యాజకత్వము యువకులను ఏ విధంగా ఆశీర్వదించును
మనము దేవదూతలవలే పరిచర్య చేయుటకు, భూఖండములన్నింటి మీద సువార్తను బోధించుటకు, ఆత్మలను క్రీస్తు నొద్దకు వచ్చునట్లు సహాయము చేయుటకు మనకు అవకాశము అనుగ్రహింపబడియున్నది.
సహోదర సహోదరీలారా, ఈ చారిత్రాత్మక సాయంత్రాన్న పరిశుద్ధవరమైన యాజకత్వమును గూర్చి ఈ యుగములోని యువకులను ఆశీర్వదించుటకు దానికిగల ఆశ్చర్యకరమైన శక్తిని గూర్చి మాట్లాడగలుగుటకు నేను కృతజ్ఞుడను. సత్యమును బోధించుటకు నాయొక్క అసంపూర్ణతలను పరిగణించక పరిశుద్ధాత్మ నాకు సహాయము చేయునని నేను ప్రార్థిస్తున్నాను.
ఆహారోను యాజకత్వము కలిగిన వారికి ప్రథమ అధ్యక్షత్వము జ్ఞాపకము చేయునదేమనగా ”మీరు గొప్ప అవకాశములను మరియు సవాళ్ళను ఎదుర్కొను దినములో, యాజకత్వము పునరుద్ధరింపబడిన దినములో జీవిస్తున్నారు. ఆహారోను యాజకత్వపు విధులను నిర్వర్తించుటకు మీకు అధికారముకలదు. యోగ్యత కలిగి ప్రార్ధనాపూర్వకంగా ఆ అధికారాన్ని వినియోగపరచినప్పుడు మీరు మీ చుట్టునున్న వారి జీవితాలను అత్యధికంగా ఆశీర్వదించగలరు.”1 సంఘము యొక్క యువకులుగా మనము దేవుని ప్రియమైన [కుమారుల]మనియు, మరియు ఆయనకొరకు [మనము] చేయవలసిన ఒక కార్యము కలదని కూడా జ్ఞాపకము చేయబడుచున్నాము”2 మరియు “నరుని అమర్త్యత్వము మరియు నిత్యజీవమును సిద్ధింపచేయుటకు ఆయన పనిలో మనము సహాయము చేయుచున్నాము” (మోషే 1:39).
రక్షకుని యొక్క సువార్త విధులను, నిబంధనలను యోగ్యులైన వారికొరకు నిర్వహించుటకు గల అధికారమే యాజకత్వము. మన దైవ లక్ష్యాన్ని సాధించుటకు సహాయము చేయు రక్షకుని ప్రాయశ్చిత్తము యొక్క పూర్తి ఆశీర్వాదములు ఈ యజకత్వపు విధులు, పరిశుద్ధ నిబంధనల ద్వారా లభించును.
యేసు క్రీస్తు యొక్క సువార్తను పునఃస్థాపించుటకు దేవునిచేత పిలువబడిన యువకుడు జోసెఫ్ స్మిత్ మరియు ఆ సంకల్పము కొరకు యాజకత్వాన్ని పొంది, దానిని ఆయన సర్వమానవాళిని ఆశీర్వదించుటకు వినియోగించెను. సిద్ధాంతము మరియు నిబంధనలు 135, లో జోసెఫ్ స్మిత్ ఈ యుగంలోని యువకులకు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదాలను జాన్ టైలర్ వెలుగులోనికి తెచ్చియున్నారు. మనము ఇలా చదువుతాము: “జోసెఫ్ స్మిత్ … మానవ రక్షణ కొరకు యేసు క్రీస్తు తప్ప ఈ ప్రపంచములో జీవించిన మరే మనుష్యుడు ఏనాడు చేయజాలనంత అధికంగా చేసియుండెను. … మోర్మన్ గ్రంథమును ఆయన తీసుకొచ్చారు … ; నిత్యజీవ సువార్త యొక్క పరిపూర్ణతను … భూమి నలుమూలలకు పంపెను; బయల్పాటులు, ఆజ్ఞల యొక్క కూర్పుగా సిద్దాంతము మరియు నిబంధనలను తెచ్చెను… ; కడవరి దిన పరిశుద్ధులను అనేక వేల మందిని ప్రోగుచేసెను, … నశింపజాలని ఖ్యాతిని, కీర్తిని మిగిల్చెను” (సిద్దాంతము మరియు నిబంధనలు 135:3).
జోసెఫ్ మాదిరిగా సమర్ధవంతమైన సేవచేయుటకు, మనము ఆ ప్రభువు యొక్క యాజకత్వ అధికారమును వినియోగించుటకు మనము యోగ్యులముగా అర్హతను పొందవలెను. మోర్మన్ గ్రంధమును అనువదించునప్పుడు జోసెఫ్ మరియు ఆలివర్ కౌడరిలు బాప్తీస్మము పొందగోరిరి, కాని వారికి సరియైన అధికారము కొదువైంది. మే 15, 1829న వారు మోకాళ్లూని ప్రార్థించినప్పుడు వారికి ఆహారోను యాజకత్వపు తాళపుచెవులను, అధికారమును అనుగ్రహించిన బాప్తీస్మమిచ్చు యోహాను దర్శించి, ఇట్లు చెప్పెను, “నా తోటి సేవకులైన మీపై, మెస్సీయ నామములో నేను అహరోను యాజకత్వమును అనుగ్రహించుచున్నాను, ఇది దేవదూతల పరిచర్య యొక్కయు, పశ్చాత్తాప సువార్త యొక్కయు, పాపక్షమాపణ కొరకు ముంచుట ద్వారా బాప్తీస్మము యొక్కయు తాళపుచెవులను కలిగియున్నది” ( సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1).
మనము దేవదూతలవలే పరిచర్య చేయుటకు, భూఖండములన్నింటి మీద సువార్తను బోధించుటకు, ఆత్మలను క్రీస్తు నొద్దకు వచ్చునట్లు సహాయము చేయుటకు మనకు అవకాశము అనుగ్రహింపబడియున్నది. ఈసేవ మనలను బాప్తీస్మమిచ్చు యోహాను, మొరోనై, జోసెఫ్ స్మిత్, అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్, మరియు ప్రభువు యొక్క శ్రద్ధగల ఇతర సేవకులతో సహపనివారిగా నుంచును.
మన సేవలోను, మనతోను ఆయన యాజకత్వమును కలిగియున్నచో, ప్రభువు యొక్క బోధనలను పరిపూర్ణంగా పాటించుటకు, అనుసరించుటకు అంకితమైన వారిని ఐక్యపరచగలము, అది మనము ఎదుర్కొను యవ్వనకాల సవాళ్ళనుబట్టి అది కష్టమని వ్యక్తిగతంగా నాకు తెలుసు. కాని, ఆయన కార్యమును సాధించుటలో ప్రభువు యొక్క తోటి సేవకులతో ఐక్యమగుట వలన అపవాది శోధనలకు, మోసములకు వ్యతిరేకముగా మనలను బలపరచుకొనుటకు సహాయము చేయును. అనిశ్చిత పరిస్థితిలోనున్న వారందరికి మీరు దారిచూపు దీపస్ధంభం వలే ఉండగలరు. మీలోని వెలుగు ప్రకాశవంతముగా నుండుట వలన మీరు సంభాషించే ప్రతి ఒక్కరు కేవలము మీ సహవాసము వలన ఆశీర్వదింపబడగలరు. ఒక్కోసారి మన ఆత్మీయ సహచరులను గుర్తించుట కష్టము కావచ్చును. కాని నేను విశ్వాసులైన ఒక యాజకత్వ సమూహములో సభ్యుడనని, వారితో కలిసి పనిచేయుచు క్రీస్తుకు దగ్గరగుటకు నేను ఎదగగలనని తెలుసుకొనుటకు కృతజ్ఞత కలిగియున్నాను.
మన స్నేహితులు, కుటుంబాలతో పాటు, పరిశుద్ధాత్మ కూడా మిక్కిలి నమ్మదగిన, విశ్వసనీయమైన సహచరుల్లో ఒకరు. కానీ అతని నిత్య సహచరత్వాన్ని ఆహ్వానించుటకు, అతడు ఉండాలనుకునే పరిస్థితులలో, ప్రదేశాలలో మనల్ని మనం ఉంచుకోవాలి. మన గృహమును ఒక పరిశుద్ద స్థలముగా చేసుకొనుటకు అనుదినము లేఖన అధ్యయనము, కుటుంబ సమేతంగా ప్రార్ధనలను చేయుట, మరిముఖ్యంగా మన వ్యక్తిగత లేఖన పఠనం, ప్రార్ధనల ద్వారా మన స్వంత గృహములలోనే అది ప్రారంభం కావచ్చును.
ఈ సంవత్సరారంభంలో, సెలెస్టియల్ రాజ్యంలో ప్రవేశించడానికి నిర్దేశించిన అవసరాలలో ఒకదాన్ని నెరవేర్చుటకు బాప్తీసం పొందే ఆహ్వానాన్ని అంగీకరించడం ద్వారా నా చిన్న చెల్లెలు ఓషియాన్, ఒడంబడిక మార్గంలో ముందుకు సాగుటకు సహాయపడటానికి నాకు ఉత్తేజకరమైన ఇంకా వినయపూర్వకమైన అవకాశం లభించింది. యాజక విధులను నిర్వహించుటకు నాకు అవకాశము లభించునట్లు నేను యాజకునిగా నియమించబడువరకు ఆమె తన బాప్తీస్మమును ఒక నెల రోజులు వాయిదా వేయగా, మా ఇతర సహోదరీలు యాజకత్వనియమంలో పని చేస్తూ, సాక్షులుగా నిలబడు ప్రత్యేకతను పొందారు. తొట్టెకు ఎదురెదురుగా మేము నిల్చుని, నీటిలోకి ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, నేను నాతో సమానమయ్యే ఉత్సాహాన్ని ఆమెలో గమనించాను. ఆమె సరైన నిర్ణయం తీసుకుంటుందని చూస్తూ, నేను ఆమెతో ఏకీభవించుటను అనుభవించాను. యాజకత్వమును అభ్యసించుటకు కలిగిన అవకాశము నా సువార్తపరమైన జీవితము మరింత జాగ్రత్తగా ఉంటూ, సాధారణముగా నెంచకుండా ఉండుట అవసరమయ్యింది. సిద్ధపాటు కోసం నేను ఆ వారంలో ప్రతి రోజు దేవాలయమునకు నా తల్లి, మామ్మ, చెల్లెలి యొక్క సహాయముతో వెళ్లి, మరణించిన వారి కొరకు బాప్తీస్మము తీసుకొంటిని.
ఈ అనుభవము నాకు యాజకత్వమును గూర్చియు దానిని నేను యోగ్యతతో ఏవిధముగా అభ్యసించవలెనో బాగా నేర్పించింది. “వెళ్లి చేసెదను” అను నీఫై మాదిరిని అనుసరించినచో యాజకత్వము కలిగిన వారందరు నాకు కలిగిన భావనలనే పొందుదురని నేనెరుగుదును(1 నీఫై 3:7 చూడుము). మనము పనిచేయకుండా కూర్చొని ప్రభువు తన మహత్తర కార్యములో మనలను ఉపయోగించవలెనని కోరుకొనలేము. మన యొక్క సహాయము అవసరమైన వారు మనలను వెదకుకొని వచ్చేవరకు మనము వేచియుండక, మాదిరి చూపుతూ దేవుని సాక్షులుగా నిలువబడుట యాజకత్వము కలిగినవారిగా మన బాద్యత. నిత్యజీవ పురోగతిని నిరోధించే నిర్ణయాలు మనము చేయుచున్నట్లయితే మనము ఇప్పుడే మారాలి. మనలను సాదారణమైన ఆనందాలను వెతుక్కునే ఐహిక స్థితిలో ఉంచుటకు సాతాను తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు. మనలను ఐహికస్థితిలో క్షణికానందములను వెదకునట్లు చేయుటకు సాతాను కష్టపడి ప్రయత్నిస్తుంది, కాని మనము ప్రయత్నించి, మనకు సహాయము చేయువారిని కనుగొనుచు, ప్రతిరోజూ పశ్చాత్తాపపడినప్పుడు, ఫలితంగా వచ్చు ఆశీర్వాదములు నమ్మశక్యము కానివని, మనము నిబంధన మార్గములో ముందుకు సాగిపోవుచుండగా మన జీవితాలు శాశ్వతంగా మారిపోవునని నేనెరుగుదును.
నేను ఇది అపొస్తలులకు మనలను మరిముఖ్యంగా ఈ సవాళ్లుగల దినాలలో నడిపించుటకు, ఆయన రాకడకు లోకాన్ని సిద్దపరచుటకు ఉపయోగించే యాజకత్వపు తాళంచెవులు అనుగ్రహించిన, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిజమైన సంఘమని యెరుగుదును.
జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్త అని, అధ్యక్షులు నెల్సన్ ఈ రోజు జీవించుచున్న మన ప్రవక్త అని నాకు తెలుసు. మన సృష్టికర్తను కలుసుకొనుటకు సిద్ధపడునట్లు ఈ గొప్ప యాజకత్వము కలవారి జీవితాలను పరిశీలించి మనలను మనం అనుదినం మెరుగుపరచుకోవాలని మనందరినీ ఆహ్వానిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.