ప్రవచనము యొక్క నెరవేర్పు
యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన ద్వారా నెరవేరిన ప్రవచనాలు చాలా ఉన్నాయి.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, నిస్సందేహంగా పరిశుద్ధ వనములో తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జోసెఫ్ స్మిత్ మొదటి దర్శన జ్ఞాపకార్థం ఈ చారిత్రాత్మక సర్వసభ్య సమావేశంలో మాట్లాడటం నాకు గౌరవంగా ఉంది. సువార్త పునఃస్థాపనకు, మోర్మన్ గ్రంథము నుండి యాజకత్వ అధికారం మరియు తాళపుచెవులు తిరిగి రావడం వరకు, ప్రభువు యొక్క నిజమైన సంఘము యొక్క వ్యవస్థీకరణ, దేవుని దేవాలయాలు, ఈ కడవరి దినాలలో దేవుని కార్యమును నడిపించే ప్రవక్తలు మరియు అపొస్తలుల నాయకత్వం వరకు విశదపరచబడిన అన్నింటికి ఆ దర్శనము ఒక అద్భుతమైన ప్రారంభము.
దైవిక రూపకల్పన ద్వారా, దేవుని పురాతన ప్రవక్తలు, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు, పునఃస్థాపన గురించి మరియు మన రోజులో రాబోయేది, అంతిమ యుగము మరియు కాలముల సంపూర్ణత గురించి ప్రవచించారు. ఈ కార్యమే ఆరంభ దీర్ఘదర్శుల యొక్క “ఆత్మలను ప్రేరేపించింది.”1 తరతరాలుగా, వారు భూమిపై దేవుని రాజ్యం యొక్క భవిష్యత్తు గురించి ముందే చెప్పారు, కలలు కన్నారు, ఊహించారు మరియు ప్రవచించారు, దీనిని యెషయా “ఒక ఆశ్చర్య కార్యము, బహు ఆశ్చర్యము”2 అని పిలిచెను.
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘముతో సహా యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపన ద్వారా అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అయితే ఈ రోజు, నాకు ఇష్టమైన వాటిలో కొన్నింటి గురించి మాత్రమే ప్రధానంగా మాట్లాడతాను. ఇవి నాకు నా ప్రియమైన ప్రాథమిక బోధకుల ద్వారా మరియు దేవదూత లాంటి మా అమ్మ చేత బోధించబడ్డాయి.
ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసం మరియు దేవుని యొక్క పరిచర్య దేవదూతల ప్రమేయం ద్వారా సింహాలను అదుపులోపెట్టిన దానియేలు, మన కాలమును దర్శనములో చూసాడు. దానియేలు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క కలను వివరిస్తూ, ప్రభువు సంఘము చివరి రోజుల్లో “చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన” ఒక చిన్న రాయి వలె ఉదయించునని ప్రవచించాడు.”3 “చేతి సహాయం లేకుండా,” అనగా దైవిక ప్రమేయం ద్వారా ప్రభువు సంఘం పరిమాణంలో మొత్తం భూమిని నింపేవరకు పెరుగును, “దానికెన్నటికి నాశనము కలుగదు… [కానీ] అది యుగములవరకు నిలుచును.”4
సంఘ సభ్యులు, ప్రపంచం నలుమూలల నుండి, ఈ రోజు సమావేశాన్ని చూస్తున్నారు మరియు వింటున్నారు, కాబట్టి దానియేలు మాటలు నెరవేరుతున్నాయనడానికి ఇది ఒక లోతైన సాక్ష్యం.
భక్తుడు, అపొస్తలుడైన పేతురు, “ఆదినుండి … అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చను”5 అని వివరించాడు. దేవుడు కాలములు పరిపూర్ణమైనప్పుడు “క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా”7 “సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చునని,”6 అపొస్తలుడైన పౌలు వ్రాసాడు. నేను రోమ్ ఇటలీ దేవాలయ సమర్పణలో పాల్గొన్నప్పుడు ఆ ప్రవచనాలను నేను చాలా బలంగా భావించాను. పేతురు, పౌలు చేసినట్లుగా అక్కడ ప్రవక్తలు మరియు అపొస్తలులందరూ లోక విమోచకుడైన యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చారు. సహోదర సహోదరీలారా, ఆ పునఃస్థాపనకు సంఘము ఒక సజీవ ఉదాహరణ మరియు మన సభ్యులు చాలా కాలం క్రితం చేయబడిన ఆ దైవిక ప్రవచనాలకు సాక్షులు.
ఐగుప్తు యొక్క యోసేపు ఇలా ప్రవచించాడు, కడవరి దినములలో “ప్రభువైన నా దేవుడు ఒక దీర్ఘదర్శిని పుట్టించును, అతడు నా కన్న సంతానమునకు ఒక శ్రేష్ఠమైన దీర్ఘదర్శియై యుండును.”8 “ఏలయనగా అతడు [ప్రభువు కార్యమును] చేయును.”9 పునఃస్థాపన ప్రవక్త అయిన జోసెఫ్ స్మిత్ ఆ దీర్ఘదర్శి.
సర్వశక్తిమంతుని యొక్క ఒక దేవదూత ఈ పదాలతో పునఃస్థాపన యొక్క ముఖ్యమైన అంశాలను ఒకచోట చేర్చునట్లు ప్రకటనకారుడైన యోహాను ప్రవచించాడు: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను.”10 ఆ దూత మొరోనై. మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడినట్లుగా అతడు మన కాలాన్ని చూసాడు. పదేపదే కనిపించినప్పుడు, మోర్మన్ గ్రంథము: యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన యొక్క అనువాదంతో సహా పరిచర్య చేయడం కోసం ఆయన జోసెఫ్ స్మిత్‌ను సిద్ధం చేశాడు.
ఇతర ప్రవక్తలు మన కాలము గురించి ముందుగానే చెప్పారు. ఏలీయా “తండ్రుల హృదయములను పిల్లలతట్టును పిల్లల హృదయములను తండ్రులతట్టును త్రిప్పును”11 అని మలాకి చెప్పాడు. ఏలీయా వచ్చాడు, దాని ఫలితంగా నేడు మనకు 168 దేవాలయాలు వినియోగంలో ఉన్నాయి. ప్రతి దేవాలయం పవిత్ర నిబంధనలు చేసేవారితో మరియు వారి కొరకు, మరణించిన వారి పూర్వీకుల తరపున దీవించబడిన విధులు పొందుతున్న యోగ్యులైన సభ్యులతో నిండి ఉంటుంది. మలాకి వివరించిన ఈ పవిత్రమైన కార్యము “తన పిల్లల నిత్య గమ్యము కొరకు సృష్టికర్త చేసిన ప్రణాళికకు కేంద్రమైనది.”12
ప్రవచించబడిన ఆ కాలంలో మనము జీవిస్తున్నాము; యేసు క్రీస్తు రెండవ రాకడను ప్రారంభించుటకు బాధ్యత ఇవ్వబడిన జనులం మనమే; నిత్య సువార్త యొక్క సత్యాలు, నిబంధనలు మరియు వాగ్దానాలను వినే మరియు స్వీకరించే దేవుని పిల్లలను మనము సమకూర్చాలి. అధ్యక్షులు నెల్సన్ దీనిని “ గొప్ప సవాలు, గొప్ప హేతువు, మరియు ఈ రోజు భూమిపై జరిగే గొప్ప కార్యము” అని పిలుస్తారు.13 ఆ అద్భుత కార్యము గురించి నేను నా సాక్ష్యము చెప్తున్నాను.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చేత నియమించబడి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, నేను డర్బన్ దక్షిణాఫ్రికా దేవాలయాన్ని సమర్పించాను. అది నా జీవితమంతా నేను గుర్తుంచుకునే రోజు. “ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను” 14 అని పూర్వము యిర్మియా ప్రవచించినట్లుగా సువార్త యొద్దకు వచ్చిన సభ్యులతో నేను ఉన్నాను. యేసు క్రీస్తు సిద్ధాంతం మనందరినీ—ప్రపంచవ్యాప్తంగా—దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, సువార్తలో సహోదరులు మరియు సహోదరీలుగా ఏకం చేస్తుంది. మనం ఎలా కనిపించినా, ఎలా దుస్తులు ధరించినా, మనము పరలోకంలో ఉన్న తండ్రితో ఒక్కటిగా ఉన్నాము, మొదటి నుండి ఆయన కుటుంబం కొరకు ఆయన ప్రణాళిక ఏమిటంటే మనం పవిత్ర దేవాలయ నిబంధనలు చేసుకొని, పాటించడం ద్వారా తిరిగి ఏకమవడం.
1834 లో ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ఒక పాఠశాల గృహంలో యాజకత్వము కలిగియున్నవారి యొక్క ఒక చిన్న సమావేశానికి, జోసెఫ్ ప్రవక్త ఇలా ప్రవచించారు, “ఈ రాత్రి మీరు ఇక్కడ యాజకత్వముగల కొద్దిమందిని మాత్రమే చూస్తున్నారు, కానీ ఈ సంఘము ఉత్తర మరియు దక్షిణ అమెరికాను నింపుతుంది—ఇది ప్రపంచాన్ని నింపుతుంది.”15
ఇటీవలి సంవత్సరాలలో నేను సంఘ సభ్యులతో కలవడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించాను. పన్నెండు మంది సమూహములోని నా సహోదరులు ఇలాంటి నియమించబడిన కార్యమునే కలిగి ఉన్నారు. అయినప్పటికీ, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు నెల్సన్ గారి యొక్క కార్యక్రమపట్టికను ఎవరు కొనసాగించగలరు, సంఘ అధ్యక్షునిగా తన మొదటి రెండు సంవత్సరాలలో ఆయన చేసిన ప్రయాణం “ముప్పై రెండు దేశాలు మరియు అమెరికా భూభాగాలలో”16 జీవముతోనున్న క్రీస్తు గురించి సాక్ష్యమివ్వడానికి పరిశుద్ధులతో కలవడానికి తీసుకువెళ్ళింది.
యువకుడిగా నా మిషన్ పిలుపు వచ్చినప్పుడు నాకు గుర్తుంది. నేను నా తండ్రి, సోదరుడు మరియు బావ వలె జర్మనీలో సేవ చేయాలనుకున్నాను. ఎవరైనా ఇంటికి తీసుకొని వస్తారని ఎదురుచూడకుండా, నేను ఉత్తరాలపెట్టె వద్దకు వెళ్లి పిలుపు కవరు తెరిచాను. నేను న్యూయార్క్ నగరంలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈస్టర్న్ స్టేట్స్ మిషన్‌కు పిలువబడ్డానని చదివాను. నేను నిరాశ చెందాను, అందువల్ల నేను లోపలికి వెళ్లి ఓదార్పు కోసం నా లేఖనాలను తెరిచాను. నేను సిద్ధాంతము మరియు నిబంధనలను చదవడం మొదలుపెట్టాను: “ఇదిగో చూడుడి, ఈ ప్రదేశములోను, చుట్టు ప్రక్కల ప్రాంతములలోను నాకు అనేక జనులు కలరు; ఈ తూర్పు దేశములో చుట్టు ప్రక్కల ప్రాంతములలో కార్యానుకూలమైన ద్వారము తెరువబడును.”17 1833 లో జోసెఫ్ స్మిత్ ప్రవక్తకు ఇవ్వబడిన ఆ ప్రవచనము నాకు ఒక బయల్పాటుగా ఉండెను. అప్పుడు నాకు తెలుసు, ప్రభువు నేను సేవ చేయాలని కోరిన ఖచ్చితమైన మిషనుకు నేను పిలువబడ్డానని. పునఃస్థాపన మరియు దాని నాటకీయ ప్రారంభాన్ని బోధించడంలో నేను గడిపాను, పరలోకమందున్న మన తండ్రి జోసెఫ్ స్మిత్ తో మాట్లాడి, ఇలా చెప్పారు, “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనను ఆలకించుము!”18
మొత్తం సంఘానికి గొప్ప ప్రాముఖ్యత గలిగినది యేసు క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాల కన్నా ముందు యెషయా చేసిన ప్రవచనం: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవామందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడును, … సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.”19
ఈ రోజు నా మనస్సులో, టెలివిజన్, ఇంటర్నెట్ లేదా ఇతర మార్గాల గుండా ఎలక్ట్రానిక్ ద్వారా ఈ కార్యకలాపాలకు అనుసంధానించబడిన మిలియన్ల మంది మన సభ్యులు మరియు స్నేహితులను నేను చిత్రీకరించుకొంటున్నాను. “పర్వత శిఖరమున”20 కూర్చున్నట్లుగా మనందరం కలిసి కూర్చున్నాము. బ్రిగం యంగ్, “ఇది సరైన ప్రదేశం”21 అనే ప్రవచనాత్మక పదాలను పలికారు. పరిశుద్ధులు, వారిలో కొందరు నా స్వంత అగ్రగామి పూర్వీకులు, “భూమి యొక్క దేశాలను నిర్దేశించేవాని యొక్క సంకల్పం మరియు ఆనందం ద్వారా”22 రాతి పర్వతాలలో సీయోనును స్థాపించడానికి పనిచేశారు.
లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించిన పవిత్ర మైదానంలో నేను ఈ రోజు నిలబడి ఉన్నాను. 2002 లో, సాల్ట్ లేక్ సిటీ శీతాకాల ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రారంభోత్సవాలలో టాబర్నాకిల్ గాయకబృందం పాడింది, మరియు సంము అనేకానేక దేశాల నుండి వచ్చిన అతిథులు మరియు పాల్గొనేవారి కొరకు కచేరీలు మరియు కార్యక్రమాలను అందించింది. ప్రపంచవ్యాప్తంగా రాత్రిపూట వార్తా ప్రసారాల నేపథ్యంలో దేవాలయాన్ని చూడడాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను.
సంవత్సరాలుగా, అమెరికా అధ్యక్షులు, రాజులు, న్యాయమూర్తులు, ప్రధానమంత్రులు, రాయబారులు మరియు అనేక దేశాల అధికారులు సాల్ట్ లేక్ సిటీకి వచ్చి మన నాయకులతో సమావేశమయ్యారు. అధ్యక్షులు నెల్సన్ జాతి ఆధారంగా వివక్ష లేకుండా సమాన హక్కులకు కట్టుబడి ఉన్న సంయుక్త రాష్ట్రాల సంస్థ అయిన నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ నాయకులకు ఆతిథ్యం ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కువ నాగరికత మరియు జాతి సామరస్యాన్ని కోరుతూ అధ్యక్షులు నెల్సన్ వారితో చేరినందున ఈ స్నేహితులు మరియు నాయకులతో భుజాలు కలిపి నిలబడడం నాకు గుర్తుంది.23
ఇంకా చాలా మంది టెంపుల్ స్క్వేర్‌కు వచ్చి సంఘ నాయకులతో ఆలోచనచేయుటకు వారిని కలిసారు. కొన్నింటిని ఉదహరించుటకు, గత సంవత్సరం మేము ఐక్యరాజ్యసమితి 68 వ సివిల్ సొసైటీ కాన్ఫరెన్స్, ప్రపంచ సమావేశాన్ని స్వాగతించాము, న్యూయార్క్ నగరం వెలుపల జరిగిన ఈ రకమైన వాటిలో ఇది మొదటిది. మేము వియత్నాం యొక్క మతపరమైన వ్యవహారాల కమిటీతో, క్యూబా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, రొమేనియా, సుడాన్, ఖతార్ మరియు సౌదీ అరేబియా నుండి రాయబారులతో సమావేశమయ్యాము. ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్‌ను కూడా మేము స్వాగతించాము.
అంత్యదినములలో జనములు “యెహోవామందిర పర్వతము”24 నకు వచ్చెదరు అని యెషయా చేసిన ప్రవచనము యొక్క నెరవేర్పును నేను వర్ణిస్తున్నాను. గొప్ప సాల్ట్ లేక్ దేవాలయం ఆ ఘనత మరియు కీర్తికి మధ్యలో నిలిచింది.
మా దృశ్యము అద్భుతమైనది అయినప్పటికీ, ప్రజలను ఆకర్షించినది ప్రకృతి దృశ్యం కాదు; యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము మరియు దాని ప్రజల యొక్క ఆత్మ, పెరుగుదల, మంచితనం మరియు ఔదార్యం లో ప్రదర్శించబడిన స్వచ్ఛమైన మతం యొక్క సారాంశం; దేవుడు ప్రేమించినట్లుగా మన ప్రేమ; “క్రీస్తు కారణం”25 అని జోసెఫ్ స్మిత్ పిలిచిన ఉన్నత కారణంపట్ల మన నిబద్ధత.
రక్షకుడు ఎప్పుడు తిరిగి వస్తారో మనకు తెలియదు, కానీ ఇది మనకు తెలుసు. ఆయనను స్వీకరించడానికి అర్హులుగా మనం హృదయంలో మరియు మనస్సులో సిద్ధంగా ఉండాలి, మరియు చాలా కాలం క్రితం ప్రవచించబడిన వాటన్నిటిలో భాగమైనందుకు గౌరవించబడాలి.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ భూమిపై ప్రభువు ప్రవక్త అని మరియు ఆయన వైపు దేవుని చేత పిలువబడి ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులుగా ఆమోదించబడిన అపొస్తలులు ఉన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు నా ప్రియమైన సహోదర సహోదరీలారా, పునఃస్థాపన కొనసాగుతుంది.
నేను సాక్ష్యమిచ్చే మాటలు నిజమని తెలుపుతూ నేను జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనంతో ముగిస్తున్నాను: “అపవిత్రమైన ఏ చెయ్యి ఈ పని పురోగమించకుండా ఆపలేదు; హింసలు చెలరేగవచ్చు, అల్లరిమూకలు ఏకముకావచ్చు, సైన్యాలు సమీకరించబడవచ్చు, అపకీర్తి పరువు తీయవచ్చు, కాని దేవుని సత్యము ప్రతి ఖండములోనికి చొచ్చుకుపోయే వరకు, ప్రతి వాతావరణాన్ని సందర్శించే వరకు, ప్రతి దేశాన్ని తుడిచిపెట్టి, ప్రతి చెవిలో వినిపించే వరకు, దేవుని ఉద్దేశ్యాలు నెరవేరే వరకు, మరియు గొప్ప యెహోవా ఆ పని పూర్తయిందని చెప్పేవరకు ధైర్యంగా, ఘనంగా, స్వతంత్రంగా ముందుకు సాగుతుంది.”26 జోసెఫ్ స్మిత్ యొక్క ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయని నేను సాక్ష్యమిస్తున్నాను.
మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్, ఆయన సలహాదారులు, అపొస్తలులు మరియు ఇతర సంఘ నాయకుల ప్రేరేపిత సలహాలను మీరు అనుసరిస్తున్నప్పుడు మరియు మన కాలము గురించి ముందే చెప్పిన పురాతన ప్రవక్తల పట్ల మీరు శ్రద్ధ వహిస్తున్నప్పుడు, మీ హృదయపు లోతులలో, ఆత్మలో పునఃస్థాపన యొక్క కార్యము మరియు ఆత్మతో నింపబడతారని నేను వాగ్దానము చేస్తున్నాను. మీ జీవితాలలో దేవుని హస్తాన్ని మీరు చూస్తారని, ఆయన ప్రేరణలను వింటారని మరియు ఆయన ప్రేమను అనుభవిస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆయన సువార్త మరియు ఆయన సంఘము యొక్క పునఃస్థాపనకు కృతజ్ఞతతో, ఆయన సాటిలేని ప్రేమకు సాక్ష్యంగా, యేసు క్రీస్తు నామములో, ఆమేన్.