రాబోవు కాలమునకు మంచి పునాది
రాబోయే సంవత్సరాల్లో, సాల్ట్ లేక్ దేవాలయానికి చేసిన మెరుగుదలలు మమ్మల్ని కదిలించడానికి మరియు ప్రేరేపించడానికి అనుమతించవచ్చు.
సాల్ట్ లేక్ దేవాలయ చరిత్ర
మనం వెనుకకు ప్రయాణం చేసి 1847 జూలై 24, తాపముగల మధ్యాహ్నం 2:00 గంటలకు వెళ్దాం. సంఘానికి చెందిన 148 మంది సభ్యులతో 111 రోజుల కష్టతరమైన ప్రయాణం తరువాత, పశ్చిమ దిశగా వెళ్ళిన మొదటి జట్టు, బ్రిగమ్ యంగ్, అప్పటి పన్నెండు అపొస్తలుల సమూహము యొక్క అధ్యక్షుడు, అనారోగ్యంతో మరియు కొండ జ్వరం వలన బలహీనంగా ఉండి సాల్ట్ లేక్ లోయలోకి ప్రవేశించారు.
రెండు రోజుల తరువాత, తన అనారోగ్యం నుండి కోలుకుంటున్నప్పుడు, బ్రిగం యంగ్ పన్నెండు అపొస్తలుల సమూహము యొక్క అనేక మంది సభ్యులను మరియు ఇతరులను అన్వేషించే యాత్రకు నడిపించారు. విలియం క్లేటన్ ఇలా నమోదు చేశారు: “శిబిరానికి ఉత్తరాన మూడొంతులు మైలు దూరంలో, మేము ఒక అందమైన భూమి, స్థాయి మరియు చక్కగా పడమర వైపు వాలుగా వచ్చాము.” 1
సమూహంతో ఆ స్థలాన్ని పరిశీలించేటప్పుడు, బ్రిగం యంగ్ అకస్మాత్తుగా ఆగి తన కర్రను భూమిలో గుచ్చి, “ఇక్కడ మన దేవుని దేవాలయం నిర్మించబడాలి” అని బిగ్గరగా చెప్పారు.” అతని సహచరులలో ఒకరు ఎల్డర్ విల్ఫర్డ్ ఉడ్రఫ్, ఈ ప్రకటన “[తన లోనుండి] మెరుపులాగా దూసుకుపోయింది” అని చెప్పారు మరియు అధ్యక్షులు యంగ్ కర్ర చేసిన ముద్రను గుర్తించడానికి అతను ఒక కొమ్మను భూమిలోకి గుచ్చెను. ఈ దేవాలయం కోసం నలభై ఎకరాలు ఎంపిక చేయబడ్డాయి, మరియు దేవాలయం కేంద్ర ప్రదేశంగా ఉండటంతో నగరాన్ని “సంపూర్ణ చదరపు ఉత్తర & దక్షిణ, తూర్పు& పడమర” గా ఉంచాలని నిర్ణయించారు.2
ఏప్రిల్ 1851 సర్వసభ్య సమావేశంలో, “ప్రభువు నామానికి”3 ఒక దేవాలయాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని బలపరచడానికి సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. రెండు సంవత్సరాల తరువాత, ఫిబ్రవరి 14, 1853 న, హీబర్ సి. కింబల్ అనేక వేల మంది పరిశుద్ధులు హాజరైన బహిరంగ కార్యక్రమంలో ఈ స్థలాన్ని అంకితం చేశారు మరియు దేవాలయ పునాది కోసం శంకుస్థాపన చేయబడింది. కొన్ని నెలల తరువాత, ఏప్రిల్ 6 న, దేవాలయం యొక్క భారీ మూలరాయిలు వేయబడ్డాయి మరియు విస్తృతమైన వేడుకలతో అంకితం చేయబడ్డాయి, ఇందులో కవాతు సమూహాలు, బృందాలు మరియు టేబర్నేకిల్ నుండి దేవాలయ స్థలం వరకు సంఘ నాయకుల నేతృత్వంలోని ఊరేగింపు ఉన్నాయి, నాలుగు రాళ్ళలో ప్రతి రాయి వద్ద వ్యాఖ్యలు మరియు ప్రార్థనలు చేయబడ్డాయి.4
శంకుస్థాపన వేడుకలో, అధ్యక్షులు యంగ్ వారు లోయ నేలను సర్వే చేస్తున్నప్పుడు ఆయన మొదట నేలమీద అడుగు పెట్టినప్పుడు తనకు ఒక దర్శనము కలిగిందని జ్ఞాపకముచేసుకొన్నారు, “[అప్పుడు] నాకు తెలిసినట్లే, ఇప్పుడు నాకు తెలుసు, దేవాలయాన్ని నిర్మించవలసిన స్థలము ఇదే—ఇది దర్శనములో నా ముందు ఉన్నట్లు కనిపించింది.”5
పది సంవత్సరాల తరువాత, అక్టోబర్ 1863 సర్వసభ్య సమావేశంలో బ్రిగమ్ యంగ్ ఈ క్రింది ప్రవచనాత్మక అంతర్దృష్టిని ఇచ్చాడు: “నేను దేవాలయాన్ని వెయ్యెండ్ల పరిపాలన వరకు ఉండే విధంగా నిర్మించడం చూడాలనుకుంటున్నాను. ఇది మేము నిర్మించే ఏకైక దేవాలయం కాదు; వాటిలో వందలాది నిర్మించబడి, ప్రభువుకు అంకితం చేయబడతాయి. ఈ దేవాలయాన్ని పర్వతాలలో నిర్మించిన మొదటి దేవాలయంగా కడవరి-దిన పరిశుద్ధులు పిలుస్తారు. … ఆ దేవాలయం… పర్వతాలలో దేవుని పరిశుద్ధులు విశ్వాసం, పట్టుదల మరియు పరిశ్రమ యొక్క గర్వించదగిన స్మారక చిహ్నంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను.” 6
ఈ సంక్షిప్త చరిత్ర యొక్క సమీక్ష నన్ను బ్రిగం యంగ్ యొక్క దీర్ఘదర్శనము పట్ల విస్మయానికి గురిచేస్తుంది—మొదట, సాధ్యమైనంతవరకు మరియు ఆ సమయంలో మరియు ప్రదేశంలో లభించే నిర్మాణ పద్ధతులను ఉపయోగించి, సాల్ట్ లేక్ దేవాలయము వెయ్యేండ్ల వరకు నిలబడే విధానంలో నిర్మించబడుతుందని ఆయన అభయమివ్వడం మరియు రెండవది, ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ దేవాలయాల పెరుగుదల గురించి అది వందల సంఖ్యలో కూడా ఉంటుందని ఆయన ప్రవచించడం.
సాల్ట్ లేక్ దేవాలయము పునరుద్ధరణ
బ్రిగం యంగ్ మాదిరిగా, నేటి మన ప్రవక్తలు సాల్ట్ లేక్ దేవాలయము మరియు మిగతా అన్నింటిని చాలా జాగ్రత్తగా చూసుకొంటున్నారు. అనేక సంవత్సరాలుగా, ప్రథమ అధ్యక్షత్వము—ఎప్పటికప్పుడు—సాల్ట్ లేక్ దేవాలయము యొక్క పునాది దృఢంగా ఉండేలా అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కును సంప్రదించింది. ప్రథమ అధ్యక్షత్వము అభ్యర్థన మేరకు నేను అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కులో పనిచేసినప్పుడు, మేము సాల్ట్ లేక్ దేవాలయం యొక్క మొత్తం సదుపాయాల సమీక్ష చేసాము, ఇందులో భూకంప రూపకల్పన మరియు నిర్మాణ పద్ధతుల్లో ఇటీవలి పురోగతి యొక్క మూల్యాంకనం ఉంది.
ఆ సమయంలో ప్రథమ అధ్యక్షత్వానికి అందించిన సమీక్ష యొక్క భాగాలు ఇక్కడ ఉన్నాయి: “సాల్ట్ లేక్ దేవాలయ రూపకల్పన మరియు నిర్మాణంలో, ఉత్తమ ఇంజనీరింగ్, నైపుణ్యం కలిగిన శ్రమ, నిర్మాణ సామగ్రి, అలంకరణలు మరియు ఇతర కాలానికి అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించబడ్డాయి. 1893 లో ప్రతిష్ఠించబడినప్పటి నుండి, ఈ దేవాలయం దృఢంగా నిలబడి విశ్వాసం [మరియు] నిరీక్షణ యొక్క దారిచూపేదిగా మరియు ప్రజలకు వెలుగుగా పనిచేసింది. దేవలయాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, శుభ్రపరచడానికి మరియు నిర్వహించడానికి చాలా జాగ్రత్తలు తీసుకొనబడ్డాయి. గ్రానైట్‌తో బాహ్యఆవరణము మరియు లోపల వేయబడిన వాసాలు మరియు వాటికి మద్దతుగా వేయబడిన దూలాలు మంచి స్థితిలో ఉన్నాయి. దేవాలయం కోసం బ్రిగం యంగ్ ఎంచుకున్న ప్రదేశం చాలా మంచి నేలలు మరియు అద్భుతమైన సంపీడన లక్షణాలను కలిగి ఉందని ఇటీవలి అధ్యయనాలు నిర్ధారించాయి. ”7
బాహ్య వసారా మరియు ఉపరితల ప్రాంతాలు, వాడుకలో లేని వినియోగ విధానాలు, బాప్తీస్మకార్యక్రమ ప్రాంతాలతో సహా ఆలయాన్ని పునరుద్ధరించడానికి మరియు నవీకరించడానికి సాధారణ మరమ్మతులు మరియు మెరుగుదలలు అవసరమని సమీక్ష తేల్చింది. ఏదేమైనా, దేవాలయ పునాది నుండి పైకి ప్రారంభమయ్యే ప్రత్యేకమైన భూకంప నవీకరణను పరిగణనలోకి తీసుకోవడం కూడా సిఫార్సు చేయబడింది.
దేవాలయ పునాది
మీరు గుర్తుచేసుకున్నట్లుగా, అధ్యక్షులు బ్రిగం యంగ్ అసలు దేవాలయ పునాది నిర్మాణంలో చాలా వివరంగా పాల్గొన్నారు, ఇది 127 సంవత్సరాల క్రితం దేవాలయం పూర్తయినప్పటి నుండి బాగా పనిచేసింది. ఆలయం కోసం కొత్తగా ప్రతిపాదించిన భూకంప నవీకరణ ప్యాకేజీ బేస్ ఐసోలేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది, దీనిని దాని యొక్క నిర్మాణ సమయంలో ఊహించలేదు. భూకంప రక్షణ కోసం ఇది సరికొత్త, అత్యాధునిక ఇంజనీరింగ్‌గా పరిగణించబడుతుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానం, ఇటీవల దాని అభివృద్ధిలో, దేవాలయం యొక్క పునాది వద్ద ప్రారంభమవుతుంది, ఇది భూకంపం నుండి నష్టానికి వ్యతిరేకంగా బలమైన రక్షణను అందిస్తుంది. సారాంశం ఏమిటంటే, ఇది నిర్మాణాత్మకంగా దేవాలయం స్థిరంగా నిలబడటానికి బలపరుస్తుంది, అలాగే భూమి మరియు పర్యావరణం భూమికదులుట, భూకంప సంఘటనకు లోనయినప్పుడు ఊతమిస్తుంది.
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే దేవాలయ పునరుద్ధరణను గత సంవత్సరం ప్రథమ అధ్యక్షత్వము ప్రకటించింది. అధ్యక్షత్వము వహించు బిషప్రిక్కు దర్శకత్వంలో కొన్ని నెలల క్రితం, జనవరి 2020 లో నిర్మాణం ప్రారంభమైంది. ఇది సుమారు నాలుగు సంవత్సరాలలో పూర్తవుతుందని అంచనా.
మీ వ్యక్తిగత పునాదిని బలపరచుట
ఈ అందమైన, గొప్ప, ఉన్నతమైన, మరియు విస్మయం కలిగించే సాల్ట్ లేక్ దేవాలయం యొక్క తరువాతి నాలుగు సంవత్సరాల గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను దానిని మూసివేసే సమయం కాకుండా పునరుద్ధరణ యొక్క సమయంగా ఎక్కువగా ఊహించాను! ఇదే విధంగా, “సాల్ట్ లేక్ దేవాలయం యొక్క ఈ విస్తృతమైన పునరుద్ధరణ మన స్వంత ఆధ్యాత్మిక పునరుద్ధరణ, పునర్నిర్మాణం, పునర్జన్మ, పునరుజ్జీవనం లేదా పునఃస్థాపనకు ఎలా ప్రేరణనిస్తుంది?”
మనకు అవసరమైన నిర్వహణ మరియు పునర్నిర్మాణ పనులను, భూకంప నవీకరణను చేయడం ద్వారా మనం మరియు మా కుటుంబాలు ప్రయోజనం పొందవచ్చని ఒక ఆత్మపరిశీలన చూస్తే తెలుస్తుంది! మనం ఈ ప్రశ్నలు అడగడం ద్వారా అటువంటి ప్రక్రియను ప్రారంభించవచ్చు:
“నా పునాది చూడడానికి ఎలా ఉంటుంది?”
“నా సాక్ష్యం ఆధారపడిఉన్న నా వ్యక్తిగత పునాదిలో భాగమైన మందపాటి గోడలు, స్థిరమైన, బలమైన మూలస్తంభాలు ఏమిటి?”
“నాకు మరియు నా కుటుంబానికి కదలకుండా, స్థిరంగా ఉండటానికి వీలు కల్పించి, మన జీవితంలో ఖచ్చితంగా జరిగే భూప్రకంపనలు మరియు గందరగోళ భూకంప సంఘటనలను కూడా తట్టుకునే నా ఆత్మీయ మరియు భావోద్వేగ గుణము యొక్క పునాది అంశాలు ఏవి?”
భూకంపానికి సమానమైన సంఘటనలు ఊహించడం చాలా కష్టం మరియు అవి వివిధ స్థాయిల తీవ్రతతో వస్తాయి—ప్రశ్నలు లేదా సందేహాలతో పెనుగులాడుట, బాధలు లేదా కష్టాలను ఎదుర్కోవడం, సంఘ నాయకులు, సభ్యులు, సిద్ధాంతం లేదా విధానంతో వ్యక్తిగతంగా మనస్సు నొప్పించే వాటిని పరిష్కరించడం. వీటన్నిటిని ఎదుర్కొవడానికి ఉత్తమమైన రక్షణ మన ఆత్మీయ పునాదిలో ఉంటుంది.
మన వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాల ఆత్మీయ మూల రాళ్ళు ఏమిటి? కుటుంబ ప్రార్థన, లేఖన అధ్యయనం, దేవాలయానికి హాజరగుట, మోర్మన్ గ్రంథము, మరియు రండి, నన్ను అనుసరించండి మరియు కుటుంబ గృహ సాయంకాలం ద్వారా సువార్త అభ్యాసం—అవి సువార్త జీవనము యొక్క సాధారణ, సరళమైన మరియు విలువైన సూత్రాలు కావచ్చు. మీ ఆధ్యాత్మిక పునాదిని బలోపేతం చేయడానికి ఇతర సహాయక వనరులలో విశ్వాస ప్రమాణాలు, కుటుంబ ప్రకటన మరియు “జీవించుచున్న క్రీస్తు” ఉండవచ్చు.
నాకైతే, ఒక దేవాలయ సిఫార్సు స్వీకరించడంలో భాగంగా చర్చించిన ప్రశ్నలలో చేర్చబడిన సూత్రాలు ఆత్మీయ పునాదికి బలమైన పునాదిగా ఉపయోగపడతాయు—ముఖ్యంగా మొదటి నాలుగు ప్రశ్నలు. నేను వాటిని ఆత్మీయ మూలరాయిలుగా చూస్తాను.
అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ గత సర్వసభ్య సమావేశంలో వాటిని ఒక్కొక్కటిగా మాకు చదివినందున, ఈ ప్రశ్నలతో మనకు బాగా తెలుసు.
-
నిత్యుడగు తండ్రియైన దేవునియందు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు, మరియు పరిశుద్ధాత్మయందు మీరు విశ్వాసమును మరియు సాక్ష్యమును కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి మరియు రక్షకునిగా, విమోచకునిగా ఆయన పాత్రను గూర్చి మీరు సాక్ష్యము కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు సువార్త యొక్క పునఃస్థాపన గూర్చి మీరు సాక్ష్యమును కలిగియున్నారా?
-
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క అధ్యక్షునిని ప్రవక్త, దీర్ఘదర్శి మరియు బయల్పాటుదారునిగా, సమస్త యాజకత్వ తాళపుచెవులను ఉపయోగించుటకు అధికారము పొందిన ఏకైక వ్యక్తిగా మీరు బలపరుస్తున్నారా?8
ఈ ప్రశ్నలను మీ వ్యక్తిగత పునాదిని నిర్మించి, బలపరచుటకు మీకు సహాయపడుటకు విలువైన అంశాలుగా ఎలా పరిగణించవచ్చో మీరు చూడగలరా? “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు; ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది”9 అని పౌలు ఎఫెసీయులకు ఒక సంఘము గురించి బోధించెను.
యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తపై విశ్వాసానికి ఉదాహరణలుగా జీవిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులతో పరిచయం మరియు ప్రేరణ పొందడం నా జీవితంలో గొప్ప ఆనందాలలో ఒకటి. వారు హృదయవేదన మరియు బాధను కలిగి ఉన్నప్పటికీ, భూకంప సంఘటనలను స్థిరమైన అవగాహనతో తట్టుకోగలిగే బలమైన వ్యక్తిగత పునాదులు కలిగి ఉన్నారు.
దీన్ని మరింత వ్యక్తిగత స్థాయిలో ప్రదర్శించడానికి, నేను ఇటీవల ఒక అందమైన, శక్తివంతమైన, యువ భార్య మరియు తల్లి (మా కుటుంబ స్నేహితురాలు కూడా) అంత్యక్రియల్లో మాట్లాడాను. ఆమె దంత విద్యార్థి భర్తను కలుసుకుని వివాహం చేసుకున్నప్పుడు ఆమె మొదటి స్థానంలో ఉన్న జట్టులో పట్టుదల గల సాకర్ క్రీడాకారిణి. వారు ఒక అందమైన, వయస్సుకుమించిన బుద్ధిగల కుమార్తెతో ఆశీర్వదించబడ్డారు. ఆమె సవాలుతో కూడిన ఆరు సంవత్సరాలు వివిధ రకాల క్యాన్సర్‌తో పోరాడింది. ఆమె అనుభవించిన మానసిక మరియు శారీరక బాధలు ఉన్నప్పటికీ, ఆమె తన ప్రేమగల పరలోక తండ్రిని విశ్వసించింది మరియు ఆమె సోషల్ మీడియా అనుచరులు ఆమె ప్రఖ్యాత సామెతను విస్తృతంగా ఉదహరించారు: “దేవుడు మన జీవిత వివరాలలో ప్రభావాన్ని కలిగి ఉన్నారు.”
తన సోషల్ మీడియా పోస్టులలో ఒకదానిలో, “నిన్ను చుట్టుముట్టిన అన్ని హృదయ వేదనలతో మీరు ఇంకా విశ్వాసాన్ని ఎలా కలిగిఉన్నావు?” అని ఒకరు అడిగారని వ్రాసింది. ఆమె ఈ మాటలతో గట్టిగా సమాధానమిచ్చింది: “ఎందుకంటే విశ్వాసం ఈ చీకటి సమయాలలో నన్ను ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం కలిగి ఉండటం అంటే చెడు ఏమీ జరగదు అని అర్థం కాదు. విశ్వాసం కలిగి ఉండటం వలన మళ్ళీ వెలుతురు ఉంటుందని నేను నమ్మేలా చేస్తుంది. నేను చీకటిలో నడిచినందున ఆ కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. సంవత్సరాలుగా నేను ఎంత చీకటిని చూసానో, అంతకంటే చాలా ఎక్కువ కాంతిని నేను చూశాను. నేను అద్భుతాలను చూశాను. నేను దేవదూతలను భావించాను. నా పరలోక తండ్రి నన్ను మోయుచున్నారని నాకు తెలుసు. జీవితం తేలికగా ఉంటే అలాంటిదేమీ అనుభవించబడదు. ఈ జీవితం యొక్క భవిష్యత్తు తెలియకపోవచ్చు, కానీ నా విశ్వాసం కాదు. నేను విశ్వాసం కలిగి ఉండకూడదని ఎంచుకుంటే, నేను చీకటిలో మాత్రమే నడవడానికి ఎంచుకుంటాను. ఎందుకంటే విశ్వాసం లేకుండా, మిగిలేది చీకటి మాత్రమే.”10
ప్రభువైన యేసు క్రీస్తుపై ఆమెకున్న అచంచలమైన సాక్ష్యం—ఆమె మాటలలో మరియు ఆమె చర్యలలో—ఇతరులకు ప్రేరణ. ఆమె శరీరం బలహీనంగా, ఉన్నప్పటికీ, బలంగా ఉండాలని ఆమె ఇతరులను ఉత్తేజపరిచింది.
ఈ సహోదరి వలె, సంఘములోని లెక్కలేనన్ని ఇతర సభ్యుల గురించి, ఆమె లాంటి యోధులు, ప్రతిరోజూ విశ్వాసంతో నడుస్తూ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన మరియు నిర్భయులైన శిష్యులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. వారు క్రీస్తునుండి నేర్చుకొంటారు. వారు క్రీస్తు గురించి బోధిస్తారు. ఆయన మాదిరిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. వారి జీవితపు దినములు స్థిరంగా ఉన్నా లేదా కదిలిన మైదానంలో ఉన్నా, వారి పునాది బలంగా మరియు స్థిరంగా ఉందని వారికి తెలుసు.
“ప్రభువు పరిశుద్ధులారా, పునాది ఎంత దృఢమైనది” మరియు “ఆశ్రయం కోసం రక్షకుని వద్దకు పారిపోయిన వారు” 11 అనే సాహిత్యం యొక్క లోతైన అర్థాన్ని అర్థం చేసుకున్న భక్తిగల ఆత్మలు ఇవి. పరిశుద్ధులు అనే పేరుకు తగిన ఆత్మీయ పునాదిని సిద్ధం చేసిన వారి మధ్యలో మరియు జీవితంలోని అనేక గందరగోళాలను ఎదుర్కోవటానికి బలంగా మరియు భద్రంగా ఉన్నవారి మధ్యలో నడవడానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.
మన వ్యక్తిగత జీవితంలో అటువంటి పునాది యొక్క ప్రాముఖ్యతను మనం ఎక్కువగా చెప్పగలమని నేను అనుకోను. చిన్న వయస్సులోనే, మా ప్రాధమిక పిల్లలు ఈ సత్యాన్ని పాడేటప్పుడు బోధిస్తారు:
వివేకవంతుడు తన ఇంటిని రాతిపైన నిర్మించాడు,
మరియు వర్షాలు కురియడం మొదలుపెట్టాయి. …
వర్షాలు కురిశాయి, వరదలు వచ్చాయి,
మరియు రాతి పై ఉన్న ఇల్లు నిశ్చలంగా ఉంది.12
లేఖనం ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుంది. రక్షకుడు అమెరికా ప్రజలకు ఇలా బోధించెను:
“మీరు ఈ విషయములను ఎల్లప్పుడు చేసిన యెడల, మీరు ధన్యులు. ఏలయనగా, మీరు నా బండమీద కట్టబడియున్నారు.
“కానీ, మీ మధ్య వీటకన్నా ఎక్కువ లేక తక్కువ చేయువారెవరైననూ నా బండమీద కట్టబడలేదు, కాని ఒక ఇసుక పునాదిమీద కట్టబడియున్నారు: మరియు వాన కురిసి మరియు వరదలు వచ్చి మరియు గాలులు వీచి మరియు వాటిపైన కొట్టినప్పుడు వారు పడిపోవుదురు. మరియు వారిని చేరుకొనుటకు నరకము యొక్క గుమ్మములు తెరువబడి సిద్ధముగా ఉండును.”13
సాల్ట్ లేక్ దేవాలయం యొక్క ముఖ్యమైన పునర్నిర్మాణాలు “వెయ్యేండ్ల వరకు నిలిచేటట్లుగా దేవాలయ నిర్మాణం చేయుటను చూడాలన్న” బ్రిగమ్ యంగ్ యొక్క కోరిక నెరవేర్చడానికి దోహదం చేస్తాయని సంఘ నాయకుల యొక్క హృదయపూర్వక ఆశ. రాబోయే సంవత్సరాల్లో, సాల్ట్ లేక్ దేవాలయనికి మేము చేసే ఈ మెరుగుదలలు వ్యక్తులు మరియు కుటుంబాలుగా మనల్ని కదిలించి, ప్రేరేపించగలవని నా ప్రార్థన, మనం కూడా రూపకాలంకారముగా—“వెయ్యేండ్ల వరకు నిలిచేటట్లుగా మనం నిర్మాణం చేయబడగలము.”
అపొస్తలుడైన పౌలు చేసిన ఆజ్ఞను నెరవేర్చినప్పుడు మనము కూడా అలా చేస్తాము, “[మనము] నిత్య జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది [మన] కొరకు వేసి కొందుము”14 మన ఆత్మీయ పునాది నిశ్చయంగా ఉండాలని, యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి మన సాక్ష్యం మరియు మన రక్షకుడిగా మరియు విమోచకుడిగా ఆయన పాత్ర మనకు మన స్వంత ప్రధాన మూలరాయిగా మారుతుందని నా హృదయపూర్వక ప్రార్థన.