సర్వసభ్య సమావేశము
”ఈ మందిరము నా నామమున నిర్మించబడవలెను”
ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశము


”ఈ మందిరము నా నామమున నిర్మించబడవలెను”

(సిద్ధాంతము మరియు నిబంధనలు 124:40)

దేవాలయాల్లో పొందిన నిబంధనలు మరియు నిర్వహించబడిన విధులు మన హృదయాలను పరిశుద్ధపరచడానికి మరియు దేవుని కుమారులు, కుమార్తెల అంతిమ ఉన్నతస్థితి కొరకు ఆవశ్యకమైనవి.

200 ఏళ్ళ క్రితం పరిశుద్ధ వనంలో, యౌవనుడైన జోసెఫ్ స్మిత్ నిత్య తండ్రియైన దేవుడిని, ఆయన కుమారుడైన యేసు క్రీస్తును చూచి, వారితో మాట్లాడాడు. వారి నుండి జోసెఫ్, దైవ సమూహము యొక్క నిజమైన స్వభావం గురించి మరియు కడవరి దిన “కాలముల యొక్క సంపూర్ణ యుగము“లో ఈ దివ్యమైన దర్శనము సంభవించగా కొనసాగిన బయల్పాటు గురించి నేర్చుకున్నాడు. 1

సుమారు మూడు సంవత్సరాల తర్వాత, సెప్టెంబరు 21, 1823 సాయంత్రం మనఃపూర్వక ప్రార్థనకు జవాబుగా జోసెఫ్ పడకగది “మిట్టమధ్యాహ్నము కంటే కాంతివంతమగువరకు“ వెలుగుతో నింపబడింది. 2 అతని మంచము ప్రక్కన ఒక వ్యక్తి ప్రత్యక్షమై, ఆ పిల్లవాడిని పేరుతో పిలిచి, “అతడు దేవుని సన్నిధి నుండి పంపబడిన ఒక దూత అని … అతని పేరు మొరోనై అని“ ప్రకటించాడు. 3 రాబోతున్న మోర్మన్ గ్రంథము గరించి అతడు జోసెఫ్ కు ఉపదేశించాడు.

అప్పుడు మొరోనై, కింగ్ జేమ్స్ అనువాదంలో ఉపయోగించిన భాషలో కొంత మార్పుతో పాత నిబంధనలోని మలాకీ గ్రంథం నుండి వ్యాఖ్యానించాడు:

“ప్రభువు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలీయా చేతిద్వారా యాజకత్వమును నేను మీకు తెలియజేయుదును. …

“పితరులకు చేయబడిన వాగ్దానములను పిల్లల హృదయాలలో అతడు నాటును, అప్పుడు పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరుగును. అట్లు కానియెడల, ఆయన రాకడ సమయమున భూమి యంతయు పూర్తిగా నాశనము చేయబడును.” 4

ముఖ్యంగా ఏలీయా పని గురించి జోసెఫ్ స్మిత్ కు మొరోనై చేసిన ఉపదేశము, కడవరి దినాలలో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమును ఆరంభించింది మరియు “దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన విషయములన్నిటిని“ పునఃస్థాపించడంలో కీలక అంశమైంది. 5

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ దేవాలయాల్లో మనకు లభ్యమగు నిబంధనలు, విధులు మరియు దీవెనల గురించి మనమంతా కలిసి నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మ సహాయము కొరకు నేను ప్రార్థిస్తున్నాను.

ఏలీయా పునరాగమనము

ఒక ముఖ్య ప్రశ్న అడగడంతో నేను ప్రారంభిస్తాను: ఏలీయా పునరాగమనము ఎందుకు ముఖ్యమైనది?

“మెల్కీసెదకు యాజకత్వము యొక్క బంధించు శక్తిని ఏలీయా కలిగియున్నాడని కడవరి-దిన బయల్పాటు నుండి మనము నేర్చుకుంటాము”6 మరియు “అతడు యేసు క్రీస్తు రావడానికి ముందు ఆవిధంగా చేయగల చివరి ప్రవక్త.“7

ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా వివరించారు: ”ఏలీయా యొక్క ఆత్మ, శక్తి, పిలుపు ఏవనగా, … మెల్కీసెదకు యాజకత్వము యొక్క సంపూర్ణ … తాళపు చెవులను కలిగియుండుటకు; మరియు దేవుని రాజ్యమునకు సంబంధించిన విధులన్నిటిని … పొందుటకు … పరలోకమందున్న వారితో సహా తండ్రుల హృదయాలను పిల్లల తట్టు పిల్లల హృదయాలను తండ్రుల తట్టు తిప్పుటకు మీరు శక్తి కలిగియున్నారు.”8

“భూలోకమందు మీరు దేనిని బంధించుదురో అది పరలోకములో బంధింపబడుటకు, భూలోకమందు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడుటకు“ 9 ఈ పరిశుద్ధ బంధనాధికారము అవసరము.

జోసెఫ్ స్మిత్ ఇంకను స్పష్టపరిచారు: “ఈ తరమును కాపాడేందుకు దేవుడు ఎలా వస్తారు? ఆయన ప్రవక్తయైన ఏలీయాను పంపుతారు. … ఏలీయా తండ్రుల హృదయాలను పిల్లలతో పిల్లల హృదయాలను తండ్రులతో బంధించడానికి నిబంధనలను బయల్పరుస్తాడు.” 10

రూపాంతరపు కొండ మీద మోషేతో పాటు ఏలీయా ప్రత్యక్షమై ఈ అధికారాన్ని పేతురు, యాకోబు, యోహానులపై అనుగ్రహించాడు. 11 1836, ఏప్రిల్ 3 న కర్ట్లాండ్ దేవాలయంలో మోషే మరియు ఏలీయాలతో పాటు ఏలీయా కూడా ప్రత్యక్షమై అవే యాజకత్వపు తాళపుచెవులను జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలపై అనుగ్రహించాడు. 12

రక్షకుని రెండవ రాకడ కొరకు లోకాన్ని సిద్ధం చేయడానికి 1836లో ఏలీయా చేత బంధనాధికారము యొక్క పునఃస్థాపన ఆవశ్యకమైనది మరియు అది కుటుంబ చరిత్ర పరిశోధనలో బాగా పెరిగిన, ప్రపంచవ్యాప్త ఆసక్తిని ఆరంభించింది.

హృదయాలను మార్చుట, తిప్పుట, మరియు శుద్ధిచేయుట

హృదయము అనే పదము లేఖనాలలో 1000 కంటే ఎక్కువసార్లు ఉపయోగించబడింది. సరళమైన, కానీ ప్రత్యేకమైన ఈ పదము తరచు ఒక వ్యక్తి యొక్క అంతర్గత భావాలను సూచిస్తుంది. మన హృదయాలు—మన కోరికలు, ఆప్యాయతలు, ఉద్దేశాలు, ఆశయాలు, వైఖరులు అన్నిటి మొత్తము—మనమెవరమో వర్ణిస్తాయి మరియు మనం ఏమి కాగలమో నిర్థారిస్తాయి. సువార్త నిబంధనలు మరియు యాజకత్వ విధుల ద్వారా హృదయాలను మార్చుతూ, తిప్పుతూ, శుద్ధిచేయడమే ప్రభువు కార్యము యొక్క ముఖ్య లక్షణం.

జ్ఞాపకముంచుకోదగిన వ్యక్తిగత లేదా కుటుంబ అనుభవము కలిగియుండేందుకు మాత్రమే మనము పరిశుద్ధ దేవాలయాలను నిర్మించము లేదా వాటిలో ప్రవేశించము. కానీ, దేవాలయాల్లో పొందిన నిబంధనలు మరియు నిర్వహించిన విధులు మన హృదయాలను పరిశుద్ధపరచడానికి మరియు దేవుని కుమారులు, కుమార్తెల అంతిమ ఉన్నతస్థితి కొరకు ఆవశ్యకమైనవి.

తండ్రులకు—అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులకు కూడా చేయబడిన వాగ్దానాలను పిల్లల హృదయాలలో నాటడం—పిల్లల హృదయాలను వారి స్వంత తండ్రుల వైపు తిప్పడం, కుటుంబ చరిత్ర పరిశోధనను నిర్వహించడం, ప్రత్యామ్నాయ దేవాలయ విధులను నిర్వర్తించడం వంటివి తెరకు ఇరువైపుల వ్యక్తులను దీవించు కార్యములు. మనము ఈ పరిశుద్ధ కార్యములో ఆతృతగా నిమగ్నమైనప్పుడు, దేవుడిని మరియు మన పొరుగువారిని ప్రేమించమని, సేవ చేయమనే ఆజ్ఞలకు మనం లోబడుతున్నాము. 13 అటువంటి నిస్వార్థ సేవ నిజంగా “ఆయనను వినుటకు“ 14 మరియు రక్షకుని వద్దకు వచ్చుటకు మనకు సహాయపడుతుంది. 15

అత్యంత పరిశుద్ధ నిబంధనలు మరియు యాజకత్వ విధులు కేవలం దేవాలయంలో—ప్రభువు యొక్క మందిరంలోనే పొందబడతాయి. దేవాలయంలో నేర్చుకున్న ప్రతిది మరియు చేసిన పనులన్నీ యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరియు పరలోక తండ్రి యొక్క గొప్ప సంతోష ప్రణాళికలో ఆయన పాత్రను నొక్కి చెప్తాయి.

లోపల నుండి

“నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటకు“ 16 విమోచకుడు అమలుపరచిన ఒక ముఖ్య విధానాన్ని అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ వివరించారు. ఆయన చెప్పారు: “ప్రభువు లోపల నుండి పనిచేస్తారు. ప్రపంచము బయటి నుండి పనిచేస్తుంది. ప్రపంచము మనుష్యులను మురికివాడల నుండి బయటకు తెస్తుంది. క్రీస్తు మనుష్యులలో నుండి మురికిని తీసివేస్తారు, అప్పుడు వారు తమనుతాము మురికివాడల నుండి బయటకు తెచ్చుకుంటారు. వారి పరిసరాలను మార్చడం ద్వారా ప్రపంచము మనిషిని మలుస్తుంది. క్రీస్తు మనుష్యులను మారుస్తారు, తర్వాత వారు తమ పరిసరాలను మార్చుకుంటారు. ప్రపంచము మానవ ప్రవర్తనను రూపొందిస్తుంది, కానీ క్రీస్తు మానవ స్వభావాన్ని మార్చగలరు.” 17

ఆత్మీయ పునర్జన్మ మరియు రూపాంతరము యొక్క నిరంతర ప్రక్రియలో నిబంధనలు మరియు యాజకత్వ విధులు ముఖ్యమైనవి; మనలో ప్రతి ఒక్కరితో లోపల నుండి ప్రభువు పనిచేయడానికి సాధనములు అవే. నిరంతరము గౌరవించబడి, ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోబడి, “మెత్తని హృదయములు అను పలకలమీద … జీవముగల దేవుని ఆత్మతో“ వ్రాయబడిన నిబంధనలు 18 మర్త్యత్వములో మరియు నిత్యము కొరకు దీవెనల యొక్క ఉద్దేశాన్ని, అభయాన్ని అందిస్తాయి. యోగ్యతగా పొందబడిన మరియు నిరంతరము జ్ఞాపకముంచుకోబడిన విధులు పరలోక ద్వారాలను తెరుస్తాయి, వాటిగుండా దైవత్వపు శక్తి మన జీవితాల్లోకి ప్రవహించగలదు.

లోకము యొక్క దుష్టత్వముల నుండి దాగుకొనేందుకు లేదా తప్పించుకొనేందుకు మనము దేవాలయానికి రాము. కానీ, దుష్టత్వపు లోకాన్ని జయించడానికి మనము దేవాలయానికి వస్తాము. యాజకత్వపు విధులను పొంది, పరిశుద్ధ నిబంధనలను చేసి, పాటించుట ద్వారా మనము మన జీవితాల్లోకి “దైవత్వపు శక్తిని“ 19 ఆహ్వానించినప్పుడు, మర్త్యత్వపు శోధనలను, సవాళ్ళను జయించడానికి, మంచిని చేయడానికి, మంచిగా మారడానికి మన స్వంత శక్తికి మించిన దానితో మనము దీవించబడతాము. 20

ఈ మందిరపు ప్రతిష్ఠ సర్వత్రా వ్యాపించును

ఈ యుగపు మొదటి దేవాలయము కర్ట్లాండ్, ఓహైయో లో నిర్మించబడి, 1836, మార్చి 27న సమర్పించబడింది.

సమర్పణ తర్వాత ఒక వారానికి ప్రవక్త జోసెఫ్ స్మిత్ కు ఒక బయల్పాటులో ప్రభువు ఇలా ప్రకటించారు:

“నా నామమునకు ఈ మందిరమును తమ శక్తినంతటితో నిర్మించిన నా జనులందరి హృదయాలు సంతోషింపనీయుడి. …

“అవును, క్రుమ్మరించబడబోవు దీవెనలకు, ఈ మందిరములో నా సేవకులు దీవించబడిన దీవెనకు పర్యవసానముగా వేలు పదివేల కొలది హృదయాలు మిక్కిలి ఆనందించును.

“ఈ మందిరపు ప్రతిష్ఠ విదేశాలకు వ్యాపించును; నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము.“ 21

వేలు పదివేల కొలది హృదయాలు మిక్కిలి ఆనందించును మరియు ఈ మందిరపు ప్రతిష్ఠ విదేశాలకు వ్యాపించును అను వాక్యభాగాలను దయచేసి గమనించండి. 1836 ఏప్రిల్ లో సంఘము కేవలం కొద్దిమంది సభ్యులను, ఒక దేవాలయాన్ని కలిగియున్నప్పుడు ఇవి నిర్ఘాంతపరిచే ప్రకటనలు.

నేడు 2020 లో మనము 168 పనిచేయుచున్న దేవాలయాలను కలిగియున్నాము. అదనంగా నలభై తొమ్మిది దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయి లేక ప్రకటించబడ్డాయి. ప్రభువు యొక్క మందిరాలు “సముద్ర ద్వీపాలమీద“ 22 మరియు ఒక దేవాలయం నిర్మించబడే అవకాశం లేదని గతంలో అనేకులచేత భావించబడిన దేశాలలో మరియు ప్రాంతాలలో నిర్మించబడుతున్నాయి.

దీవెన ఆచారకర్మ ప్రస్తుతం 88 భాషల్లో అందించబడుతోంది, మరింత మంది దేవుని పిల్లలను దీవించడానికి దేవాలయాలు నిర్మించబడుతుండగా అదనంగా అనేక భాషల్లో లభ్యము చేయబడుతుంది. మరో 15 సంవత్సరాలలో, దేవాలయ విధులు లభ్యమయ్యే భాషల సంఖ్య రెట్టింపు కాగలదు.

ఈ సంవత్సరము మేము 18 దేవాలయాలకు శంకుస్థాపన చేసి, నిర్మాణము మొదలుపెడతాము. దానికి విరుద్ధంగా, 1830లో సంఘము స్థాపించబడినప్పటి నుండి 1980లో అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ గారిచే టోక్యో జపాన్ దేవాలయం సమర్పణ వరకు మొదటి 18 దేవాలయాలను నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టింది.

చిత్రం
ఆరు దేవాలయాలు

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి జీవితకాలంలో సంభవించిన దేవాలయ కార్యపు వేగాన్ని ఆలోచించండి. సెప్టెంబరు 9, 1924 లో అధ్యక్షులు నెల్సన్ పుట్టినప్పుడు, సంఘము ఆరు పనిచేయుచున్న దేవాలయాలను కలిగియుంది.

చిత్రం
26 దేవాలయాలు

ఏప్రిల్ 7, 1984లో 60 ఏళ్ళ తర్వాత, ఆయన అపొస్తలునిగా నియమించబడినప్పుడు, 26 దేవాలయాలు పనిచేస్తున్నాయి, 60 ఏళ్ళలో 20 దేవాలయాల పెరుగుదల.

చిత్రం
159 దేవాలయాలు

అధ్యక్షులు నెల్సన్ సంఘాధ్యక్షునిగా సమ్మతించబడినప్పుడు, 159 దేవాలయాలు పనిచేస్తున్నాయి, పన్నెండుమంది అపొస్తలుల సమూహము యొక్క సభ్యునిగా ఆయన సేవచేసిన 34 ఏళ్ళలో 133 దేవాలయాల పెరుగుదల.

చిత్రం
పనిచేయుచున్న మరియు ప్రకటించబడిన దేవాలయాలు

2018, జనవరి 14న సంఘము యొక్క అధ్యక్షుడైనప్పటి నుండి అధ్యక్షులు నెల్సన్ 35 క్రొత్త దేవాలయాలను ప్రకటించారు.

ప్రస్తుతమున్న దేవాలయాలలో తొంభై ఆరు శాతం అధ్యక్షులు నెల్సన్ గారి జీవితకాలంలో సమర్పించబడ్డాయి; 84 శాతం ఆయన అపొస్తలుడైనప్పటి నుండి సమర్పించబడ్డాయి.

ఎల్లప్పుడు అత్యధిక ప్రాధాన్యత గల విషయాలపై దృష్టిపెట్టండి

ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘ సభ్యులుగా, కడవరి దినాలలో ఆయన కార్యము యొక్క నిరంతర- వేగవంతమైన గమనాన్ని చూసి మనమంతా ఆశ్చర్యపడుతున్నాము. మరిన్ని దేవాలయాలు రాబోతున్నాయి.

బ్రిగమ్ యంగ్ ఇలా ప్రవచించారు, “ఈ కార్యమును సాధించడానికి ఒక్కటి చాలదు, వేల దేవాలయాలు కావాలి మరియు వేలు పదుల వేలమంది స్త్రీ పురుషులు ఆ దేవాలయాలలోకి వెళ్ళి, ప్రభువు బయల్పరచినప్పటి నుండి జీవించిన జనుల కొరకు పనిచేయాలి.“ 23

ప్రతి క్రొత్త దేవాలయ ప్రకటన గొప్ప ఆనందానికి మూలమవుతుందని, ప్రభువుకు కృతజ్ఞత తెలుపడానికి ఒక కారణమవుతుందని అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ, ప్రధానంగా మన దృష్టి మన హృదయాలను మార్చి, రక్షకుని పట్ల మన భక్తిని అధికం చేయగల నిబంధనలు మరియు విధులపై ఉండాలి, అంతేకానీ భవనము ఉన్న ప్రాంతము లేదా దాని అందంపైన మాత్రము కాదు.

ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘ సభ్యులుగా మనపై గల ప్రధాన బాధ్యతలేవనగా, (1) “ఆయనను వినుట“ 24 మరియు నిబంధనలు, విధుల ద్వారా మన హృదయాలు మార్చబడేలా చేయుట, (2) తెరకు ఇరువైపుల గల మానవ కుటుంబమంతటికి దేవాలయ దీవెనలు అందించుటకు దైవికంగా ఇవ్వబడిన బాధ్యతను ఆనందంగా నెరవేర్చుట. ప్రభువు యొక్క మార్గదర్శకత్వము, సహాయముతో నిజంగా మనము ఈ పరిశుద్ధ విధులను నెరవేరుస్తాము.

సీయోను నిర్మాణము

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ప్రకటించారు:

“సీయోనును నిర్మించడం, అన్ని కాలాల్లో దేవుని జనుల ఆసక్తిని చూరగొనడానికి ఒక కారణం; ఈ విషయంపై ప్రవక్తలు, యాజకులు, రాజులు ప్రత్యేక ఆనందంతో నివసించారు; మనం జీవించే రోజు కోసం వారు సంతోషకరమైన నిరీక్షణతో ఎదురుచూసారు; పరలోకపు ఆనందకరమైన నిరీక్షణలతో వెలిగింపబడి, వారు మన రోజు గురించి పాడారు, వ్రాసారు, ప్రవచించారు; కానీ అది చూడకుండానే వారు మరణించారు; … కడవరి-దిన మహిమను చూడడం, దానిలో పాల్గొనడం మరియు అది ముందుకు సాగేలా తోడ్పడడం మన వంతు.”25

“ఆ గొప్ప ఉద్దేశాలను నెరవేర్చడానికి పరలోకపు యాజకత్వము భూలోకపు దానితో ఏకమవుతుంది; … గత తరాల నుండి దేవుడు మరియు దేవదూతలు ఆనందంతో నిర్దేశించిన కార్యమది; ప్రాచీన గోత్రజనకులు మరియు ప్రవక్తల ఆత్మలను వెలిగించినది; అంధకారపు శక్తులను నాశనం చేయడానికి, భూమిని నూతనపరచడానికి, దేవుని మహిమను మరియు మానవ కుటుంబానికి రక్షణను తెచ్చుటకు ఉద్దేశించబడిన కార్యమది.”26

తండ్రి మరియు కుమారుడు జోసెఫ్ స్మిత్ కు ప్రత్యక్షమయ్యారని, ఏలీయా బంధనాధికారాన్ని పునఃస్థాపించాడని నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నాను. మనము “ఆయనను విని“ 27, మన జీవితాల్లో దైవత్వపు శక్తిని పొందినప్పుడు పరిశుద్ధ దేవాలయ నిబంధనలు మరియు విధులు మనల్ని బలపరచగలవు మరియు మన హృదయాలను శుద్ధిచేయగలవు. ఈ కడవరి-దిన కార్యము అంధకారపు శక్తులను నాశనం చేయునని, మానవ కుటుంబానికి రక్షణ తెచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈ సత్యాలను గూర్చి నేను ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఆనందంగా సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.

ముద్రించు