బిషప్పులు—ప్రభువు మందపై కాపరులు
ఒంటరి యువజనులతో పాటు ఉదయిస్తున్న తరాన్ని యేసు క్రీస్తు వైపు నడిపించడానికి ఒక కాపరిగా సేవచేయడంలో బిషప్పు ప్రముఖ పాత్ర వహిస్తారు.
నా ప్రియమైన యాజకత్వ సహోదరులారా, అతి ప్రియమైన కీర్తనలో అత్యంత చిరస్మరణీయ వాక్యాలలో ఒకటి, “సీయోను యువత సంకోచించెదరా?”1 అని అడుగుతుంది. “లేదు!” అనేది ఆ ప్రశ్నకు జవాబుగా నా హృదయపూర్వకంగా ధ్వనించే ప్రకటన.
ఆ జవాబు నిజమని చెప్పడానికి, అసాధారణ సవాళ్ళు, శోధనలు గల సమయంలో ఉదయిస్తున్న తరానికి సహకరించడమనేది తల్లిదండ్రులు మరియు బిషప్పులకు పరలోక తండ్రి చేత ఇవ్వబడిన ఆవశ్యకమైన బాధ్యత అని నేడు నేను సాక్ష్యమిస్తున్నాను.2 ఒక వ్యక్తిగత అనుభవంతో బిషప్రిక్కు యొక్క ప్రాముఖ్యతను నేను వివరిస్తాను.
నేను పరిచారకునిగా ఉన్నప్పుడు, మా కుటుంబం వేరే వార్డులో ఉన్న క్రొత్త ఇంటికి మారింది. నేను జూనియర్ ఉన్నత పాఠశాలకు వెళ్ళబోతున్నందున, నేను క్రొత్త పాఠశాలకు హాజరయ్యాను. పరిచారకుల సమూహంలో అద్భుతమైన యువకుల సమూహముంది. వారి తల్లిదండ్రులలో అధికులు క్రియాశీలక సభ్యులు. మా అమ్మ పూర్తిగా క్రియాశీలి; మా నాన్న అన్నివిధాల ప్రత్యేకమైనవారు, కానీ క్రియాశీలక సభ్యుడు కాదు.
బిషప్రిక్కులో రెండవ సలహాదారుడైన3 సహోదరుడు డీన్ ఐర్ అంకితభావం గల నాయకుడు. నేను క్రొత్త వార్డుకు ఇంకా అలవాటు పడుతుండగా, సుమారు 40 మైళ్ళు (65 కి.మీ.) దూరంలో ఉన్న బేర్ లేక్‌కు తండ్రి-కొడుకుల కార్యక్రమము ప్రకటించబడింది. మా నాన్న లేకుండా నేను వెళ్తానని అనుకోలేదు. కానీ, ఆయనతోపాటు రమ్మని సహోదరుడు ఐర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన మా నాన్న గురించి ఉన్నతంగా, గౌరవంగా మాట్లాడారు మరియు పరిచారకుల సమూహంలోని ఇతర సభ్యులతో ఉండేందుకు నాకొచ్చిన అవకాశం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కాబట్టి నేను సహోదరుడు ఐర్‌తో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను మరియు నాకు అద్భుతమైన అనుభవం కలిగింది.
యువతను పర్యవేక్షించడం, సంరక్షించడంలో తల్లిదండ్రులకు సహకరించే బిషప్రిక్కు బాధ్యతను నెరవేర్చడంలో క్రీస్తు వంటి ప్రేమకు సహోదరుడు ఐర్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ క్రొత్త వార్డులో ఆయన నాకు దివ్యమైన ఆరంభాన్నిచ్చారు మరియు నాకు మార్గదర్శకునిగా ఉన్నారు.
1960లో నేను సువార్తసేవకు వెళ్ళడానికి కొన్ని నెలల ముందు సహోదరుడు ఐర్ 39 ఏళ్ళ వయస్సులో క్యాన్సర్‌తో మరణించారు. ఆయన భార్యను, 16 ఏళ్ళ కంటే చిన్నవారైన ఐదుగురు పిల్లలను వదిలి వెళ్ళిపోయారు. వారి తండ్రి లేని సమయంలో బిషప్రిక్కు వారికి సహకరించి, వారిని, వారి తమ్ముళ్ళను, చెల్లెల్ని క్రీస్తువంటి ప్రేమతో చూసుకున్నారని ఆయన పెద్ద కొడుకులైన రిఛర్డ్ మరియు క్రిస్ ఐర్ నాకు స్థిరంగా చెప్పారు, అందకు నేను కృతజ్ఞుడిని.
తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ కుటుంబాల కొరకు ప్రధాన బాధ్యతను కలిగియుంటారు.4 విధులను, అహరోను యాజకత్వపు శక్తిని వారి జీవితాల్లో ముఖ్యమైన ప్రాధాన్యతగా చేస్తూ వారికి సహకరించడం ద్వారా సమూహ సభ్యులకు ఆవశ్యకమైన సహాయాన్ని, నడిపింపును కూడా సమూహ అధ్యక్షత్వాలు అందిస్తాయి.5
నేడు బిషప్పులు, వారి సలహాదారులపై దృష్టిసారించడం నా ఉద్దేశ్యము, వారు—ఉదయిస్తున్న తరానికి కాపరులుగా ఉన్నారనే ఉద్ఘాటనతో “ప్రభువు మందపై కాపరులు” అని వారు సరిగ్గా పిలువబడగలరు.6 యేసు క్రీస్తును “మీ ఆత్మల యొక్క కాపరి మరియు బిషప్పుగా”7 అపొస్తలుడైన పేతురు సూచించడం ఆసక్తికరము.
ఒక వార్డుపై అధ్యక్షత్వం వహించడంలో బిషప్పు ఐదు ప్రధాన బాధ్యతలు కలిగియున్నారు:
-
వార్డులో ఆయన అధ్యక్షత్వం వహించు ప్రధాన యాజకుడు.8
-
ఆయన అహరోను యాజకత్వము యొక్క అధ్యక్షుడు.9
-
ఆయన ఉమ్మడి న్యాయాధిపతి.10
-
అవసరతలో ఉన్నవారిపట్ల శ్రద్ధ చూపడంతోపాటు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును ఆయన సమన్వయపరుస్తారు.11
-
ఆయన రికార్డులను, ఆర్థిక వ్యవహారాలను, సమావేశ గృహం యొక్క వాడుకను పర్యవేక్షిస్తారు.12
అధ్యక్షత్వము వహించు ఉన్నత యాజకునిగా తన పాత్రలో బిషప్పు వార్డు యొక్క “ఆత్మీయ నాయకుడు.”13 ఆయన “యేసు క్రీస్తు యొక్క విశ్వాసియైన శిష్యుడు.”14
అదనంగా, “వార్డులో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యమును బిషప్పు సమన్వయపరుస్తారు.”15 సువార్తను పంచుకోవడం, క్రొత్త మరియు తిరిగివచ్చు సభ్యులను బలపరచడం, పరిచర్య చేయడం, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము వంటి అనుదిన బాధ్యతను బిషప్పు పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వాలకు అప్పగించాలి.16 వార్డు సలహాసభ మరియు వార్డు యువత సభలో బిషప్పు ఈ కార్యమును సమన్వయపరుస్తారు.
ఒంటరి యుక్తవయస్కులతో పాటు ఉదయిస్తున్న తరాన్ని యేసు క్రీస్తు వైపు నడిపించడానికి ఒక కాపరిగా సేవచేయడంలో బిషప్పు ప్రముఖ పాత్ర వహిస్తారు.17 బిషప్పు మరియు ఆయన సలహాదారుల ప్రభావశీల పాత్రను అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఉద్ఘాటించారు. “(తమ) వార్డులోని యువతీ యువకుల పట్ల శ్రద్ధ చూపడమే వారి మొదటి మరియు ప్రధాన బాధ్యత”18 అని ఆయన బోధించారు. వార్డులోని పిల్లలను, యువతను పర్యవేక్షించడం మరియు సంరక్షించడంలో బిషప్రిక్కు తల్లిదండ్రులకు సహకరిస్తారు. బిషప్పు మరియు యువతుల అధ్యక్షురాలు ఒకరితోఒకరు సంప్రదిస్తారు. యౌవనుల బలము కొరకు లోని నియమాలను జీవించడంలో, విధులను పొందడానికి అర్హులవడంలో, పరిశుద్ధ నిబంధనలను చేసి, పాటించడంలో యువతకు సహాయపడేందుకు వారు ప్రయత్నిస్తారు.
“యువతతో అంత సమయాన్ని గడపాలని బిషప్రిక్కు ఎందుకు నిర్దేశించబడ్డారు?” అని మీరు అడుగవచ్చు. ముఖ్యమైన ప్రాధాన్యతలను సాధించడానికి ప్రభువు తన సంఘాన్ని ఏర్పాటు చేసారు. దాని ప్రకారము, ఆయన సంఘము యొక్క నిర్మాణంలో ఒక వ్యవస్థ ఉంది, అందులో బిషప్పుకు ద్వంద్వ బాధ్యత గలదు. మొత్తంగా వార్డు కొరకు ఆయన సిద్ధాంతపరమైన బాధ్యత కలిగియున్నారు, కానీ యాజకుల సమూహానికి కూడా ఆయన ప్రత్యేక సిద్ధాంతపరమైన బాధ్యత కలిగియున్నారు.19
యాజకులైన యువకులు మరియు అదే వయస్సులో ఉన్న యువతులు వారి జీవితాల్లో మరియు ఎదుగుదలలో అతి ముఖ్యమైన దశలో ఉన్నారు. అతి కొద్ది సమయంలో వారు ముఖ్యంగా జీవితకాలం ప్రభావం చూపే నిర్ణయాలు చేస్తారు. వారు దేవాలయానికి వెళ్ళడానికి, సువార్త సేవ చేయడానికి అర్హులవుతారా,20 దేవాలయంలో వివాహమాడేందుకు ప్రయత్నిస్తారా, వారి జీవిత కార్యము కొరకు సిద్ధపడతారా అనేదానిని అవి నిర్ణయిస్తాయి. ఒకసారి ఈ నిర్ణయాలు చేసినట్లయితే, వారి జీవితంలో మిగిలిన భాగమంతా అవి లోతైన ఆత్మీయ మరియు ఆచరణాత్మక ప్రభావాన్ని కలిగియుంటాయి. బిషప్పులారా, ఒక యువ యాజకునితో లేదా యువతితో లేదా ఒక యుక్తవయస్కునితో గడిపిన అతికొద్ది సమయం యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా వారికి లభ్యమయ్యే శక్తిని గ్రహించడానికి వారికి సహాయపడగలదని దయచేసి తెలుసుకోండి. వారి పూర్తి జీవితంపై అత్యంత ప్రభావం కలిగియుండగల నడిపింపును అది అందించగలదు.
బిషప్పుకు నేను చూసిన మంచి మాదిరులలో ఒకరు బిషప్పు మోవా మాహె, ఆయన తన యువతకు ఈ రకమైన నడిపింపును అందించడంలో సహాయపడ్డారు. శాన్ ఫ్రాన్సిస్కో టోంగన్ వార్డు యొక్క మొదటి బిషప్పుగా ఆయన పిలువబడ్డారు.21 ఆయన టోంగాలోని వావావు నుండి వచ్చిన వలసదారుడు. ఆయన వార్డు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం దగ్గర ఉండేది, అక్కడ ఆయన పనిచేసేవారు.22
వార్డులో అధికసంఖ్యలో యువత ఉండేది, వారిలో ఎక్కువమంది క్రొత్తగా సంయుక్త రాష్ట్రాలకు వలసవచ్చిన కుటుంబాలవారు. యేసు క్రీస్తు యొక్క నీతిగల శిష్యులుగా ఎలా ఉండాలనే దానిని బిషప్పు మాహె తన మాట ద్వారా, మాదిరి ద్వారా నేర్పడమే కాకుండా, వారు ఏమి కాగలరనే స్వప్నాన్ని వారికివ్వడంలో సహాయపడ్డారు మరియు దేవాలయము, సువార్తసేవ, విద్య, ఉద్యోగాల కోసం వారు సిద్ధపడేందుకు సహాయపడ్డారు. ఆయన దాదాపు ఎనిమిది సంవత్సరాలు సేవచేసారు మరియు యువత కోసం ఆయన కలలు, కోరికలు నిజమయ్యాయి.
అహరోను యాజకత్వ సమూహాలలో దాదాపు 90 శాతం యువకులు సువార్తసేవ చేసారు. 1987 కల్లా 15 మంది యువతీ యువకులు వారి కుటుంబాలలో కళాశాలకు వెళ్ళిన మొదటి సభ్యులయ్యారు.23 స్థానిక ఉన్నత పాఠశాల (మన విశ్వాసానికి చెందినది కాదు) ప్రధానోపాధ్యాయుడిని ఆయన కలుసుకున్నారు మరియు వారు స్నేహాన్ని పెంపొందించుకొని, విలువైన లక్ష్యాలను సాధించడానికి, సమస్యలను అధిగమించడానికి ప్రతి యౌవనునికి సహాయపడేందుకు కలిసి పనిచేసారు. శ్రమపడుతున్న, ఇతర విశ్వాసాలకు చెందిన వలసదారులతో పనిచేయడంలో బిషప్పు మాహె తనకు సహాయపడ్డారని ప్రధానోపాధ్యాయుడు నాతో చెప్పారు. బిషప్పు వారిని ప్రేమించారని యౌవనులకు తెలుసు.
బిషప్పుగా సేవచేస్తున్నప్పుడే బిషప్పు మాహె మరణించడం బాధాకరం. ప్రేరేపితమైన, మనస్సును తాకిన ఆయన అంత్యక్రియను నేనెన్నడూ మరువను. అక్కడ పెద్దసంఖ్యలో జనులు సమకూడారు. సువార్తసేవ చేసినవారు లేదా కళాశాలకు హాజరవుతున్న వారు మరియు ఆయన బిషప్పుగా సేవచేసినప్పుడు యౌవనులుగా ఉన్నవారు 35 కంటే ఎక్కువమంది విశ్వాసులైన యువ సభ్యులతో గాయకబృందం కూర్చబడింది. ఒక వక్త తన వార్డులోని యువత మరియు యుక్తవయస్కుల తరఫున అత్యధికంగా అభినందనను వ్యక్తపరిచారు. జీవితం మరియు నీతియుక్తమైన సేవ కోసం సిద్ధపడడంలో ఆయన వారికిచ్చిన స్వప్నం కొరకు బిషప్పు మాహెకు ఆయన నివాళులర్పించారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది, వారి జీవితాలకు పునాదిగా ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసాన్ని నిర్మించడంలో బిషప్పు మాహె వారికి సహాయపడ్డారు.
ఇప్పుడు, బిషప్పులారా, మీరెక్కడ సేవచేసినప్పటికీ, మీ ముఖాముఖిలలో, ఇతర సహవాసాలలో మీరు అటువంటి స్వప్నాన్ని అందించగలరు మరియు యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని నిర్మించగలరు. ప్రవర్తన మార్చుకోవడానికి, జీవితం కొరకు వారిని సిద్ధం చేయడానికి మరియు నిబంధన బాటపై నిలిచియుండేందుకు వారిని ప్రేరేపించడానికి మీరు శక్తివంతమైన ఆహ్వానాలను ఇవ్వగలరు.
అదనంగా, అనవసరమైన విషయాల్లో తల్లిదండ్రులతో గొడవపడే యువతకు మీరు సహాయపడవచ్చు.24 యౌవనులు వారి తల్లిదండ్రులతో అత్యధిక వివాదం కలిగియున్నట్లు అనిపించిన సమయంలో, వారి సమూహంపై అధ్యక్షత్వం వహించే వ్యక్తి, ధార్మికంగా వారు ఎవరికి జవాబుదారులో ఆ వ్యక్తి మరియు దేవాలయ సిఫారసుల కోసం వారి తల్లిదండ్రులు వెళ్ళే వ్యక్తి ఒకరే అయ్యుంటారు. వివాదం విభజనను ఏర్పరచినప్పుడు యువతకు, వారి తల్లిదండ్రులకు సలహా ఇవ్వవలసిన ప్రత్యేక పరిస్థితిలో ఇది బిషప్పును ఉంచుతుంది. విషయాలను నిత్య దృష్టితో చూడడానికి మరియు ఎక్కువ లేదా తక్కువ ప్రాముఖ్యత గల విషయాలను పరిష్కరించడానికి బిషప్పులు ఇరువురికీ సహాయపడగలరు. పరిచర్య చేయవలసిన కుటుంబాలను బిషప్పులకు నియమించవద్దని మేము సిఫారసు చేస్తున్నాము, ఆవిధంగా వారు యువతకు, వారి కుటుంబాలకు ఈవిధమైన పరిస్థితులలో పరిచర్య చేయడానికి వారి సమయాన్ని, శక్తిని వినియోగించగలరు.25
ఇంటిలో ఐకమత్యాన్ని, సువార్త పట్ల నిబద్ధతను పెంచుతూ ఒక కొడుకు మరియు అతని తల్లిదండ్రుల మధ్య తీవ్రమైన వివాదాన్ని పరిష్కరించగలిగిన బిషప్పు గురించి నాకు తెలుసు. కుటుంబంలో పనులు సరిగ్గా ఎప్పుడు, ఎలా చేయబడతాయనే దానికంటే యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా ముఖ్యమైనదని తల్లిదండ్రులు అర్థం చేసుకొనేలా బిషప్పు సహాయపడ్డారు.
పాఠశాల కార్యక్రమాలు లేదా ప్రోత్సాహ కార్యక్రమాలతో కలిపి, వారు ఎక్కడ ఉన్నప్పటికీ యువతతో అధిక సమయం గడపడానికి, నిర్దిష్ట సమావేశాలను మరియు యుక్తవయస్కులతో సంప్రదింపుల సమయాన్ని ఇతరులకు అప్పగించమని బిషప్పులు సలహా ఇవ్వబడ్డారు. ముఖ్యమైన మరియు అత్యవసరమైన విషయాలను బిషప్పులు చూసుకున్నప్పటికీ, యోగ్యతను నిర్ణయించవలసిన అవసరం లేని దీర్ఘకాలికమైన, అత్యవసరం కాని విషయాలలో జరుగుతున్న సంప్రదింపుల బాధ్యతను పెద్దల సమూహము లేదా ఉపశమన సమాజము యొక్క సభ్యులకు—సాధారణంగా అధ్యక్షత్వాలు లేదా పరిచర్య చేయు సహోదరులు మరియు సహోదరీలకు అప్పగించమని మేము సిఫారసు చేస్తున్నాము. ఈ సంప్రదింపులకు బాధ్యత వహించడానికి సరైన సభ్యులను ఎంపిక చేసుకోవడానికి ఆత్మ నాయకులను నడిపిస్తుంది.26 ఈ సంప్రదింపుల నియామకం అప్పగించబడినవారు బయల్పాటుకు అర్హులు. అయితే, వారు ఎల్లప్పుడూ తప్పకుండా ఖచ్చితమైన గోప్యతను పాటించాలి.
ఆలోచనగల నాయకులు ఎల్లప్పుడూ ఉదయిస్తున్న తరం కొరకు త్యాగం చేసారు. ఈ విషయంలోనే బిషప్రిక్కు సభ్యులు తమ సంఘ-సేవా సమయంలో అధికశాతం గడుపుతారు.
ఇప్పుడు నేను కొన్ని విషయాలు సూటిగా యువతతో, తర్వాత మన బిషప్పులతో చెప్పాలనుకుంటున్నాను.
అమూల్యమైన యువత అయిన మీలో అనేకులు మీరు ఎవరో మరియు మీరు ఏమి కాగలరో అనేదాని యొక్క స్పష్టమైన గ్రహింపును కలిగియుండకపోవచ్చు. కానీ త్వరలోనే మీరు మీ జీవితంలో అతిముఖ్యమైన నిర్ణయాలు చేయవలసియుంటుంది. మీ ముందున్న ముఖ్యమైన ఎంపికల గురించి మీ తల్లిదండ్రులు మరియు మీ బిషప్పుతో దయచేసి సంప్రదించండి. మీ స్నేహితునిగా, సలహాదారునిగా ఉండేందుకు బిషప్పును అనుమతించండి.
అన్నివైపుల నుండి మీకు శ్రమలు, శోధనలు కలుగుతాయని మాకు తెలుసు. అధ్యక్షులు నెల్సన్ బోధించినట్లుగా మనమందరం రోజూ పశ్చాత్తాపపడవలసిన అవసరముంది. ఈ అంతిమ యుగంలో ఆయన మీ కొరకు కలిగియున్న “గొప్ప కార్యము” కొరకు సిద్ధపడడంలో ప్రభువుతో మీ జీవితాన్ని క్రమబద్ధం చేసుకోవడానికి ఉమ్మడి న్యాయాధిపతి మీకు సహాయపడగల ఏ విషయం గురించి అయినా దయచేసి మీ బిషప్పుతో మాట్లాడండి.27 అధ్యక్షులు నెల్సన్ మిమ్మల్ని ఆహ్వానించినట్లుగా, ప్రభువు యొక్క యువ సైన్యంలో భాగస్థులవడానికి దయచేసి మిమ్మల్ని మీరు అర్హులుగా చేసుకోండి.28
అమూల్యమైన బిషప్పులారా, ఇప్పుడు సంఘము యొక్క నాయకత్వము మరియు సభ్యుల తరఫున మీకొక మాట. మీ పట్ల మా లోతైన కృతజ్ఞతను మేము వ్యక్తపరుస్తున్నాము. ప్రియమైన బిషప్పులారా, ఈమధ్య కాలంలో మీరు చేయాలని అడుగబడిన సర్దుబాట్లతో మేము మిమ్మల్ని ఎంతగా ప్రేమించి, అభినందిస్తున్నామో దయచేసి తెలుసుకోండి. రాజ్యానికి మీ తోడ్పాటు వర్ణింపనలవికానిది. ప్రపంచవ్యాప్తంగా సేవచేస్తున్న 30,900 మంది బిషప్పులు మరియు శాఖాధ్యక్షులను సంఘము కలిగియుంది.29 మీలో ప్రతిఒక్కరిని మేము గౌరవిస్తాము.
వారు వర్ణించే కొన్ని పదాలు మరియు పరిశుద్ధ పిలుపులు దాదాపుగా ఆత్మీయమైన, అసాధారణమైన ప్రాధాన్యతతో నింపబడ్డాయి. బిషప్పు యొక్క పిలుపు ఖచ్చితంగా అటువంటి పదాలలో గొప్పది. ఈ స్థానంలో ప్రభువుకు సేవచేయడం అనేక విధాలుగా విశేషమైనది. ఒక బిషప్పును పిలువడం, ఆమోదించడం మరియు ప్రత్యేకపరచడం అనేది ఎన్నడూ మరచిపోలేని అనుభవం. నా మట్టుకు, ఈ అనుభవం అతని జీవితంలో అత్యంత ప్రత్యేకమైన సంఘటనలలో ఒకటి, ఎందుకంటే వివిధ రకాల భావాలను అతడు బలంగా భావించేలా చేస్తుందది. అతనికి ఈ అనుభవం ఎంత ప్రత్యేకమైనదంటే, అది క్లుప్తంగా వర్ణించలేనిది, అది వివాహం చేసుకోవడం మరియు తండ్రి కావడం వంటి వాటితో పోల్చదగినది.30
బిషప్పులారా, మేము మిమ్మల్ని ఆమోదిస్తున్నాము! బిషప్పులారా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము! మీరు నిజంగా ఆయన మందపై ప్రభువు యొక్క కాపరులు. ఈ పవిత్రమైన పిలుపులలో రక్షకుడు మిమ్మల్ని వదిలివేయరు. దీనిని గూర్చి ఈ ఈస్టరు వారాంతంలో నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.