సర్వసభ్య సమావేశము
సహాయము కొరకు పరలోకములను తెరుచుట
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


11:27

సహాయము కొరకు పరలోకములను తెరుచుట

ప్రభువైన యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని అమలు చేద్దాం!

ఇది ఎంత ప్రత్యేకమైన మరియు అద్భుతమైన సభ! ధన్యవాదాలు, ప్రియమైన లాడీ మరియు ఎంజో. మీరు సంఘము యొక్క అద్భుతమైన యువతులు మరియు యువకులకు బాగా ప్రాతినిధ్యం వహించారు.

నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము యొక్క పునఃస్థాపన గురించి ఈ రోజు మనం చాలా విన్నాము—మన రక్షకుడైన యేసు క్రీస్తు తన భూలోక పరిచర్యలో స్థాపించిన సంఘము ఇదే. ఈ పునఃస్థాపన 200 సంవత్సరాల క్రితం ఈ వసంతకాలంలో తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యువ జోసెఫ్ స్మిత్‌కు కనిపించినప్పుడు ప్రారంభమైంది.

ఈ సర్వశ్రేష్ఠమైన దర్శనము కలిగిన పది సంవత్సరాల తరువాత, ప్రవక్త యైన జోసెఫ్ స్మిత్ మరియు మరో ఐదుగురు ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘము యొక్క వ్యవస్థాపక సభ్యులుగా పిలువబడ్డారు.

ఏప్రిల్ 6, 1830 న సమావేశమైన ఆ చిన్న సమూహం నుండి, 16 మిలియన్లకు పైగా సభ్యులతో కూడిన ప్రపంచ సంస్థ వచ్చింది. మానవ బాధలను తగ్గించడానికి మరియు మానవజాతికి ఉత్తేజాన్ని అందించడానికి ఈ సంఘము ప్రపంచవ్యాప్తంగా సాధించిన మంచి విస్తృతంగా అందరికి తెలుసు. కానీ దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పురుషులు, స్త్రీలు మరియు కుటుంబాలు ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు అన్ని ఆశీర్వాదాలలో గొప్పదైన—దేవునితో మరియు వారి ప్రియమైనవారితో నిత్యజీవానికి అర్హత పొందడం.

మనం 1820 లో ప్రారంభించబడిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మనం జోసెఫ్ స్మిత్‌ను దేవుని ప్రవక్తగా గౌరవిస్తున్నప్పటికీ, ఇది జోసెఫ్ స్మిత్ సంఘము కాదని, మోర్మన్ సంఘము కాదని జ్ఞాపకముంచుకొనుట ముఖ్యము. ఇది యేసు క్రీస్తు యొక్క సంఘము. తన సంఘాన్ని ఏ పేరుతో పిలవాలో అని ఆయన ఖచ్చితంగా ఆదేశించారు: “ఏలయనగా అంతిమ దినములలో నా సంఘము ఈ విధముగా పిలువబడును, అదేమనగా యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము.”

సంఘము పేరును సూచించే విధానంలో అవసరమైన దిద్దుబాట్ల క్రమము గురించి నేను ఇంతకు ముందు మాట్లాడాను. ఆ సమయం నుండి, ఈ దిద్దుబాటు సాధించడానికి చాలా జరిగింది. ఈ ప్రయత్నాలకు మరియు ఈ సాయంత్రం నేను ప్రకటించబోయే మరొక కార్యారంభమునకు సంబంధించిన వాటన్నిటికి నాయకత్వం వహించడానికి చాలా కృషి చేసిన అధ్యక్షుడు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మరియు పన్నెండు అపొస్తలుల మొత్తం సమూహానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

సంఘ నాయకులు మరియు విభాగాలు, సంబంధిత సంస్థలు మరియు మిలియన్ల మంది సభ్యులు మరియు ఇతరులు ఇప్పుడు సంఘము యొక్క సరైన పేరును ఉపయోగిస్తున్నారు. సంఘము యొక్క అధికారిక శైలి మార్గదర్శిని సర్దుబాటు చేయబడింది. సంఘము యొక్క ప్రధాన వెబ్‌సైట్ ఇప్పుడు ChurchofJesusChrist.org. ఈ-మెయిల్, డొమైన్ పేర్లు మరియు సోషల్ మీడియా ఛానెల్‌ల కోసం చిరునామాలు నవీకరించబడ్డాయి. మన ప్రియమైన గాయక బృందం ఇప్పుడు టెంపుల్ స్క్వేర్ వద్ద టాబర్నాకిల్ గాయకబృందం.

మేము ఈ అసాధారణ ప్రయత్నాలకు వెళ్ళాము, ఎందుకంటే ప్రభువు పేరును ఆయనసంఘము నుండి తొలగించినప్పుడు, మన ఆరాధన మరియు మన జీవితాల యొక్క కేంద్రీకృత దృష్టి నుండి మనం అనుకోకుండా ఆయనను తొలగిస్తాము. బాప్తీస్మము వద్ద మనము రక్షకుని నామమును మనపై తీసుకున్నప్పుడు, యేసే క్రీస్తు అని మన మాటలు, ఆలోచనలు మరియు చర్యల ద్వారా సాక్ష్యమివ్వడానికి మనము కట్టుబడి ఉన్నాము.

“ప్రభువు సంఘము యొక్క సరైన పేరును పునఃస్థాపించడానికి మన వంతు కృషి చేస్తే” ఆయన “మనం ఎప్పుడూ చూడని రీతులలో తన శక్తిని మరియు ఆశీర్వాదాలను కడవరి-దిన పరిశుద్ధుల శిరస్సులపై క్రుమ్మరిస్తారని“ ఇంతకుముందు నేను వాగ్దానము చేసాను. ఆ వాగ్దానాన్ని నేను నేడు నూతనపరుస్తున్నాను.

ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘమును ప్రభువు సంఘము గా గుర్తించడంలో మాకు సహాయపడడానికి, ఆయన సంఘములో యేసు క్రీస్తు యొక్క ప్రధాన స్థానాన్ని సూచించే చిహ్నాన్ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము.

ఈ చిహ్నంలో ఒక మూలరాయిలో సంఘము పేరు కలిపి ఉంటుంది. యేసు క్రీస్తు ప్రధానమైన మూలరాయి.

అక్షరగుర్తుతో మూలరాయి

చిహ్నం మధ్యలో థోర్వాల్డ్‌సెన్ పాలరాయి విగ్రహం క్రైస్టస్ యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది. ఇది పునరుత్థానం చెందిన, జీవించుచున్న ప్రభువును తన వద్దకు వచ్చే వారందరినీ హత్తుకోవడానికి సమీపిస్తున్నట్లు చిత్రీకరిస్తుంది.

ప్రతీకగా, యేసు క్రీస్తు ఒక ధనురాకారము క్రింద నిలబడి ఉన్నారు. ఆయన సిలువ వేయబడిన తరువాత మూడవ రోజు పునరుత్థానం చెందిన రక్షకుడు సమాధి నుండి ఉద్భవించడం గురించి ఆ ధనురాకారము మనకు గుర్తు చేస్తుంది.

సంఘము యొక్క క్రొత్త చిహ్నము

పునఃస్థాపించబడిన సువార్తను జీవించుచున్న, పునరుత్థానం చెందిన క్రీస్తుతో మనం చాలాకాలంగా గుర్తించినందున, ఈ గుర్తు చాలా మందికి పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది.

ఈ చిహ్నం ఇప్పుడు అధికారిక సాహిత్యం, వార్తలు మరియు సంఘము యొక్క సంఘటనలకు దృశ్యమాన గుర్తింపుగా ఉపయోగించబడుతుంది. ఇది రక్షకుని సంఘము అని మరియు ఆయన సంఘ సభ్యులుగా మనం చేసేదంతా యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై కేంద్రీకరింపబడుతుందని ఇది గుర్తు చేస్తుంది.

ఇప్పుడు నా ప్రియ సహోదరీ సహోదరులారా, ఎల్డర్ గాంగ్ చాలా అనర్గళంగా బోధించినట్లుగా రేపు మట్టల ఆదివారము. తరువాత మనము ఈస్టరుతో ముగుస్తున్న ప్రత్యేక వారంలో ప్రవేశిస్తాము. యేసు క్రీస్తు అనుచరులుగా, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేసిన రోజులో జీవిస్తుండగా, మనం కేవలం క్రీస్తు గురించి మాట్లాడటం లేదా క్రీస్తు గురించి బోధించడం లేదా క్రీస్తును సూచించే చిహ్నాన్ని ఉపయోగించుకోవడమే కాదు.

ప్రభువైన యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని అమలు చేద్దాం!

మీకు తెలిసినట్లుగా, సంఘ సభ్యులు ప్రతి నెల ఒక రోజు ఉపవాస చట్టాన్ని పాటిస్తారు.

ఉపవాస సిద్ధాంతం పురాతనమైనది. దీనిని పూర్వపు రోజుల నుండి బైబిల్ వీరులు అభ్యసిస్తున్నారు. మోషే, దావీదు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యెషయా, దానియేలు, యోవేలు మరియు మరెంతో మంది ఉపవాసం చేసారు మరియు ఉపవాసం గురించి బోధించారు. యెషయా రచనల ద్వారా, ప్రభువు ఇలా అన్నారు: “దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా?”

అపొస్తలుడైన పౌలు కొరింథులోని పరిశుద్ధులకు “మీరు ఉపవాస ప్రార్థనలు చేయుడి” అని ఉపదేశించారు. “ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేనివలననైనను” ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని రక్షకుడు బోధించారు.

నేను ఇటీవల ఒక సోషల్ మీడియా వీడియోలో, “వైద్యుడు మరియు శస్త్రవైద్యునిగా , కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి ఇరవైనాలుగు గంటలు పనిచేస్తున్న వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు మరియు ఇతరులపై నాకు విపరీతమైన గౌరవం ఉంది” అని అన్నాను.

ఇప్పుడు, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘాధ్యక్షునిగా మరియు యేసుక్రీస్తు అపొస్తలునిగా, దేవుడు “సమస్త శక్తి, సమస్త వివేకము, సమస్త గ్రహింపును కలిగియున్నాడు; ఆయన అన్ని సంగతులను గ్రహించును మరియు పశ్చాత్తాపము పొంది, ఆయన నామమందు విశ్వసించువారి రక్షణ కొరకు కూడా ఆయన ఒక కనికరము గల వ్యక్తియై యున్నాడు” అని నాకు తెలుసు.

కాబట్టి తీవ్ర బాధాకర సమయంలో, అనారోగ్యం ప్రపంచవ్యాప్త దశకు చేరుకున్నప్పుడు, మనం చేయవలసిన సహజమైన విషయం ఏమిటంటే, భూమిపైన ఉన్న ప్రజలను ఆశీర్వదించమని, వారి అద్భుతమైన శక్తిని చూపించమని మన పరలోకపు తండ్రికి మరియు ఆయన కుమారుడు—స్వస్థపరిచే గురువుకు మొరపెట్టడం.

నా వీడియో సందేశంలో, మార్చి 29, 2020 ఆదివారం నాడు ఉపవాసంలో చేరమని అందరినీ ఆహ్వానించాను. మీలో చాలామంది వీడియోను చూసి ఉపవాసంలో చేరారు. కొంతమంది చేరకపోయి ఉండవచ్చు. ఇప్పటికీ మనకు పరలోకము నుండి సహాయం కావాలి.

కాబట్టి ఈ రాత్రి, నా ప్రియ సహోదర సహోదరీలారా, చాలా ఉపవాసం మరియు ప్రార్థనలు చేసిన మోషైయ కుమారుల ఆత్మలో మరియు మన ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశంలో భాగంగా, నేను ప్రపంచవ్యాప్తంగా మరో ఉపవాసం కోసం పిలుపు ఇస్తున్నాను. ఎవరి ఆరోగ్యం అనుమతిస్తుందో వారందరం ఉపవాసం, ప్రార్థన చేద్దాం మరియు మన విశ్వాసాన్ని మరోసారి ఏకం చేద్దాం. ఈ ప్రపంచవ్యాప్త మహమ్మారి నుండి ఉపశమనం కోసం ప్రార్థనపూర్వకంగా వేడుకుందాం.

ప్రస్తుత మహమ్మారి నియంత్రించబడాలని, సంరక్షకులు రక్షించబడాలని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, మరియు జీవితం సాధారణ స్థితికి రావాలని, ఏప్రిల్ 10, గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం మరియు ప్రార్థన చేయమని మన విశ్వాసానికి చెందని వారితో సహా అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను.

మనం ఎలా ఉపవాసం చేస్తాము? రెండు భోజనాలు లేదా 24 గంటల వ్యవధి మన ఆచారం. రక్షకుడు మీ కోసం చేసిన అత్యున్నత త్యాగాన్ని మీరు గుర్తు చేసుకొన్నప్పుడు, మీకు ఏది ఒక త్యాగం అని అనిపిస్తుందో దానిని మీరు నిర్ణయించుకోండి. ప్రపంచమంతటా స్వస్థత కోసం విజ్ఞప్తి చేయడంలో మనం ఏకమవుదాం.

గుడ్ ఫ్రైడే రోజు, మన పరలోకపు తండ్రి మరియు ఆయన కుమారుడు మనల్ని వినేలా చేయడానికి అది సరైన రోజు!

ప్రియ సహోదర సహోదరీలారా, మనము నిమగ్నమై ఉన్న పని యొక్క దైవత్వానికి నా సాక్ష్యంతో పాటు, మీ పట్ల నా ప్రగాఢ ప్రేమను తెలియజేస్తున్నాను. ఇది యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము. ఆయన దీనికి శిరస్సుగా ఉండి, మనం చేసే పనులన్నింటినీ నిర్దేశిస్తున్నారు. ఆయన తన ప్రజల అభ్యర్ధనలకు ప్రతిస్పందిస్తారని నాకు తెలుసు. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.