విశ్వాసముతో ముందుకు సాగండి
నేను మిమ్ములను శాంతితో మరియు ప్రభువుపై ఎక్కువ విశ్వాసంతో దీవిస్తున్నాను.
నా ప్రియ సహోదర సహోదరీలారా, ఈ చారిత్రాత్మక సమావేశం ముగియుచుండగా, మేము ప్రభువుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సంగీతం అద్భుతముగా, సందేశాలు ఉత్తేజకరమైనవిగా ఉన్నాయి.
ఈ సమావేశంలో, మనము చాలా గొప్ప సంగతులను అనుభవించాము. ఈ ద్విశతాబ్ది వార్షికోత్సవం సందర్భంగా, యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన యొక్క వాస్తవికతను దాని సంపూర్ణతతో ప్రకటిస్తూ ప్రపంచానికి ఒక ప్రకటనను మనం జారీచేసాము.
మనము హోసన్నా కేకతో పునఃస్థాపనను జ్ఞాపకం చేసుకున్నాము.
ప్రభువైన యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని మరియు అధికారిక సంఘ సమాచారం మరియు సామగ్రిని దృశ్యమానంగా గుర్తించే క్రొత్త చిహ్నాన్ని మేము ఆవిష్కరించాము.
ప్రస్తుత మహమ్మారి నియంత్రించబడాలని, సంరక్షకులు రక్షించబడాలని, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయబడాలని మరియు జీవితం సాధారణ స్థితికి రావాలని మేము ప్రపంచవ్యాప్త ఉపవాసం మరియు ప్రార్థన దినోత్సవానికి పిలుపునిచ్చాము. ఈ ఉపవాసం ఏప్రిల్ 10, గుడ్ ఫ్రైడే రోజున జరుగుతుంది. అది ఎంత గొప్ప శుక్రవారం అవుతుంది!
తరువాతి ఆదివారం ఈస్టర్ ఆదివారం, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం మరియు పునరుత్థానాన్ని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన ప్రాయశ్చిత్తం కారణంగా, ఆయన పునరుత్థాన వరము ఇప్పటివరకు జీవించిన వారందరికీ ఇవ్వబడుతుంది. ఆయన పవిత్ర దేవాలయాలలో చేసిన విధులు మరియు నిబంధనలకు విశ్వసనీయత ద్వారా అర్హత సాధించిన వారందరికీ ఆయన నిత్యజీవ వరము ఇవ్వబడుతుంది.
ఈ ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశంలోని అనేక ఉత్తేజకరమైన భాగాలు—మరియు ఇప్పుడు మనం ప్రారంభించే పవిత్ర వారం—దైవికంగా నిర్ణయించిన రెండు పదాల ద్వారా సంగ్రహించబడవచ్చు: “ఈయనను వినుడి.”1 ఆ మాటలు మాట్లాడిన పరలోకపు తండ్రిపైన మరియు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుపైన మీ దృష్టి స్పష్టమైన మీ జ్ఞాపకాలన్నింటిలో ముఖ్యమైనదిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. రక్షకుని మాటలను వినడానికి, ఆలకించడానికి మరియు శ్రద్ధవహించడానికి మీరు యధార్థముగా క్రొత్తగా ప్రారంభిస్తారని మేము ప్రార్థిస్తున్నాము.2 తగ్గిన భయం మరియు పెరిగిన విశ్వాసం అనుసరిస్తాయని నేను వాగ్దానం చేస్తున్నాను.
ప్రభువు ఆత్మ నివసించేలా మీ ఇళ్ళను విశ్వాసం యొక్క నిజమైన ఆశ్రయదుర్గములుగా మార్చాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మన సువార్త అధ్యయన పాఠ్యాంశం, రండి, నన్ను అనుసరించండి, మీ జీవితాలను ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీ స్థిరమైన ప్రయత్నాలు—మీరు ప్రత్యేకంగా విజయవంతం కాలేదని మీకు అనిపించిన సందర్భాలలో కూడా—మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని మరియు ప్రపంచాన్ని మారుస్తాయి. మనం ఎక్కడ ఉన్నా ప్రభువు యొక్క మరింత ధైర్యవంతులైన శిష్యులుగా మారి, ఆయన కొరకు నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనం బలపడతాము.
ఇప్పుడు, దేవాలయాల గురించి మాట్లాడుదాం. మనకు ప్రపంచవ్యాప్తంగా 168 సమర్పించబడిన దేవాలయాలు ఉన్నాయి. మిగతావి ప్రణాళిక మరియు నిర్మాణం యొక్క వివిధ దశలలో ఉన్నాయి. ఒక క్రొత్త దేవాలయమును నిర్మించుటకు మన ప్రణాళికలను ప్రకటించినప్పుడు, అది మన పవిత్రమైన చరిత్రలో భాగమౌతుంది.
మన దేవాలయాలన్నీ కొంతకాలం మూసివేయబడినప్పుడు క్రొత్త దేవాలయాలను ప్రకటించడం విచిత్రంగా అనిపించవచ్చు.
ఒక శతాబ్దం క్రితం, 1893 లో ఇచ్చిన సాల్ట్ లేక్ దేవాలయం యొక్క సమర్పణ ప్రార్థనలో నమోదు చేయబడినట్లుగా, అధ్యక్షుడు విల్ఫర్డ్ ఉడ్రఫ్ నేడు మనకున్నటువంటి పరిస్థితులను ముందుగానే చూశారు. మీలో కొందరు ఇటీవల సోషల్ మీడియాలో ఈ గొప్ప ప్రార్థన యొక్క సారాంశాలను చూసియుండవచ్చు.
దేవుని యొక్క గొప్ప ప్రవక్త నుండి ఈ అభ్యర్థనలను వినండి: “నీ ప్రజలకు ఈ పవిత్ర గృహంలోకి ప్రవేశించే అవకాశం లేనప్పుడు… మరియు వారు అణచివేయబడినప్పుడు మరియు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులతో చుట్టుముట్టబడినప్పుడు… మరియు వారి ముఖాలను ఈ పవిత్ర మందిరము వైపు తిప్పి, విడుదల కోసం, సహాయం కోసం, వారి తరపున నీ శక్తిని విస్తరించమని నిన్ను అడిగినప్పుడు, నీ పవిత్ర నివాసం నుండి దయతో క్రిందికి చూడమని … మరియు వారి ఏడుపులను వినమని మేము నిన్ను వేడుకుంటున్నాము. లేదా నీ ప్రజల పిల్లలు, రాబోయే సంవత్సరాల్లో ఏ కారణం చేతనైనా ఈ ప్రదేశం నుండి వేరుచేయబడినప్పుడు… వారికి ఉపశమనం మరియు విడుదలను విస్తరించడానికి వారు తమ బాధలు మరియు దుఃఖాల లోతుల నుండి నీకు మొరపెట్టినప్పుడు, వారి మొరను ఆలకించమని మరియు వారు అడిగే ఆశీర్వాదాలను వారికి అనుగ్రహించమని మేము వినయముగా మిమ్మల్ని వేడుకొంటున్నాము.” 3
సహోదరీ సహోదరులారా, మన కష్ట సమయాల్లో దేవాలయాలు మూసివేయబడి ఉన్నప్పుడు, మీరు మీ నిబంధనలను గౌరవించేటప్పుడు మీరింకను మీ దేవాలయ నిబంధన మరియు వరము యొక్క శక్తిని పొందగలరు. దేవాలయాలు మూసివేయబడిన ఈ సమయాన్ని దయచేసి దేవాలయ యోగ్యమైన జీవితాన్ని కొనసాగించడానికి లేదా దేవాలయ యోగ్యులుగా మారడానికి ఉపయోగించండి.
మీ కుటుంబం మరియు స్నేహితులతో దేవాలయం గురించి మాట్లాడండి. దేవాలయంలో మనం చేసే ప్రతి పనికి యేసు క్రీస్తు కేంద్రంగా ఉన్నందున, మీరు దేవాలయం గురించి ఎక్కువగా ఆలోచించేటప్పుడు మీరు ఆయన గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీకు వరముగా ఇవ్వబడిన శక్తి మరియు జ్ఞానం గురించి లేదా—మీరు ఇంకా పొందవలసియున్న వరము గురించి మరింత తెలుసుకోవడానికి అధ్యయనం చేయండి మరియు ప్రార్థించండి.
ఈ రోజు మేము ఈ క్రింది ప్రదేశాలలో ఎనిమిది క్రొత్త దేవాలయాల నిర్మాణ ప్రణాళికలను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాము: బహయా బ్లాంకా, అర్జెంటీనా; తల్లాహస్సీ, ఫ్లోరిడా; లుబుంబాషి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో; పిట్స్ బర్గ్, పెన్సిల్వేనియా; బెనిన్ సిటీ, నైజీరియా; సిరక్యూస్, యూటా; దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్; మరియు షాంఘై, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.
మొత్తం ఎనిమిది ప్రదేశాలలో, సంఘము యొక్క వాస్తుశిల్పులు స్థానిక అధికారులతో కలిసి పని చేస్తారు, తద్వారా దేవాలయం సామరస్యంగా ఉంటుంది మరియు ప్రతి సమాజానికి ఒక అదనపు ఆకర్షణగా ఉంటుంది.
దుబాయ్‌లోని దేవాలయ ప్రణాళిక వారి దయగల ఆహ్వానానికి ప్రతిస్పందనగా వచ్చింది, దీనిని మేము కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము.
షాంఘై యొక్క ప్రణాళిక కోసం సందర్భం చాలా ముఖ్యం. రెండు దశాబ్దాలకు పైగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని దేవాలయ యోగ్యులైన సభ్యులు హాంకాంగ్ చైనా దేవాలయానికి హాజరయ్యారు. కానీ జూలై 2019 లో, ఆ దేవాలయం దీర్ఘకాలంగా ప్రణాళిక చేయబడిన మరియు చాలా అవసరమైన పునర్నిర్మాణం కోసం మూసివేయబడింది.
షాంఘైలో ఒక నిరాడంబరమైన బహుళార్ధసాధక సమావేశ స్థలం—పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో—వారికి మరియు వారి పూర్వీకుల కొరకు దేవాలయ విధుల్లో పాల్గొనడాన్ని కొనసాగించేందుకు చైనా సభ్యులకు వీలుకల్పిస్తుంది. 4
ప్రతి దేశంలో, ఈ సంఘము తన సభ్యులకు చట్టాన్ని గౌరవించాలని, పాటించాలని మరియు కాపాడాలని బోధిస్తుంది.5 మేము కుటుంబం, మంచి తల్లిదండ్రులుగా మరియు ఆదర్శవంతమైన పౌరులుగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాము. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క చట్టాలు మరియు నిబంధనలను మేము గౌరవిస్తున్నందున, సంఘము సువార్త బోధించు సువార్త పరిచారకులను ఆక్కడికి పంపుట లేదు; మరియు మేము ఇప్పుడు అలా చేయము.
ప్రవాసులు మరియు చైనా సమూహాలు విడివిడిగా సమావేశమవుతాయి. అక్కడ సంఘము యొక్క చట్టపరమైన స్థితి మారదు. సదుపాయాల ఉపయోగం యొక్క ప్రారంభ దశలో, ప్రవేశం నియామకం ద్వారా మాత్రమే ఉంటుంది. షాంఘైలోని ప్రభువు గృహము ఇతర దేశాల పర్యాటకులకు గమ్యస్థానంగా ఉండదు.
ఈ ఎనిమిది క్రొత్త దేవాలయాలు మరణం యొక్క తెరకు రెండు వైపులా చాలా మంది ప్రజల జీవితాలను ఆశీర్వదిస్తాయి. దేవాలయాలు, యేసు క్రీస్తు సువార్త సంపూర్ణత యొక్క పునఃస్థాపనలో ఒక ముఖ్యమైన భాగం. దేవుని మంచితనం మరియు ఔదార్యం కొద్ది, ప్రతిచోటా ఆయన దేవాలయ ఆశీర్వాదాలను తన పిల్లలకు దగ్గరగా తీసుకువస్తున్నారు.
పునఃస్థాపన కొనసాగుతున్నప్పుడు, దేవుడు భూమిపై తన రాజ్యానికి సంబంధించిన అనేక గొప్ప మరియు ముఖ్యమైన విషయాలను బయల్పరచడం కొనసాగిస్తూనే ఉంటారని నాకు తెలుసు.6 ఆ రాజ్యమే యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము.
ప్రియమైన సహోదర సహోదరీలారా, నేను మీ పట్ల నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఉద్రిక్తత మరియు అనిశ్చితి ఉన్న ఈ సమయంలో, నాలో ఉన్న అధికారాన్ని ఆహ్వానిస్తూ, మీకు అపొస్తలుని దీవెన ఇవ్వాలనుకుంటున్నాను.
నేను మిమ్ములను శాంతితో మరియు ప్రభువుపై ఎక్కువ విశ్వాసంతో దీవిస్తున్నాను.7
ప్రతి రోజు పశ్చాత్తాపం చెందాలని మరియు కొంచెం ఎక్కువగా ఆయనలా కావాలనే కోరికతో నేను మిమ్ములను దీవిస్తున్నాను.8
ప్రవక్త జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తు సువార్తను దాని సంపూర్ణతలో పునఃస్థాపించిన ప్రవక్త అని తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని దీవిస్తున్నాను.
మీలో లేదా మీ ప్రియమైనవారిలో అనారోగ్యం ఉంటే, నేను ప్రభువు చిత్తానికి అనుగుణంగా స్వస్థత యొక్క దీవెన ఇస్తున్నాను.
యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, మీలో ప్రతి ఒక్కరికీ నా ప్రేమ వ్యక్తీకరణను మరోసారి జోడించి, నేను మిమ్ములను దీవిస్తున్నాను, ఆమేన్.