హల్లెలూయా, హోసన్న—సజీవుడైన యేసు క్రీస్తు: పునఃస్థాపన మరియు ఈస్టర్ యొక్క ముఖ్యభాగము
హోసన్న మరియు హల్లెలూయా యొక్క ఈ కాలములో, హల్లెలూయా పాడండి—ఎందుకంటే ఆయన ఎప్పటికీ శాశ్వతంగా పరిపాలన చేయును!
ప్రియమైన సహోదర సహోదరీలారా: హోసన్న మరియు హల్లెలూయాతో, ఈస్టర్ మరియు కొనసాగుతున్న పునఃస్థాపన కాలములో సజీవుడైన యేసు క్రీస్తును మనం పురస్కరించుకుందాము. పరిపూర్ణమైన ప్రేమతో మన రక్షకుడు మనకు అభయమిస్తున్నారు: “నాయందు మీకు సమాధానము కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.”1
కొన్ని సంవత్సరాల క్రితం, సహోదరి గాంగ్ మరియు నేను ఒక సుందరమైన కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు, వారి చిన్న కుమార్తె ఐవీ సిగ్గుతో తన వయోలిన్ కేసును బయటకు తెచ్చింది. ఆమె వయోలిన్ విల్లును పైకి ఎత్తి, బిగించి దానిపై రోసిన్ పూసింది. అప్పుడు ఆమె జాగ్రత్తగా విల్లును తిరిగి పెట్టెలో ఉంచి, నవ్వి, ఒంగి నమస్కరించి, కూర్చుంది. ఒక కొత్త ప్రారంభికురాలిగా, ఆమె తనకు వయోలిన్‌లో తెలిసినవన్నీ పంచుకుంది. ఇప్పుడు, సంవత్సరాల తరువాత, ఐవీ అందంగా వయోలిన్ వాయిస్తుంది.
ఈ మర్త్య కాలంలో, మనమందరం ఐవీ మరియు ఆమె వయోలిన్ లాగా ఉన్నాము. మనం ప్రారంభంలోనే మొదలుపెడతాము. అభ్యాసం మరియు నిలకడతో, మనం పెరుగుతాము మరియు మెరుగుపడతాము. కాలక్రమేణా, మనము ఆయనతో ఆయన ద్రాక్షతోటలో2 శ్రమించి, ఆయన నిబంధన మార్గాన్ని అనుసరించినప్పుడు, నైతిక కర్తృత్వము మరియు మర్త్య అనుభవాలు మన రక్షకుని వలె మారడానికి మనకు సహాయపడతాయి.
ఈ ద్విశతాబ్దితో సహా వార్షికోత్సవాలు, పునఃస్థాపన యొక్క నమూనాలను ప్రధానాంశంగా చేస్తాయి.3 యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన యొక్క కొనసాగింపును పురస్కరించుకొంటున్నప్పుడు, మనం ఈస్టర్ కోసం కూడా సిద్ధపడతాము. రెండింటిలో, యేసు క్రీస్తు తిరిగి రావడంలో మనం సంతోషిస్తాము. ఆయన జీవిస్తున్నారు— అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా; కొంతమంది కోసమే కాదు, అందరి కోసం. విరిగిన హృదయాలను నయం చేయడానికి, బందీలను విడిపించడానికి, అంధుల దృష్టిని తిరిగి ఇవ్వడానికి మరియు గాయపడిన వారిని స్వేచ్ఛగా ఉంచడానికి ఆయన వచ్చారు మరియు వస్తారు.4 మనందరము ఆ విధంగా ఉండాలి. ఆయన విమోచన వాగ్దానాలు మన గతం, మన వర్తమానం లేదా మన భవిష్యత్తు కోసం ఆందోళనలతో సంబంధం లేకుండా వర్తిస్తాయి.
రేపు మట్టల ఆదివారము. సాంప్రదాయకంగా, క్రీస్తు విజయవంతంగా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, “బహు జనసమూహము … ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయినట్లుగా”5 ఖర్జూరపు మట్టలు మన ప్రభువులో ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఒక పవిత్ర చిహ్నం. (అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ కార్యాలయంలో ఆయన డెస్క్ వెనుక ఉన్న ఈ హ్యారీ ఆండర్సన్ పెయింటింగ్ యొక్క అసలు విషయం తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉండవచ్చు.) ప్రకటన గ్రంథంలో, దేవుడిని మరియు గొర్రెపిల్లను స్తుతించేవారు ఆవిధమగా “తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొని”6 నిలబడ్డారు. కర్ట్లాండ్ దేవాలపు సమర్పణ ప్రార్థనలో “నీతి వస్త్రములు” మరియు “మహిమ కిరీటముల” తో పాటు ఖర్జూరపు మట్టలు ఉపయోగించబడ్డాయి.7
వాస్తవానికి, మట్టల ఆదివారము యొక్క ప్రాముఖ్యత జనసమూహము యేసును ఖర్జూరపుమట్టలతో పలకరించుటకు మించినది. మట్టల ఆదివారం నాడు, , విశ్వాసకులు ప్రవచన నెరవేర్పుగా గుర్తించిన విధాలలో యేసు విజయవంతంగా యెరూషలేములోనికి ప్రవేశించారు. జెకర్యా8 మరియు కీర్తనకారుడు ప్రవచనపూర్వకముగా ముందుగా చెప్పినట్లు, “సర్వోన్నతమైన స్థలములలో జయము”9 అని జనసమూహము కేకలు వేయగా మన ప్రభువు గాడిద పిల్లపై యెరూషలేములో ప్రవేశించారు. హోసన్న అనగా “ఇప్పుడు రక్షించుము”10 అని అర్థము. అప్పుడు, ఇప్పుడు మనం, “యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక”11 అని ఆనందిస్తాము.
మట్టల ఆదివారం అయిన ఒక వారం తరువాత ఈస్టర్ ఆదివారం. యేసు క్రీస్తు “ఆయన బాకీ లేని రుణాన్ని తీర్చడానికి వచ్చారు, ఎందుకంటే మనము చెల్లించలేని రుణాన్ని మనము బాకీ ఉన్నాము”12 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధిస్తున్నారు. నిజానికి, క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా, దేవుని పిల్లలందరూ “సువార్త యొక్క చట్టాలకు మరియు విధులకు విధేయత చూపడం ద్వారా రక్షింపబడవచ్చు.”13 ఈస్టర్ రోజు, మనం హల్లెలూయా అని పాడతాము. హల్లెలూయా అనగా “ప్రభువైన యెహోవా నీకు స్తుతులు”14 అని అర్థము. హాండెల్ యొక్క మెస్సీయ లోని హల్లెలూయా పల్లవి ఆయన “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు”15 అని ప్రియమైన ఈస్టర్ ప్రకటన.
మట్టల ఆదివారము మరియు ఈస్టర్ ఆదివారం మధ్య జరిగిన పవిత్ర సంఘటనలే హోసన్న మరియు హల్లెలూయా కథ. హోసన్న అనేది రక్షించమని భగవంతుడికి మన విజ్ఞప్తి. హల్లెలూయా అనేది రక్షణ మరియు మహోన్నతస్థితి యొక్క నిరీక్షణ కోసం ప్రభువుకు మన స్తుతులు తెలియజేస్తుంది. హోసన్న మరియు హల్లెలూయాలో సజీవుడైన యేసు క్రీస్తును ఈస్టర్ మరియు పునఃస్థాపన యొక్క ముఖ్యభాగముగా మనం గుర్తిస్తాము.
కడవరి-దిన పునఃస్థాపన దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమవ్వడంతో మొదలవుతుంది—తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, యువ ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు అక్షరార్థముగా ప్రత్యక్షమయ్యారు. ప్రవక్తయైన జోసెఫ్ ఇలా అన్నారు, “మీరు ఐదు నిమిషాలు స్వర్గంలోనికి తొంగి చూడగలిగితే, ఈ విషయంపై ఇప్పటివరకు వ్రాసినవన్నీ చదవడం ద్వారా మీరు తెలుసుకొనేదానికన్నా ఎక్కువగా మీరు తెలుసుకుంటారు.”16 పరలోకములు మళ్ళీ తెరవబడెను గనుక, మనము దైవసమూహము—“నిత్య తండ్రియైన దేవుడు, మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును, మరియు పరిశుద్ధాత్మను నమ్ముతాము”17 మరియు యెరుగుదుము.
పునఃస్థాపన యొక్క ప్రారంభ సంవత్సరాల్లో, ఈస్టర్ ఆదివారం, 1836, ఏప్రిల్ 3న కర్ట్లాండ్ దేవాలయం సమర్పించబడినప్పుడ సజీవుడైన యేసు క్రీస్తు కనిపించారు. అక్కడ ఆయనను చూసిన వారు అగ్ని మరియు నీటి యొక్క పరిపూర్వకమైన విరుద్ధతలో ఆయన గురించి సాక్ష్యమిచ్చారు: “ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను; ఆయన తలవెంట్రుకలు తెల్లగా శుద్ధమైన హిమమువలే ఉండెను; ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలే ఉండెను; ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే, యెహోవా కంఠస్వరమువలే నుండెను.”18
ఆ సందర్భంగా, మన రక్షకుడు ఇలా ప్రకటించెను, “ఆదియు అంతమును నేనే; సజీవుడైన వాడను నేనే, వధించబడిన వాడను నేనే; తండ్రితో మీ న్యాయవాదిగా ఉన్నాను.”19 మళ్ళీ, పరిపూర్వకమైన వైరుధ్యాలు—ఆదియు మరియు అంతము, సజీవుడైన మరియు వధించబడిన. ఆయనే అల్ఫాయు ఓమెగయు, ఆదియు అంతమును,20 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైయున్నాడు.21
యేసు క్రీస్తు కనిపించిన తరువాత, మోషే, ఏలీ, ఏలియా కూడా వచ్చారు. దైవిక దిశానిర్దేశకత్వము ద్వారా, ఈ గొప్ప ప్రాచీన ప్రవక్తలు యాజకత్వపు తాళపుచెవులు మరియు అధికారమును పునఃస్థాపించారు. ఆవిధంగా, దేవుని పిల్లలందరిని దీవించడానికి పునఃస్థాపించబడిన ఆయన సంఘములో “ఈ యుగపు తాళపుచెవులు ఇవ్వబడ్డాయి.”22
కర్ట్లాండ్ దేవాలయంలో ఏలియా రాక, “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు”23 ఏలియా తిరిగి వచ్చుననే మలాకీ యొక్క పాత నిబంధన ప్రవచనాన్ని కూడా నెరవేర్చింది. అలా చేయడం ద్వారా, ఏలియా ప్రత్యక్షమవ్వడం యాదృచ్చికం కాకపోయినా, యూదుల పస్కా పండుగ సమయంలోనే జరిగింది, ఆ సాంప్రదాయం ఏలియా తిరిగి రావడాన్ని భక్తితో ఎదురుచూస్తుంది.
భక్తులైన యూదుల కుటుంబాలలో అనేకము ఏలియాకు తమ పస్కా బల్లలో చోటు కల్పించాయి. ఆయన్ని ఆహ్వానించడానికి మరియు స్వాగతించడానికి చాలామంది అంచువరకు ఒక పాత్రను నింపుతారు. మరికొందరు, సాంప్రదాయ పస్కా విందు సమయంలో, ఏలియా ఆహ్వానించబడడానికి వెలుపల వేచి ఉన్నారో లేదో చూడడానికి, ఒక పిల్లవాడిని తలుపు యొద్దకు పంపుతారు, కొన్నిసార్లు తలుపును పాక్షికంగా తెరిచి ఉంచుతారు.24
ప్రవచనం నెరవేర్చబడటంలో మరియు వాగ్దానం చేయబడిన అన్ని విషయాల పునఃస్థాపనలో భాగంగా,25 వాగ్దానం చేసినట్లుగానే ఈస్టర్ మరియు పస్కా ప్రారంభంలో ఏలియా వచ్చారు. భూమిపై మరియు పరలోకంలో కుటుంబాలను బంధించడానికి ఆయన బంధనాధికారాన్ని తీసుకువచ్చారు. ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు మొరోనై బోధించినట్లుగా, ఏలియా “పితరులకు చేయబడిన వాగ్దానములను పిల్లల హృదయాలలో నాటును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. “అట్లు కానియెడల, (ప్రభువు యొక్క) రాకడ సమయమున భూమి యంతయు పూర్తిగా నాశనము చేయబడును”26 అని మొరోనై కొనసాగించెను. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతయైన ఏలియా యొక్క ఆత్మ మన తరాలకు—గత, వర్తమాన మరియు భవిష్యత్తు తరాలకు—మన వంశవృక్షాలు, చరిత్రలు మరియు దేవాలయ సేవలలో మనలను ఆకర్షిస్తుంది.
పస్కా దేనిని సూచిస్తుందో కూడా క్లుప్తంగా గుర్తు చేసుకోండి. 400 సంవత్సరాల బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విమోచనను పస్కా జ్ఞాపకముంచుకుంటుంది. కప్పలు, పేనులు, ఈగలు, పశువుల మరణం, పొక్కులు, దద్దుర్లు, వడగళ్ళు మరియు అగ్ని, మిడుతలు మరియు మందపాటి చీకటి తరువాత ఈ విడుదల ఎలా వచ్చిందో నిర్గమకాండము గ్రంథము వివరిస్తుంది. అంతిమ తెగులు దేశములో తొలిచూలుగా జన్మించినవారి మరణానికి ముప్పు తెచ్చిపెట్టింది, కాని ఇశ్రాయేలు వంశస్థుల ఇళ్ళలో కాదు—ఒకవేళ ఆ ఇంటివారు మచ్చలేని తొలిచూలు గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీద తాకించినట్లైతే ఆ ముప్పు వారికి రాదు.27
గొర్రెపిల్ల యొక్క సంకేతపరమైన రక్తంతో గుర్తించబడిన ఇళ్ళ గుండా మరణ దూత వెళ్ళెను.28 అలా వెళ్ళడం లేదా దాటి వెళ్ళడం యేసు క్రీస్తు చివరికి మరణాన్ని జయించడాన్ని సూచిస్తుంది. నిజానికి, దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రాయశ్చిత్త రక్తం మన మంచి గొర్రెల కాపరికి తన ప్రజలను అన్ని ప్రదేశాలలో మరియు పరిస్థితులలో తెరకు రెండువైపుల ఉన్నవారిని సమకూర్చడానికి శక్తిని ఇస్తుంది.
విశేషమేమిటంటే, మోర్మన్ గ్రంథము “క్రీస్తు శక్తి మరియు పునరుత్థానం”29—ఈస్టర్ యొక్క సారాంశం—రెండు పునఃస్థాపనల అర్థములో వివరిస్తుంది.
మొదటిది, పునరుత్థానంలో “శరీరము యొక్క ప్రతి భాగము,” “వాటియొక్క సరియైన క్రమమునకు పునఃస్థాపించబడుట” కలిపియున్నది, “తల వెంట్రుకలలో ఒకటియైనను నశించదు.”30 ఈ వాగ్దానం అవయవాలను కోల్పోయిన వారికి; చూడడానికి, వినడానికి లేదా నడవడానికి సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి; లేదా కనికరంలేని వ్యాధి, మానసిక అనారోగ్యం లేదా ఇతర క్షీణించిన సామర్థ్యం చేత కోల్పోబడిన వారికి నిరీక్షణనిస్తుంది. ఆయన మనల్ని కనుగొంటారు. ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేస్తారు.
ఈస్టర్ మరియు మన ప్రభువు ప్రాయశ్చిత్తము యొక్క రెండవ వాగ్దానము, ఆత్మీయంగా “అన్ని వస్తువులు తమ సరియైన క్రమమునకు పునఃస్థాపించబడవలెను.”31 ఈ ఆత్మీయ పునఃస్థాపన, మన పనులను మరియు కోరికలను ప్రతిబింబిస్తుంది. నీటి మీద రొట్టె వలె, 32 ఇది “మంచిని,” “నీతిని,” “న్యాయాన్ని,” మరియు “దయగలదానిని” పునఃస్థాపిస్తుంది. 33 “న్యాయముగా వ్యవహరించుము, నీతిగా తీర్పు తీర్చుము, మరియు నిరంతరము మేలు చేయుము”35 అని మనల్ని వేడుకొన్నప్పుడు ఆల్మా పునఃస్థాపన అనే పదమును 22 సార్లు34 ఉపయోగించుట అతిశయోక్తి కాదు.
“దేవుడు తానే లోకము యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయును”36 గనుక ప్రభువు యొక్క ప్రాయశ్చిత్తము ఇంతకు ముందు ఉన్నదే కాదు, ఏది చేయబడగలదో దానిని కూడా పునఃస్థాపించగలదు. మన బాధలు, శ్రమలు, అనారోగ్యం, మన “ప్రతి విధమైన శోధన” ఆయనకు తెలుసు కాబట్టి 37 ఆయన దయతో మన బలహీనతల ప్రకారం మనకు సహాయం చేయగలరు.38 దేవుడు “ఒక పరిపూర్ణ న్యాయమైన దేవుడు మరియు కనికరము గల దేవుడు” గనుక, కనికరము యొక్క ప్రణాళిక “న్యాయము యొక్క అక్కరలను సంతృప్తి పరచగలదు.“39 మనము పశ్చాత్తాపపడి, మనం చేయగలిగినదంతా చేస్తాము. ఆయన మనలను శాశ్వతంగా “తన ప్రేమగల హస్తములలో” చుట్టుముట్టును.40
నేడు మనము పునఃస్థాపనను మరియు పునరుత్థానమును పురస్కరించుకుంటాము. యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క కొనసాగుతున్న పునఃస్థాపనలో మీతోపాటు నేను సంతోషిస్తున్నాను. ఈ వసంతకాలంలో రెండు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్లుగానే, ప్రభువు యొక్క సజీవ ప్రవక్త ద్వారా మరియు ఆయన పేరుతో—యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము—అని పిలువబడిన ఆయన సంఘము ద్వారా, వ్యక్తిగత బయల్పాటు మరియు దివ్యమైన పరిశుద్ధాత్మ వరము యొక్క ప్రేరేపణ ద్వారా వెలుగు మరియు బయల్పాటు రావడం కొనసాగుతుంది.
మీతోపాటు, ఈ ఈస్టర్ కాలములో, దేవుడు, మన శాశ్వతమైన తండ్రి మరియు అతని ప్రియమైన కుమారుడు, జీవించుచున్న యేసు క్రీస్తు గురించి నేను సాక్ష్యమిస్తున్నాను. మర్త్యులైన మనుష్యులు క్రూరంగా సిలువ వేయబడ్డారు మరియు తరువాత పునరుత్థానం చెందారు. కానీ సజీవుడైన యేసు క్రీస్తు మాత్రమే తన సంపూర్ణ పునరుత్థాన రూపంలో ఆయన చేతులు, కాళ్ళు మరియు ప్రక్కలో సిలువ వేయబడిన గుర్తులను కలిగి ఉన్నారు. ఆయన మాత్రమే “నా యరచేతులమీదనే నిన్ను చెక్కి యున్నాను”41 అని చెప్పగలరు. ఆయన మాత్రమే ఇలా చెప్పగలరు: “పైకెత్తబడిన వాడను నేను”. సిలువ వేయబడిన యేసును నేనే. నేను దేవుని కుమారుడను.”42
చిన్న ఐవీ మరియు ఆమె వయోలిన్ మాదిరిగా, మనము ఇంకా కొన్ని విధాలుగా ప్రారంభిస్తున్నాము. నిజంగా, “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు.”43 ఈ సమయాల్లో, మనం ఆయనను వెదుకుతున్నప్పుడు మరియు ఒకరినొకరు చేరుకున్నప్పుడు, దేవుని మంచితనం గురించి మరియు మనలో దేవుని ప్రేమ పెరగడానికి మనకున్న దైవిక సామర్థ్యం గురించి మనం ఎక్కువగా నేర్చుకోగలము. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, దయ వెంబడి దయ, వ్యక్తిగతంగా మరియు కలిసి, క్రొత్త విధాలలో మరియు క్రొత్త ప్రదేశాలలో మనం చేయగలం మరియు కాగలం.
ప్రతిచోటా ఉన్న ప్రియమైన సహోదర సహోదరీలారా, మనం కలిసి నేర్చుకున్నప్పుడు, మీ విశ్వాసము మరియు మంచితనము నన్ను సువార్త ఉత్తేజము మరియు కృతజ్ఞతాభావముతో నింపింది. మీ సాక్ష్యం మరియు సువార్త ప్రయాణం, నా సాక్ష్యాన్ని మరియు సువార్త ప్రయాణాన్ని సుసంపన్నం చేస్తుంది. మీ ఆందోళనలు మరియు ఆనందాలు, మా పరిశుద్ధుల సమాజము మరియు దేవుని ఇంటివారిపట్ల మీ ప్రేమ, మరియు పునఃస్థాపించబడిన సత్యం మరియు వెలుగుపై మీకున్న జీవముగల అవగాహన, సజీవుడైన యేసు క్రీస్తు ప్రధాన అంశముగా పునఃస్థాపించబడిన సువార్త సంపూర్ణత యొక్క నా అవగాహనను పెంచుతుంది. మనం కలిసి నమ్ముతాము, “మేఘము మరియు సూర్యరశ్మి గుండా, ప్రభూ, నాతో ఉండండి.” 44 కలిసికట్టుగా మనకు తెలుసు, మన భారాలు మరియు చింతల మధ్య, మన అనేక ఆశీర్వాదాలను మనం లెక్కించగలము. 45 రోజువారీ వివరాలలో, చిన్న మరియు సరళమైన విషయాలలో, మన జీవితాల్లో గొప్ప విషయాలు జరిగినట్లు మనం చూడగలము.46
“ఇది జరుగును, నీతిమంతులు సమస్త జనములనుండి కూర్చబడుదురు, నిత్య సంతోష గీతములను పాడుచు సీయోనుకు వచ్చెదరు.”47 హోసన్న మరియు హల్లెలూయా యొక్క ఈ కాలములో, హల్లెలూయా పాడండి—ఎందుకంటే ఆయన ఎప్పటికీ శాశ్వతంగా పరిపాలన చేయును! దేవునికి, గొఱ్ఱెపిల్లకు హోసన్నయని పాడండి! యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో, ఆమేన్.