ప్రభువుకు సిఫారసు చేయబడెను
“ప్రభువుకు సిఫార్సు చేయ”బడు ప్రక్రియను ప్రారంభించండి, ఆ విధంగా ఆయన ఆత్మ మీతో సమృద్ధిగా ఉంటుంది.
శుభోదయం సహోదర, సహోదరిలారా. మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా నేను, ఈ సమావేశము కొరకు ప్రపంచం నలుమూలల నుండి సాంకేతికంగా సమావేశమవడానికి ఎదురుచూచాను.
ఇది మిక్కిలి అసాధారణమైన సంవత్సరము. నాకైతే అది దక్షిణాఫ్రికా, డర్బన్‌లో ప్రభువుకు పరిశుద్ధ దేవాలయమును సమర్పించుటకు ప్రథమ అధ్యక్షత్వము నుండి ఒక నియామకముతో అది ప్రారంభమైంది. ఆ భవనము యొక్క వైభవాన్ని నేను ఎన్నడూ మరచిపోను. కానీ ఆ సంఘటన జరిగే చోట అమరిక కంటె ఎక్కువగా, ఆ పరిశుద్ధ భవనంలోకి ప్రవేశించుటకు చాలా బాగా సిద్ధపడిన జనుల గౌరవానికి నేను ఎల్లప్పుడు విలువిస్తాను. వారు పునఃస్థాపన యొక్క గొప్ప దీవెనలలో ఒకటియైన ప్రభువు మందిరము యొక్క సమర్పణలో పాల్గొనుటకు సిద్ధపడి వచ్చారు. ఆయనకు, ఆయన ప్రాయశ్చిత్తఃము కొరకు ప్రేమతో నిండిన హృదయాలతో వారు వచ్చారు. పైకెత్తబడుటకు నడిపించే పరిశుద్ధ విధులను అందించినందుకు మన పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞతతో నింపబడి వారు వచ్చారు. వారు యోగ్యతతో వచ్చారు.
దేవాలయములు ఎక్కడ ఉన్నప్పటికినీ, అక్కడ లోక విధానాలను జయించుట మనము నేర్చుకుంటాము. ప్రపంచంలోని ప్రతి కడవరి-దిన పరిశుద్ధ దేవాలయములో అనగా ఉన్న 168లో నిత్య జీవితంలోని మన విశ్వాసానికి, మన కుటుంబాలతో సహా, మన పరలోకపు తండ్రితో గడిపే ఆనందానికి నిబంధనలుగా నిలుస్తాయి. దేవాలయములకు హాజరగుట దైవసమూహం మరియు నిత్య సువార్తలను గూర్చిన మన అవగాహనను, సత్యమును జీవించుటకు, బోధించుటకు గల మన ఒడంబడికను, మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించుటకు మన సమ్మతిని హెచ్చిస్తాయి.
సంఘములోని ప్రతీ దేవాలయము వెలుపల “ప్రభువుకే పరిశుద్ధత” అను యుక్తమైన మాటలు కలిగి ఉంటాయి. దేవాలయము ప్రభువు యొక్క మందిరము మరియు లోకము నుండి ఒక ఆశ్రయము. ఆ పరిశుద్ధ గోడలలోపల ఆరాధించు వారిని ఆయన ఆత్మ హత్తుకొనును. ఆయన ఏర్పరచిన ప్రమాణాల ద్వారా ఆయన అతిధులుగా మనము ప్రవేశిస్తాము.
నేను ఎప్పటికీ ఎరిగిన శ్రేష్ఠమైన వ్యక్తులలో ఒకరైన మా మామగారు, బ్లైయిన్ ట్విచిల్, నాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. ఆయన మర్త్య ప్రయాణము ముగింపుకు దగ్గరైనప్పుడు, సహోదరి రేస్బాండ్, నేను ఆయనను చూడటానికి వెళ్లాము. మేము అతని గదిలో ప్రవేశించినప్పుడు, అతని బిషప్పు అప్పుడే వెళుతున్నాడు. మేము బిషప్పును పలుకరించినప్పుడు, “ఎంత మంచి బిషప్పు. అతడు తన వార్డులోని ఒక విశ్వాసుడైన సభ్యునికి పరిచర్య చేస్తూ ఇక్కడున్నాడు” అని నేను అనుకున్నాను.
“బిషప్పు వచ్చి పరామర్శించడం మంచిగా ఉంది కదా” అని నేను బ్లెయిన్‌తో అన్నాను.
బ్లెయిన్ నా వైపు చూసి, “అది పరామర్శించడం కంటే అధికమైనది. నా దేవాలయ సిఫారసు మౌఖికపరీక్ష చేయుటకు రమ్మని బిషప్పును నేను అడిగాను. ప్రభువుకు సిఫారసు చేయబడి నేను చనిపోవాలని కోరుకున్నాను.” అందుకే అతడు విచ్చేసాడు! అని స్పందించాడు.
“ప్రభువుకు సిఫారసు చేయబడి,” అన్న మాట నా మనస్సులో ఉండిపోయింది. అది మన సంఘ నాయకుల చేత క్రమం తప్పకుండా మౌఖికపరిక్ష చేయబడుటపై ఒక క్రొత్త దృక్పథాన్ని తెచ్చింది. సంఘారంభంలో దేవాలయ సిఫారసు ఎంత ముఖ్యమైనదంటే, 1891 వరకు, ప్రతీ దేవాలయ సిఫారసు సంఘ అధ్యక్షునిచేత ఆమోదించబడేది. 1
యువతకైనా లేక పెద్దవారికైనా, మీ దేవాలయ సిఫారసు మౌఖికపరిక్ష చేయాల్సినవి, లేదా చేయకూడని వాటిని గూర్చి కాదు. ఒక సిఫారసు పరిశీలనా సూచిక కాదు, గదిలోకి ప్రవేశార్హత కాదు, లేక ప్రత్యేకంగా స్థానానికి ఒక టికెట్టు కాదు. అది మరింత ఉన్నతమైన, పరిశుద్ధమైన ఉద్దేశమును కలిగియున్నది. ఒక దేవాలయ సిఫారసు యొక్క గౌరవమునకు యోగ్యులగుటకు, మీరు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ బోధనలతో సామరస్యంగా జీవించాలి
మీ మౌఖికపరీక్షలో యేసు క్రీస్తు, ఆయన ప్రాయశ్చిత్తఃమునందు గల వ్యక్తిగత విశ్వాసము గురించి మీ ఆత్మను పరిశోధించుటకు మీరు అవకాశము కలిగియున్నారు. పునఃస్తాపించబడిన సువార్తను గూర్చిన మీ సాక్ష్యమును, ఆయన సంఘమును నడిపించుటకు ప్రభువు పిలిచిన వారిని ఆమోదించుటకు మీ సమ్మతిని, సువార్త సిద్ధాంతమునందు మీ విశ్వాసమును, కుటుంబ బాధ్యతలను మీరు నెరవేర్చుటను, నిజాయితీ, పవిత్రత, నమ్మకము, విధేయత, బుద్ధివాక్యము, దశమభాగములపై మీ గుణాలను, సబ్బాతు దినము యొక్క పరిశుద్ధతను ఆచరించుటను తెలిపే దీవెనను మీరు కలిగియున్నారు. అవి యేసు క్రీస్తు మరియు ఆయన కార్యమునకు సమర్పించబడిన జీవితము యొక్క పునాది సూత్రములైయున్నవి.
మీ దేవాలయ సిఫారసు ప్రభువు యొక్క చట్టములను జీవించుటకు మీరు ప్రయాసపడుచున్నారనే లోతైన, ఆత్మీయ ఉద్దేశమును మరియు ఆయన ప్రేమిస్తున్న వాటిని అనగా నమ్రత, స్థిరత్వము, దాతృత్వము, ధైర్యము, కనికరము, క్షమాపణ, మరియు విధేయతలను మీరు ప్రేమించుటను సూచించును. ఆ పరిశుద్ధ పత్రముపై మీ పేరును సంతకం చేసినప్పుడు ఆ ప్రమాణాలకు మిమ్మల్ని మీరు బద్ధులుగా చేసుకుంటారు.
మీ దేవాలయ సిఫారసు బాప్తీస్మములు, వరములు, వివాహములు, మరియు బంధనలు అను నిత్య ప్రాముఖ్యత గల విధులు మరియు హక్కులతో మీకు, ఇతరులకు పరలోకపు ద్వారములను తెరుచును.
“ప్రభువుకు సిఫారసు చేయబడియుండుటకు” నిబంధన పాటించే కడవరి-దిన పరిశుద్ధుని నుండి ఏమి ఆశించబడుతుందో జ్ఞాపకముంచుకోవాలి. మా మామయైన బ్లెయిన్, ప్రభువు యెదుట వినయంగా నిలబడే దినము కొరకు అమూల్యమైన సిద్ధపాటుగా దానిని చూసాడు.
మోషే హోరేబు కొండపైకి వెళ్లినప్పుడు, ప్రభువైన యెహోవా అతనికి మండుచున్న పొదలో కనిపించిన దానిని పరిశీలించండి. దేవుడు అతనితో చెప్పాడు, “దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము.” 2
దేవాలయ ద్వారము వద్ద మన చెప్పులను విడిచిపెట్టుటకు అర్ధమేమనగా, ఆత్మీయ అభివృద్ధి నుండి మనల్ని అంతరాయపరచు లోకసంబంధమైన కోరికలను లేక సంతోషాలను విడిచి, మన ప్రశస్తమైన మర్త్యత్వమును దారిమళ్లించే విషయాలను ప్రక్కన పెట్టి, వివాదాస్పద ప్రవర్తన చేత గాయపరచబడకుండా, పరిశుద్ధముగా ఉండుటకు సమయాన్ని వెదకుట.
దైవరూపకల్పన చే మన భౌతిక శరీరము దేవుని యొక్క సృష్టి, మీ ఆత్మ యొక్క దేవాలయము, మరియు అది భక్తిగల గౌరవంతో చూడబడాలి. “నా శరీరము ఒక దేవాలయము, దానికి గొప్ప సంరక్షణ అవసరము,” 3 అనే ప్రాధమిక పాట యొక్క మాటలు చాలా యధార్ధమైనవి. ప్రభువు నీఫైయులకు ప్రత్యక్షమైనప్పుడు, “నా యెదుట మచ్చలేక యుండునట్లు, మీరు పరిశుద్ధాత్మను పొందుట ద్వారా పరిశుద్ధ పరచబడుము” అని ఆయన ఆజ్ఞాపించాడు. 4 “మీరు ఏవిధమైన మనుష్యులైయుండవలెననుకొనుచున్నారు?”5 అని ప్రభువు అడిగి, మరియు “నా వలెనే,” అని జవాబిచ్చాడు. 5 “ప్రభువుకు సిఫారసు చేయబడుటకు” మనము ఆయనవలే ఉండుటకు ప్రయాసపడతాము.
సంఘము యొక్క 14 వ అధ్యక్షునిగా తన మొదటి ప్రసంగములో అధ్యక్షులు హవార్డ్ డబ్ల్యు. హంటర్‌ను నేను వినుటను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన అన్నారు: “సంఘము యొక్క ప్రతీ సభ్యుడు దేవాలయములో ప్రవేశించుటకు యోగ్యతగా ఉండాలని నా హృదయ ఆకాంక్ష. ప్రతీ వయోజన సభ్యుడు చలామణిలో ఉన్న దేవాలయ సిఫారసును —కలిగియుండుటకు— యోగ్యతతో ఉంటే ప్రభువుకు సంతోషము కలిగించును.” 6 పరిమిత-ఉపయోగ సిఫారసు మన ప్రశస్తమైన యువత కొరకు ఒక స్పష్టమైన మార్గాన్ని నిర్ధేశిస్తుందని నేను చేరుస్తాను.
అధ్యక్షులు హంటర్ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు, “ఆ రోజు, జూన్ 6, 1994న, నా పర్సులో మేము తీసుకువెళ్లే దేవాలయ సిఫారసు ఒక ప్రత్యేక వస్తువుగా మారింది. అంతకు ముందు, అది కావాల్సిన ఫలితమివ్వడానికి మాత్రమే చేయబడింది. అది ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరములోనికి ప్రవేశించుటకు నన్ను అనుమతించే సాధనము; కానీ ఆయన ప్రకటన తరువాత, అది దానికదే స్వంత లక్ష్యమైంది. అది దేవుని ప్రవక్త పట్ల నా విధేయతకు ఒక చిహ్నముగా మారింది.” 7
మీరు ఒక సిఫారసు పొందాల్సిన యెడల లేక మీ సిఫారసు గడువు ముగిసిన యెడల, 1845 మరియు 1846 లో నావూ దేవాలయ ద్వారము వద్ద పూర్వపు పరిశుద్ధులు వరసగా నిలబడినట్లుగా, బిషప్పు ద్వారము వద్ద వరసగా నిలబడండి. 39 ఆ విశ్వాసుల మధ్య నా పూర్వీకులున్నారు. వారు తమ అందమైన పట్టణాన్ని విడిచి పశ్చిమంగా వెళుతున్నారు, కానీ దేవాలయములో వారికోసం పరిశుద్ధ అనుభవాలు ఎదురుచూస్తున్నాయని వారికి తెలుసు. అయోవాలో కఠినమైన కాలిబాట ప్రయాణంలో శారా రిచ్ ఇలా వ్రాసింది, “ఆ దేవాలయములో మాకు దయచేయబడిన విశ్వాసము మరియు జ్ఞానము లేకపోతే … మా ప్రయాణము … చీకటిలోనికి జారిపోయినట్లుగా ఉండేది.” 9 దేవాలయములో వాగ్దానము చేయబడిన ప్రేరేపణ మరియు శాంతి లేకుండా ఈ జీవితం గుండా మనము వెళ్లినప్పుడు మనము కోల్పోయేది ఇదే.
“ప్రభువుకు సిఫారసు చేయబడే” ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించండి, ఆవిధంగా ఆయన ఆత్మ మీతో సమృద్ధిగా ఉండి, ఆయన ప్రమాణాలు మీకు “సమాధానముగల మనస్సాక్షిని” 10 తెస్తాయి.
మీ యువ నాయకులు, ఎల్డర్స్ కోరము అధ్యక్షుడు, ఉపశమన సమాజ అధ్యక్షురాలు, మరియు పరిచర్య చేయు సహోదర, సహోదరీలు మీరు సిద్ధపడటానికి సహాయపడతారు, మీ బిషప్పు లేక బ్రాంచి అధ్యక్షులు మిమ్మల్ని ప్రేమతో నడిపిస్తారు.
దేవాలయములు మూసివేయబడిన లేదా వాటిని పరిమితంగా ఉపయోగించే సమయాన్ని మనము అనుభవిస్తున్నాము. అధ్యక్షులు నెల్సన్, ఆయన ప్రక్కన సేవ చేస్తున్న మాకు, దేవాలయములు మూసివేయాలనే ప్రేరేపించబడిన నిర్ణయం తీసుకున్నప్పుడు “బాధతో కూడినదై” మరియు “తీవ్ర ఆందోళనకు గురిచేసింది.” అధ్యక్షులు నెల్సన్ “ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్‌కు నేను ఏమని చెప్పాలి.” బ్రిగం యంగ్, విల్ఫోర్డ్ వుడ్రఫ్, మరియు అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ వరకు గల ఇతర అధ్యక్షులకు నేను ఏమని చెప్పాలి?” 11 అని తనను తాను ప్రశ్నించుకున్నారు.
ఇప్పుడు, ఒక పరిమిత స్థాయిలో బంధనలు మరియు వరముల కొరకు దేవాలయాలను క్రమంగా, కృతజ్ఞతపూర్వకంగా మేము తిరిగి తెరుస్తున్నాము.
అయినప్పటికినీ, దేవాలయానికి హాజరగుటకు యోగ్యత కలిగియుండుట ఆపబడలేదు. మీరు ఒక దేవాలయమునకు వెళ్ళగలిగినా లేక వెళ్లలేకపోయినా, నిబంధన బాటపై స్థిరంగా నిలిచియుండుటకు మీకు చలామణిలో ఉన్న ఒక దేవాలయ సిఫారసు అవసరము.
గత సంవత్సరం చివరిలో నేను, సహోదరి రేస్బాండ్ న్యూజిలాండ్‌లో యుక్తవయస్సుగల వయోజన గుంపుతో మాట్లాడే పనిమీద వెళ్లాం. వారికి దేవాలయముకు వెళ్లుటకు సులభముకాదు; హామిల్టన్ నవీకరించబడుతున్నది, ఇంకా వారు ఆక్లాండ్‌లో దేవాలయ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికినీ, దేవాలయ సిఫారసులను నవీకరించుకోమని లేక పొందమని వారిని ప్రోత్సహించడానికి నేను ప్రేరేపించబడ్డాను.
వారు దేవాలయముకు వెళ్లలేకపోయినప్పటికినీ, వారు పరిశుద్ధముగా ప్రభువు యెదుట తమను తాము హాజరుపరచుకొని, ఆయనకు సేవ చేయుటకు సిద్ధపడియుంటారు. చలామణిలో ఉన్న దేవాలయ సిఫారసును కలిగియుండుట అపవాది నుండి రక్షణను, ఎందుకనగా మీ జీవితం గురించి మీరు ప్రభువుకు ఒక స్థిరమైన ఒడంబడిక చేసారు, మరియు ఆత్మ మీతో ఉంటుందనే ఒక వాగ్దానము.
మన పూర్వీకుల కొరకు అన్వేషించి, వారి పేర్లను విధుల కొరకు అప్పగించినప్పుడు మనము దేవాలయపు పనిని చేస్తున్నాము. మన దేవాలయములు మూసివేయబడియుండగా, మనము మన కుటుంబాలను ఇంకా పరిశోధించగలము. “ప్రభువుకు సిఫారసు చేయబడుటకు,” మన హృదయాలలో దేవుని యొక్క ఆత్మతో, మనము వారికి ప్రతినిధులుగా నిలబడతాం.
దేవాలయ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నేను సేవ చేస్తున్నప్పుడు, నావూ దేవాలయము గురించి ప్రభువు చేత మాట్లాడబడిన ఈ లేఖనమును అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ సూచించుట నేను తరుచుగా విన్నాను: “ఆయన దేవాలయపు పని, మరియు ఆయన మనకు అప్పగించిన కార్యమంతా కొనసాగవలెనని, అది ఆపబడరాదని చెప్పారు; మన శ్రద్ధ , పట్టుదల, క్రియలు రెట్టింపు చేయబడవలెను, అప్పుడు మనము ఎన్నడూ ప్రతిఫలాన్ని కోల్పోమని, సైన్యముల కధిపతి చెప్పారు.” 12
దేవాలయములో మన పని మన నిత్య బహుమానముతో ముడిపడియున్నది. ఇటీవల మేము పరీక్షించబడ్డాము. “శ్రద్ధ, … పట్టుదల, మరియు సహనంతో” దేవాలయములో పనిచేయమని ప్రభువు మనల్ని పిలిచారు. 13 “ప్రభువుకు సిఫారసు చేయబడుటకు” ఆ లక్షణాలు అవసరము. మనము ఆజ్ఞలను జీవించడంలో శ్రద్ధ వహించాలి, మన దేవాలయ నిబంధనలపై మన ఆసక్తిని చూపుటలో పట్టుదలతో ఉండాలి, ప్రభువు వాటి గురించి బోధించుట కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞత కలిగియుండాలి, మరియు దేవాలయాలు వాటి సంపూర్ణతలో తిరిగి తెరవడానికి మనము ఎదురుచూస్తున్నప్పుడు ఓపికతో ఉండాలి.
మన ప్రయత్నాలను “రెట్టింపు” చేయమని ప్రభువు మనల్ని పిలిచినప్పుడు, మనము నీతియందు వృద్ధి చెందమని ఆయన అడుగుతున్నారు. ఉదాహరణకు, మన లేఖన అధ్యయనము, మన కుటుంబ చరిత్రా పరిశోధన, మన విశ్వాసపు ప్రార్ధనలు పొడిగించబడాలి, ఆవిధంగా ఒక దేవాలయ సిఫారసును పొందడానికి సిద్ధపడు వారితో, ప్రత్యేకంగా మన కుటుంబసభ్యులతో, ప్రభువు యొక్క మందిరము కొరకు మన ప్రేమను పంచుకోవచ్చు.
మీ నీతిగల ప్రయత్నాలను మీరు రెట్టింపు చేసినప్పుడు, తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తుకు మీ సమర్పణయందు నవీకరించబడినట్లు మీరు భావిస్తారని, పరిశుద్ధాత్మ సమృద్ధిగా మిమ్మల్ని నడిపించుటను మీరు అనుభవిస్తారని, మీ పరిశుద్ధ నిబంధనల కొరకు మీరు కృతజ్ఞత కలిగియుంటారని, మీరు “ప్రభువుకు సిఫారసు చేయబడ్డారు,” అని తెలుసుకొని మీరు శాంతిని పొందుతారని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తులునిగా నేను మీకు యేసు క్రీస్తు నామములో వాగ్దానము చేస్తున్నాను, ఆమేన్.