సీయోనులోని సహోదరీలు
ఇశ్రాయేలును సమకూర్చడంలో, సీయోను జనులను సృష్టించడంలో మీరు ఆవశ్యకమైన శక్తి అవుతారు.
నా ప్రియమైన సహోదరీలారా, ప్రపంచ చరిత్రలో ఈ అద్భుతమైన సమయంలో మాట్లాడుతున్నందుకు నేను ధన్యుడిని. ప్రతిరోజు మనం రక్షకుడైన యేసు క్రీస్తు మరలా భూమికి వచ్చే మహిమకరమైన క్షణానికి దగ్గరవుతున్నాం. ఆయన రాకడకు ముందు వచ్చే భయంకరమైన సంఘటనల గురించి కొంత మనకు తెలుసు, అయినప్పటికీ ఆయన తిరిగివచ్చే ముందు నెరవేర్చబడే మహిమకరమైన వాగ్దానాల గురించి తెలుసు గనుక మన హృదయాలు ఆనందంతో, విశ్వాసంతో ఉప్పొంగుతాయి.
పరలోక తండ్రి యొక్క ప్రియ కుమార్తెలుగా, ఆయన రాజ్యంలో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కుమార్తెలుగా, 1 ముందున్న ముఖ్య సమయాల్లో మీరు కీలక పాత్ర పోషిస్తారు. హనోకు పట్టణంలోని జనుల వలె జీవించుటకు సమకూర్చబడి, సిద్ధపరచబడిన జనుల యొద్దకు రక్షకుడు వస్తారని మనకు తెలుసు. అక్కడి జనులు యేసు క్రీస్తు నందు విశ్వాసములో ఏకమైయున్నారు మరియు పూర్తిగా శుద్ధులైనందున వారు పరలోకానికి తీసుకుపోబడ్డారు.
హనోకు జనులకు ఏమి జరుగుతుంది మరియు కాలములు సంపూర్ణమైన ఈ చివరి యుగంలో ఏమి జరుగుతుంది అని ప్రభువు బయల్పరచిన వర్ణన ఇక్కడుంది:
“భూమి విశ్రమించు దినము వచ్చును, కాని ఆ దినమునకు ముందు ఆకాశము చీకటిగా మారును, చీకటిపొరలు భూమిని కప్పును; భూమ్యాకాశములు వణకును; మనుష్య కుమారుల మధ్య గొప్పబాధ కలుగును, కాని నా జనులను నేను కాపాడెదను;
“పరలోకమునుండి నీతిని నేను క్రిందకు పంపుదును; నా అద్వితీయ కుమారుని గూర్చి, మరణమునుండి ఆయన పునరుత్థానమును, సమస్త మానవుల పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు భూమినుండి సత్యమును నేను పంపుదును; నేను సిద్ధముచేయు ఒక స్థలమునకు, నా పరిశుద్ధ పట్టణమునకు భూమి నలుమూలల నుండి నేను ఎన్నుకొనిన వారిని పోగుచేయుటకు నీతియు, సత్యమును వరదవలె భూమిని ముంచివేయునట్లు చేయుదును, తద్వారా వారు తమ నడుములకు దట్టీలు కట్టుకొని, నా రాకడ సమయము కొరకు కనిపెట్టుదురు; ఏలయనగా అక్కడ నా మందిరముండును మరియు అది సీయోనుగా, ఒక నూతన యెరూషలేముగా పిలువబడును.
“దేవుడు హనోకుతో ఈలాగు సెలవిచ్చెను: అప్పుడు నీవును, నీ పట్టణమంతయు అక్కడ వారిని కలుసుకొందురు, వారిని మనము మన కౌగిలిలోనికి తీసుకొందుము, వారు మనలను చూచెదరు; వారి మెడలమీద మనము, మన మెడలమీద వారు పడి ఒకరికొకరు ముద్దు పెట్టుకొందుము;
“అక్కడ నా నివాసముండును, అది సీయోనుయై యుండును, అది నేను చేసిన సృష్టి అంతటిలోనుండి బయటకు వచ్చును; వెయ్యేండ్ల వరకు భూమి విశ్రమించును.” 2
సహోదరీలైన మీరు, మీ కుమార్తెలు, మీ మనవరాళ్ళు మరియు మీరు పోషించు స్త్రీలు, రక్షకునితో మహిమకరమైన సహవాసములో చేరు జనుల యొక్క ఆ సమాజాన్ని సృష్టించడంలో ముఖ్య భాగమవుతారు. ఇశ్రాయేలును సమకూర్చడంలో, నూతన యెరూషలేములో సమాధానమందు జీవించు సీయోను జనులను సృష్టించడంలో మీరొక ఆవశ్యకమైన శక్తి అవుతారు.
ప్రభువు తన ప్రవక్తల ద్వారా మీకొక వాగ్దానమిచ్చారు. “మీరు మీ విశేషాధికారములకు తగినట్లుగా జీవించినట్లయితే, మీ సహవాసులు కావడం నుండి దేవదూతలు నిరోధించబడలేరు,“ అని ఉపశమన సమాజపు తొలిరోజులలో ప్రవక్త జోసెఫ్ స్మిత్ సహోదరీలతో చెప్పారు. 3
ఆ అద్భుత సామర్థ్యం మీలో ఉంది, మీరు దానికోసం సిద్ధం చేయబడుతున్నారు.
అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా అన్నారు:
“సహోదరీలైన మీరు … తన పిల్లల నిత్య సంతోషం మరియు సంక్షేమం కొరకు మన తండ్రి యొక్క ప్రణాళికలో తక్కువ స్థానాన్ని కలిగిలేరు. ఖచ్చితంగా మీరు ఆ ప్రణాళికలో ఆవశ్యకమైన భాగమైయున్నారు.
“మీరు లేకుండా ఆ ప్రణాళిక పనిచేయలేదు. మీరు లేకుండా పూర్తి ప్రణాళిక వ్యర్థం చేయబడుతుంది. …
“మీలో ప్రతిఒక్కరు దేవుని కుమార్తెయై, దైవిక జన్మహక్కుతో దీవించబడ్డారు.“ 4
రక్షకుని రాకడ కొరకు సిద్ధపాటులో మీరు పోషించే పాత్రను మన ప్రస్తుత ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా వర్ణించారు:
“భార్యలు, తల్లులు, మామ్మలుగా; సహోదరీలు, అత్తలు, చిన్నమ్మలుగా; బోధకులు మరియు నాయకురాళ్ళుగా; ప్రత్యేకించి శ్రేష్టమైన మాదిరులుగా, విశ్వాసమును కాపాడు భక్తులుగా కుటుంబాలపై మాత్రమే కాదు, కానీ ప్రభువు సంఘముపై కూడా స్త్రీలు కలిగియున్న … ప్రభావమును లెక్కించుట అసాధ్యము.
“ఆదాము హవ్వల నాటి నుండి ప్రతి సువార్త యుగములో ఇది నిజమైయున్నది. అయినప్పటికీ ఈ యుగపు స్త్రీలు మరే ఇతర యుగపు స్త్రీలకన్నా ప్రత్యేకమైనవారు, ఎందుకంటే ఈ యుగము మరేయితర యుగముకన్నా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకత విశేషాధికారాలను, బాధ్యతలను తెస్తుంది.” 5
ఈ యుగము ప్రత్యేకమైనది, ఎందుకంటే హనోకు పట్టణం వలె ఉండేందుకు సిద్ధపడడానికి ప్రభువు మనల్ని నడిపిస్తారు. సీయోను జనులకు ఆ పరివర్తన దేనిని అనివార్యం చేస్తుంది అనేదానిని ఆయన తన అపొస్తలులు, ప్రవక్తల ద్వారా వివరించారు.
ఎల్డర్ బ్రూస్ ఆర్. మెఖాంకి ఇలా బోధించారు:
“(హనోకుది) దుష్టత్వము చెడుతనము గల దినము, అంధకారము తిరుగుబాటుతనము గల దినము, యుద్ధము నిర్జనము గల దినము, నీటితో భూమిని శుద్ధిచేయడానికి నడిపింపబడుతున్న దినము.
“అయినప్పటికీ హనోకు విశ్వాసము గలవాడు. అతడు ‘ప్రభువును చూసెను,‘ ఒక మనిషి మరొకరితో మాట్లాడినట్లుగా ‘ముఖాముఖిగా‘ ఆయనతో మాట్లాడెను. (మోషే 7:4.) లోకానికి పశ్చాత్తాపము ప్రకటించమని ప్రభువు అతడిని పంపెను మరియు ‘తండ్రి యొక్కయు, కృపాసత్యసంపూర్ణుడైన కుమారుని యొక్కయు, తండ్రిని కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీస్మము ఇయ్యవలెనని‘ అతడిని ఆజ్ఞాపించెను.’ (మోషే 7:11.) హనోకు నిబంధనలుచేసి, నిజమైన విశ్వాసుల సమూహమును సమావేశపరిచెను, వారందరు ఎంత విశ్వాసులుగా మారిరి అనగా ’ప్రభువు వచ్చి తన జనులతో నివసించెను, వారు నీతియందు జీవించిరి,’ మరియు ఉన్నతమైన దానినుండి దీవించబడిరి. ’ప్రభువు తన జనులను సీయోను అని పిలిచెను, ఎందుకనగా వారు ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియుండి, నీతియందు జీవించిరి; వారి మధ్య బీద వారెవరును లేరు.’ (మోషే 7:18.) …
“ప్రభువు తన జనులను సీయోను అని పిలిచిన తర్వాత, హనోకు ‘ఒక పట్టణమును నిర్మించెను, అది పరిశుద్ధ పట్టణము అనగా సీయోను అని పిలువబడెను;‘ ఆ సీయోను ‘పరలోకమునకు కొనిపోబడెను,‘ అక్కడ ‘తన సన్నిధిలో నివసించునట్లు దేవుడు దానిని కొనిపోయెను; అప్పటినుండి సీయోను వెళ్ళిపోయెను అను మాట బయలువెళ్ళెను.‘ (మోషే 7:19, 21, 69.) …
“పరలోకమునకు కొనిపోబడిన అదే సీయోను తిరిగి రావలెను … ప్రభువు మరలా సీయోనును తెచ్చినప్పుడు దాని నివాసులు అప్పుడు స్థాపించబడు నూతన యెరూషలేముతో చేరుదురు.” 6
గతం ప్రస్తావించబడినట్లయితే, రక్షకుని రాకడ సమయంలో, దేవునితో తమ నిబంధనలకు బలంగా బద్ధులైయున్న కుమార్తెలు ఆయన వచ్చినప్పుడు ఆహ్వానించుటకు సిద్ధపడియున్న వారిలో సగం కంటే ఎక్కువగా ఉంటారు. కానీ సంఖ్యలేవైనప్పటికీ, ఆ సీయోను కోసం సిద్ధం చేయబడిన జనుల మధ్య ఐక్యతను సృష్టించడంలో మీ వంతు సగానికంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది.
ఆ విధంగా ఉంటుందని నేనెందుకు నమ్ముతున్నానో మీకు చెప్తాను. మోర్మన్ గ్రంథము సీయోను జనుల వృత్తాంతము నొకదానిని ఇస్తుంది. మీకు గుర్తుందా, పునరుత్థానుడైన రక్షకుని చేత వారు బోధించబడి, ప్రేమించబడి, దీవించబడిన తర్వాత, ”జనుల హృదయాలలో నివసించిన దేవుని ప్రేమను బట్టి దేశమందు ఎట్టి వివాదము లేకుండెను.” 7
వివాదాన్ని తొలగించి, దేవుని పట్ల వారి ప్రేమతో మరియు వారు సేవచేసే వారిలో వారు సృష్టించిన దేవుని ప్రేమతో నీతిని పెంచే బహుమానాన్ని పరలోక తండ్రి కుమార్తెలు కలిగియున్నారని నా అనుభవం నాకు నేర్పింది.
నా బాల్యపు గృహంలో మా చిన్న శాఖ కలుసుకున్నప్పుడు నా యౌవనంలో నేను దానిని చూసాను. నా సోదరుడు, నేను మాత్రమే అహరోను యాజకత్వం కలిగియున్నాము, నా తండ్రి మాత్రమే మెల్కీసెదకు యాజకత్వం కలిగియున్నారు. శాఖ ఉపశమన సమాజ అధ్యక్షురాలు పరివర్తన చెందిన వ్యక్తి, ఆమె భర్త ఆమె సంఘ సేవతో సంతోషంగా లేరు. సభ్యులంతా వారి ఇళ్ళలో యాజకత్వం గలవారు లేని వయస్సైన సహోదరీలు. మా అమ్మ, ఆ సహోదరీలు ఒకరినొకరు ప్రేమించి, బలపరచి, జాగ్రత్త వహించడాన్ని నేను గమనించాను. నేను సీయోను గురించి ముందుగానే క్షణికదర్శనం ఇవ్వబడ్డానని నేనిప్పుడు తెలుసుకున్నాను.
విశ్వాసం గల స్త్రీల ప్రభావం గురించి నా శిక్షణ న్యూ మెక్సికోలోని ఆల్‌బుకర్క్‌లో సంఘము యొక్క చిన్న శాఖలో కొనసాగింది. శాఖాధ్యక్షుని భార్య, జిల్లా అధ్యక్షుని భార్య మరియు ఉపశమన సమాజ అధ్యక్షురాలు క్రొత్తగా వచ్చిన, పరివర్తన చెందిన ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం నేను గమనించాను. రెండు సంవత్సరాలు అక్కడి సహోదరీల ప్రభావాన్ని గమనించిన తర్వాత, నేను ఆల్‌బుకర్క్‌ను వదిలివెళ్ళిన ఆదివారం అక్కడ మొదటి స్టేకు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ప్రభువు అక్కడ ఒక దేవాలయాన్ని ఉంచారు.
తరువాత నేను బోస్టన్‌కు వెళ్ళాను, అక్కడ రెండు రాష్ట్రాలలో విస్తరించిన చిన్న శాఖలపై అధ్యక్షత్వం వహించే జిల్లా అధ్యక్షత్వంలో నేను సేవ చేసాను. అక్కడున్న వివాదాలు మనస్సులను మృదువుగా చేయడంలో సహాయపడిన ప్రియమైన, క్షమాగుణం గల స్త్రీల చేత ఒకటి కంటే ఎక్కవసార్లు పరిష్కరించబడ్డాయి. నేను బోస్టన్‌ను విడిచివెళ్ళిన ఆదివారం మస్సాచుసెట్స్‌లో మొదటి స్టేకును ప్రథమ అధ్యక్షత్వపు సభ్యులొకరు ఏర్పాటుచేసారు. ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడు నివసించిన చోటుకు దగ్గరగా ఇప్పుడక్కడ ఒక దేవాలయం ఉంది. ఆయన సంఘములో క్రియాశీలక సభ్యులైయుండి, విశ్వాసంగల ప్రియమైన భార్యచేత ప్రభావితం చేయబడి, ఆ తర్వాత స్టేకు అధ్యక్షునిగా, మిషను అధ్యక్షునిగా సేవచేయడానికి పిలువబడ్డారు.
సహోదరీలారా, దేవుని కుమార్తెలైయుండి మీరు ప్రత్యేక బహుమానాలతో దీవించబడ్డారు. ఇతరులను పోషించడానికి, సీయోను సమాజంలో కలిసి జీవించడానికి వారిని అర్హులుగా చేసే ప్రేమ, శుద్ధతలను వారు ఎక్కువగా కలిగియుండేందుకు సహాయపడడానికి ఒక ఆత్మీయ సామర్థ్యాన్ని మీరు మీతోపాటు మర్త్య జీవితంలోకి తెచ్చారు. పరలోక తండ్రి కుమార్తెల కోసం ప్రత్యేకించబడిన మొదటి సంఘ నిర్మాణమైన ఉపశమన సమాజము, “దాతృత్వము ఎన్నటికీ విఫలము కాదు“ అనేదానిని ఆదర్శవాక్యంగా కలిగియుండడం అనుకోకుండా జరిగింది కాదు.
దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది. దీర్ఘకాలము ఎదురుచూసిన, వాగ్దానమివ్వబడిన సీయోను సమాజంలో నివసించే అద్భుతమైన బహుమానం కోసం మిమ్మల్ని, మీరు ప్రేమించి, సేవించే వారిని అర్హులుగా చేసేవి ఆయన యందున్న విశ్వాసము మరియు అనంతమైన ఆయన ప్రాయశ్చిత్తము యొక్క సంపూర్ణ ప్రభావాలు. అక్కడ మీరు ప్రభువు చేత, మీరు దీవించిన వారిచేత వ్యక్తిగతంగా ప్రేమించబడి, సీయోనులోని సహోదరీలవుతారు.
మీరు భూమిపైన ప్రభువు రాజ్యము యొక్క పౌరులని నేను సాక్ష్యమిస్తున్నాను. మీరు ప్రియమైన పరలోక తండ్రి కుమార్తెలు, ఆయన మిమ్మల్ని ప్రత్యేక బహుమానాలతో లోకంలోకి పంపారు, ఇతరులను దీవించడానికి వాటిని ఉపయోగిస్తామని మీరు వాగ్దానం చేసారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు మిమ్మల్ని చేయి పట్టుకొని నడిపించునని నేను మీకు వాగ్దానమిస్తున్నాను. ఆయన వాగ్దానం చేసిన సీయోనుగా కావడానికి ఆయన జనులను సిద్ధపరచడంలో మీరు ఆయనకు సహాయపడినప్పుడు, ఆయన మీ ముందు మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.