సర్వసభ్య సమావేశము
జీవముతోనున్న క్రీస్తుకు ఒక సజీవ సాక్ష్యము
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


జీవముతోనున్న క్రీస్తుకు ఒక సజీవ సాక్ష్యము

మానవజాతి యొక్క రక్షణ మరియు మహోన్నతస్థితిలో యేసు క్రీస్తు యొక్క ముఖ్యమైన పాత్ర యొక్క నిజమైన జ్ఞానాన్ని పునఃస్థాపించడం మోర్మన్ గ్రంథము యొక్క ప్రధాన సందేశం.

2017 లో ఎండగానున్న ఒక వసంతకాల దినమున, పారిస్ ఫ్రాన్స్ దేవాలయం సందర్శకుల కోసం అంతకుముందే తెరువబడింది, అప్పుడు ముఖంలో బాధతో ఒక వ్యక్తి పర్యాటక నిర్దేశకులలో ఒకరిని సంప్రదించాడు. తాను ఆలయం పక్కనే నివసిస్తున్నాడని, దాని నిర్మాణానికి తాను చురుకైన ప్రత్యర్థిని అని అతడు చెప్పాడు. ఒక రోజు తన అపార్ట్ మెంట్ కిటికీలోంచి చూస్తుండగా, ఒక పెద్ద క్రేన్ యేసు విగ్రహాన్ని ఆకాశం నుండి క్రిందికి దించి, ఆలయ మైదానంలో జాగ్రత్తగా ఉంచడాన్ని అతడు చూశాడన్నాడు. ఈ అనుభవం మన సంఘం పట్ల అతని భావాలను పూర్తిగా మార్చివేసిందని ఆ వ్యక్తి ప్రకటించాడు. మనము యేసు క్రీస్తు అనుచరులమని గ్రహించి, అతడు ఇంతకు ముందు కలిగించిన హానికి క్షమించమని వేడుకున్నాడు.

చిత్రం
పారిస్ ఫ్రాన్స్ దేవాలయం వద్ద విగ్రహం పెట్టబడుట

పారిస్ దేవాలయ భూమిని మరియు ఇతర సంఘ స్థలాలను అలంకరించే క్రైస్టస్, విగ్రహం, రక్షకుడిపై మనకున్న ప్రేమకు సాక్ష్యమిస్తుంది. అసలు పాలరాయి విగ్రహం డానిష్ కళాకారుడు బెర్టెల్ థోర్వాల్డ్‌సెన్ యొక్క రూపకల్పన, అతను దీనిని 1820 లో—మొదటి దర్శనము కలిగిన అదే సంవత్సరంలో చెక్కాడు. ఈ విగ్రహం ఆ కాలంలోని చాలా కళాత్మక ప్రదర్శనలకు పూర్తి విరుద్ధంగా ఉంది, అవి సిలువపై బాధపడుతున్న క్రీస్తును ఎక్కువగా చిత్రీకరించాయి. థోర్వాల్డ్‌సెన్ యొక్క పనితనము జీవముతోనున్న క్రీస్తును ప్రదర్శిస్తుంది, ఆయన మరణంపై విజయం సాధించారు మరియు బాహువులను చాపి, తన వద్దకు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఆయన చేతులు మరియు కాళ్ళలో మేకుల గుర్తులు మరియు ఆయన ప్రక్కన ఉన్న గాయం మాత్రమే ఆయన మానవాళిని కాపాడడానికి భరించిన వర్ణించలేని వేదనకు సాక్ష్యమిస్తాయి.

చిత్రం
క్రైస్టస్‌లో చిత్రీకరించబడినట్లుగా రక్షకుని చెయ్యి

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా మనం ఈ విగ్రహాన్ని ఇష్టపడటానికి ఒక కారణం ఏమిటంటే, ఇది అమెరికా ఖండంలో రక్షకుని దర్శనం గురించి మోర్మన్ గ్రంథములో ఇచ్చిన వివరణను గుర్తుచేస్తుంది:

చిత్రం
యేసు క్రీస్తు అమెరికాను దర్శించుట

“ఇదిగో వారు ఒక మనుష్యుడు పరలోకము నుండి దిగివచ్చుట చూచిరి; అతడు ఒక తెల్లటి నిలువుటంగీని ధరించి యుండెను మరియు అతడు క్రిందికి వచ్చి మరియు వారి మధ్య నిలిచెను. …

“అతడు తన చేతులు ముందుకు చాపి మరియు జనులతో ఇట్లు చెప్పుచూ పలికెను:

“ఇదిగో, … యేసు క్రీస్తును నేనే, …

“… తండ్రి నాకు ఇచ్చిన ఆ చేదు పాత్రనుండి నేను తాగియున్నాను, మరియు లోకము యొక్క పాపములను నాపై తీసుకొనుటలో తండ్రిని మహిమపరచి యున్నాను.” 1

అప్పుడు ఆయన ప్రతి పురుషుడు, స్త్రీ మరియు బిడ్డను ముందుకు వచ్చి వారి చేతులను తన వైపుకు చాచి, ఆయన చేతులు మరియు కాళ్ళలోని మేకుల యొక్క గుర్తులను అనుభవించమని ఆహ్వానించారు, తద్వారా ఆయన నిజంగా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ అని వారు వ్యక్తిగత సాక్ష్యం పొందగలరు.2

ఈ అద్భుతమైన దృశ్యం మోర్మన్ గ్రంథము యొక్క ముగింపు ఘట్టము. సువార్త యొక్క “శుభవార్త” అంతా రక్షకుని యొక్క ఈ చిత్రంలో ఉంది, ఇందులో ప్రతి వ్యక్తిని తన వద్దకు రమ్మని మరియు ఆయన ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలను స్వీకరించమని ఆహ్వానించడానికి ఆయన “దయ గల హస్తములను”3 సున్నితంగా విస్తరించారు.

మానవజాతి యొక్క రక్షణ మరియు మహోన్నతస్థితిలో యేసు క్రీస్తు యొక్క ముఖ్యమైన పాత్ర యొక్క నిజమైన జ్ఞానాన్ని పునఃస్థాపించడం మోర్మన్ గ్రంథము యొక్క ప్రధాన సందేశం. ఈ ప్రధానాంశము పీఠిక పేజీ నుండి చివరి అధ్యాయం యొక్క చివరి పదాల వరకు ప్రతిధ్వనిస్తుంది. శతాబ్దాల భ్రష్టత్వం మరియు ఆధ్యాత్మిక గందరగోళం ద్వారా, గెత్సేమనేలో మరియు గోల్గొతాపై క్రీస్తు చేసినదానికి లోతైన అర్ధం కోల్పోబడింది లేదా నశించింది. 1వ నీఫై గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని కనుగొన్నప్పుడు జోసెఫ్ స్మిత్ ఎంత ఉత్సాహంగా భావించి ఉండవచ్చునో కదా: “ఈ చివరి వృత్తాంతములు [మోర్మన్ గ్రంథము] … [బైబిలు] మొదటి వాటి యొక్క సత్యమును స్థాపించును … వాటినుండి తీసివేయబడిన సరళమైన మరియు ప్రశస్థమైన వాక్యములను తెలియజేయును; మరియు సమస్త వంశములు, భాషలు మరియు జనులకు దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల, శాశ్వతుడైన తండ్రి యొక్క కుమారుడనియు మరియు లోక రక్షకుడనియు మరియు నరులందరు ఆయన యొద్దకు రావలెననియు లేనియెడల రక్షణ పొందలేరనియు తెలియజేయును.” 4

రక్షకుని ప్రాయశ్చిత్తం గురించి సరళమైన మరియు ప్రశస్థమైన సత్యాలు మోర్మన్ గ్రంథమంతటా ప్రతిధ్వనిస్తాయి. నేను ఈ అనేక సత్యాలను జాబితా చేస్తున్నప్పుడు, అవి మీ జీవితాన్ని ఎలా మార్చాయో లేదా ఎలా మార్చగలవో అనేదానిపై ప్రతిబింబించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

  1. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం అందరికీ అనగా భూమిపై ఇంతకుముందు నివసించిన, ప్రస్తుతం నివసిస్తున్న మరియు భవిష్యత్తులో నివసించే వారందరికి ఇవ్వబడిన ఉచిత వరము. 5

  2. మన పాపాల భారాన్ని మోయడంతో పాటు, క్రీస్తు మన దుఃఖాలు, బలహీనతలు, బాధలు, అనారోగ్యాలు మరియు మనిషి యొక్క ప్రాణాంతక స్థితిలో అంతర్లీనంగా ఉన్న అన్ని బాధలను స్వయంగా స్వీకరించారు. ఆయన మనకోసం అనుభవించని వేదన, బాధ, లేదా విచారము లేదు.6

  3. రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం, శారీరక మరణంతో పాటు ఆదాము పతనం యొక్క ప్రతికూల పరిణామాలను అధిగమించడానికి మనల్ని అనుమతిస్తుంది. క్రీస్తు కారణంగా, ఈ భూమిపై జన్మించిన దేవుని పిల్లలందరూ, వారి నీతితో సంబంధం లేకుండా, పునరుత్థాన శక్తి 7 ద్వారా వారి ఆత్మలు మరియు శరీరాలు తిరిగి ఏకమవడాన్ని అనుభవిస్తారు మరియు “(వారి) క్రియల ప్రకారం తీర్పు తీర్చబడుటకు”8 ఆయన యొద్దకు తిరిగి వెళ్తారు.

  4. దీనికి విరుద్ధంగా, రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క పూర్తి ఆశీర్వాదాలను పొందడమనేది “క్రీస్తు సిద్ధాంతాన్ని”10 జీవించడంలో మనం చూపించే శ్రద్ధ9 అనే షరతుపై ఆధారపడి ఉంటుంది. లీహై తన కలలో, జీవ వృక్షానికి దారితీసే “తిన్నని ఇరుకైన మార్గాన్ని”11 చూసాడు. క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతమైన ఆశీర్వాదాల ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని ప్రేమను సూచించే దాని ఫలం, “మిక్కిలి శ్రేష్ఠమైనది మరియు మిక్కిలి కోరదగినది … [మరియు] దేవుని యొక్క బహుమానములన్నింటిలో గొప్పది.”12 ఈ ఫలమును పొందడానికి, మనం యేసు క్రీస్తుపై విశ్వాసం కలిగి ఉండాలి, పశ్చాత్తాపం చెందాలి, “దేవుని వాక్యమును ఆలకించాలి,”13 అవసరమైన విధులను పొందాలి మరియు మన జీవితకాలం చివరి వరకు పవిత్ర నిబంధనలను పాటించాలి.14

  5. తన ప్రాయశ్చిత్తం ద్వారా, యేసు క్రీస్తు మన పాపాలను కడిగివేయడమే కాక, సమర్థతనిచ్చే శక్తిని కూడా ఆయన అందిస్తారు, దాని ద్వారా తన శిష్యులు “ప్రకృతి సంబంధియైన మనుష్యుని [విసర్జించి],”15 “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ”16 పురోగతి సాధించవచ్చు మరియు పవిత్రతను పెంచుకోవచ్చు,17 తద్వారా వారు క్రీస్తు స్వరూపంలో పరిపూర్ణ జీవులుగా మారవచ్చు,18 దేవునితో మళ్ళీ జీవించడానికి19 మరియు పరలోకరాజ్యం యొక్క అన్ని ఆశీర్వాదాలను వారసత్వంగా పొందడానికి20 అర్హత పొందవచ్చు.

మోర్మన్ గ్రంథములో ఉన్న మరో ఓదార్పునిచ్చే సత్యం ఏమిటంటే, ప్రభువు ప్రాయశ్చిత్తం అనంతమైనది మరియు విశ్వవ్యాప్తమైనది అయినప్పటికీ, అది విశేషముగా వ్యక్తిగతమైన మరియు సన్నిహితమైన బహుమానము, అది మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సరిపోతుంది.21 యేసు తన గాయాలను తాకి చూడడానికి నీఫై శిష్యులలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించినట్లే, ఆయన మనలో ప్రతి ఒక్కరము అనగా మీరు లేదా నేను మాత్రమే ఈ భూమిమీద ఉన్నట్లు వ్యక్తిగతంగా మనకొరకు మరణించారు. ఆయన వద్దకు వచ్చి, ఆయన ప్రాయశ్చిత్తం యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలను పొందడానికి ఆయన మనకు వ్యక్తిగత ఆహ్వానాన్ని ఇస్తున్నారు.22

మోర్మన్ గ్రంథములో విశేషమైన స్త్రీపురుషుల ఉదాహరణలను మనం పరిశీలిస్తే, క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క వ్యక్తిగత స్వభావం మరింత వాస్తవమవుతుంది. వారిలో ఈనస్, ఆల్మా, జీజ్రొమ్, రాజైన లమోనై మరియు అతని భార్య మరియు బెంజమిన్ రాజు యొక్క ప్రజలు ఉన్నారు. వారి పరివర్తన కథలు మరియు శక్తివంతమైన సాక్ష్యాలు, ప్రభువు యొక్క అనంతమైన మంచితనం మరియు దయ ద్వారా మన హృదయాలు ఎలా మార్చబడగలవో మరియు మన జీవితాలు ఎలా మారగలవో అనడానికి సజీవ సాక్ష్యాలను అందిస్తాయి.23

అల్మా ప్రవక్త తన ప్రజలను ఈ దహించు ప్రశ్న అడిగారు. ఆయనిలా అన్నారు, “మీరు హృదయము యొక్క మార్పును అనుభవించిన యెడల, మరియు విమోచించు ప్రేమ యొక్క గీతమును మీకు పాడవలెననిపించిన యెడల నేను అడుగుచున్నాను, ఇప్పుడు అలాగున భావించగలరా?”24 ఈ ప్రశ్న ఈ రోజు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రభువు శిష్యులుగా, ఆయన విమోచన శక్తి మనతో పాటు ఉండాలి, మనల్ని ప్రేరేపించాలి మరియు ప్రతిరోజూ మనల్ని మార్చాలి.

ఆల్మా ప్రశ్నను మరోరకంగా ఇలా అడగవచ్చు, మీ జీవితంలో రక్షకుని ప్రాయశ్చిత్తం యొక్క మధురమైన ప్రభావాన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు అనుభవించారు? మీ పాపాలు క్షమించబడ్డాయని మీ ఆత్మకు సాక్ష్యమిచ్చే “తీవ్రమైన మరియు మధురమైన”25 ఆనందం మీపైకి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది; లేదా బాధాకరమైన పరీక్షలు అకస్మాత్తుగా భరించడానికి తేలికైనప్పుడు; లేదా మీ హృదయం మృదువుగా మారినప్పుడు మరియు మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తిని మీరు క్షమించగలిగినప్పుడు ఇది జరుగుతుంది. లేదా ఇతరులను ప్రేమించడానికి మరియు సేవ చేయడానికి మీ సామర్థ్యం పెరిగినట్లు మీరు గమనించిన ప్రతిసారీ లేదా పవిత్రీకరణ ప్రక్రియ మిమ్మల్ని వేరే వ్యక్తిగా, రక్షకుని ఉదాహరణను పోలిన వ్యక్తిగా మార్చినప్పుడు ఇది జరుగుతుంది.26

ఈ అనుభవాలన్నీ నిజమైనవని, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తంపై విశ్వాసం ద్వారా జీవితాలు మార్చబడగలవనడానికి సాక్ష్యాలని నేను సాక్ష్యమిస్తున్నాను. మోర్మన్ గ్రంథము ఈ దివ్యమైన బహుమానము గురించి మన జ్ఞానాన్ని స్పష్టం చేస్తుంది మరియు విస్తరిస్తుంది. మీరు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, జీవముతోనున్న క్రీస్తు యొక్క స్వరము మిమ్మల్ని తన దగ్గరకు రమ్మని ఆహ్వానించడాన్ని మీరు వింటారు. ఈ ఆహ్వానాన్ని మీరు అంగీకరించి, ఆయన మాదిరికి అనుగుణంగా మీ జీవితాన్ని రూపొందించుకుంటే, ఆయన విమోచన ప్రభావం మీ జీవితంలోకి వస్తుందని నేను వాగ్దానం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, రక్షకుడు మిమ్మల్ని దిన దినము “పరిపూర్ణమైన దినము వరకు”27 మారుస్తారు, అప్పుడు మీరు ఆయన ప్రకటించినట్లుగా “నా ముఖాన్ని చూసి నేను ఉన్నానని తెలుసుకొందురు.”28 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు