సర్వసభ్య సమావేశము
మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


15:1

మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము

ప్రపంచం యేసు క్రీస్తు గురించి తక్కువగా మాట్లాడుతుండగా, మనం ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుదాం.

మా ప్రియమైన స్నేహితులు మరియు తోటి విశ్వాసులైన మీ పట్ల నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఈ గత నెలల్లో మీ విశ్వాసం మరియు ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్త మహమ్మారి మన జీవితాలను దెబ్బతీసింది, విలువైన కుటుంబ సభ్యులను మరియు ప్రియమైన స్నేహితులను బలితీసుకుంది.

ఈ అనిశ్చితి కాలంలో, యేసే క్రీస్తు అని నాకున్న ఖచ్చితమైన, నిర్ధిష్టమైన జ్ఞానం కొరకు నేను అసాధారణమైన కృతజ్ఞతను అనుభవించాను. మీరు కూడా ఆ విధంగా భావించారా? మనలో ప్రతి ఒక్కరికి భారంగా ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ “నేనే మార్గము, సత్యము మరియు జీవము”1 అని వినయంగా ప్రకటించిన ఆయన ఎల్లప్పుడూ మన ముందు ఉన్నాడు. మనం ఇతరుల నుండి భౌతిక దూరం పాటించే కాలాన్ని సహిస్తున్నప్పుడు, “నా యొద్దకు రండి” అని ప్రేమతో మనలను పిలిచే ఆయన నుండి ఆత్మీయ దూరాన్ని పాటించే కాలాన్ని సహించవలసిన అవసరం లేదు.2

స్పష్టమైన నల్లని ఆకాశంలో మార్గదర్శక నక్షత్రంలా యేసు క్రీస్తు మన మార్గాన్ని వెలిగిస్తారు. ఆయన దీనమైన పశువులపాకలో భూమిపైకి వచ్చారు. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించారు. ఆయన రోగులను స్వస్థపరచి, మృతులను లేపారు. మరువబడినవారికి ఆయన స్నేహితుడు. మంచి చేయమని, విధేయత చూపించమని, ఒకరినొకరు ప్రేమించాలని ఆయన మనకు నేర్పించారు. ఆయన సిలువపై మరణించారు, మూడు రోజుల తరువాత గంభీరముగా లేచి, మనకు మరియు మనం ఇష్టపడేవారికి మరణము తరువాత జీవించడానికి వీలు కల్పించారు. తన సాటిలేని కరుణ మరియు కృపతో మన పాపాలను, మన బాధలను ఆయన స్వయంగా స్వీకరించారు, మనం పశ్చాత్తాపపడినప్పుడు క్షమాపణను ప్రసాదించి, జీవిత తుఫానులలో శాంతిని అనుగ్రహించారు. మనం ఆయనను ప్రేమిస్తున్నాము. ఆయనను ఆరాధిస్తాము. ఆయనను అనుసరిస్తాము. ఆయన మన ఆత్మకు లంగరువలెనున్నాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆత్మీయ విశ్వాసం మనలో పెరుగుచుండగా యేసు క్రీస్తు గురించి చాలా తక్కువ తెలిసినవారు అనేకులు భూమిమీద ఉన్నారు మరియు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఆయన పేరు శతాబ్దాలుగా ప్రకటించబడినప్పటికీ, యేసు క్రీస్తుపై విశ్వాసం తగ్గిపోతోంది. ఐరోపాలోని శూరులైన పరిశుద్ధులు దశాబ్దాలుగా తమ దేశాలలో విశ్వాసం క్షీణించడాన్ని చూసారు.3 ఇక్కడ సంయుక్త రాష్ట్రాలలో కూడా విశ్వాసం తగ్గడం విచారకరం. గత పది సంవత్సరాలలో సంయుక్త రాష్ట్రాలలో 30 మిలియన్ల మంది యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని విశ్వసించకుండా వైదొలిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.4 ప్రపంచవ్యాప్తంగా చూస్తే, రాబోయే దశాబ్దాలలో క్రైస్తవ మతాన్ని స్వీకరించే వారి కంటే దానిని విడిచిపెట్టేవారు రెట్టింపు కంటే ఎక్కువ మంది ఉంటారని మరొక అధ్యయనం అంచనా వేసింది.5

మనము ప్రతి ఒక్కరికి గల ఎన్నుకునే హక్కును గౌరవిస్తాము, అయినప్పటికీ మన పరలోక తండ్రి ఇలా ప్రకటించారు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి.”6 ప్రతి మోకాలును వంగును, ప్రతి నాలుకయు యేసే క్రీస్తని ఒప్పుకొను దినము వచ్చునని నేను సాక్ష్యమిస్తున్నాను.7

మారుతున్న మన ప్రపంచంపట్ల మనం ఎలా స్పందించాలి? కొందరు తమ విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తుండగా, మరికొందరు సత్యం కోసం వెదకుచున్నారు. మనము రక్షకుని నామమును మనపై తీసుకొనియున్నాము. మనం ఇంకేమి చేయాలి?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క సిద్ధపాటు

సంఘ అధ్యక్షునిగా ఆయన పిలువబడకముందు నెలల్లో అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను ప్రభువు ఎలా సిద్ధపరిచారో సమీక్షించినప్పుడు మన సమాధానంలో కొంత భాగం రావచ్చు. తన పిలుపుకు ఒక సంవత్సరం ముందు మాట్లాడుతూ, అధ్యక్షుడు నెల్సన్ విషయ దీపికలో జాబితా చేయబడిన యేసు క్రీస్తు పేరు యొక్క 2,200 ఉదాహరణలను మరింత లోతుగా అధ్యయనం చేయమని ఆహ్వానించారు.8

లేఖనాలను చదువుచున్న అధ్యక్షులు నెల్సన్

మూడు నెలల తరువాత ఏప్రిల్ సర్వసభ్య సమావేశంలో, ఆయన తన దశాబ్దాల అంకితభావ శిష్యత్వమును కలిగియుండి కూడా యేసు క్రీస్తు గురించి ఈ లోతైన అధ్యయనం తనను ఎంతగా ప్రభావితం చేసిందో మాట్లాడారు. దాని ప్రభావమును గూర్చి సహోదరి వెండీ నెల్సన్ ఆయనను అడిగారు. “నేను మారిన వ్యక్తిని” అని ఆయన సమాధానమిచ్చారు. ఆయన మారిన వ్యక్తియా? 92 సంత్సరాల వయస్సులో, మారిన వ్యక్తియా? అధ్యక్షులు నెల్సన్ బోధించారు:

“మనము రక్షకుని గురించి, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం గురించి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించినప్పుడు, మనం… (ఆయన) వైపుకు ఆకర్షితులవుతాము. …

“మన దృష్టి రక్షకునిపై మరియు ఆయన సువార్తపై దృఢంగా నిలిచియుంటుంది.”9

“ప్రతి తలంపులో నా వైపు చూడుడి” అని రక్షకుడు బోధించారు.10

పని, దిగులు మరియు తగిన ప్రయత్నాల ప్రపంచంలో మన ఆశ, రక్షణ అయిన ఆయనపై మనం మన హృదయాన్ని, మనస్సును, మన ఆలోచనలను నిలుపుతాము.

రక్షకుని గురించి నూతనంగా చేసిన అధ్యయనం అధ్యక్షులు నెల్సన్‌ను సిద్ధం చేయడంలో సహాయపడితే, అది మనల్ని కూడా సిద్ధం చేయడంలో సహాయపడలేదా?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్

సంఘము యొక్క పేరును నొక్కి చెప్పడంలో, అధ్యక్షుడు నెల్సన్ ఇలా బోధించారు: “మనము యేసు క్రీస్తు ప్రాయశ్చిత్త శక్తిని పొందడానికి—మనలను స్వస్థపరచి, శుద్ధి చేయడానికి, బలపరచి, ఘనపరచడానికి, చివరకు మనల్ని మహోన్నతులుగా చేయడానికి—స్పష్టంగా ఆయనే ఆ శక్తి యొక్క మూలాధారం అని మనం గుర్తించాలి.“11 సంఘము యొక్క సరైన పేరును స్థిరంగా ఉపయోగించడం ఒక చిన్న విషయంగా అనిపించవచ్చును, కానీ అది చిన్న విషయం కాదని, భవిష్యత్తు రూపురేఖలను మారుస్తుందని ఆయన మనకు బోధించారు.

మీ సిద్ధపాటు కొరకు ఒక వాగ్దానము

అధ్యక్షులు నెల్సన్ చేసినట్లుగా, మనల్ని మనం సిద్ధం చేసుకున్నప్పుడు, మనము కూడా భిన్నంగా ఉంటామని, రక్షకుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ఆయన గురించి మరింత తరచుగా మరియు తక్కువ సంకోచంతో మాట్లాడతామని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు ఆయనను మరింత లోతుగా తెలుసుకుని ప్రేమిస్తున్నప్పుడు, మీ పిల్లలలో ఒకరి గురించి లేదా ప్రియమైన స్నేహితుడి గురించి మాట్లాడేటప్పుడు మీ మాటలు వచ్చినంత తేలికగా మరింత హాయిగా మాటలు వస్తాయి. మీ మాటలు వినే వారు మీతో వాదించడానికి లేదా మీ మాటలు కొట్టిపారేయడానికి తక్కువ ఆసక్తి చూపించాలని, మీ నుండి నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపించాలని భావిస్తారు.

మీరు మరియు నేను యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాము, కానీ మనం ఇంకొంచెం మెరుగ్గా చేయగలమేమో. ప్రపంచం ఆయన గురించి తక్కువగా మాట్లాడబోతుంటే, ఆయన గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడబోతున్నారు? మనం! ఇతర క్రైస్తవ భక్తులతో పాటు మాట్లాడతాము!

క్రీస్తు గురించి మన గృహాలలో మాట్లాడుట

మన గృహాలలో రక్షకుని చిత్రాలు ఉన్నాయా? యేసు ఉపమానాల గురించి మనం మన పిల్లలతో తరచుగా మాట్లాడుతామా? “యేసు కథలు మన పిల్లల హృదయాలలో విశ్వాసం యొక్క ప్రవహించే గాలివలె ఉన్నాయి.”12 మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు, రక్షకుడు బోధించిన వాటిని బోధించడాన్ని స్పృహతో పరిగణించండి. ఉదాహరణకు, “నాన్న, మనం ఎందుకు ప్రార్థిస్తాము?” అని మీ పిల్లవాడు అడిగితే, “ఇది గొప్ప ప్రశ్న. యేసు ప్రార్థించినప్పుడు నీకు గుర్తుందా? ఆయన ఎందుకు ప్రార్థించారు మరియు ఎలా ప్రార్థించారనే దాని గురించి మాట్లాడుదాం” అని మీరు ప్రతిస్పందించవచ్చు.

“మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము, క్రీస్తు నందు ఆనందించుచున్నాము, … మా సంతానము వారి పాప పరిహారము కొరకు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకొనునట్లు వ్రాయుచున్నాము.”13

క్రీస్తు గురించి సంఘములో మాట్లాడుట

ఇదే లేఖనము మేము “క్రీస్తును గూర్చి బోధిస్తున్నాము” అని కూడా చెప్తుంది.14 మన ఆరాధన సేవలలో, రక్షకుడైన యేసు క్రీస్తుపై మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగం వలన కలిగిన బహుమానముపై మనం ఎల్లప్పుడూ దృష్టి సారిద్దాం. దీని అర్థం, మన స్వంత జీవితం నుండి ఒక అనుభవాన్ని చెప్పలేము లేదా ఇతరుల నుండి ఒక ఆలోచనను పంచుకోలేము అని కాదు. మన విషయం కుటుంబాలు, సేవ, దేవాలయాలు లేదా ఇటీవలి సువార్తసేవ గురించి కావచ్చు, కానీ మన ఆరాధనలో ప్రతిదీ ప్రభువైన యేసు క్రీస్తును సూచించాలి.

“తాను [సంస్కార] సమావేశానికి హాజరయ్యానని మరియు రక్షకుడిని ప్రస్తావించకుండా పదిహేడు సాక్ష్యాలను విన్నానని చెప్పిన వ్యక్తి నుండి” ముప్పై సంవత్సరాల క్రితం, ఆయనకు వచ్చిన ఒక లేఖ గురించి అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ మాట్లాడారు.15 అధ్యక్షులు ఓక్స్ అప్పుడు ఇలా పేర్కొన్నారు, “బహుశా ఆ వివరణ అతిశయోక్తి కావచ్చు, [కానీ] నేను దానిని ఉదహరిస్తున్నాను ఎందుకంటే ఇది మనందరికీ స్పష్టమైన జ్ఞాపకాన్ని అందిస్తుంది.” 16 అప్పుడాయన మన ప్రసంగాలు మరియు తరగతి చర్చలలో యేసు క్రీస్తు గురించి ఎక్కువగా మాట్లాడమని మనల్ని ఆహ్వానించారు. మన సంఘ సమావేశాలలో మనం క్రీస్తుపై ఎక్కువ దృష్టి పెడుతున్నామని నేను గమనించాను. ఈ సానుకూల ప్రయత్నాలలో అప్రమత్తంగా కొనసాగుదాం.

క్రీస్తు గురించి ఇతరులతో మాట్లాడుట

మన చుట్టుపక్కల వారితో, మనం మరింత బహిరంగంగా క్రీస్తు గురించి మాట్లాడటానికి ఇష్టపడదాము. అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు ధైర్యంగా నిలబడడానికి, మాట్లాడడానికి మరియు ప్రపంచ ప్రజల నుండి భిన్నంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు.”17

కొన్నిసార్లు మనము ఎవరితోనైనా సంభాషిస్తే, వారు సంఘానికి రావడానికి లేదా సువార్తికులను కలవడానికి అది దారితీయాలి అని అనుకుంటాము. అయితే ఆయన స్వరముగా ఉండడానికి మన బాధ్యత గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ, ఎల్లప్పుడూ మన విశ్వాసం గురించి ఆలోచనాత్మకంగా, స్పష్టంగా ఉండి, వారు సిద్ధమనస్సు కలిగి ఉన్నప్పుడు ప్రభువు వారికి మార్గనిర్దేశం చేయనిద్దాం. మన వారాంతం గురించి ఎవరైనా అడిగినప్పుడు, మనం చిరునవ్వుతో “నేను యేసు వలె ఉండడానికి ప్రయత్నిస్తున్నాను” అని ప్రాథమిక పిల్లలు పాడిన పాట వినడం మాకు చాలా ఇష్టమని చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలని ఎల్డర్ డిటర్ ఎఫ్. ఉక్‌డార్ఫ్ మనకు బోధించారు.18 క్రీస్తుపై మన విశ్వాసానికి దయతో సాక్ష్యమిద్దాం. ఎవరైనా వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్య గురించి మాట్లాడితే మనం ఈ విధంగా చెప్పవచ్చును, “జాన్, మేరీ, నేను యేసుక్రీస్తును నమ్ముతున్నానని మీకు తెలుసు. ఆయన చెప్పిన దానిలో మీకు సహాయం చేయగలదాని గురించి నేను ఆలోచిస్తున్నాను.”

క్రీస్తుపై మీ నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు సామాజిక మాధ్యమంలో మరింత స్పష్టంగా ఉండండి. చాలామంది మన విశ్వాసాన్ని గౌరవిస్తారు, కానీ మీరు రక్షకుని గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా నిరాకరిస్తే, ఆయన వాగ్దానం నుండి ధైర్యం తెచ్చుకోండి: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించినప్పుడు … మీరు ధన్యులు. … పరలోకమందు మీ ఫలము అధికమగును.”19 మన స్వంత అనుచరులకు “నచ్చడం” కంటే ఆయన అనుచరులుగా ఉండడంపై మనము ఎక్కువ శ్రద్ధ వహిస్తాము. “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి” అని పేతురు ఉపదేశించాడు.20 క్రీస్తును గూర్చి మనం మాట్లాడదాం.

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తుకు శక్తివంతమైన సాక్ష్యము. వాస్తవానికి ప్రతి పేజీ రక్షకుని గురించి మరియు ఆయన దైవిక నియమితకార్యము గురించి సాక్ష్యమిస్తుంది.21 ఆయన ప్రాయశ్చిత్తం మరియు దయ యొక్క అవగాహన దాని పేజీలను సంతృప్తిపరుస్తుంది. క్రొత్త నిబంధనకు తోడుగా, రక్షకుడు మనలను రక్షించడానికి ఎందుకు వచ్చారో మరియు మనం మరింత గంభీరముగా ఆయన యొద్దకు ఎలా రాగలమో బాగా అర్థం చేసుకోవడానికి మోర్మన్ గ్రంథము మనకు సహాయపడుతుంది.

మన తోటి క్రైస్తవులలో కొందరు కొన్నిసార్లు మన నమ్మకాలు మరియు ఉద్దేశ్యాల గురించి అనిశ్చితంగా ఉంటారు. యేసు క్రీస్తుపై మరియు మనమందరం ఇష్టపడే క్రొత్త నిబంధన లేఖనాలపై మనకున్న విశ్వాసాన్ని పంచుకుంటూ వారితో నిజాయితీగా ఆనందిద్దాం. రాబోయే రోజుల్లో, యేసు క్రీస్తును విశ్వసించే వారికి పరస్పర స్నేహం, మద్దతు అవసరం.22

లోకానికి వెలుగు

ప్రపంచం యేసు క్రీస్తు గురించి తక్కువగా మాట్లాడుతుండగా, మనం ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుదాం. ఆయన శిష్యులుగా మన నిజమైన గుణాలు బయల్పరచబడినప్పుడు, మన చుట్టూ ఉన్న చాలామంది వినడానికి సిద్ధంగా ఉంటారు. మనము ఆయన నుండి పొందిన వెలుగును పంచుకున్నప్పుడు, తమ హృదయాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నవారిపై ఆయన వెలుగు మరియు సర్వశ్రేష్టమైన ఆయన రక్షణాశక్తి ప్రకాశిస్తుంది. “నేను ఈ లోకమునకు వెలుగు(గా) వచ్చియున్నాను” అని యేసు చెప్పారు.23

క్రీస్తును గూర్చి మాట్లాడుటకు మన కోరికను ప్రేరేపించుట

క్రీస్తు రాకడను ఊహించుకోవడం కంటే ఆయన గురించి మాట్లాడడానికి నా కోరికను ప్రేరేపించేది మరేదీ లేదు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియనప్పటికీ, ఆయన రాకడ యొక్క సంఘటనలు ఉత్కంఠభరితంగా ఉంటాయి! ఆయన తన పరిశుద్ధ దేవదూతలందరితో మహిమతో, ఘనతతో ఆకాశ మేఘాలలో వస్తారు. కొద్దిమంది దేవదూతలు మాత్రమే కాదు, కానీ ఆయన పరిశుద్ధ దేవదూతలు అందిరితో ఆయన తిరిగి వస్తారు. ఇవి ప్రేమికుల గ్రీటింగ్ కార్డులపై కనిపించే రాఫెల్ చిత్రించిన చెర్రీపండు బుగ్గలు గల కెరూబులు కావు. వీరు శతాబ్దాలుగా ఉన్న దేవదూతలు, సింహాల నోరు మూయడానికి,24 చెరశాల తలుపులు తెరవడానికి,25 ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆయన పుట్టుకను ప్రకటించడానికి,26 గెత్సెమనేలో ఆయనను ఓదార్చడానికి,27 శిష్యులకు ఆయన ఆరోహణ సమయంలో అభయమివ్వడానికి28 మరియు మహిమాన్వితమైన సువార్త యొక్క పునఃస్థాపనను ప్రారంభించడానికి పంపబడిన దేవదూతలు.29

రెండవ రాకడ

తెరకు ఈ వైపు లేదా ఆ వైపు ఆయనను కలుసుకోవడానికి కొనిపోబడడాన్ని మీరు ఊహించగలరా?30 అది నీతిమంతులకు ఆయన ఇచ్చు వాగ్దానము. ఈ అద్భుతమైన అనుభవం మన ఆత్మలపై శాశ్వతంగా ముద్రవేస్తుంది.

రక్షకుడిని ప్రేమించి, ఆయన దైవత్వాన్ని ప్రకటించాలనే మన కోరికను అధికము చేసిన మన ప్రియ ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ పట్ల మనం ఎంతో కృతజ్ఞత కలిగియున్నాము. ప్రభువు హస్తము ఆయనపై ఉన్నదనుటకు మరియు ఆయనను నడిపించే బయల్పాటు వరమునకు నేను ప్రత్యక్ష సాక్షిని. అధ్యక్షులు నెల్సన్, మేము మీ ఉపదేశం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాము.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన మిత్రులారా, ఆయన మహిమగల వాగ్దానాన్ని ఊహించి, క్రీస్తు గురించి మాట్లాడుదాం: “ఎవరైతే… మనుష్యుల యెదుట నన్ను ఒప్పుకొనునో, నా తండ్రి యెదుట వానిని నేను ఒప్పుకొందును.” ఆయన దేవుని కుమారుడని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.