సర్వసభ్య సమావేశము
దేవుడు మన మధ్యనున్నాడు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


15:44

దేవుడు మన మధ్యనున్నాడు

దేవుడు మన మధ్య ఉన్నాడు, వ్యక్తిగతంగా మన జీవితాలలో పాలుపంచుకొనుచున్నాడు మరియు తన పిల్లలకు చురుకుగా మార్గనిర్దేశం చేస్తున్నాడు.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యుగయుగాలుగా దేవుడు తన సేవకులైన ప్రవక్తల1 ద్వారా మాట్లాడియున్నాడు. ఈ ఉదయం, దేవుని ప్రవక్త ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడడాన్ని వినేందుకు మనము విశేషాధికారమును కలిగియున్నాము. అధ్యక్షులు నెల్సన్, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీ మాటలను అధ్యయనం చేయమని, శ్రద్ధ వహించమని నేను ప్రతిచోటనున్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాను.

నేను నా 12వ పుట్టినరోజుకు చేరుకోవడానికి ముందు, యుద్ధం మరియు రాజకీయ విభజన వలన ఏర్పడిన గందరగోళం, భయం మరియు అనిశ్చితుల మధ్య మా కుటుంబం రెండుసార్లు మా ఇంటి నుండి పారిపోయి, క్రొత్త ప్రదేశంలో మేము బ్రతకనారంభించవలసి వచ్చింది. ఇది నాకు ఆత్రుత గల సమయం, కానీ అది నా ప్రియమైన తల్లిదండ్రులకు భయంకరంగా ఉండి ఉండవచ్చు.

నా తల్లిదండ్రులు ఈ భారంలో కొంచెము మాత్రమే నలుగురు పిల్లలమైన మాతో పంచుకున్నారు. వారు ఒత్తిడిని మరియు బాధను తమకు సాధ్యమైనంత ఉత్తమంగా భరించారు. భయం అణచివేతకు గురిచేసి, వారి సమయాన్ని హరించివేసి, వారి ఆశను క్షీణింపజేసి ఉండవచ్చు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నిరాశతో కూడిన ఈ సమయం ప్రపంచంపై తన ముద్రవేసింది. అది నాపై బలమైన ముద్రవేసింది.

అప్పట్లో, ఒంటరితనముతో ఉన్న నా ఏకాంత సమయంలో, “ప్రపంచంలో ఏదైనా ఆశ మిగిలి ఉందా?” అని నేను తరచు వాపోయాను.

దేవదూతలు మన మధ్యనున్నారు

నేను ఈ ప్రశ్నలను ఆలోచిస్తున్నప్పుడు, ఆ సంవత్సరాల్లో మా మధ్య పనిచేసిన మా యువ అమెరికా దేశపు సువార్తికుల గురించి ఆలోచించాను. వారు తమ గృహాలలో ఉన్న సౌకర్యాలను, భద్రతను ప్రపంచానికి సగం దూరంలో విడిచి వచ్చారు మరియు మా ప్రజలకు దైవిక నిరీక్షణను అందించడానికి వారి నూతన శత్రువుల భూమియైన జర్మనీకి ప్రయాణించారు. వారు నిందించడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి లేదా సిగ్గుపరచడానికి రాలేదు. వారు భూసంబంధమైన లాభం గురించి ఆలోచించకుండా తమ యువ జీవితాలను ఇష్టపూర్వకంగా ఇచ్చారు, వారు అనుభవించిన సంతోషాన్ని, సమాధానాన్ని కనుగొనడంలో ఇతరులకు సహాయం చేయాలనుకున్నారు.

నా దృష్టిలో ఈ యువకులు మరియు యువతులు పరిపూర్ణులు. వారికి లోపాలు ఉండి ఉండవచ్చు, కాని నా దృష్టిలో వారికి లోపాలు లేవు. నేను వారి లక్షణాలను ఎల్లప్పుడూ ఈ జీవితం కంటే గొప్పవిగా భావిస్తాను—వారు వెలుగు మరియు మహిమ యొక్క దేవదూతలు, కరుణ, మంచితనం మరియు సత్యముతో పరిచర్య చేసేవారు.

ప్రపంచం వైరాగ్యం, చెడుతనం, ద్వేషం మరియు భయంతో మునిగిపోవుచుండగా, ఈ యువకుల ఉదాహరణ మరియు బోధనలు నన్ను ఆశతో నింపాయి. వారు అందించిన సువార్త సందేశం రాజకీయాలు, చరిత్ర, పగ, మనోవేదనలు మరియు వ్యక్తిగత కార్యకలాపాలను మించిపోయింది. ఈ క్లిష్ట సమయాల్లో మేము కలిగియున్న ముఖ్యమైన ప్రశ్నలకు ఇది దైవిక సమాధానాలు ఇచ్చింది.

ఆ సందేశం ఏమిటంటే అల్లరి, గందరగోళం మరియు అలజడి ఉన్న ఈ పరిస్థితులలో కూడా దేవుడు సజీవుడు మరియు మా గురించి పట్టించుకున్నాడు. సత్యాన్ని, వెలుగును, ఆయన సువార్తను మరియు సంఘాన్ని పునఃస్థాపించడానికి మన కాలంలో ఆయన ప్రత్యక్షమయ్యెను. ఆయన మరలా ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు; దేవుడు మన మధ్య ఉన్నాడు, వ్యక్తిగతంగా మన జీవితాలలో పాలుపంచుకొనుచున్నాడు మరియు తన పిల్లలకు చురుకుగా మార్గనిర్దేశం చేస్తున్నాడు.

మన పరలోక తండ్రి తన పిల్లల కొరకు సిద్ధపరచిన రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క ప్రణాళిక, సంతోష ప్రణాళికను కొంచెం దగ్గరగా చూసినప్పుడు మనం నేర్చుకోగల విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. మనం అల్పమైనవారిగా, తరిమివేయబడిన వారిగా మరియు మరచిపోబడినవారిగా భావించినప్పుడు, దేవుడు మనలను మరచిపోలేదని మనకు అభయమివ్వబడునని మనం నేర్చుకోగలము—వాస్తవానికి, ఆయన తన పిల్లలందరికీ అనూహ్యమైనదాన్ని ఇవ్వజూచుచున్నాడు: అదేమనగా “దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులము”2 కావడం.

దీని అర్థం ఏమిటి?

మనము శాశ్వతంగా జీవిస్తాము, ఆనందం యొక్క సంపూర్ణతను3 పొందుతాము మరియు “సింహాసనములను, రాజ్యములను, ప్రధానులను, అధికారములను”4 వారసత్వంగా పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాము.

మన గొప్పతనము వలన కాదు, కానీ దేవుని గొప్పతనము వలన ఈ అద్భుతమైన మరియు అతీంద్రియ భవిష్యత్తు సాధ్యమేనని తెలుసుకోవడం మిక్కిలి వినయాన్ని కలిగిస్తుంది.

ఇది తెలిసి కూడా మనం ఎప్పుడైనా దుఃఖించి, సణిగి లేదా విచారంగా ఉండగలమా? దైవిక ఆనందం యొక్క అనూహ్యమైన భవిష్యత్తు అనే విమానం ఎక్కమని రాజులకు రాజు మనలను ఆహ్వానించినప్పుడు, మనం ఎప్పుడూ నేలవైపు చూస్తూ ఎలా ఉండగలము?5

రక్షణ మన మధ్యనున్నది

దేవుడు మనపట్ల కలిగియున్న పరిపూర్ణమైన ప్రేమ మరియు యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన త్యాగం కారణంగా, మన పాపాలు గొప్పవైనను, చిన్నవైనను అవి చెరిపివేయబడి, ఇకపై జ్ఞాపకముంచుకొనబడవు.6 మనం ఆయన యెదుట స్వచ్ఛంగా, యోగ్యులుగా మరియు పవిత్రమైన వారిగా నిలబడగలము.

నా పరలోక తండ్రిపట్ల కృతజ్ఞతతో నా హృదయం పొంగిపోతోంది. ఉజ్వలమైన మరియు శాశ్వతమైన భవిష్యత్తు కోసం నిరీక్షణ లేకుండా మర్త్యత్వములో శ్రమపడడానికి ఆయన తన పిల్లలను విడువలేదని నేను గ్రహించాను. ఆయన యొద్దకు తిరిగి వెళ్ళే మార్గాన్ని బయలుపరచే సూచనలను ఆయన అందించారు. దాని మధ్యలో ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు7 మరియు మన కొరకు ఆయన త్యాగం కేంద్రీకృతమైయున్నాయి.

రక్షకుని యొక్క అనంతమైన ప్రాయశ్చిత్తం మనం మన అతిక్రమములను మరియు లోపాలను చూసే విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ, విమోచన లేదని చింతించే బదులు, మనము వాటి నుండి నేర్చుకోవచ్చు మరియు ఆశాజనకంగా భావించవచ్చు.8 పశ్చాత్తాపం యొక్క ప్రక్షాళన చేయు బహుమానము మన పాపాలను విడిచిపెట్టి, నూతన సృష్టిగా ఉద్భవించడానికి మనల్ని అనుమతిస్తుంది.9

యేసు క్రీస్తు కారణంగా, మన వైఫల్యాలు మనల్ని నిర్వచించాల్సిన అవసరం లేదు. అవి మనల్ని శుద్ధి చేయగలవు.

స్వరాలను సాధన చేసే సంగీతకారుడి వలె, మన అపోహలు, లోపాలు మరియు పాపాలను ఎక్కువ స్వీయ-అవగాహనకు, ఇతరుల పట్ల లోతైన మరియు నిజాయితీగల ప్రేమకు మరియు పశ్చాత్తాపం ద్వారా శుద్ధీకరణకు అవకాశాలుగా మనం చూడవచ్చు.

మనం పశ్చాత్తాపపడితే, తప్పులు మనల్ని అనర్హులుగా చేయవు. అవి మన పురోగతిలో భాగం.

మనము దేనికి రూపించబడ్డామో ఆ మహిమ మరియు ప్రభావముతో పోలిస్తే మనమందరం శిశువులము. తరచు పడిపోయి, ఢీకొట్టి, గాయపడకుండా ఏ నరుడు కూడా ప్రాకడం, నడవడం నుండి పరుగెత్తటకు పురోభివృద్ధి చెందలేడు. ఆ విధంగానే మనం నేర్చుకుంటాము.

మనము శ్రద్ధగా సాధన చేస్తూ, ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నిస్తూ మరియు మనము పశ్చాత్తాపపడడానికి, సహించడానికి, మనం నేర్చుకున్న వాటిని వర్తింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, కొద్దికొద్దిగా మనం మన ఆత్మలలోకి కాంతిని సేకరిస్తాము.10 ఇప్పుడు మన పూర్తి సామర్థ్యాన్ని మనం పూర్తిగా గ్రహించలేక పోయినప్పటికీ, “[రక్షకుడు] ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే”11 మనలో ఆయన స్వరూపమును చూచెదము అని మనకు తెలుసు.

ఇది ఎంత మహిమకరమైన వాగ్దానం!

అవును, ప్రపంచం గందరగోళంలో ఉంది. అవును, మనకు బలహీనతలు ఉన్నాయి. కానీ మనము నిరాశతో మన తల దించుకోనవసరం లేదు, ఎందుకంటే మనం దేవుడిని నమ్మగలము, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును విశ్వసించగలము మరియు సంతోషము, దివ్యానందముతో నిండిన జీవితం వైపు ఈ మార్గంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి ఆత్మ వరమును అంగీకరించగలము.12

యేసు మన మధ్యనున్నాడు

యేసు నేడు మన మధ్య ఉంటే ఏమి బోధించునో మరియు చేయునో అని నేను తరచూ ఆలోచిస్తాను.

పునరుత్థానం తరువాత, యేసు క్రీస్తు తన “ఇతర గొర్రెలను”13 సందర్శిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు.

మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన అమెరికా ఖండంలోని ప్రజలకు అలాంటి ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. రక్షకుని కార్యానికి స్పష్టమైన సాక్షిగా ఈ విలువైన గ్రంథాన్ని మనం కలిగియున్నాము.

మోర్మన్ గ్రంథములోని ప్రజలు ప్రపంచంలో మరొక వైపు నివసించారు—వారి చరిత్రలు, సంస్కృతులు మరియు రాజకీయ వాతావరణాలు యేసు తన మర్త్య పరిచర్యలో బోధించిన వ్యక్తుల నుండి చాలా భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన పరిశుద్ధ భూమిలో బోధించిన అవే విషయాలలో అనేకమును వారికి బోధించాడు.

ఆయన ఎందుకు అలా చేసి ఉండవచ్చు?

రక్షకుడు ఎల్లప్పుడూ నిత్య సత్యాలను బోధిస్తాడు. అవి ఏ వయస్సు గలవారికైనా మరియు ఏ పరిస్థితులకైనా వర్తిస్తాయి.

ఆయన సందేశం నిరీక్షణ యొక్క సందేశం—మన పరలోక తండ్రియైన దేవుడు తన పిల్లలను విడిచిపెట్టలేదు అనడానికి సాక్ష్యం.

దేవుడు మన మధ్యనున్నాడు అనడానికి సాక్ష్యం!

రెండు వందల సంవత్సరాల క్రితం, రక్షకుడు మళ్ళీ భూమికి తిరిగి వచ్చాడు. తండ్రి అయిన దేవునితో కలిసి ఆయన 14 ఏళ్ళ జోసెఫ్ స్మిత్‌కు ప్రత్యక్షమై, సువార్త మరియు యేసు క్రీస్తు సంఘము యొక్క పునఃస్థాపనను ప్రారంభించాడు. ఆ రోజు నుండి పరలోకములు తెరువబడ్డాయి, పరలోక వార్తాహరులు అమర్త్య మహిమా స్థలాల నుండి క్రిందికి వచ్చారు. సిలెస్టియల్ సింహాసనం నుండి కాంతి మరియు జ్ఞానం క్రుమ్మరించబడ్డాయి.

ప్రభువైన యేసు క్రీస్తు మరోసారి ప్రపంచంతో మాట్లాడారు.

ఆయన ఏమి చెప్పారు?

మనకు దీవెనగా, ఆయన చెప్పిన అనేక మాటలు సిద్ధాంతము మరియు నిబంధనలలో నమోదు చేయబడ్డాయి—వాటిని చదవడానికి మరియు అధ్యయనం చేయడానికి ప్రపంచంలో ఎవరికైనా అవి అందుబాటులో ఉన్నాయి. ఈ మాటలు నేడు మనకు ఎంతో అమూల్యమైనవి.

రక్షకుడు తన సువార్త యొక్క ముఖ్య సందేశాన్ని మళ్ళీ బోధిస్తున్నాడని తెలుసుకుని మనం ఆశ్చర్యపోనవసరం లేదు: “ప్రభువైన నీ దేవుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తి, మనస్సు, బలముతోను ప్రేమించవలెను; యేసు క్రీస్తు నామములో నీవు ఆయనను సేవించవలెను.”14 దేవుడిని వెదకమని15 మరియు ఆయన తన సేవకులైన ప్రవక్తలకు16 బయలుపరచిన బోధనల ప్రకారం జీవించమని ఆయన మనలను ప్రేరేపిస్తాడు.

ఒకరి యెడల మరొకరు ప్రేమ కలిగి ఉండాలని17 మరియు “మనుష్యులందరి యెడల దాతృత్వముతో నిండియుండవలెనని”18 ఆయన మనకు బోధిస్తాడు.

ఆయన చేతులుగా ఉండవలెనని, మేలు చేయుచు సంచరించవలెనని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు.19 “మాటతోను నాలుకతోను కాక… క్రియతోను సత్యముతోను ప్రేమింతుము.”20

ప్రేమించమని, పంచుకోమని, అందరినీ తన సువార్త మరియు తన సంఘానికి ఆహ్వానించమనే తన గొప్ప ఆజ్ఞను పాటించమని ఆయన మనలను సవాలు చేస్తున్నాడు.21

పరిశుద్ధ దేవాలయాలను నిర్మించాలని, అక్కడ ప్రవేశించి సేవ చేయాలని ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు.22

మన హృదయాలు వ్యక్తిగత శక్తి, సంపద, ఆమోదం లేదా స్థానం కోసం ప్రయత్నించకుండా తన శిష్యులుగా మారమని ఆయన మనకు బోధిస్తాడు . “ఈ లోకసంబంధమైన విషయములను ప్రక్కన పెట్టి, ఉత్తమమైన సంగతులను వెదకవలెనని”23 ఆయన మనకు బోధిస్తున్నాడు.

సంతోషం, జ్ఞానోదయం, శాంతి, సత్యం, ఆనందం24 మరియు అమర్త్యత్వం, నిత్యజీవము25 యొక్క వాగ్దానాన్ని కోరుకోవాలని ఆయన మనలను కోరుతున్నాడు.

దీన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్దాం. యేసు ఈ రోజు మీ వార్డు, శాఖ లేదా మీ ఇంటికి వచ్చాడని అనుకుందాం. అది ఎలా ఉంటుంది?

ఆయన తిన్నగా మీ హృదయంలోకి చూస్తాడు. బాహ్య స్వరూపములు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి. మీరేమిటో ఆయనకు తెలుస్తుంది. మీ హృదయ వాంఛలు ఆయనకు తెలుస్తాయి.

సాత్వీకులను, దీనమనస్సు గలవారిని ఆయన లేవనెత్తును.

రోగులను ఆయన స్వస్థపరచును.

అవిశ్వాసులు నమ్ముటకు విశ్వాసముతో, ధైర్యముతో వారిని ఆయన నింపును.

మన హృదయాలను దేవుని కొరకు తెరిచి, ఇతరులకు సహాయము చేయాలని ఆయన మనకు బోధిస్తాడు.

ఆయన నిజాయితీ, వినయం, చిత్తశుద్ధి, విశ్వాసం, కరుణ మరియు దాతృత్వాన్ని గుర్తించి గౌరవిస్తాడు.

ఒక్కసారి ఆయన కళ్ళలోకి చూసిన తర్వాత, మనము ఎప్పటికీ ఇంతకుముందులా ఉండము. మనము శాశ్వతముగా మార్చబడతాము. దేవుడు మన మధ్య ఉన్నాడు అని స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా మనం రూపాంతరం చెందుతాము.

మనము ఏమి చేయాలి?26

నేను ఎదుగుతున్న సంవత్సరాల్లో యువకుడిగా ఉన్న నన్ను నేను దయతో చూస్తాను. నేను గతంలోకి తిరిగి వెళ్ళగలిగితే, నేను అతడిని ఓదార్చి, శోధించడం కొనసాగించమని చెప్తాను. యేసు క్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించమని నేను అతడిని అడుగుతాను, ఎందుకంటే దేవుడు మన మధ్య ఉన్నాడు!

నా ప్రియమైన సహోదర సహోదరీలైన మీకు మరియు సమాధానాల కోసం వెతుకుతున్న అందరికీ నేను అదే సలహా ఇస్తున్నాను: విశ్వాసము మరియు సహనంతో శోధించడం కొనసాగించండి.27

అడుగుడి, మీకియ్యబడును. తట్టుడి, మీకు తీయబడును.28 ప్రభువును నమ్మండి.29

మన దైనందిన జీవితంలో ఇది మనకు సర్వశ్రేష్ఠమైన కార్యము మరియు దేవుడికి ఎదురుపడేందుకు ఆశీర్వాదముతో కూడుకున్న అవకాశం.

మనము గర్వాన్ని ప్రక్కనపెట్టి, విరిగిన హృదయంతో మరియు నలిగిన ఆత్మతో30 ఆయన సింహాసనాన్ని సమీపించినప్పుడు, ఆయన మన దగ్గరికి వస్తారు.31

మనము యేసు క్రీస్తును అనుసరించడానికి మరియు శిష్యత్వ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కొద్దికొద్దిగా ఆనందం యొక్క సంపూర్ణతను పొందే అనూహ్యమైన బహుమానమును మనం అనుభవించే రోజు వస్తుంది.

నా ప్రియమైన మిత్రులారా, మీ పరలోక తండ్రి మిమ్ములను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఆయన తన ప్రేమను అంతులేని మార్గాల్లో నిరూపించారు, కానీ అన్నింటిని మించి మన పరలోక తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళడాన్ని సాధ్యం చేయడానికి తన ఏకైక కుమారుడిని బలిగా, బహుమానంగా తన పిల్లలకు ఇవ్వడం ద్వారా నిరూపించారు.

మన పరలోక తండ్రి సజీవుడని, యేసు క్రీస్తు తన సంఘాన్ని నడిపిస్తున్నారని, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఆయన ప్రవక్తయని నేను సాక్ష్యమిస్తున్నాను.

ఈ ఆనందకరమైన ఈస్టర్ సమయములో నా ప్రేమను, ఆశీర్వాదాన్ని మీకు అందిస్తున్నాను. మీ పరిస్థితులు, శ్రమలు, బాధలు లేదా తప్పులు ఏవైనప్పటికీ, మన రక్షకుడు మరియు విమోచకుని కొరకు మీరు మీ హృదయాన్ని తెరవండి; ఆయన సజీవుడని, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరియు ఆయన కారణముగా మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరని మీరు తెలుసుకోగలరు.

దేవుడు మన మధ్యనున్నాడు.

ఈ సంగతుల గురించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.