సర్వసభ్య సమావేశము
నేను దేవదూతలను నమ్ముచున్నాను
అక్టోబరు 2020 సర్వసభ్య సమావేశము


10:45

నేను దేవదూతలను నమ్ముచున్నాను

మీరు ఎదుర్కొను సవాళ్లు ప్రభువుకు తెలియును. ఆయన మిమ్ములనెరుగును, ఆయన మిమ్ములను ప్రేమించును, ఆయన మీకు సహాయము చేయుటకు దేవదూతలను పంపునని నేను వాగ్దానము చేయుచున్నాను,

సహోదర సహోదరీలారా, నేను దేవదూతలను నమ్ముచున్నాను మరియు వారితో నా యొక్క అనుభవములను మీతో పంచుకొనగోరుచున్నాను. ఈ విధంగా మనము దేవదూతల యొక్క ప్రాముఖ్యతను మన జీవితాలలో గుర్తిస్తామని ఆశిస్తున్నాను మరియు ప్రార్ధిస్తున్నాను.

గత సర్వసభ్యసమావేశంలో ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలెండ్ ఇలా అన్నారు: “దేవుని హస్తాలలో పనిముట్లుగా ఉన్నవారిని గూర్చి మనం మాట్లాడినప్పుడు, వారందరూ మరణించిన వారే కావలసిన అవసరం లేదని మనం జ్ఞాపకం చేయబడతాం.” వారిలో కొందరు ఇక్కడ, ఇప్పుడు ప్రతిరోజూ మనతో కలిసి నడుస్తు, మాట్లాడుతూ ఉన్నవారే. వారిలో కొందరు మన సొంత ఇరుగుపొరుగువారే. … కొందరు మనుషుల యొక్క దయ, భక్తి, అత్యంత మంచితనం, స్వచ్ఛత యందు దేవుని ప్రేమ వ్యక్తమైనప్పుడు వాస్తవంగా, వారు దేవదూతల వంటివారు అనే భావం కలిగి, పరలోకం ఎంతో దూరంగా లేదనిపిస్తుంది” (“The Ministry of Angels,” లియహోనా, నవం. 2008, 30).

మరణపుతెరకు ఇవతలనున్న దేవదూతలను గూర్చి నేను మాట్లాడాలని కోరుతున్నాను. మన అనుదిన జీవితంలో మన మధ్య నడిచే దేవదూతలు దేవునికి మనపై గల ప్రేమకు బలమైన జ్ఞాపికలు.

నేను మొట్టమొదటిగా ప్రస్తావించబోయే దేవదూతలు, నేను యువకునిగా ఉన్నప్పుడు నాకు సువార్తను బోధించిన ఇద్దరు సువార్తికురాళ్లు, సహోదరి విల్మా మొలీనా మరియు సహోదరి ఇవోనీట్ రివిట్టి నా చిన్న చెల్లెలు, నేను, సంఘము యొక్క ఒక కార్యక్రమమునకు ఆహ్వానింపబడినప్పుడు అక్కడ మేము ఈ ఇద్దరు దేవదూతలను కలుసుకున్నాము. ఆ చిన్న కార్యక్రమము ఎంతగా నా జీవితమును మార్చివేస్తుందో నేనెప్పుడూ ఊహించలేదు.

ఆ సమయంలో నా తల్లిదండ్రులకు, తోబుట్టువులకు ఈ సంఘమును గూర్చి అధికంగా తెలుసుకొనవలెననే ఆసక్తి లేదు. ఆ మిషనరీలు మా ఇంటికి రావడం కూడా వారు ఇష్టపడలేదు. కనుక నా మిషనరీ పాఠములను ఒక సంఘభవనములో నేర్చుకున్నాను. ఆ మందిరంలోని చిన్న గది నాకు “పరిశుద్ధవనంగా” మారింది.

తన సహోదరితో యవ్వనుడైన ఎల్డర్ గోడోయ్

ఈ దేవదూతలు నన్ను సువార్తకు పరిచయం చేసిన ఒక నెల తరువాత నేను బాప్తీస్మము పొందాను. అప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు. దురదృష్టవశాత్తు ఆ పరిశుద్ధసంఘటన యొక్క చిత్రం నా వద్ద లేదు. కాని, నేను, నా సహోదరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి చిత్రం మాత్రం నా వద్ద ఉన్నది. ఈ చిత్రంలో ఉన్నవారిని విశదపరచే అవసరం నాకున్నది. కుడివైపున పొడవుగా ఉన్నది నేను.

మీరు ఊహించగలిగినట్లు ఈ సంఘంలో అప్పుడే మారిన నా జీవితవిధానం, ఆ బాటను అనుసరించని కుటుంబంతో సంఘ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం కౌమారదశలోనున్న నాకు సవాలుగా ఉండేది.

నేను నా క్రొత్త జీవితమునకు, క్రొత్త సంస్కృతికి, మరియు క్రొత్త స్నేహితులకు అలవాటుపడటానికి ప్రయత్నించే సమయంలో, నేనొక పరాయివానిననే భావన కలిగేది. చాలా సార్లు నాకు ఒంటరిగాను, నిరుత్సాహంగాను అనిపించేది. ఈ సంఘం నిజమైనదని తెలుసు, కాని అందులో నేనూ ఒకనిగా భావించుకొనడం కష్టమయ్యేది. నాయొక్క క్రొత్త మతంలో ఇమడటానికి ప్రయత్నించడం ఇబ్బందిగాను, అయోమయంగాను ఉన్న సమయంలో, క్రొత్త స్నేహితుల పరిచయానికి సహాయపడగలదని తలంచి మూడు దినాల యవ్వనుల సమావేశంలో పాల్గొనడానికి సాహసం చేశాను. అదే సమయంలో నేను మోనికా బ్రేండావో అనే మరొక రక్షణ దూతను కలుసుకున్నాను.

సహోదరి గోడోయ్

బ్రెజిల్ యొక్క వేరొక ప్రదేశము నుండి రావడం వలన ఆమె ఆ ప్రాంతానికి క్రొత్త. ఆమె త్వరగా నా దృష్టిని ఆకర్శించింది, నా అదృష్టవశాత్తు నన్ను ఒక స్నేహితునిగా ఆమె అంగీకరించింది. నా అంచనా ప్రకారం ఆమె నా ఆకారం కంటే అధికంగా నా మనసులోనికి చూచింది.

ఆమె నాతో స్నేహం చేసినందుకు తన స్నేహితులకు నన్ను పరిచయం చేసింది, వారు కూడా నా స్నేహితులయ్యారు, ఆ తరువాత జరిగిన అనేక యవ్వనస్తుల కార్యక్రమాలలో నేను పాల్గొన్నప్పుడు మేము కలిసి ఆనందించాము. నేను ఈ క్రొత్త జీవితంలో విలీనం కావడానికి ఆ కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యమైనవి.

ఎల్డర్ గోడోయ్ యొక్క స్నేహితులు

ఈ మంచి స్నేహితులు ఎంతో సహాయపడినప్పటికీ నా ఇంటిలో సువార్త బోధింపబడక, నా కుటుంబము యొక్క మద్దతు లేక పోవడంవలన నాలో జరిగే మార్పు కష్టతరమయ్యింది. సంఘములో సువార్త సంబంధమైన ప్రతిస్పంధనలు వృద్ది చెందుచున్న నా యొక్క మార్పునకు మరింత కీలకమైననిగా మారినవి. అప్పుడు ఇద్దరు అదనపు దేవదూతలు ఆ ప్రభువుచేత నా సహాయము కొరకు పంపబడ్డారు.

అందులో ఒకరు లెడా విట్టోరి, నాకు తెల్లవారుఝాము సెమినరీ ఉపాధ్యాయిని. ఆమె యొక్క ప్రేమపూర్వక మరియు స్ఫూర్తిదాయకమైన తరగతుల ద్వారా ఆమె నాకు రోజంతటికీ అవసరమైన “దేవుని యొక్క మంచి వాక్యమును” మొరోనై 6:4, రోజువారీ మోతాదులో అందించింది. ముందుకు సాగిపోడానికి కావలసిన ఆత్మీయ శక్తి లభించడానికి ఇది నాకు సహాయపడింది.

నాకు సహాయము చేయుటకు పంపబడిన మరొక దేవదూత, యువకుల సమూహము యొక్క అధ్యక్షుడు, మార్కో అంతోనియో ఫుస్కో. గృహబోధనలో నాకు సీనియర్ సహచరునిగా కూడా అతడు నియమించబడ్డాడు. నాకు అనుభవం తక్కువైనా, నా ఆకారం వేరుగాఉన్నా, నన్ను యాజకుల సమూహపు సభలలో, గృహ బోధనలో బోధించుటకు నియమించేవాడు. అతడు నాకు సువార్త బోధన కేవలం చూపడం కాకుండా ఆచరించుటకు, మరియు నేర్చుకొనుటకు అవకాశం ఇచ్చేవాడు. నన్ను నాకంటే అతడే అధికంగా నమ్మేవాడు.

ప్రాముఖ్యమైన నా ప్రారంభదినాలలో నాకెదురైన దేవదూతలందరికి, ఇంకా అనేకమందికి కృతజ్ఞతలు కలిగియున్నాను, ఏలయనగా నేను సత్యమును గూర్ఛిన ఆత్మీయ సాక్ష్యమును పొంది, నిబంధన మార్గంలో నిలిచియుండుటకు తగినంత శక్తిని పొందితిని.

మరియు అదేవిధంగా, ఆ యవ్వన దేవదూత, మోనికా? మేమిద్దరం మిషనరీ సేవలు పూర్తిచేసిన తరువాత, ఆమె నా భార్య అయ్యింది.

ఆ క్రమంలో భాగమైన మంచి స్నేహితులు, సంఘపు బాధ్యతలు, దేవుని యొక్క మంచి వాక్యము చేత పోషింపబడుట, ఇవి, కాకతాళీయము కాదు అని భావిస్తాను. అధ్యక్షులు గార్డెన్ బి. హింక్లీ జ్ఞానంతో బోధించారు: “ఈ సంఘములోనికి పరివర్తన చెందే సంఘటన సులభతరమైనది కాదు.” అది పూర్వ బంధాలను త్రెంచుకొవడం అని అర్ధం. అది స్నేహితులను వదలిపెట్టడం అని అర్ధం. ఇష్టమైన నమ్మకాలను ప్రక్కన పెట్టడం అని కూడా అర్ధం కావచ్చును. అలవాట్లు మార్చుకొనడం, అభిరుచులను అణచివేయడం దానికి అవసరం కాగలదు. అనేక సందర్భాలలో అది ఒంటరితనం, ఏదో తెలియని భయం కావచ్చును. మార్పుచెందే వ్యక్తి యొక్క జీవితంలో కష్టతరమైన కాలంలో పోషణ, బలపరచబడుట తప్పక ఉండాలి”. (”సందేశకులు తప్పక ఉండాలి,” ఎన్సైన్, అక్టోబర్,1987, 5).

తర్వాత ఆయన ఇలా బోధించారు, “ప్రతి ఒక్కరు మూడింటిని తప్పక కలిగియుండాలి: ఒక స్నేహితుడు, ఒక బాధ్యత, మరియు దేవుని మంచివాక్యము చేత పోషణ.” (“మతం మార్చుకున్నవారు మరియు యువకులు,” ఎన్సైన్, మే 1997, 47).

నేను ఈ అనుభవాలను మీతో ఎందుకు పంచుకుంటున్నాను?

మొదటిది, ఇటువంటి పరిస్థితుల్లో నడుస్తున్న వారికి ఇది ఒక సందేశము. నీవు క్రొత్తగా మారిన వ్యక్తివి కావచ్చును, లేక, కొంత కాలంగా అటు ఇటు మరలి, మళ్ళీ ఈ సంఘానికి వచ్చియుండవచ్చును లేదా ఇమడలేక ప్రయాసపడుచుండవచ్చును. ఈ విశాల కుటుంబములో చేరుట కొరకు నీ ప్రయత్నములను దయచేసి, విరమించుకోవద్దు. ఇది యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘము.

నీ సంతోషము, మరియు నీ రక్షణ విషయమైతే, ప్రయత్నం కొనసాగించడం వలన సర్వదా నీ శ్రమకు తగ్గ విలువ దక్కుతుంది. నీ జీవిత విధానం, సాంప్రదాయాలను అనుకూలంగా సవరించుకొనడం వలన శ్రమకు తగ్గ విలువ దక్కుతుంది. మీరు ఎదుర్కొను సవాళ్లు ఆ ప్రభువునకు తెలియును. ఆయన మిమ్ములనెరుగును, ఆయన మిమ్మల్ని ప్రేమించును, మరియు ఆయన మీకు సహాయము చేయుటకు దేవదూతలను పంపునని నేను వాగ్దానము చేయుచున్నాను,

రక్షకుడు స్వయంగా చెప్పెను: “మీకు ముందుగా నేను వెళ్లెదను. నేను నీకు కుడి వైపున, ఎడమ వైపున ఉందును, … నా ఆత్మ నీ హృదయములో నుండును, నా దూతలు నిన్ను ఎత్తి పట్టుకొనుటకు నీ చుట్టునుందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88).

ఈ అనుభవాలను పంచుకొనుటలో నా యొక్క రెండవ ఉద్దేశ్యం, సంఘ సభ్యులమైన మనందరికీ ఒక సందేశం పంపడం. క్రొత్తగా మతం మార్చుకున్న వారు; తిరిగి వస్తున్న మిత్రులు, మరియు విభిన్న జీవిత విధానం గలవారు ఒక్కసారిగా ఇమిడిపోవుట సులభం కాదని మనం గుర్తుంచుకోవాలి. వారు ఎదుర్కొను సవాళ్లు ఆ ప్రభువు ఎరుగును, మరియు వారికి సహాయము చేయు దూతల కొరకు ఆయన వెదకుచున్నాడు. ఇతరుల జీవితాలలో దూతలుగా ఉండుటకు స్వఛ్ఛందంగా ఇష్టపడుచున్నవారి కొరకు ఆ ప్రభువు నిరంతరం వెదకుచున్నాడు

సహోదర సహోదరీలారా, ఆ ప్రభువు చేతిలో ఒక పరికరంగా ఉండుటకు ఇష్టపడుచున్నారా? ఈ దేవదూతలలో ఒకనిగా అగుటకు ఇష్టపడుచున్నారా? ఒక దూతగా మరణపు తెరకు ఈవల, ఆయన చింతిస్తున్న ఎవరో ఒకరికోసం దేవునిచేత పంపబడిన దూతగా వెళ్ళగలరా? ఆయనకు మీరు అవసరం. మీరు వారికి అవసరం!

వాస్తవంగా, మనం ఎల్లప్పుడూ సువార్తికులమీద ఆధారపడవచ్చును. ఈ విధంగా దేవదూతల పనికి, నమోదు కావడానికి వారెప్పుడూ ముందుంటారు. కాని, వారు సరిపోరు.

మీ చుట్టూ జాగ్రత్తగా చూస్తే, దేవదూతల సహాయం అవసరమైనవారు అనేకులుంటారు. ఈ మనుష్యులు తెల్ల చొక్కాలు, వస్త్రాలు, లేక ఏదైనా సముచితమైన ఆదివారపు వస్త్రధారణలో నుండక పోవచ్చును, వారు మందిరం వెనుక భాగంలోనో, తరగతి గదిలోనో, ఒంటరిగా కూర్చొని ఒక్కోసారి వారు అదృశ్యమైనవారిగా భావించుకుంటారు. వారి వేషం విపరీతంగాను, వారి భాష వేరుగాను ఉండవచ్చును, అయినా వారు ఉన్నారు, మరియు వారు ప్రయత్నిస్తూ ఉన్నారు.

కొందరు “నేను వెనక్కి రావాలా? అని ఆలోచిస్తూ ఉండవచ్చును. నేను ప్రయత్నిస్తూ ఉండాలా? మరికొందరు ఏనాటికైనా అంగీకరింపబడి ప్రేమించబడిన అనుభూతి పొందగలమా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు, దేవదూతలు అవసరం; వారిని ఆలింగనం చేసుకోవడానికి తమ సౌకర్యాన్ని విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్న దేవదూతలు; [వాటిని వివరించడానికి] దేవదూతల వలే గుర్తుకు వచ్చే మంచివారైన మరియు స్వచ్ఛమైన వ్యక్తులు“ (జెఫ్రీ ఆర్. హాలెండ్, “The Ministry of Angels,” 30).

సహోదర సహోదరీలారా, నేను దేవదూతలను నమ్ముచున్నాను! ఈ కడవరి దినములకొరకు, ప్రేమగల సృష్టికర్త యొక్క చేతులు చాపబడినవి అన్నట్లు పరిచర్య చేయుటకు నియమింపబడిన దేవదూతల యొక్క మహా సైన్యమువలె, ఈ రోజు మనమంతా ఇక్కడున్నాము. మనము సేవ చేయుటకు అంగీకరించుచున్న యెడల పరిచర్యచేయు దేవదూతలము అగుటకు ప్రభువు మనకు అవకాశములు అనుగ్రహించును, అని నేను వాగ్దానము చేయుచున్నాను. ఎవరికి దేవదూతల సహాయము అవసరమో ఆయనకు తెలియును కనుక ఆయన వారిని మన దారిలో నుంచును. ఎవరికి దేవదూతల సహాయము అవసరమో వారిని అనుదినం ప్రభువు మన దారిలో నుంచును.

నా జీవితంతం ప్రభువు నా దారిలో ఉంచిన అనేక దేవదూతల కొరకు నేను ఎంతో కృతజ్ఞుడను. నాకు వారి అవసరం ఎంతగానో ఉండెను. మనము మారుటకు సహాయము చేయుచు మరియు మరింత ఉత్తమంగా మారుటకు అవకాశము నిచ్చు ఆయన యొక్క సువార్త కొరకు కూడా నేను కృతజ్ఞుడను

ఇది ప్రేమ యొక్క సువార్త, పరిచర్య యొక్క సువార్త. దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిచ్చుచున్నాను, ఆమేన్.