సర్వసభ్య సమావేశము
దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు
2021 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


8:40

దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నాడు

ఆయన పిల్లలమైన మన కొరకు మన పరలోక తండ్రి తన ప్రేమను ప్రత్యక్షపరచు మూడు ప్రత్యేక విధానాలను నేను పంచుకోదలిచాను.

సహోదర సహోదరీలారా, మీతోపాటు నేను యేసు క్రీస్తు యొక్క సువార్తయందు ఆనందిస్తున్నాను. ఫిలిప్పీన్స్‌లో ఉన్న హుషారైన సభ్యుల నుండి ప్రేమను నాతో తెచ్చాను మరియు వారి తరఫున చెప్తున్నాను, మబుహే !

ఈ ఈస్టరు ఉదయాన, జీవముతోనున్న క్రీస్తు గురించి, ఆయన మృతులలో నుండి లేచారని మరియు మన కొరకు, మన పరలోక తండ్రి కొరకు ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, నిత్యమైనదని నేను సాక్ష్యమిస్తున్నాను. మనందరి కొరకు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా ప్రత్యక్షపరచబడిన పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుల ప్రేమ మీద ఈరోజు నేను దృష్టిసారించాలి అనుకుంటున్నాను. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను” (యోహాను 3:16).

దేవునికి సంబంధించి అతని జ్ఞానము గురించి ప్రవక్త నీఫై దేవదూత చేత అడుగబడినప్పుడు, “ఆయన తన సంతానమును ప్రేమించునని నేనెరుగుదును” (1 నీఫై11:16–17 చూడండి) అని నీఫై జవాబిచ్చాడు.

మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన నుండి ఒక వచనము రక్షకుని పరిపూర్ణ ప్రేమను శక్తివంతంగా వివరిస్తుంది: “వారి దుష్టకార్యములను బట్టి లోకము ఆయనను పనికిరాని వస్తువుగా తీర్పు తీర్చును; … వారు ఆయనను కొరడాతో బాధించెదరు, … ఆయనను కొట్టెదరు, … వారు ఆయనపై ఉమ్మి వేసినా మనుష్య సంతానము యెడల ఉన్న ఆయన కృపాతిశయము మరియు దీర్ఘశాంతమును బట్టి ఆయన సహించును” (1 నీఫై 19:9). రక్షకుని యొక్క విశ్వవ్యాప్త ప్రేమయే ఆయన చేసే వాటన్నిటి వెనుకనున్న ప్రేరణాశక్తి. ఇది మన పరలోక తండ్రి మన కొరకు కలిగియున్న ప్రేమయేనని మనకు తెలుసు, ఎందుకంటే ఆయన మరియు తండ్రి “ఏకమైయున్నారని” (యోహాను 10:30; 17:20–23 చూడండి) రక్షకుడు వినయంగా బోధించారు.

అప్పుడు, వారి విశ్వవ్యాప్త ప్రేమ కొరకు మనమెలా బదులు చెల్లిస్తాము మరియు మన కృతజ్ఞతను ఎలా చూపుతాము? ఈ సరళమైన, సమస్తమును ఆవరించు ఆహ్వానముతో రక్షకుడు మనకు బోధించారు: “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుము” (యోహాను 14:15).

అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ ఇలా బోధించారు, “దేవుని యొక్క విశ్వవ్యాప్తమైన, పరిపూర్ణమైన ప్రేమ ఆయన చట్టాలకు లోబడే వారి కొరకు ఆయన ఎంపిక చేసిన దీవెనలు దాచబడియున్నాయనే వాస్తవంతో పాటు ఆయన సువార్త ప్రణాళిక యొక్క దీవెనలన్నిటిలో చూపబడింది.”1

ఆయన పిల్లలమైన మన కొరకు మన పరలోక తండ్రి తన ప్రేమను ప్రత్యక్షపరచు మూడు ప్రత్యేక విధానాలను నేను పంచుకోదలిచాను.

మొదటిది, దేవునితో మరియు కుటుంబముతో సంబంధాలు ఆయన ప్రేమను ప్రత్యక్షపరుస్తాయి

మన అత్యంత విలువైన సంబంధాలు తండ్రి, కుమారుడు మరియు మన స్వంత కుటుంబాలతో ఉన్నాయి, ఎందుకంటే వారితో మన సంబంధాలు నిత్యమైనవి. సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక మన కొరకు దేవుని ప్రేమ యొక్క అద్భుతమైన ప్రత్యక్షత. దేవుని ప్రణాళికపై మనసు లగ్నం చేసి, మనలో ఉన్న స్వార్థపూరిత కోరికలైన మట్టి మరియు రాళ్ళను తీసివేసి, వాటి స్థానంలో నిత్య సంబంధాలను నిర్మించే పునాదులను వేయడానికి మనం ఇష్టపూర్వకంగా ఎంచుకున్నాము. ఒకవిధంగా ఇది “ఆత్మీయ త్రవ్వకం” అని పిలువబడగలదు. మన ఆత్మీయ త్రవ్వకాన్ని నిర్వహించడంలో ముందుగా మనం తప్పక దేవుని వెదకి, ఆయనకు ప్రార్థన చేయవలెను (యిర్మీయా 29:12–13 చూడండి).

ఆయనను వెదకి, ఆయనకు ప్రార్థన చేయడం ప్రక్రియను ప్రారంభిస్తుంది మరియు మన నిత్య సంబంధాలను నిర్మించి, బలపరచడానికి వీలుకల్పిస్తుంది. అది మన ఆత్మీయ దృష్టిని విస్తరిస్తుంది మరియు మన నియంత్రణలో లేని భయాలపై కంటే మనం నియంత్రించగల వాటిని మార్చడంపై దృష్టి సారించేలా మనకు సహాయపడుతుంది. మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్యను అధ్యయనం చేయడం ఈ ఇతర చింతలను నిత్య దృష్టితో చూడడాన్ని మనకు సాధ్యం చేస్తుంది.

పరధ్యానాలు కొన్నిసార్లు మన కుటుంబ సంబంధాలు మరియు కార్యక్రమాల్లో దేవుని ప్రేమను అనుభవించడం నుండి మనల్ని నిరోధించగలవు. ఎలక్ట్రానిక్ పరికరాలు తన కుటుంబ సంబంధాలను జయిస్తున్నాయని భావించిన ఒక తల్లి దానికి పరిష్కారాన్ని కనుగొంది. భోజన సమయంలో మరియు ఇతర కుటుంబ సమయాల్లో, “ఫోనులు ప్రక్కన పెట్టండి; ముఖాముఖిగా మాట్లాడుకుందాం” అని ఆమె చెప్తుంది. ఇది వారి కుటుంబము కొరకు క్రొత్త నియమమని, వారు నిజంగా ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడు ఒక కుటుంబంగా వారి సంబంధాన్ని ఇది బలపరుస్తుందని ఆమె చెప్తుంది. వారిప్పుడు ఒక కుటుంబంగా కలిసి నాణ్యమైన రండి, నన్ను అనుసరించండి చర్చలను ఆనందిస్తున్నారు.

రెండవది, ప్రవక్తలను పిలవడం ద్వారా ఆయన తన పిల్లల పట్ల తన ప్రేమను ప్రత్యక్షపరుస్తారు

మన ప్రస్తుత ప్రపంచము “వాగ్వివాదము మరియు అభిప్రాయభేదములతో” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:10) ముంచివేయబడింది. “లోకమందు ఎన్నో విధములగు భాషలున్నవి” (1 కొరింథీయులకు 14:10) అని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. ఈ స్వరములన్నిటిలో ఏది కలహాన్ని మించి స్పష్టంగా, అర్థవంతంగా ఎదిగింది? అది దేవుని యొక్క ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారుల స్వరము.

2018లో శస్త్రచికిత్స తరువాత తిరిగి పనిచేయడానికి వచ్చినప్పుడు, నాకు స్పష్టంగా గుర్తుంది, నేను సంఘ ప్రధాన కేంద్రం వద్ద వాహనాలు నిలిపే ప్రదేశంలో ఉన్నాను. అకస్మాత్తుగా, “తానియెలా, తానియెలా” అని పిలుస్తున్న అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ స్వరమును నేను విన్నాను. ఆయన వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాను, నేను ఎలా ఉన్నానని ఆయన అడిగారు.

“నేను బాగా కోలుకుంటున్నాను, అధ్యక్షులు నెల్సన్” అని నేను చెప్పాను.

ఆయన నాకు సలహా ఇచ్చి, నన్ను ఆలింగనం చేసుకున్నారు. నిజంగా “ఒక వ్యక్తికి” ప్రవక్త యొక్క వ్యక్తిగత పరిచర్యను నేను భావించాను.

అధ్యక్షులు నెల్సన్ భూమి మీద అనేక దేశాలకు ప్రయాణించారు. నా మనస్సులో, ఆయన కేవలం వేలమందికి పరిచర్య చేయడం లేదు, కానీ వేలమందిలో “ప్రతి వ్యక్తికి” ఆయన పరిచర్య చేస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా, దేవుడు తన పిల్లలందరి కొరకు కలిగియున్న ప్రేమను ఆయన పంచుతున్నారు.

ఇటీవల అధ్యక్షులు నెల్సన్ గారి మాటలు ఫిలిప్పీన్స్ ప్రజలకు ప్రేరణగా, బలాన్నిచ్చేవిగా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశం వలె 2020 లో ఫిలిప్పీన్స్ కూడా కొవిడ్-19 మహమ్మారి చేత, అలాగే అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, బలమైన తుఫానులు మరియు నాశనకరమైన వరదల చేత తీవ్రంగా ప్రభావితం చేయబడింది.

కానీ భయం, ఒంటరితనం మరియు నిరాశలనే చీకటి మబ్బుల గుండా ప్రకాశిస్తున్న వెలుగు స్తంభంలా ప్రవక్త మాటలు వినిపించాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఉపవాస ప్రార్థన చేయమనే పిలుపు మరియు మహమ్మారి ఉన్నప్పటికీ ముందుకు సాగమనే సలహా ఉన్నాయి. మన గృహాలను విశ్వాసం యొక్క వ్యక్తిగత ఆశ్రయంగా చేయమని ఆయన మనల్ని ఆహ్వానించారు. దేవుని పిల్లలందరిని గౌరవించమని, దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వమని ప్రతిచోట నున్న కడవరి-దిన పరిశుద్ధులందరికీ ఆయన పిలుపునిచ్చారు.2

అదేవిధంగా, కృతజ్ఞత యొక్క శక్తి గురించి ఇటీవల అధ్యక్షులు నెల్సన్ వీడియో సాక్ష్యము ప్రేరేపించేదిగా ఉంది మరియు ఆయన ముగింపు ప్రార్థన ఫిలిప్పీన్స్ అంతటా ధ్వనించింది.3 లేటి ప్రావిన్స్‌లో వివిధ మతాలవారు పాల్గొన్న కార్యక్రమములో ఈ వీడియో చూపబడింది మరియు ఒక మత నాయకుని ప్రసంగంలో భాగంగా కూడా ప్రస్తావించబడింది. ఆయన ఎంచుకున్న ప్రవక్త యొక్క మాటల ద్వారా మొత్తం ప్రపంచంతో పాటు ఫిలిప్పీయులు దేవుని ప్రేమను భావించడానికి దీవించబడ్డారు.

మూడవది, గద్దింపు తన పిల్లల కొరకు దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత కాగలదు

కొన్నిసార్లు మనల్ని గద్దించడం ద్వారా దేవుడు తన ప్రేమను చూపుతారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని, మనమెవరమో ఆయనకు తెలుసునని మనకు గుర్తు చేయడానికి ఇది ఒక విధానము. నిబంధన బాటపై ధైర్యంగా నడుస్తూ, దిద్దుబాటును పొందడానికి సమ్మతించే వారందరికీ ఆయన వాగ్దానమిచ్చిన సమాధానము యొక్క దీవెన లభ్యమవుతుంది.

గద్దింపును గుర్తించి, ఇష్టపూర్వకంగా మనం స్వీకరించినప్పుడు అది ఒక ఆత్మీయ శస్త్రచికిత్స అవుతుంది. అయినా, శస్త్రచికిత్సను ఎవరు ఇష్టపడతారు? కానీ, అది అవసరమైన వారికి మరియు దానిని పొందడానికి సమ్మతించేవారికి అది ప్రాణరక్షణ కాగలదు. తాను ప్రేమించేవారిని ప్రభువు గద్దిస్తారు. లేఖనాలు మనకు ఆవిధంగా చెప్తాయి (హెబ్రీయులకు 12:5–11; హీలమన్ 12:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 1:27; 95:1 చూడండి). గద్దింపు లేదా ఆత్మీయ శస్త్రచికిత్స మన జీవితాల్లో కావలసిన మార్పును తెస్తుంది. సహోదర సహోదరీలారా, అది మన లోపలి పాత్రలను మెరుగుపెట్టి శుద్ధిచేస్తుందని మనము తెలుసుకుంటాము.

పునఃస్థాపన యొక్క ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ గద్దించబడ్డారు. మోర్మన్ గ్రంథము యొక్క చేతివ్రాత ప్రతులైన 116 పేజీలను జోసెఫ్ కోల్పోయిన తర్వాత, ప్రభువు ఈ విధంగా చెప్తూ ఆయనను సరిదిద్ది, ప్రేమ చూపారు: “నీవు దేవుని కంటే మనుష్యునికి ఎక్కువ భయపడియుండవలసినది కాదు. … నీవు నమ్మకముగా యుండవలసినది. … ఇదిగో, జోసెఫ్ అను నీవు, ఎన్నుకోబడితివి. … దేవుడు కనికరము గలవాడని జ్ఞాపకముంచుకొనుము; కాబట్టి, పశ్చాత్తాపపడుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 3:7–10).

2016లో, అర్కన్సాస్‌లోని లిటిల్ రాక్‌లో సువార్త సేవ చేస్తున్నప్పుడు, ఫీజిలోని ఒక ద్వీపంపై నివసిస్తున్న మా అక్కకు ఒక ప్యాకేజి ఇవ్వమని నేను సహోదరుడు కావాను అడిగాను. అతని జవాబు నేను ఊహించినది కాదు. “అధ్యక్షులు వాకొలొ, మీ అక్క చనిపోయి 10 రోజుల క్రితం పాతిపెట్టబడ్డారని” అతడు బాధగా చెప్పాడు. నా మీద నేను జాలిపడ్డాను మరియు కనీసం నాకు చెప్పాలని కూడా నా కుటుంబానికి అనిపించనందుకు కొంత బాధపడ్డాను.

మరుసటి రోజు, నా భార్య సువార్తికులకు బోధిస్తున్నప్పుడు, ఈ ఆలోచన నా మనస్సులో ప్రవేశించింది: “తానియెలా, ఈ అనుభవాలన్నీ నీ మేలుకొరకు, వృద్ధి కొరకైనవి. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గురించి నీవు బోధిస్తున్నావు మరియు నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నావు; ఇప్పుడు దాని ప్రకారము జీవించు.” “దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు; కాబట్టి (మనము) సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించరాదు” (యోబు 5:17). అది నాకు ఆత్మీయ శస్త్రచికిత్స వంటిది మరియు దాని ఫలితం వెంటనే వచ్చింది.

ఆ అనుభవాన్ని నేను ధ్యానిస్తుండగా, ఆ చర్చకు ముగింపు వ్యాఖ్యలు చేయమని నేను పిలువబడ్డాను. మిగిలిన విషయాల మధ్య, అప్పుడే నాకు బోధించబడిన పాఠాలను నేను పంచుకున్నాను: ఒకటి, అప్పుడే నేను పరిశుద్ధాత్మ చేత గద్దించబడ్డాను మరియు నేను దానిని ప్రేమించాను, ఎందుకంటే దానిని వినినది నేనొక్కడినే; రెండు, రక్షకుని త్యాగము మరియు ఆయన చెల్లించిన జరిమానా మూలంగా నేను నా సవాళ్ళను ఇకపై శ్రమలు మరియు బాధలుగా కాకుండా నేను “నేర్చుకొను అనుభవాలుగా” సూచిస్తాను; మూడు, ఆయన పరిపూర్ణమైన, పాపరహితమైన జీవితం మూలంగా నేను ఇకపై నా దోషాలను, లోపాలను బలహీనతలుగా కాకుండా నేను “వృద్ధిచెందడానికి అవకాశాలుగా” సూచిస్తాను. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తారని తెలుసుకోవడానికి ఈ అనుభవం నాకు సహాయపడింది.

నేను ముగిస్తాను. మనకు బోధించడానికి, పరిచర్య చేయడానికి ఆధునిక-దిన ప్రవక్తలను పిలవడం ద్వారా మరియు మనం నేర్చుకొని వృద్ధిచెందేలా సహాయపడేందుకు మనల్ని గద్దించడం ద్వారా, వారితో మరియు మన కుటుంబ సభ్యులతో నిత్య సంబంధాలు కలిగియుండడాన్ని మనకు సాధ్యపరచడం ద్వారా మన నిత్య తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు తమ ప్రేమను చూపిస్తున్నారు. ఆయన దైవిక కుమారుడు, పునరుత్థానం చెందిన మన ప్రభువు, జీవముతోనున్న క్రీస్తు యొక్క అపురూపమైన బహుమానం కొరకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి.4 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.