సర్వసభ్య సమావేశము
ప్రారంభ సందేశం
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


6:40

ప్రారంభ సందేశం

పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు పరిచర్య ద్వారా మనతో మాట్లాడే యేసు క్రీస్తును వినడానికి మనకు వీలైనన్ని విధాలుగా ప్రయత్నించాలి.

నా ప్రియ సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధల సంఘము యొక్క ఈ చారిత్రాత్మక ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము, మీకు తెలిసిన కారణాల వల్ల, నేను ఖాళీ ఆడిటోరియంలో మీ ముందు నిలబడ్డాను!

ఈ ఏప్రిల్ సమావేశం “చిరస్మరణీయమైనది” మరియు “మరపురానిదిగా” ఉంటుందని అక్టోబర్ 2019 సర్వసభ్య సమావేశంలో నేను మీకు వాగ్దానం చేసినప్పుడు నాకు తెలియదు, 10 కంటే తక్కువ మంది కనిపించే ప్రేక్షకులతో మాట్లాడటం ఈ సమావేశాన్ని నాకు చిరస్మరణీయమైనదిగా మరియు మరపురానిదిగా చేస్తుందని! అయినప్పటికీ మీరు ఎలక్ట్రానిక్ ప్రసారము ద్వారా పాల్గొంటున్నారన్న జ్ఞానం మరియు గాయక బృందంచే “ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్” యొక్క అందమైన ప్రదర్శన నా ఆత్మకు ఎంతో ఓదార్పునిస్తోంది.

మీకు తెలిసినట్లుగా, మంచి ప్రపంచ పౌరులుగా ఉండడానికి మరియు కోవిడ్-19 యొక్క వ్యాప్తిని పరిమితం చేయడానికి మనం చేయగలిగినదంతా చేయడానికి మా ప్రయత్నాల్లో భాగంగా ఈ సర్వసభ్య సమావేశానికి హాజరు ఖచ్చితంగా పరిమితం చేయబడింది. ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావాన్ని చూపింది. ఇది మన సంఘ సమావేశాలు, మిషనరీ సేవ మరియు దేవాలయ కార్యాలను కూడా తాత్కాలికంగా మార్చింది.

నేటి ఆంక్షలు తీవ్రమైన వైరస్‌కు సంబంధించినవి అయినప్పటికీ, జీవితం యొక్క వ్యక్తిగత పరీక్షలు ఈ మహమ్మారిని మించినవి. భవిష్యత్ పరీక్షలు ప్రమాదం, ప్రకృతి విపత్తు లేదా ఊహించని వ్యక్తిగత హృదయవేదన కారణంగా సంభవించవచ్చు.

ఇలాంటి శ్రమలను మనం ఎలా సహించగలం? “మీరు సిద్ధపడియున్నట్లైతే మీరు భయపడక యుందురు” 1 అని ప్రభువు మనకు చెప్పారు. వాస్తవానికి, మన ఆహారం, నీరు మరియు ధనాన్ని మనం నిల్వ చేసుకోగలం. అయితే, మన వ్యక్తిగత ఆత్మీయ నిల్వగృహాలను విశ్వాసం, సత్యం మరియు సాక్ష్యముతో నింపాల్సిన అవసరం కూడా అంతే కీలకం.

జీవితంలో మన అంతిమ తపన మన సృష్టికర్తను కలవడానికి సిద్ధం కావడమే. మన రక్షకుడైన యేసు క్రీస్తువలె మారడానికి ప్రతిరోజూ కృషి చేయడం ద్వారా మనం దీన్ని చేస్తాము.2 మనం ప్రతిరోజూ పశ్చాత్తాపపడి, ఆయన ప్రక్షాళన, స్వస్థత మరియు బలోపేత శక్తిని పొందినప్పుడు దానిని మనం చేస్తాము. అప్పుడు మనం అల్లకల్లోలంగా ఉన్న సమయాల్లో కూడా శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్ని అనుభవించగలము. ఈ కారణం చేతనే మనం పవిత్ర స్థలాలలో నిలబడాలని మరియు “కదలకుండా ఉండాలని” ప్రభువు మనలను కోరుచున్నారు.3

ఈ సంవత్సరం, ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటైన 200వ వార్షికోత్సవాన్ని మనం గుర్తుచేసుకుంటాము—అదేమనగా తండ్రియైన దేవుడు మరియు ఆయన ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్‌కు కనిపించడం. ఆ అసాధరణమైన దర్శనంలో, తండ్రియైన దేవుడు యేసు క్రీస్తును చూపిస్తూ ఇలా అన్నారు: “ఇదిగో నా ప్రియమైన కుమారుడు. ఆయనను ఆలకించుము!”4

జోసెఫ్ స్మిత్‌కు ఇచ్చిన ఆ ఉపదేశము మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు పరిచర్య ద్వారా మనతో మాట్లాడే యేసు క్రీస్తును వినడానికి మనకు వీలైనన్ని విధాలుగా ప్రయత్నించాలి.

ఇది మరియు ప్రతి సర్వసభ్య సమావేశం యొక్క ఉద్దేశ్యం ఏమనగా ఆయనను వినడానికి మనకు సహాయపడడం. రక్షకుడు మీ కోసం ప్రత్యేకంగా కలిగి ఉన్న సందేశాలు—మీ ఆత్మకు శాంతిని కలిగించే సందేశాలు మీరు వినగలిగేంత గొప్ప సమృద్ధిగా ప్రభువు ఆత్మ మనతో ఉండాలని మేము ప్రార్థించాము మరియు ప్రార్థన చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ విరిగిన హృదయాన్ని స్వస్థపరిచే సందేశాలు. మీ మనస్సును ప్రకాశింపజేసే సందేశాలు. ఇప్పుడు మరియు భవిష్యత్తు గందరగోళం మరియు శ్రమగల సమయాలలో మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఏమి చేయాలో తెలుసుకోవడానికి మీకు సహాయపడే సందేశాలు.

మీరు వినే సందేశాలు, చేయబడబోయే ప్రత్యేకమైన ప్రకటనలు మరియు మీరు పాల్గొనడానికి ఆహ్వానించబడబోయే అనుభవాల కారణంగా ఈ సమావేశం చిరస్మరణీయమైనదిగా మరియు మరపురానిదిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము.

ఉదాహరణకు, ఆదివారం ఉదయం సభ ముగింపులో, నేను మిమ్మల్ని పవిత్రమైన హోసన్నా కేక వేయడంలో నడిపించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గంభీరమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ప్రపంచ వ్యాప్తంగా ఏకస్వరముతో వారిని స్తుతించడం ద్వారా తండ్రియైన దేవునికి మరియు ఆయన ప్రియ కుమారుడికి మన ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నందున ఇది మీకు ఒక ఆధ్యాత్మిక ప్రధానాంశం అవుతుందని మేము ప్రార్థిస్తున్నాము.

ఈ పవిత్రమైన అనుభవం కోసం, మనం శుభ్రమైన తెల్లటి రుమాలు ఉపయోగిస్తాము. మీ దగ్గర రుమాలు లేకపోతే, మీరు మీ చేతిని ఊపవచ్చు. హోసన్నా కేక ముగింపులో, సమూహం “ద స్పిరిట్ ఆఫ్ గాడ్”5 పాడడంలో గాయక బృందంతో చేరుతుంది.

నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ సమావేశం అద్భుతంగా ఉంటుంది. మనము రక్షకునిపై మరియు ఆయన పునఃస్థాపించిన సువార్తపై తీవ్రంగా దృష్టి సారించినందున ఈ సంవత్సరం అసాధారణంగా ఉంటుంది. మన హృదయాలు మారినప్పుడు మరియు ఆయనను వినడానికి జీవితకాల తపనను మనం ప్రారంభించినప్పుడు, ఈ చారిత్రాత్మక సమావేశం యొక్క అతి ముఖ్యమైన శాశ్వత ప్రభావాలు మనపై ఉంటాయి.

ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశానికి స్వాగతం! మన పరలోకపు తండ్రి మరియు అతని కుమారుడైన యేసు క్రీస్తు మనలను గుర్తుంచుకుంటారని నాకు తెలుసు. మనము వారికి దగ్గరగా ఉండడానికి మరియు వారిని గౌరవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ రెండు అద్భుతదినాల కార్యకలాపాలన్నిటిలో వారు మనతో ఉంటారు. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.