సర్వసభ్య సమావేశము
ఐక్యభావన చేత మనము దేవుని నుండి శక్తి పొందుతాము
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


10:6

ఐక్యభావన చేత మనము దేవుని నుండి శక్తి పొందుతాము

మనం ఐక్యభావనను కోరుకున్నప్పుడు, మన ప్రయత్నాలను మరింత సంపూర్ణం చేయడానికి దేవుని శక్తిని మనం క్రిందికి రప్పిస్తాము.

గార్డెన్ తన పనులను ముగిస్తే అతని తల్లి అతని కోసం అప్పం చేస్తానని చెప్పింది. అతనికి ఇష్టమైన రకం. కేవలం అతని కోసం చేస్తానంది. గార్డన్ ఆ పనులు ముగించడానికి వెళ్ళినప్పుడు, అతని తల్లి అప్పం తయారుచేసింది. అతని అక్క కేథీ తన స్నేహితురాలితో ఇంటికి వచ్చింది. ఆమె అప్పాన్ని చూసి తాను, తన స్నేహితురాలు చిన్న ముక్క తినవచ్చా అని అడిగింది.

”లేదు,” ”అది నా అప్పం. అమ్మ నా కోసం దాన్ని చేసింది, నేను దానిని సంపాదించుకోవాలి,” అన్నాడు గార్డన్.

కేథీ తన తమ్ముడిని కోప్పడింది. అతడు చాలా స్వార్థపరుడు, అత్యాశ గలవాడు. మొత్తం తనే ఎలా ఉంచుకుంటాడు?

చాలాసేపటి తర్వాత తన స్నేహితురాలిని ఇంటికి చేర్చడానికి కేథీ కారు తలుపు తెరిచినప్పుడు, సీటు మీద రెండు చేతిరుమాళ్ళు చక్కగా మడతపెట్టియుండి, పళ్ళాలలో రెండు పెద్ద అప్పం ముక్కలు, వాటిమీద రెండు ఫోర్కులు పెట్టి ఉన్నాయి. అతడు మారడానికి, అర్హత లేని వారిపట్ల కూడా దయ చూపడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడో తెలియజేయడానికి గార్డన్ అంత్యక్రియల సమయంలో కేథీ ఈ విషయం చెప్పింది.

1842లో పరిశుద్ధులు నావూ దేవాలయాన్ని నిర్మించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. మార్చిలో ఉపశమన సమాజము స్థాపించబడిన తర్వాత, త్వరలో దేవాలయంలో వారు చేయబోయే పరిశుద్ధమైన, ఐక్యపరచు నిబంధనల కోసం వారిని సిద్ధం చేయడానికి ప్రవక్త జోసెఫ్ తరచు వారి సమావేశాలకు వచ్చేవారు.

జూన్ 9న ప్రవక్త ఇలా అన్నారు, “నేను కనికరము గురించి చెప్పబోతున్నాను[.] మనకు జరిగే స్వల్పమైన విషయాలపై యేసు క్రీస్తు మరియు దేవదూతలు కోపం తెచ్చుకుంటారని అనుకుంటున్నాను. మనం తప్పకుండా కనికరము కలిగియుండి, అల్పమైన విషయాలను పట్టించుకోకూడదు.” అధ్యక్షులు స్మిత్ కొనసాగించారు, ”అధికమైన ఐక్యభావన లేకపోవడం నన్ను బాధిస్తున్నది—ఒకరు శ్రమపడినప్పుడు అందరు వారితోపాటు శ్రమపడతారు—ఐక్యభావన చేత మనము దేవుని నుండి శక్తి పొందుతాము.” 1

ఆ చిన్న వాక్యము నాకు మెరుపులా తగిలింది. ఐక్యభావన చేత మనము దేవుని నుండి శక్తి పొందుతాము. ఈ ప్రపంచం నేను కోరుకున్నట్లుగా లేదు. నేను ప్రభావితం చేసి, బాగుచేయాలని కోరుకొనే విషయాలు అనేకం ఉన్నాయి. నిజానికి నేను ఆశించిన దానికి చాలా వ్యతిరేకత ఉంది, కొన్నిసార్లు నేను బలహీనురాలిగా భావిస్తాను. ఈ మధ్య నన్ను నేను పరిశోధించు ప్రశ్నలు అడుగుతున్నాను: నా చుట్టూ ఉన్నవారిని నేను బాగా ఎలా అర్థం చేసుకోగలను? అందరూ ఇంత భిన్నంగా ఉన్నప్పుడు, ఆ “ఐక్యభావన“ను నేనెలా సృష్టించగలను? నేను ఇతరులతో మరికొంత ఐక్యతతో ఉన్నట్లయితే, దేవుని నుండి నేను ఏ శక్తిని పొందగలను? నా ఆత్మ పరిశోధన నుండి నేను మూడు సూచనలు కలిగియున్నాను. అవి మీకు కూడా సహాయపడవచ్చు.

కనికరము కలిగియుండండి

జేకబ్ 2:17 లో ఇలా చదవవచ్చు, “మీ వలె మీ (సహోదర సహోదరీలు) గూర్చి ఆలోచించుడి, అందరితో స్నేహముగానుండుడి, వారు మీవలే ఐశ్వర్యవంతులగునట్లు మీ సంపద విషయములో ఉదారముగా ఉండుడి.“ సంపద అనే పదానికి బదులుగా కనికరము ఉంచుదాం—వారు మీవలే ఐశ్వర్యవంతులగునట్లు మీ కనికరము విషయములో ఉదారముగా ఉండుడి.

సంపద అనగానే మనం ఆహారం లేక డబ్బు గురించి ఆలోచిస్తాము, కానీ మన పరిచర్యలో ఎక్కువగా మనందరికి కావలసింది కనికరము కావచ్చు.

మా ఉపశమన సమాజ అధ్యక్షురాలు ఇటీవల చెప్పింది: “మీ పేరు ప్రతిష్టలకు నేను భంగం కలిగించనని వాగ్దానమిస్తున్నాను. … మీరు మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారనే దానిపై నా అభిప్రాయం ఆధారపడి ఉంటుంది. … మీ గురించి నిర్దయగా, కించపరిచేలా ఎన్నడూ నేను మాట్లాడను. నాపట్ల అలాగే వ్యవహరించమని మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే మిమ్మల్ని నిరాశపరిచానేమోనని నేను భయపడుతున్నాను. …

1842 జూన్‌లో ఆనాడు సహోదరీలకు జోసెఫ్ స్మిత్ ఇలా చెప్పారు:

“ఎవరైనా నాపట్ల అతికొద్ది దయను, ప్రేమను చూపినప్పుడు, అది నా మనస్సుపై ఎంతో శక్తి కలిగియుంటుంది. …

“… మనము మన పరలోక తండ్రికి దగ్గరవుతున్నకొద్దీ, నశించిపోతున్న ఆత్మలపట్ల దయ చూపాలని ఎక్కువగా కోరుకుంటాము—వారిని మన భుజాలమీద ఎత్తుకొని, వారి పాపాలను వెనుక వదిలివేయాలని (కోరుకుంటున్నట్లుగా మనం భావిస్తాము). ఈ సమాజానికంతటికి (నా సందేశము ఉద్దేశించబడింది)—దేవుడు మిమ్మల్ని కనికరించాలని కోరుకున్నట్లయితే, ఒకరిపట్ల ఒకరు కనికరము కలిగియుండండి.” 2

ఈ సలహా ప్రత్యేకంగా ఉపశమన సమాజము కొరకైనది. ఒకరినొకరు తీర్పుతీర్చవద్దు లేక మాటలతో బాధపెట్టవద్దు. ఒకరి పేరు ప్రతిష్టలకు మరొకరు భంగం కలిగించకుండా కనికరపు బహుమానాన్ని ఇచ్చుకుందాం. 3

మీ పడవ ఊపందుకొనేలా చేయండి

1936లో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనడానికి అప్రసిద్ధ నావికుల జట్టు ఒకటి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి జర్మనీకి ప్రయాణించింది. అది గొప్ప ఆర్థిక మాంద్యం గల క్లిష్ట సమయం. వీరు కూలిపని చేసే బాలురు, గనులలో, కలపతో చిన్నచిన్న పనులు చేసి బెర్లిన్ వెళ్ళగలిగేందుకు డబ్బు కూడబెట్టారు. పోటీలోని ప్రతి అంశంలో వారికి గెలిచే అవకాశం లేనట్లనిపించింది, కానీ అప్పుడే పోటీలో ఏదో జరిగింది. పడవ పోటీల ప్రపంచంలో దానిని “ఊపందుకోవడం“ అంటారు. పడవలో ఉన్న బాలురు: అనే పుస్తకం మీద ఆధారపడిన ఈ వర్ణనను వినండి.

సాధించడానికి కష్టమైనది, నిర్వచించడానికి వీలుకాని విషయమొకటి కొన్నిసార్లు జరుగుతుంది. దానినే “ఊపందుకోవడం“ అంటారు. ఏ ఒక్క పొరపాటు చేయకుండా అందరూ కలిసి ఐక్యతతో తెడ్డు వేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.

తెడ్డు వేసేవారు తప్పక తమ భీకర స్వాతంత్య్రాన్ని నిగ్రహించుకోవాలి, అదే సమయంలో వారి వ్యక్తిగత సామర్థ్యాలపై నమ్మకం కలిగియుండాలి. అందరూ ఒకేలా ఉన్నంత మాత్రాన పోటీలలో గెలవలేము. వివిధ సామర్థ్యాలున్నవారు మంచి నావికులు—పనిలో నడిపించడానికి ఒకరు, సరైన సమయంలో కాపాడేందుకు ఒకరు, బాగా పనిచేయడానికి ఒకరు, శాంతపరచడానికి ఒకరు. తెడ్డు వేసే వారెవ్వరూ ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదు, అందరూ పడవ సొత్తే, కానీ వారు మంచిగా తెడ్డు వేయాలంటే ప్రతి ఒక్కరు ఇతరుల అవసరాలు, సామర్థ్యాలతో సర్దుబాటు చేసుకోవాలి—కురచ చేతులున్నవాడు కొద్దిగా సాగదీయాలి, పొడవు చేతులవాడు కొద్దిగా దగ్గరకు లాగాలి.

భిన్నత్వాలను నష్టాలకు బదులుగా లాభాలుగా మార్చుకోవచ్చు. అప్పుడే పడవ దానంతట అదే ముందుకు సాగుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మాత్రమే బాధ విజయోత్సాహానికి పూర్తిగా దారిస్తుంది. మంచిగా “ఊపందుకోవడం“ అనేది కవిత్వంలా అనిపిస్తుంది. 4

పెద్ద అడ్డంకులు ఎదురైనా ఈ జట్టు సరిగ్గా ఊపందుకొని గెలిచింది. ఒలింపిక్ బంగారు పతకం సంతోషం కలిగించినప్పటికీ, తెడ్డు వేసిన ప్రతిఒక్కరు ఆనాడు అనుభవించిన ఐక్యత అనేది వారి జీవితాంతం వారితో నిలిచిన పరిశుద్ధ క్షణం.

మంచి వాటి పెరుగుదలను బట్టి చెడ్డవాటిని తీసివేయుడి

జేకబ్ 5 లో ఉన్న అద్భుతమైన ఉపమానంలో ఓలీవ తోట యజమాని మంచి స్థలములో మంచి చెట్టును నాటెను, కానీ కొంతకాలానికి అది చెడిపోయి అడవి ఫలమును ఫలించెను. “ఈ చెట్టును పోగొట్టుకొనుట నన్ను బాధించుచున్నది,“ అని ఓలీవ తోట యజమాని ఎనిమిదిసార్లు చెప్పును.

ఓలీవ తోట యజమానితో సేవకుడు “ఇంకొంత కాలము (చెట్టు) ను విడిచిపెట్టమని చెప్పగా, ఆ యజమాని — అవును, ఇంకొంత కాలము నేను దానిని విడిచిపెట్టెదను” అని చెప్పును. 5

అప్పుడు మన స్వంత ఓలీవ తోటలో చెట్టు చూట్టూ త్రవ్వి మంచి ఫలాన్ని కనుగొనడానికి ప్రయత్నించే మనందరికి అన్వయించబడగల ఉపదేశం వస్తుంది: “మీరు మంచి వాటి పెరుగుదలను బట్టి చెడ్డవాటిని తీసివేయుడి.” 6

ఐక్యత అనేది అనుకోకుండా జరిగే అద్భుతం కాదు; దానికోసం కష్టపడాలి. అది గందరగోళంగా, కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండి, మనం మంచి వాటి పెరుగుదలను బట్టి చెడ్డవాటిని తీసివేసినప్పుడు క్రమంగా సంభవిస్తుంది.

ఐక్యతను నిర్మించే మన ప్రయత్నాల్లో మనం ఎన్నడూ ఒంటరివారము కాదు. “అప్పుడు సేవకులు వెళ్ళి తమ శక్తితో పనిచేసిరి; ఒలీవతోట యజమాని కూడా వారితోపాటు పనిచేసెను,“ అని జేకబ్ 5 కొనసాగుతుంది. 7

మనలో ప్రతిఒక్కరు లోతుగా గాయపరిచే అనుభవాలను, ఎన్నడూ జరుగకూడని వాటిని కలిగియుండబోతున్నాము. మనలో ప్రతిఒక్కరం కూడా వివిధ సందర్భాల్లో మనం ఫలించే ఫలాన్ని చెడగొట్టుకోవడానికి గర్వాన్ని, అహంకారాన్ని అనుమతిస్తాం. కానీ అన్ని విషయాల్లో యేసు క్రీస్తే మన రక్షకుడు. అత్యంత కష్టమైన సమయాల్లో కూడా ఆయన శక్తి మనకు లభ్యమవుతుంది మరియు మనం ఆయనను పిలిచినప్పుడు నమ్మకంగా అది మనకోసం ఉంటుంది. మన పాపాలు, వైఫల్యాల నిమిత్తం మనమందరం కనికరం కోసం వేడుకుంటాం. ఆయన దానిని ధారాళంగా ఇస్తారు. మనము అదే కనికరాన్ని, గ్రహింపును ఒకరికొకరం ఇచ్చుకోగలమా అని ఆయన మనల్ని అడుగుతారు.

యేసు నిర్మొహమాటంగా చెప్పారు: “ఒకటిగా నుండుడి; మీరు ఒకటిగానుండని యెడల మీరు నా వారు కారు.” 8 కానీ మనం ఒకటిగానున్నట్లయితే—మన అప్పంలో ఒక ముక్కను విడిచిపెట్టగలిగినట్లయితే లేక పరిపూర్ణమైన ఐక్యతలో పడవ ఊపందుకొనేలా మన వ్యక్తిగత నైపుణ్యాలను సర్దుబాటు చేసుకోగలిగినట్లయితే—మనం ఆయన వారవుతాము. మంచి వాటి పెరుగుదలను బట్టి చెడ్డవాటిని తీసివేయడానికి ఆయన సహాయపడతారు.

ప్రవచనాత్మక వాగ్దానాలు

మనం ఆశించిన స్థాయికి మనమింకా చేరుకోకపోవచ్చు, మరియు మనం చేరుకోగల స్థాయిలో మనమిప్పుడు లేము. మనలో మరియు మనమున్న సమూహాల్లో మనం ఆశించిన మార్పు ఆచరణతత్త్వంతో కంటే ఎక్కువగా మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అనుదినం మరింత చురుకుగా ప్రయత్నించినప్పుడు వస్తుంది. ఎందుకు? ఎందుకంటే మనం సీయోనును, అనగా ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియున్న జనులను” నిర్మిస్తున్నాము. 9

నిబంధన స్త్రీలుగా మనం విస్తారమైన ప్రభావాన్ని కలిగియున్నాము. మనం ఒక స్నేహితురాలితో కలిసి చదువుతున్నప్పుడు, పిల్లలను నిద్రపుచ్చుతున్నప్పుడు, బస్సులో ప్రక్కవారితో మాట్లాడుతున్నప్పుడు, సహోద్యోగితో కలిసి ఒక సమర్పణను సిద్ధం చేస్తున్నప్పుడు అనుదిన సందర్భాలలో ఈ ప్రభావం అన్వయించబడుతుంది. దురభిమానాన్ని విడిచి, ఐక్యతను నిర్మించడానికి మనం శక్తిని కలిగియున్నాం.

ఉపశమన సమాజం మరియు యువతులు అనేవి కేవలం తరగతులు కావు. అవి భిన్నమైన స్త్రీలందరు ఒకే పడవలోకి వెళ్ళి మనమందరం మన ఊపందుకొనే వరకు నడిపే మరపురాని అనుభవాలు కాగలవు. మంచి కోసం ప్రపంచాన్ని మార్చివేసే సామూహిక శక్తిలో భాగమవ్వండని నేను ఆహ్వానిస్తున్నాను. పరిచర్య చేయడం, వడలిన చేతులను బలపరచడం, శ్రమపడుతున్న వారిని మన వీపులమీద లేక చేతులలో మోసుకెళ్ళడమే మన నిబంధనాపూర్వక నియామకము. ఏమి చేయాలో తెలుసుకోవడం కష్టమైనది కాదు, కానీ అది తరచు మన స్వార్థపూరిత ఆసక్తులకు వ్యతిరేకంగా ఉంటుంది, అయినా మనం ప్రయత్నించాలి. ఈ సంఘ స్త్రీలకు సమాజాన్ని మార్చే అపరిమిత సామర్థ్యముంది. మనం ఐక్యభావనను కోరుకున్నప్పుడు, మన ప్రయత్నాలను మరింత సంపూర్ణం చేయడానికి దేవుని శక్తిని రప్పిస్తామనే పూర్తి ఆత్మీయ నమ్మకం నాకుంది.

యాజకత్వంపై 1978 బయల్పాటును సంఘం స్మారకంగా జరుపుకున్నప్పుడు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఒక శక్తివంతమైన ప్రవచనాత్మక దీవెననిచ్చారు: “దురభిమానపు భారాలను జయించి మనం పరిపూర్ణమైన శాంతి, సమాధానాలతో— దేవునితో మరియు ఒకరితోనొకరం న్యాయంగా వ్యవహరిస్తామని వినువారందరిపై నేనొక దీవెననిస్తూ ప్రార్థిస్తున్నాను.” 10

ఈ ప్రవచనాత్మక దీవెన ప్రకారం మనం చేస్తామని ఆశిద్దాం మరియు ప్రపంచంలో ఐక్యతను పెంచేందుకు మన వ్యక్తిగత, సామూహిక ప్రయత్నాలను ఉపయోగిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వినయపూర్వకమైన నిత్య ప్రార్థన యొక్క పదాలలో నేను నా సాక్ష్యమిస్తున్నాను: “నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెను.” 11 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.