”19 అని 1831లో ఆయన పరిశుద్ధులకు చెప్పారు మరియు ఆ వాగ్దానము నేటికీ కొనసాగుతున్నది. పరలోకములో ధర్మశాస్త్రము ప్రకటించబడింది మరియు మనము ఎల్లప్పుడూ దానికి లోబడియున్నాము.
ప్రియమైన వారిని స్వస్థపరచడానికి, అన్యాయాన్ని సరిచేయడానికి, కఠినమైన లేదా భ్రమలో ఉన్నవాని హృదయాన్ని మృదువుగా చేయడానికి మనం ఒక అద్భుతాన్ని ఆశించే సమయాలుండవచ్చు. విషయాలను మర్త్య దృష్టితో చూస్తూ, వాటిని సరిచేయడానికి ప్రభువు జోక్యం చేసుకోవాలని మనం కోరుకుంటాము. మనం అనుకున్న సమయానికి లేదా మనం కోరుకున్న తీర్మానంతో కాకపోయినప్పటికీ, విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. మనం అల్పవిశ్వాసులమని లేదా ఆయన జోక్యానికి అర్హులం కాదని దానర్థమా? కాదు. మనం ప్రభువుకు ప్రియమైనవారము. ఆయన మనకోసం తన ప్రాణాలనిచ్చారు, మనం పశ్చాత్తాపపడి, ఆయనకు దగ్గరైనప్పుడు ఆయన ప్రాయశ్చిత్తము మనల్ని భారములు మరియు పాపము నుండి విడుదల చేయడాన్ని కొనసాగిస్తుంది.
“మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు,”20 అని ప్రభువు మనకు గుర్తుచేసారు. “ ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును”21 అని చెప్పి—ఆందోళన, నిరాశ, భయం, అవిధేయత, ప్రియమైన వారి కొరకు కలత చెందుట, కోల్పోయిన లేదా నెరవేరని కలల నుండి విశ్రాంతిని ఇవ్వజూచుచున్నాడు. గందరగోళం లేదా బాధ మధ్యలో శాంతి కలగడం ఒక అద్భుతమే. ప్రభువు యొక్క మాటలను గుర్తుచేసుకోండి: “ఈ విషయమును గూర్చి నీ మనస్సుకు నేను శాంతిని కలుగజేయలేదా? దేవుని నుండి తప్ప మరే గొప్ప సాక్ష్యమును నీవు కలిగియుండగలవు?”22 అద్భుతమేమనగా, యేసు క్రీస్తు, గొప్ప యెహోవా, సర్వోన్నతుని కుమారుడు శాంతితో స్పందిస్తున్నారు.
ఆయన మరియను పేరుపెట్టి పిలుస్తూ తోటలో ఆమెకు అగుపించినట్లే, మన విశ్వాసాన్ని సాధన చేయమని ఆయన మనల్ని పిలుస్తారు. మరియ ఆయనకు సేవచేయాలని, ఆయనపట్ల శ్రద్ధ చూపాలని చూసింది. ఆమె ఆశించినది ఆయన పునరుత్థానాన్ని కాదు, కానీ అది సంతోషము యొక్క గొప్ప ప్రణాళికను బట్టియైయున్నది.
“శిలువ మీద నుండి దిగుము,”23 అని కల్వరిలో అవిశ్వాసులు ఆయనను ఎగతాళి చేసారు. ఆయన అటువంటి అద్భుతాన్ని చేసియుండగలరు. కానీ ఆయన ఆది నుండి అంతమును యెరిగినవాడు మరియు తన తండ్రి ప్రణాళికపట్ల విశ్వాసంగా ఉండాలని నిశ్చయించుకున్నవాడు. ఈ మాదిరిని గ్రహించడంలో మనం విఫలం కారాదు.
“నా ప్రక్కను పొడిచిన గాయములను, నా కాళ్ళు, చేతులలోనున్న మేకుల గుర్తులను చూడుడి; విశ్వాసముగా నుండుడి, నా ఆజ్ఞలను పాటించుడి, మీరు పరలోకరాజ్యమును స్వాస్థ్యముగా పొందెదరు,“24 అని శ్రమల కాలములలో ఆయన మనకు చెప్పారు. సహోదర సహోదరీలారా, మనందరికీ వాగ్దానం చేయబడిన అద్భుతమది.
ఈ ఈస్టరు ఆదివారమున మన ప్రభువు యొక్క పునరుత్థానమనే అద్భుతాన్ని మనం కొనియాడుతుండగా, మీ జీవితంలో విమోచకుని శక్తిని మీరు అనుభవించాలని, మన పరలోక తండ్రికి మీరు చేసే విన్నపాలు యేసు క్రీస్తు తన పరిచర్య అంతటా చూపిన ప్రేమ మరియు నిబద్ధతతో జవాబివ్వబడాలని యేసు క్రీస్తు యొక్క అపొస్తలునిగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. రాబోవు వాటన్నిటిలో మీరు స్థిరంగా, విశ్వాసంగా నిలబడాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ప్రభువు చిత్తమైతే—గోషెన్‌లో మేము అనుభవించినట్లు మీకు అద్భుతాలు జరగాలని నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. “తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మరియు వారిని గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ యొక్క కృప నిరంతరము మీ యందు నిలిచియుండునట్లు, ఎవరిని గూర్చి ప్రవక్తలు మరియు అపొస్తలులు వ్రాసియుండిరో, ఆ యేసును మీరు వెదకుచుండగా”25 మీ జీవితంలో పరలోకం నుండి పంపబడిన ఈ దీవెనల కొరకు చూడండి. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.