సర్వసభ్య సమావేశము
మోర్మన్ గ్రంథము యొక్క ఆవిర్భావం
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


మోర్మన్ గ్రంథము యొక్క ఆవిర్భావం

చారిత్రాత్మిక వాస్తవాలు, మోర్మన్ గ్రంథము యొక్క ప్రత్యేక సాక్షులు దాని ఆగమనం నిజంగా అధ్భుతమని సాక్ష్యమిస్తారు.

ఒక సందర్భంలో సంఘపెద్దలను కలుస్తూ, ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్: “మోర్మన్ గ్రంథాన్ని, బయల్పాటులను తీసివేస్తే మన మతం ఎక్కడుంటుంది? ఎక్కడా ఉండదు”1 అని ప్రకటించారు. నా ప్రియమైన సహోదర సహోదరిలారా, మొదటి దర్శనం తర్వాత, ఈ యుగంలో యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపనను ఆవిష్కరించే ప్రధానమైన రెండవ మైలురాయి మోర్మన్ గ్రంథం యొక్క మహిమకరమైన ఆవిర్భావం. మోర్మన్ గ్రంథము తన బిడ్డలపై దేవునికి గల ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిస్వార్థమైన, దైవిక ప్రాయశ్చిత్త త్యాగము, ఆయన నీఫైయుల మధ్య తన పునరుత్థానం తర్వాత చేసిన గొప్ప పరిచర్యను గూర్చి సాక్ష్యమిస్తుంది.2 అంతేకాక ఇశ్రాయేలు వంశస్థులలో శేషభాగం అంతా కడవరి దిన కార్యం ద్వారా ఒక్కటై, వారు ఎన్నటికీ త్రోసివేయబడరని సాక్ష్యమిస్తుంది.3

మనం ఈ కడవరి దినాలలో ఆ పరిశుద్ధలేఖన ఆవిర్భావం గూర్చి పఠించినప్పుడు. ఆ ప్రయత్నమంతా — అనగా ప్రవక్తయైన జోసెఫ్ బంగారు పలకలను దేవదూత నుండి పొందినప్పటినుండి, “దేవుని శక్తి మరియు బహుమానంతో”4 వాటి అనువాదాన్ని, దేవుని హస్తంచే వాటి ముద్రణను ఒక మహిమార్థమైన కార్యంగా మనం గ్రహిస్తాము.

మోర్మన్ గ్రంథం ఆవిర్భావం దేవదూత మొరోనై నుండి జోసెఫ్ స్మిత్ బంగారు పలకలను పొందుటకు చాలాకాలం క్రితమే ప్రారంభమైంది. ప్రాచీన ప్రవక్తలు మనదినాలలో ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఆగమనం గురించి ప్రవచించారు.5 యెషయా ఒక గూఢమైన గ్రంథం, అది కనబడినప్పుడు దేవుని వాక్య విషయంలో ప్రజలు పడే ఘర్షణలను గూర్చి మాట్లాడెను. ఈ పరిస్థితి దేవుడు తన “ఆశ్చర్యకరమైన అధ్భుతకార్యాన్ని” అది “జ్ఞానుల జ్ఞానం నశించు[నట్లు], బుద్ధిమంతుల బుద్ధి మరుగై[నట్లు]“ చేయునప్పుడు సాత్వీకులకు “కలుగు సంతోషము అధిక మగును, మనుష్యులలోని బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు ఆనందించెదరు.” 6 యెహెజ్కేలు యూదావారి కఱ్ఱతునక (బైబిల్), ఎఫ్రాయీము కఱ్ఱతునక (మోర్మన్ గ్రంథము)లు యేకమగుటను గూర్చి మాట్లాడెను. (పాతనిబంధన)లోని యెహెజ్కేలు, (మోర్మన్ గ్రంథము)లోని లీహై, ఇరువురూ అవి అబద్ధ సిద్ధాంతాలను అంతముచేసి, శాంతిని స్థాపించుటకు, మనలను నిబంధనల జ్ఞానంలోనికి తెచ్చుటకు “కలిసి పెరుగునని” సూచించారు.7

సెప్టెంబరు 21, 1823 సాయంకాలంన, మొదటి దర్శనం జరిగిన మూడున్నర సంవత్సరాల తర్వాత, తన నిజాయితీగల ప్రార్థనల ఫలితంగా, ప్రాచీన అమెరికాలోని నీఫైయుల చివరి ప్రవక్తయైన మొరోనై దేవదూతచే జోసెఫ్ దర్శించబడ్డాడు. రాత్రంతా జరిగిన వారి దర్శింపులలో, మొరోనై జోసెఫ్ తో అతడు దేవునికి ఒక అధ్ఫుతకార్యాన్ని — అనగా అమెరికా ఖండంలోని ప్రేరేపించబడిన ప్రాచీనప్రవక్తల వాక్యాలను తర్జుమాచేసి, లోకానికి దానిని ప్రచురించుటను సాధించాలని చెప్పాడు.8 మరునాడు, జోసెఫ్ తన గృహానికి దగ్గరలోని, శతాబ్ధాలకు ముందు మొరోనై తన చివరిదినాలలో దాచిపెట్టిన పలకలు గల ఆస్థలానికి వెళ్లాడు. అక్కడ, జోసెఫ్, భవిష్యత్తులో ఆ పలకలను పొందుటకు తననుతాను సిద్ధపరచుకోవాలని ఆదేశించిన మొరోనైని మళ్లీ చూసాడు.

ఆ తర్వాత నాలుగు సంవత్సరాలలో, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22న, జోసెఫ్ మొరోనైనుండి కడవరి దినాలలో దేవుని రాజ్యంను నిర్వహించు జ్ఞానాన్ని గూర్చిన ఆధనపు ఆదేశాలను పొందాడు. జోసెఫ్ యొక్క సిద్ధపాటు దేవదూతల దర్శనాలను కలిగియుంది, ఆవిధంగా ఈయుగంలో జరగబోయే సంఘటనల ఘనతకు, మహిమకు తెరతీసాయి. 9

ఎమ్మా హేల్ తో 1827లో జరిగిన ఆయన వివాహం ఆ సిద్ధపాటులో భాగం. ప్రవక్త జీవితంలో, పరిచర్యలో ఆమె ఆయనకు సహాయపడుటలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది. ఇంకా, సెప్టెంబర్ 1827లో, జోసెఫ్ తో పాటు కొండవరకు వెళ్లి, మొరోనై దూత జోసెఫ్ కు పలకలను ఇచ్చినప్పుడు ఆయన గురించి వేచివుంది. జోసెఫ్ ఆ పలకలను సురక్షితంగా ఉంచుటకు శాయశక్తులా ప్రయత్నించినప్పుడు అవి మొరోనై చేతికి తిరిగి ఇచ్చేవరకు సంరక్షించడతాయని వాగ్ధానాన్ని పొందింది.10

సువార్తలో నా ప్రియమైన సహచరులారా, ఈనాడు ప్రాచీనకాలంనాటి ఆవిష్కరణలలో అనేకం పురావస్తు తవ్వకాలలో లేదా నిర్మాణ ప్రాజెక్టులలో అనుకోకుండా జరిగినవి. అయితే, జోసెఫ్ స్మిత్ పలకల వద్దకు దేవదూత చేత నడిపించబడ్డాడు. దాని నుండి వచ్చిన ఫలితమే ఒక అద్భుతకార్యం.

మోర్మన్ గ్రంథము అనువాద ప్రక్రియ కూడా ఒక అద్భుతకార్యమే. ఈ పరిశుద్ధ ప్రాచీన వృత్తాంతము పండితులు ప్రాచీన వ్రాతలను ఆ ప్రాచీన భాషను నేర్చుకొని తర్జుమా చేసే సాంప్రదాయపద్ధతిలో “అనువదించబడ” లేదు. మనం ఈ విధానాన్ని ప్రభువుచే అందించబడిన భౌతికమైన పనిముట్ల సాయంతో చేయబడిన ఒక “బయల్పాటు”గా చూడాలే తప్ప భాషాప్రావీణ్యుడిచే చేయబడిన “అనువాదం”గా కాదు. జోసెఫ్ స్మిత్, దేవుని శక్తి ద్వారా “నేను మోర్మన్ గ్రంథాన్ని ఈ లోకం కోల్పోయిన జ్ఞానమైన [హైరోగ్లిఫ్స్] చిత్రలిపి నుండి అనువదించాను, ఈ అద్భుతమైన సంఘటనలో నేను ఒంటరిగా నిలబడ్డాను, ఒక నేర్చుకోని యువకుడు, ప్రాపంచిక జ్ఞానాన్ని, పద్దెనిమిది శతాబ్దాలుగా గుణించబడిన అజ్ఞానాన్ని కొత్త బయల్పాటుతో ఎదుర్కొన్నాడు”11 అని ప్రకటించారు. జోసెఫ్ స్మిత్ దానిని అనువదించుటకు అధ్బుతకరంగా తీసుకున్న తక్కువ సమయాన్ని పరిగణించినప్పుడు పలకల అనువాదంలో ప్రభువు సహాయం మనకు స్పష్టమౌతుంది.12

జోసెఫ్ యొక్క లేఖికులు మోర్మన్ గ్రంథము అనువాదిస్తున్నప్పుడు వ్యక్తపరచబడిన దేవుని శక్తి గురించి సాక్ష్యమిచ్చారు. ఆలీవర్ కౌడరీ ఒకసారి చెప్పారు: “హృదయాంతరాలలోని కృతజ్ఞతను మేల్కొలిపే, పరలోక ప్రేరేపణచే నిర్ధేశిస్తున్న స్వరం యొక్క శభ్ధంలో కూర్చొన్న ఈ రోజులు ఎప్పటికీ మరువలేనివి! రోజు తర్వాత రోజు, ఆయన ‘మోర్మన్ గ్రంథాన్ని’ అనువదిస్తున్నప్పుడు నిరంతరాయంగా, ఆయన నోటినుండి వెలువడే వాటిని నేను వ్రాయుట కొనసాగించాను.”13

చారిత్రాత్మక వనరులు 1827లో జోసెఫ్ స్మిత్ పలకలను పొందిన క్షణంనుండి, వాటిని దొంగిలించుటకు ప్రయత్నాలు చేయబడ్డాయని బయల్పరుస్తాయి. “[ఆపలకల]ను [ఆయన] వద్దనుండి పొందుటకు మిక్కిలి కఠినమైన విధానాలు ఉపయోగించబడ్డాయని”, “రూపొందించగల ప్రతీ తంత్రం ఆ ఉద్ధేశ్యం కొరకు ఆశ్రయించబడిందని” 14 ఆయన సూచించారు. అనువాదకార్యాన్ని ఆరంభించు ప్రక్రియలో, జోసెఫ్ మరియు ఎమ్మాలు పలకలను దొంగిలించాలనుకునే వ్యక్తులు, ముఠాలనుండి సురక్షితమైన ప్రదేశం కనుగొనుటకు చివరికి మాంచెస్టర్, న్యూయార్క్ నుండి హార్మొనీ, పెన్సిల్వేనియాకు వెళ్లుటకు బలవంతం చేయబడ్డారు.15 ఒక చరిత్రకారుడు సూచించినట్లుగా: “ఆవిధంగా పలకలపై జోసెఫ్ కు గల సంరక్షణ యొక్క మొదటి క్లిష్టదశ ముగిసింది. … పలకలు సురక్షితంగా ఉన్నప్పటికీ, వాటిని సంరక్షించుటకు పడిన అతని కష్టాలలో, జోసెఫ్ ఎలాంటి సందేహం లేకుండా దేవుడు మరియు మానవుల మార్గాలను గూర్చి అధికంగా నేర్చుకొన్నాడు, అది అతనికి రాబోయే కాలంలో బాగా సాయపడింది.”16

మోర్మన్ గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు, జోసెఫ్ ప్రభువు ఆ పలకలను చూచుటకు సాక్షులను ఎంచుకొనునని నేర్చుకున్నాడు.17 “ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ద్వారా ప్రతీవాక్యము స్థిరపరచబడునని”18 ఆయన చెప్పినప్పుడు ప్రభువు తనకుతానే స్థిరపరచిన దానిలో ఇది ఒక భాగం. జోసెఫ్ యొక్క మొట్టమొదటి సహచరులలో కొందరైన ఆలీవర్ కౌడ్రీ, డేవిడ్ విట్మర్, మార్టిన్ హారిస్ లు ఈయుగంలో దేవుని అధ్భుతమైన కార్యాన్ని స్థిరపరచుటకు, మోర్మన్ గ్రంథం యొక్క ప్రత్యేకసాక్ష్యంను పంచుకొనుటకు పిలువబడిన మొదటి సాక్షులు. వారు ప్రభువు సమక్షం నుండి వచ్చిన ఒక దూత, ఆ ప్రాచీన వృత్తాంతాన్ని వారికి చూపెనని, పలకలపై చెక్కబడిన అక్షరాలను వారు చూసారని సాక్ష్యమిచ్చారు. వారు పరలోకం నుండి ఆ వృత్తాంతము దేవుని వరం, శక్తిచేత అనువదించబడెనని ప్రకటించిన దేవుని స్వరాన్నివిన్నారని కూడా వారు సాక్ష్యమిచ్చారు. అప్పుడు వారు లోకమంతటికీ దాని గురించి సాక్ష్యమివ్వాలని ఆజ్ఞాపించబడ్డారు.19

ప్రభువు అద్భుతంగా ఇంకొక ఎనిమిది మంది సాక్ష్యులను బంగారు పలకలను వారికైవారు చూచి, మోర్మన్ గ్రంథము యొక్క దైవత్వానికి, సత్యానికి ప్రత్యేకసాక్షులుగా ఉండుటకు పిలిచారు. వారుకూడా పలకలను వాటిపై గల చెక్కబడిన వ్రాతలను చూచి, జాగ్రత్తగా పరీక్షించారని సాక్ష్యమిచ్చారు. శోధనలు, వేధనలు, వివిధ రకాల కష్టాల మధ్య, కొంతమంది వారి విశ్వాసాలలో తర్వాత బలహీనమైనప్పటికీ కూడా, ఈ ఎంచుకోబడిన పదకొండుమంది మోర్మన్ గ్రంథము యొక్క సాక్షులు వారు పలకలను చూసామనే వారి సాక్ష్యాలను నిరాకరించలేదు. ఇక జోసెఫ్ స్మిత్ ఒక్కడే మొరోనై దర్శనాన్ని, బంగారు పలకల యొక్క జ్ఞానాన్నికలిగిలేడు.

సాక్షులకు పలకలు చూపించబడిన తర్వాత తన కుమారుడు మహానందంతో ఇంటికి వచ్చాడని లూసీ మేక్ స్మిత్ నమోదుచేసారు. జోసెఫ్ తన తల్లిదండ్రులకు “నేను భరించలేనంత బరువును మోయుటనుండి విడిపించబడినట్లుగా నేను భావిస్తున్నానని, ఇకమీదట లోకంలో నేనొక్కడినే ఒంటరిగా ఉండక్కరలేదని”20 వివరించారు.

మోర్మన్ గ్రంథం అనువాదం ముగిసిన పిదప దానిని ప్రచురించుటకు జోసెఫ్ స్మిత్ మిక్కిలి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అతను పాల్మైరా, న్యూయార్క్ లోని ఎగ్భర్ట్ బి. గ్రాడిన్ అనే ప్రచురణకర్తను, మార్టిన్ హారిస్ తన గొప్ప విశ్వాసం మరియు త్యాగంతో తన పొలాన్ని ప్రచురణా ఖర్చులకు బరోసాగా ఇచ్చిన తర్వాత దానిని ప్రచురించుటకు ఒప్పించగలిగాడు. మోర్మన్ గ్రంథం ప్రచురణ తరువాత నిరంతర వ్యతిరేకత కారణంగా, మార్టిన్ హారిస్ తన పొలంలో 151 ఎకరాలను (0.6 కి.మీ. 2) విశ్వాసంతో విక్రయించి ప్రచురణ ఖర్చులను తీర్చాడు. జోసెఫ్ స్మిత్ కు ఇవ్వబడిన ఒక బయల్పాటు ద్వారా, ప్రభువు మార్టిన్ హారిస్ ను తన ఆస్థిని ఆశింపక, “సత్యాన్ని, దేవుని వాక్యాన్ని”21 కలిగియున్న గ్రంథం కోసం దాని ప్రచురణా ఖర్చులను కట్టాలని ఆదేశించారు. 1830 మార్చిలో, మోర్మన్ గ్రంథము యొక్క మొదటి 5000 ప్రతులు ప్రచురించబడ్డాయి, ఈరోజు, 180 కోట్లకు మించిన ప్రతులు నూటికన్నా ఎక్కువ భాషలలో ప్రచురించబడుతున్నాయి.

చారిత్రాత్మిక వాస్తవాలు, మోర్మన్ గ్రంథము యొక్క ప్రత్యేక సాక్షులు దాని ఆగమనం నిజంగా అధ్భుతమని సాక్ష్యమిస్తారు. అంతేకాకుండా, ఈ గ్రంథం యొక్క శక్తి దాని యొక్క అమోఘమైన చరిత్రపైనే కాక, దాని శక్తిగల, నా జీవితంతో పాటు — లెక్కకు అందని అనేకమంది జీవితాలను మార్చిన అసమానమైన సందేశంపై ఆధారపడియుంది.

నేను యవ్వనస్తుడైన సెమినరీ విద్యార్థిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మోర్మన్ గ్రంథాన్ని పూర్తిగా చదివాను. నా బోధకునిచే సిఫార్సుచేయబడినట్లుగా, నేను దానిని పీఠిక పేజీలనుండి చదవడం మొదలుపెట్టాను. ఆ గ్రంథము ఆరంభపేజీలలో ఉన్న వాగ్ధానం ఇంకా నా చెవులలో మారుమ్రోగుతోంది: “[మీ] హృదయాలలో ధ్యానించి, అప్పుడు … దేవునిని [విశ్వాసంతో], క్రీస్తు నామంలో ఆ గ్రంథము సత్యమా అని అడిగాలి. ఎవరైతే ఈ విధానాన్ని అనుసరిస్తారో … వారు దాని సత్యం, దైవత్వం గురించి పరిశుద్ధాత్మ శక్తిచే సాక్ష్యాన్ని పొందుతారు.”22

ఆ వాగ్ధానాన్ని మనస్సులో ఉంచుకొని, దాని సత్యం గురించి ఇంకా తెలుసుకోవాలని, ప్రార్థనాపూర్వకంగా, కొంచెం కొంచెం, వారానికి ఇవ్వబడిన సెమినరీ పాఠాలను పూర్తి చేసినప్పుడు మోర్మన్ గ్రంథాన్ని చదివాను. ఆల్మా తన ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు తాను వివరించిన విధంగా, ఒక వెచ్చని భావం నా ఆత్మలో పెరిగి, నా హృదయాన్ని నింపుటను, మా జ్ఞానాన్ని మరింత వృద్ధి చేసి, ఇంకా ఉల్లాసకరంగా అగుట అది నిన్ననే జరిగినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది.23 ఆ భావం క్రమంగా నా జ్ఞానంగా మారి, నా హృదయంలో నాటుకొని, ఆ పరిశుద్ధగ్రంథంలో కనుగొనబడే ప్రాముఖ్యమైన సంఘటనలు, బోధనల యొక్క నా సాక్షానికి పునాదిగా మారింది.

వెలకట్టలేని వ్యక్తిగత అనుభవాల ద్వారా, యేసు క్రీస్తుపై నా విశ్వాసాన్ని, ఆయన సువార్త సిద్ధాంతం యొక్క నా సాక్షాన్ని ఆమోదించే ప్రధానరాయిగా మోర్మన్ గ్రంథం మారిపోయింది. అది క్రీస్తు యొక్క దైవ ప్రాయశ్చిత్త త్యాగాన్ని నాకు సాక్ష్యమిచ్చే స్థంభాలలో ఒకటిగా మారిపోయింది. నా విశ్వాసాన్ని బలహీనపరిచేందుకు మరియు నా మనస్సులో అవిశ్వాసాన్ని కలిగించడానికి విరోధి చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇది నా జీవితమంతా ఒక కవచంగా మారింది మరియు రక్షకుడి గురించి నా సాక్ష్యాన్ని ప్రపంచానికి ధైర్యంగా ప్రకటించడానికి నాకు ధైర్యం ఇస్తుంది.

నా ప్రియమైన స్నేహితులారా, మోర్మన్ గ్రంథముపై నాసాక్ష్యం కొంచెం కొంచెం24 నా హృదయానికి ఒక అద్భుతకార్యం వలే వచ్చింది. ఈనాటికీ, ఈ గొప్ప లేఖనగ్రంథం కలిగియున్న దేవుని వాక్యాన్ని మరింతగా అర్థంచేసుకోవడానికి, నిజాయితీగల హృదయంతో నేను వెదకుచున్నప్పుడు ఆ సాక్ష్యం ఇంకా పెరుగుతూనే ఉంది.

ఈరోజు నా స్వరాన్ని వినుచున్నవారందరినీ, నేను మీ జీవితాలలో మోర్మన్ గ్రంథం యొక్క అధ్బుతకరమైన ఆవిర్భావంలో భాగస్తులు కమ్మని ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రార్థనాపూర్వకంగా, క్రమతప్పకుండా దాని వాక్యాలను పఠించినప్పుడు, మీ జీవితాలలో దాని వాగ్ధానాలను, గొప్ప దీవెనలను అనుభవిస్తారని నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పేజీలగుండా మారుమ్రోగే వాగ్ధానాన్ని నేను ఇంకొకసారి ధృవీకరిస్తున్నాను: అదేమిటంటే మీరు “ఇవి సత్యమా కాదాయని మీరు నిత్యుడగు తండ్రియైన దేవునిని క్రీస్తు యొక్క నామమందు అడుగవలెను; మీరు యధార్థమైన హృదయముతో, క్రీస్తు నందు విశ్వాసము కలిగియుండి, నిజమైన ఉద్దేశముతో అడిగిన యెడల,” ఆయన కరుణతో “దాని సత్యమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు తెలియజేయును.” 25 ఆయన మీకు జవాబును చాలా వ్యక్తిగతమైన మార్గంలో, నాకును లోకంలో అనేకులకు ఆయన చేసినట్లుగా ఇస్తారని నేను మీకు అభయమిస్తున్నాను. జోసెఫ్ స్మిత్ కు, మొదటి సాక్షులకు, ఈ పరిశుద్ధగ్రంథము యొక్క సమగ్రతను, విశ్వసనీయతను పొందుటకు వెదకిన వారందరికీ జరిగిన అనుభవాలు ఎంత మహిమకరంగా, పరిశుద్ధంగా ఉన్నవో అదే విధంగా మీ అనుభవాలు ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను.

మోర్మన్ గ్రంథం నిజంగా దేవుని వాక్యమని నా సాక్షాన్ని పంచుకుంటున్నాను. ఈ పరిశుద్ధవృత్తాంతం “సువార్త సిద్ధాంతాలను సరళం చేస్తూ, రక్షణప్రణాళికను వివరిస్తూ, నరులందరికీ ఈ జీవితంలో శాంతిని, రాబోయే జీవితంలో నిత్యరక్షణను పొందుటకు ఏమి చేయవలెనో బోధిస్తుంది.”26 అది మన దినాలలో ఇశ్రాయేలును సమకూర్చుటకు, తన కుమారుడైన యేసు క్రీస్తును జనులు తెలుసుకొనుటకు సహాయపడుటకు దేవుని సాధనమైయున్నది. దేవుడు సజీవుడని, మనలను ప్రేమిస్తున్నారని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు లోకరక్షకుడని, మన విశ్వాసానికి ప్రధాన మూలరాయని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ మన విమోచకుడు, మన బోధకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధనామంలో చెప్పుచున్నాను, ఆమెన్.

ముద్రించు