యాజకత్వము యువతను ఎలా దీవించును
యాజకత్వము ద్వారా, మనము పైకెత్తబడగలము. యాజకత్వము మన లోకములోనికి వెలుగును తెస్తుంది.
నేను ఇక్కడున్నందుకు కృతజ్ఞురాలిని. ఈరోజు మీతో మాట్లాడే అవకాశము నాకు కలుగుతుందని నేను మొదట తెలుసుకున్నప్పుడు నేను చాలా ఉత్సాహపడ్డాను, కానీ అదేసమయంలో చాలా వినయంగా భావించాను. నేను దేనిని పంచుకోవాలో ఆలోచిస్తూ చాలా సమయాన్ని గడిపాను, మరియు నా సందేశము ద్వారా ఆత్మ మీతో నేరుగా మాట్లాడుతుందని నేనాశిస్తున్నాను.
మోర్మన్ గ్రంథములో లీహై చనిపోకముందు అతడు తన కుమారులలో ప్రతిఒక్కరికి ఒక దీవెన ఇచ్చాడు, అది వారు తమ బలాలను, నిత్య సామర్థ్యాన్ని చూడడానికి సహాయపడింది. నేను ఎనిమిదిమంది పిల్లలలో చిన్నదానిని, మరియు ఈ గత సంవత్సరం నేను మొదటిసారిగా ఇంట్లో ఉన్న ఏకైక సంతానము. నా తోబుట్టువులు దగ్గరగా లేకపోవడం మరియు ఎల్లప్పుడు మాట్లాడడానికి ఎవరూ లేకపోవడం నాకు కష్టంగా ఉంది. నేను చాలా ఒంటరిగా భావించిన రాత్రులున్నాయి. నాకు సహాయపడేందుకు శాయశక్తులా ప్రయత్నించిన నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞురాలిని. దీనికి ఒక ఉదాహరణ, ప్రత్యేకంగా కష్టమైన ఒక సమయంలో ఓదార్పునిచ్చే యాజకత్వ దీవెనను నాకిస్తానని మా నాన్న అడిగిన సమయం. ఆయన దీవెన ఇచ్చిన తరువాత, వెంటనే ఏమీ మారిపోలేదు, కానీ నేను నా పరలోక తండ్రి నుండి మరియు మా నాన్న నుండి శాంతిని, ప్రేమను అనుభవించగలిగాను. నాకు అవసరమైనప్పుడు యాజకత్వ దీవెనలు ఇచ్చే యోగ్యత కలిగి, లీహై తన పిల్లల్ని దీవించిప్పుడు చేసినట్లుగా నా బలాలను, నిత్య సామర్థ్యాన్ని చూడడానికి నాకు సహాయపడే తండ్రిని కలిగియున్నందుకు నేను దీవించబడినట్లుగా భావిస్తున్నాను.
మీ పరిస్థితులతో సంబంధము లేకుండా, మీరు ఎల్లప్పుడు యాజకత్వ దీవెనలు పొందగలరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచర్య చేయు సహోదరులు, యాజకత్వపు నాయకులు, మరియు మిమ్నల్ని ఎప్పటికీ విఫలము కానివ్వని పరలోక తండ్రి ద్వారా, మీరు యాజకత్వము యొక్క దీవెనలు పొందగలరు. ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ ఇలా చెప్పారు: “యాజకత్వము యొక్క దీవెనలు ఆ వరమును నిర్వహించుటకు అడగబడిన వారికంటె అపరిమితంగా గొప్పవి. … మనము యోగ్యతగా ఉన్నప్పుడు, యాజకత్వపు విధులు మన జీవితాలను సంపన్నం చేస్తాయి.”1
మీకు అదనపు నడిపింపు అవసరమైనప్పుడు ఒక దీవెన కొరకు అడగడానికి సందేహించవద్దు. మన కష్టమైన క్షణాలలో సహాయపడడానికి మనకు ఆత్మ ఎక్కువగా అవసరము. ఎవరూ పరిపూర్ణులు కాదు, మరియు మనమందరం కష్టాలను అనుభవిస్తాము. మనలో కొందరు ఆందోళన, నిరాశ, వ్యసనము, లేదా మనము సరిపోమనే భావనలతో బాధపడవచ్చు. యాజకత్వ దీవెనలు ఈ సవాళ్ళను జయించడానికి మరియు భవిష్యత్తు వైపు మనము ముందుకు సాగుతున్నప్పుడు శాంతిని పొందడానికి మనకు సహాయపడగలవు. ఈ దీవెనలు పొందడానికి మనము యోగ్యులుగా జీవించేందుకు ప్రయత్నిస్తామని నేనాశిస్తున్నాను.
యాజకత్వము మనల్ని దీవించుటకు మరొక విధానము గోత్రజనకుని దీవెనలు. నేను విచారంగా లేక ఒంటరిగా భావించినప్పుడు, నా గోత్రజనకుని దీవెన వైపు తిరగడం నేను నేర్చుకున్నాను. నా దీవెన నా సామర్థ్యాన్ని, దేవుడు నా కొరకు కలిగియున్న ప్రత్యేక ప్రణాళికను చూడడానికి నాకు సహాయపడింది. అది నన్ను ఓదారుస్తుంది మరియు నా భూలోక దృష్టికోణమును మించి చూడడానికి నాకు సహాయపడుతుంది. అది నా వరములను మరియు నేను యోగ్యతగా జీవిస్తే పొందే దీవెనలను నాకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు జవాబులను ఇస్తాడని మరియు నాకు ఎక్కవగా అవసరమైనప్పుడు సరైన క్షణములో ఖచ్చితంగా నా కోసం తలుపులు తెరుస్తాడని జ్ఞాపకం చేసుకోవడానికి మరియు శాంతిని అనుభవించడానికి కూడా అది నాకు సహాయపడుతుంది.
మన పరలోక తండ్రితో జీవించడానికి తిరిగి వెళ్ళేందుకు మనల్ని సిద్ధపరచడానికి గోత్ర జనకుని దీవెనలు సహాయపడతాయి. గోత్ర జనకుని దీవెనలు దేవుని నుండి వస్తాయని మరియు మన బలహీనతలను బలాలుగా మార్చడానికి మనకు సహాయపడగలవని నాకు తెలుసు. ఇవి జ్యోతిష్కుల నుండి వచ్చే సందేశాలు కాదు; ఈ దీవెనలు మనము వినవలసిన దానిని మనకు చెప్తాయి. అవి మనలో ప్రతిఒక్కరి కొరకు ఒక లియహోనా వలె ఉన్నాయి. మనము దేవునికి మొదటిస్థానం ఇచ్చి, ఆయనయందు విశ్వాసము కలిగియున్నప్పుడు, మన స్వంత అరణ్యము గుండా ఆయన మనల్ని నడిపిస్తాడు.
సువార్త యొక్క దీవెనలు పునఃస్థాపించబడునట్లు,జోసెఫ్ స్మిత్‌ను యాజకత్వముతో దేవుడు దీవించినట్లుగా, మన జీవితాలలో యాజకత్వము ద్వారా సువార్త యొక్క దీవెనలను మనము పొందగలము. ప్రతీవారము మనము సంస్కారము తీసుకునే విశేషావకాశము ఇవ్వబడ్డాము. ఈ యాజకత్వపు విధి ద్వారా మనము ఎల్లప్పుడు ఆత్మను మనతో కలిగియుండగలము, అది మనల్ని శుద్ధి చేసి, పరిశుద్ధపరచగలదు. మీ జీవితాలలో దేనినైనా తీసివేయాల్సి ఉన్నదని మీరు భావిస్తే, సరైన బాటలో మిమ్మల్ని ఉంచడానికి సహాయపడగల నమ్మకస్థుడైన నాయకుడిని సమీపించండి. మీ నాయకులు యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తఃము యొక్క పూర్తి శక్తిని పొందడానికి మీకు సహాయపడగలరు.
యాజకత్వమునకు ధన్యవాదాలు, దేవాలయ విధుల యొక్క దీవెనలు కూడ మనము పొందగలము. నేను దేవాలయములో ప్రవేశించగలిగినప్పటి నుండి, నేను క్రమం తప్పకుండా హాజరుకావడాన్ని ఒక లక్ష్యముగా, ప్రాధాన్యతగా చేసుకున్నాను. ఆయన పరిశుద్ధ మందిరములో నా పరలోక తండ్రికి దగ్గరగా ఉండడానికి సమయాన్ని తీసుకొని, అవసరమైన త్యాగాలు చేయడం ద్వారా, నా జీవితకాలమంతటా నాకు నిజంగా సహాయపడిన బయల్పాటును, ప్రేరేపణలను పొందడంతో నేను దీవించబడ్డాను.
యాజకత్వము ద్వారా, మనము పైకెత్తబడగలము. యాజకత్వము మన లోకములోనికి వెలుగును తెస్తుంది. ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ ఇలా చెప్పారు: “యాజకత్వపు శక్తి లేకుండా, ‘భూమంతయు పూర్తిగా నాశనం చేయబడుతుంది‘ (సి&ని 2:1–3 చూడండి). ఏ వెలుగు, ఏ నిరీక్షణ ఉండదు—చీకటి మాత్రమే ఉండును.”2
దేవుడు మన కొరకు సంతోషిస్తున్నాడు. ఆయన వద్దకు తిరిగి రావాలని మనల్ని కోరుతున్నాడు. వ్యక్తిగతంగా ఆయనకు మనం తెలుసు. మీరు ఆయనకు తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడు మన గురించి ఆయనకు తెలుసు మరియు మనము అర్హులము కాదని భావించినప్పుడు కూడా మనల్ని దీవిస్తారు. మనకు ఏది అవసరమో, అది మనకు ఎప్పుడు అవసరమో ఆయనకు తెలుసు.
“అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును:
“అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరకును; తట్టువానికి తీయబడును” (మత్తయి 7:7–8).
యాజకత్వము గురించి మీరు ఇదివరకు ఒక సాక్ష్యము కలిగియుండనట్లయితే, దాని శక్తి గురించి మీకై మీరు తెలుసుకోవడానికి ప్రార్ధించి అడగమని, తరువాత దేవుని మాటలు వినడానికి లేఖనాలు చదవమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మన జీవితాలలో దేవుని యొక్క యాజకత్వపు శక్తిని అనుభవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే, మనము దీవించబడతామని నాకు తెలుసు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.